సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై సమీక్ష అవసరం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. విద్యుత్ ధరలపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని ఒక రిసార్ట్‌లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తమ హయాంలో విద్యుత్ ధరలు నిర్ణయించడంలో పెద్ద కుంభకోణం జరిగిందని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. సంప్రదాయేతర ఇంధనాన్ని ఐదు శాతానికి మించి తీసుకోకూడదని చెబుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అలాంటిదేమీ లేదన్నారు. కాలుష్యం తగ్గించేందుకే పునరుత్పాదక ఇంధనం వైపు వెళ్లామని, 2021 నాటికి సాంప్రదాయేతర ఇంధన వినియోగం 20 శాతానికి చేరాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించిందని తెలిపారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపై సమస్యలు వస్తుండడంతో అన్ని దేశాలు సౌర, పవన విద్యుత్ వైపు వెళ్తున్నాయన్నారు. సాంప్రదాయేతర ఇంధనం వల్ల నష్టం లేదన్నారు. పవన్ విద్యుత్ ధరలపై తమిళనాడుతో పోల్చుతున్నారని, కానీ అక్కడ గాలి వేగం ఎక్కువగా ఉంటుందని అందుకే అక్కడ ధర తక్కువగా ఉందని చెప్పారు. గాలి వేగాన్ని బట్టి పవన్ విద్యుత్ ధరలను నిర్ణయిస్తారని తెలిపారు. సోలార్ విద్యుత్‌ను యూనిట్ రూ.6.90కు ఎక్కడా తీసుకోలేదన్నారు.
ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదు
తమ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఎలాంటి క్విడ్ ప్రోకోలు లేవని చంద్రబాబు అన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు రెండు పవర్ ప్లాంట్‌లు ఉన్నాయని, కర్ణాటకలో వాటికి లాభం చేకూర్చుకుని ఇక్కడ అవినీతి అంటూ హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. టెండర్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్న జ్యుడీషియల్ కమిషన్ సాధ్యం కాదని తెలిపారు. హైకోర్టు నుంచి సిట్టింగ్ జడ్జి ఎలా వస్తారని, కార్యనిర్వాహక వ్యవస్థలో తాము జోక్యం చేసుకోమని న్యాయ వ్యవస్థ ఎప్పుడో చెప్పిందన్నారు. అయినా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు రిటైర్డ్ జడ్జి చైర్మన్‌గా ఉంటారని, వారి సిఫారసుల ప్రకారమే ధరలు నిర్ణయిస్తారన్నారు. పీపీఏల విషయంలో ప్రభుత్వం పాత్ర నామమాత్రమన్నారు. 221 పీపీఏల్లో ఎక్కువ ఐదుగురికే ఇచ్చామంటున్నారని ఇందులో తమ పాత్ర ఏదీ లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. తాము ఒప్పందాలు చేసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి అంశంలోనూ తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సున్నా వడ్డీ రుణాలకు వైఎస్సార్ పేరు పెట్టి దాన్ని ఇప్పుడే తెచ్చినట్లు చెప్పారని, తాము చిల్లిగవ్వ దానికి ఇవ్వలేదని అసెంబ్లీలో సవాల్ విసిరారని, తాను రెడ్‌హ్యాండెడ్‌గా దానిపై వాస్తవాలు బయటపెడితే పారిపోయారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment