రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. మిగులు విద్యుత్‌ను విక్రయించే స్థితిలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కొత్తగా.. అదికూడా యూనిట్ రూ.4.84 చొప్పున పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.
– కేబినెట్ ఫైలులో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్
సాక్షి, అమరావతి: అప్పట్లో మిగులు విద్యుత్ పుష్కలంగా ఉంది. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా, ఇంధన శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ప్రైవేట్ పవన విద్యుత్ కొనుగోలు చేయడం సరికాదని నెత్తీనోరూ బాదుకున్నారు. అయినా.. అడ్డగోలు ఒప్పందాలతో అధిక ధరలు చెల్లించి మరీ మాజీ సీఎం చంద్రబాబు విద్యుత్ కొనుగోలు చేశారు. ఈ వ్యవహారం వెనుక ‘చంద్రబాబు డీల్స్’ నడిచాయని తేటతెల్లమవుతోంది. పవన విద్యుత్ కొనుగోలును అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్, అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, అప్పటి ఆర్థిక శాఖ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారి మాటల్ని ఖాతరు చేయని చంద్రబాబు 2017 సెప్టెంబర్ 9న కేబినెట్ సమావేశం నిర్వహించి.. అధిక ధరకు (యూనిట్ రూ.4.84) పవన విద్యుత్ కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.
పీపీఏల సమీక్ష సరికాదట
రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రైవేట్ పవన, సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలావుంటే.. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం విలేకరుల సమావేశం నిర్వహించి ఒప్పందాలను ఎందుకు సమీక్షిస్తున్నామనే విషయాన్ని వెల్లడించారు. దీనిపై చంద్రబాబు నాయుడు బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పీపీఏలను సమీక్షించడం సరికాదని, అన్ని ఒప్పందాలను సక్రమంగానే చేసుకున్నామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
కేబినెట్ ఫైలులో స్పష్టం చేసినా..
సుజ్లాన్ అండ్ యాక్సిస్ ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి 837.20 మెగావాట్ల పవన విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన కేబినెట్ ఫైలులో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌తో పాటు ఆర్థిక శాఖ అధికారులూ ఆ కేబినెట్ ఫైలులో పవన విద్యుత్ కొనుగోళ్లను గట్టిగా వ్యతిరేకించారు. పవన విద్యుత్‌ను ఎందుకు కొనుగోలు చేయకూడదో కేబినెట్ ఫైలులో స్పష్టం చేశారు. అయినా.. వారి అభిప్రాయాలను తోసిరాజన్న చంద్రబాబు ఎక్కువ ధరకు పవన విద్యుత్ కొనుగోలు చేశారు. ఈ విషయం 2017 సెప్టెంబర్ 9న చంద్రబాబు నిర్వహించిన కేబినెట్ సమావేశం అజెండాలోని సుజ్లాన్ అండ్ యాక్సిస్ నుంచి పవన విద్యుత్ కొనుగోలు వ్యవహారం బట్టబయలు చేస్తోంది.
ఎస్పీడీసీఎల్ నిరాకరించినా..
గత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కో–ఆర్డినేషన్ కమిటీ (ఏపీ పీసీసీ) 2017 ఫిబ్రవరి 4న సమావేశమై 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి 2020–21 వరకు 837.20 మెగా వాట్ల పవన విద్యుత్ కొనుగోలుపై చర్చించింది. ఈ సమావేశంలో ఏపీ ఎస్‌పీడీసీఎల్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకునేందుకు నిరాకరించింది. జాతీయ టారిఫ్ పాలసీ (ఎన్‌టీపీ) 2016లో నిర్ధారించిన మేరకు సంప్రదాయేతర ఇంధన వనరులను పోటీ టెండర్ల (కాంపిటేటివ్ బిడ్డింగ్) ద్వారానే కొనుగోలు చేయాలని స్పష్టం చేసిందని ఇందుకు ఇంకా మార్గదర్శకాలను కేంద్రం ఖరారు చేయలేదని, ఏపీ పీసీసీ పేర్కొంది. కాంపిటేటివ్ బిడ్డింగ్ మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది.
రూ.వెయ్యి కోట్ల భారం
విద్యుత్ వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరులు ఉండాలనే ఏపీ ఈఆర్‌సీ నిబంధనలను ఇప్పటికే అమలు చేసినందున కొత్తగా పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అప్పటి ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ కేబినెట్ ఫైలులో స్పష్టం చేశారు. సర్కారు నిర్ణయాన్ని అమలు చేస్తే తక్కువ ధరకు ఇప్పటికే విద్యుత్ ఇస్తున్న ప్రాజెక్ట్‌లను మూసివేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల డిస్కమ్‌లపై అదనపు ఆర్థిక భారం పడుతుందని స్పష్టం చేశారు. సుజ్లాన్ అండ్ యాక్సిస్ నుంచి 837.20 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తే ఏటా రూ.250 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.వెయ్యి కోట్ల మేర డిస్కమ్‌లపై అదనపు భారం పడుతుందని వెల్లడించారు. సుజ్లాన్ అండ్ యాక్సిస్ సంస్థకు పారిశ్రామిక విధానంలో రాయితీలు కల్పించినందున పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. అప్పటికే రాష్ట్రంలో 12,014 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగులు ఉందని, మరో మూడేళ్ల వరకు అదనపు విద్యుత్ కొనాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఏపీ డిస్కమ్స్ ఏ కంపెనీలతోనూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదని, భవిష్యత్‌లో కొనాల్సి వస్తే టెండర్ల ద్వారానే చేయాలని అజయ్‌జైన్ కేబినెట్ ఫైలులో వివరంగా పేర్కొన్నారు. ఇంధన శాఖ వెలిబుచ్చిన అభిప్రాయాలనే ఆర్థిక శాఖ కూడా వ్యక్తం చేసింది.
ఆత్మహత్యా సదృశమే
‘రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. మిగులు విద్యుత్‌ను విక్రయించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కొత్తగా.. అదికూడా యూనిట్ రూ.4.84 చొప్పున పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు’ అని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ కేబినెట్ ఫైలులో స్పష్టం చేశారు. డిస్కమ్‌లు ఇప్పటికే రూ.2 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని, అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తే మరింత భారం పడుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం డిస్కమ్‌లకు ఆత్మహత్యా సదృశమే అవుతుందన్నారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే పవన, సౌర విద్యుత్ దొరుకుతున్న నేపథ్యంలో గతంలో కుదుర్చుకున్న పీపీఏలను కూడా సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. అయినా.. చంద్రబాబు సర్కారు విద్యుత్ కొనుగోలు చేసి డిస్కమ్‌లను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment