Power purchase agreement (ppa)
-
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి లీగల్ నోటీసులు... విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తప్పుడు కథనాలు రాసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
-
పీపీఏ ప్రకారమే చెల్లింపులు
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) పేర్కొన్న ధరల ప్రకారమే పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లింపులు చేయాలని హైకోర్టు ధర్మాసనం మంగళవారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కం) ఆదేశించింది. ఇప్పటికీ చెల్లించాల్సి ఉన్న బకాయిలను ఆరు వారాల్లో చెల్లించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. పవన విద్యుత్‌కు యూనిట్ రూ.2.43, సౌర విద్యుత్‌కు యూనిట్ రూ.2.44 చొప్పున చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దుచేసింది. అలాగే, పీపీఏలను పునః సమీక్షించే అధికారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ఉందని, అభ్యంతరాలన్నీ ఈఆర్సీ ముందు ప్రస్తావించుకోవాలని పవన, సౌర విద్యుత్ సంస్థలకు స్పష్టంచేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సైతం ధర్మాసనం రద్దుచేసింది. ఈఆర్సీ ముందున్న ఓపీ 17, ఓపీ 27కు సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నింటినీ కొట్టేసింది. ఇక పవన, సౌర విద్యుత్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌లో కోత విధిస్తూ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపడుతూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలుచేస్తూ లోడ్ డిస్పాచ్ సెంటర్ దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకు యూనిట్‌కు రూ.2.43, రూ.2.44 చొప్పున చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పవన, సౌర విద్యుత్ కంపెనీలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ఇటీవల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. పీపీఏ నిబంధనలను మార్చలేం.. ఆర్థికపరమైన ఇబ్బందులవల్ల పవన, సౌర విద్యుత్ కంపెనీలకు పీపీఏల ప్రకారం చెల్లింపులు చేయలేకపోతున్నామన్న డిస్కంల వాదనను ధర్మాసనం తప్పుపట్టింది. విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు వినియోగదారుల నుంచి విద్యుత్ చార్జీలను వసూలుచేస్తూ ఆర్థికపరమైన ఇబ్బందులని చెప్పడం సరికాదని ధర్మాసనం స్పష్టంచేసింది. పీపీఏ నిబంధనలను పార్టీలు గానీ, కోర్టుగానీ మార్చడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. పీపీఏలను ఏపీఈఆర్సీ పునః సమీక్షించేంత వరకు మధ్యంతర ఏర్పాటుకింద పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకు యూనిట్‌కు రూ.2.43, రూ.2.44 చొప్పున చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సరికాదని, అవి చట్టానికి అనుగుణంగాలేవని ధర్మాసనం ఆక్షేపించింది. అందువల్ల సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దుచేస్తున్నట్లు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. అలాగే.. 25 ఏళ్ల పాటు కుదుర్చుకున్న ఒప్పందాన్ని సవరించి రేట్లను కుదించే అధికారం ఈఆర్సీకి లేదని ధర్మాసనం తెలిపింది. టారిఫ్‌లో మార్పులతో పెట్టుబడులపై ప్రభావం ‘ప్రజాభిప్రాయాన్ని సేకరించి, డిస్కంల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఏపీఈఆర్సీ పవన విద్యుత్ టారిఫ్‌ను ఖరారుచేసింది. దీనికి అనుగుణంగానే రూ.30 వేల కోట్ల మేర పవన విద్యుత్ రంగంలో దీర్ఘకాల ప్రణాళికల ఆధారంగా పెట్టుబడులు పెట్టారు. గ్లోబల్ వార్మింగ్, ఉద్గారాల తగ్గింపులో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి కీలకపాత్ర పోషిస్తోంది. అలాంటి దానికి సంబంధించిన టారిఫ్, నిబంధనల్లో మార్పుచేస్తే అది ప్రపంచంలోని పెట్టుబడిదారులపై పడుతుంది. పునరుత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి వారు వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ ఒప్పందాలను కొనసాగించేందుకు డిస్కంలు సొంత నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. డిస్కంలు వినియోగదారుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలుచేస్తున్నాయి. కాబట్టి డిస్కంల ఆర్థిక పరిస్థితికి మరేదైనా కారణం కావొచ్చుగానీ, పీపీఏలో నిర్ణయించిన టారిఫ్ కాదు’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
గత సర్కారు పాపం.. డిస్కమ్‌లకు శాపం
సాక్షి, అమరావతి: ప్రైవేటు పవన, సౌరవిద్యుత్ కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు విద్యుత్ సంస్థలకు శాపంగా మారింది. అవసరం లేకున్నా విద్యుత్ తీసుకోవడం ఒకటైతే, ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ చెల్లిస్తూ ఒప్పందాలు చేసుకోవడం మరో కోణం. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల–పీపీఏల) విషయంలో ఇదే తేల్చి చెప్పింది. 2014–19 మధ్య జరిగిన ఒప్పందాలన్నీ డిస్కమ్‌లను నిలువునా అప్పులపాలు చేసే విధంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రజాధనాన్ని కొంతమందికి కట్టబెట్టే ఈ విధానంపై పునఃసమీక్ష అవసరమని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తొలిరోజుల్లోనే భావించింది. రాష్ట్రంలో 2015 వరకు 91 పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలున్నాయి. వాటి సామర్థ్యం కేవలం 691.55 మెగావాట్లు. కానీ ఆ తర్వాత 2019 వరకు ఏకంగా 3,494 మెగావాట్ల సామర్థ్యంగల 133 ఒప్పందాలు జరిగాయి. అంతకుముందు గరిష్టంగా యూనిట్‌కు రూ.3.74 చెల్లిస్తే.. 2015 నుంచి యూనిట్‌కు రూ.4.84 చొప్పున చెల్లించారు. 25 ఏళ్లపాటు అమల్లో ఉండేలా జరిగిన ఈ పీపీఏల వల్ల డిస్కమ్‌లు ప్రైవేటు సంస్థలకు రూ.39,280 కోట్లు చెల్లించాలి. సోలార్ విద్యుత్ విషయంలోనూ ఇదేవిధంగా కొనసాగింది. 2014 వరకు రూ.384 కోట్ల విలువ చేసే 92 మెగావాట్ల మేరకు 11 పీపీఏలు ఉండేవి. 2015–19 మధ్య 2,308 మెగావాట్ల మేర 36 పీపీఏలు జరిగాయి. వీటివిలువ రూ.22,868 కోట్లు. ఫలితంగా ఇప్పటికీ పవన, సౌరవిద్యుత్ ఉత్పత్తిదారులకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. ఎక్కడా లేని ధర 2015–19 మధ్య ప్రైవేటు పవన, సౌరవిద్యుత్ ఉత్పత్తిదారులకు అప్పటి ప్రభుత్వం ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడలేదు. వాళ్లనుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందాయన్న ఆరోపణలు వచ్చినా లెక్కజేయలేదు. 2014లో సోలార్ విద్యుత్‌ను యూనిట్ రూ.6.99 ధరతో పీపీఏ చేసుకుంది. ఇదే సమయంలో పంజాబ్ యూనిట్ రూ.6.88 ధరకి పీపీఏ చేసుకుంది. 2016లో సోలార్ పీపీఏలు దాదాపు 1,500 మెగావాట్ల మేర జరిగాయి. అప్పుడు కూడా గరిష్టంగా యూనిట్ ధర రూ.6.80. అదే సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం యూనిట్ రూ.4.66 ధరతో నెడ్‌క్యాప్, జెన్కో, ఎన్టీపీసీ, సెకీతో ఒప్పందాలు చేసుకుంది. ఆ తర్వాత కాలంలోఅన్ని రాష్ట్రాల్లో యూనిట్ ధర రూ.2కు పడిపోయినా మన రాష్ట్రంలో మాత్రం రూ.4.50కే పీపీఏలు చేసుకోవడాన్నిబట్టి వీటివెనుక రాజకీయ కారణాలున్నాయనే విమర్శలొచ్చాయి. పవన విద్యుత్ పీపీఏల విషయానికొస్తే 2014లో అన్ని రాష్ట్రాల్లో యూనిట్ రూ.3.50 ఉంటే.. మన రాష్ట్రంలో రూ.4.83 చొప్పున జరిగాయి. తమిళనాడు, గుజరాత్, మరికొన్ని రాష్ట్రాల్లో యూనిట్ రూ.3.46 కొనసాగినా.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌కు రూ.4.84తోనే ఒప్పందాలు చేసుకుంది. ఈ విధంగా ప్రైవేటు పట్ల అపరిమిత ప్రేమ చూపించడం వల్ల.. ఇప్పుడు డిస్కమ్‌లు ఆర్థికభారంతో కుంగిపోయే పరిస్థితి ఏర్పడింది. -
గత ప్రభుత్వ కరెంట్ షాక్..రూ.39,280 కోట్లు
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) విషయంలో కేవలం కొన్ని కంపెనీలకే ప్రాధాన్యతనివ్వడం డిస్కమ్ (విద్యుత్ పంపిణీ సంస్థలు)ల నష్టానికి కారణమైంది. దీనిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక కూడా పీపీఏల వల్ల జరిగిన నష్టాన్ని ప్రస్తావించింది. 2015 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు భారీగానే ఉన్నాయి. వీటి విలువ ఏకంగా రూ.39,280 కోట్లు. నాడు పవన, సౌర విద్యుత్ ధరలు తగ్గుతాయని ఇతర రాష్ట్రాలు ముందుగానే గుర్తించాయి. రాష్ట్ర విద్యుత్ అధికారులు కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం దృష్టికి ఇదే అంశాన్ని తీసుకెళ్లారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం దీన్ని పెడచెవిన పెట్టింది. మిగతా రాష్ట్రాలన్నీ బిడ్డింగ్‌లకు వెళ్తున్నా ఏపీ మాత్రం జనరిట్ టారిఫ్ (నిర్దేశించిన టారిఫ్ మేరకు) ఇచ్చింది. అదీ కూడా టీడీపీ ప్రభుత్వ పెద్దలతో ఏదో రకంగా సంబంధం ఉన్న కంపెనీలే కావడం అనుమానాలకు తావిస్తోంది. ఉదాహరణకు గ్రీన్కో అనే సంస్థ రూ.12,672 కోట్ల విలువైన 16 ఒప్పందాలు చేసుకోగా.. ఈ మొత్తంలో ఏకంగా గ్రీన్కోకు 32 శాతం వాటా కట్టబెట్టారు. అలాగే రెన్యూ అనే సంస్థ రూ.8,513 కోట్ల విలువైన 15 ఒప్పందాలు చేసుకోగా.. ఈ మొత్తంలో ఆ సంస్థకు 22 శాతం లబ్ధి చేకూరింది. ఈ నేపథ్యంలో మొత్తం 133 పవన విద్యుత్ పీపీఏలపై సవివరమైన సమాచారాన్ని డిస్కమ్‌లు.. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి అందించాయి. ఇందులో రూ.5,548 కోట్ల విలువైన 64 విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించిన కమిటీ పునఃపరిశీలించాలని కోరింది. ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.43 చొప్పున చెల్లిస్తే సరిపోతుందని పంపిణీ సంస్థలు అంటున్నాయి. ఇలా చేస్తే ఉత్పత్తిదారులకు ఏమాత్రం నష్టం కూడా ఉండదు. పైగా ప్రైవేటు సంస్థలకు చెల్లించే రూ.39,280 కోట్ల ప్రజాధనాన్ని రూ.20 వేల కోట్లకు కుదించే వీలుంది. అంటే.. దాదాపు రూ.19 వేల కోట్లకుపైగా ప్రజాధనం వృథా కాకుండా చేసే వీలున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్రం చెప్పిందీ వినలేదు.. పవన, సౌర విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేంద్రం పెట్టిన లక్ష్యం ఒకటైతే.. 2015 నుంచి టీడీపీ ప్రభుత్వం చేసింది మరొకటి. 2015–16లో విద్యుత్ వినియోగంలో 5 శాతం మాత్రమే సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి తీసుకోవాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. కానీ ఏపీ మాత్రం ఏకంగా 5.59 శాతం మేర పీపీఏలు చేసుకుంది. 2016–17లో 8.6 శాతం, 2017–18లో 9 శాతం లక్ష్యమైతే 19 శాతం, 2018–19లో 11 శాతం లక్ష్యమైతే 23.4 శాతం తీసుకుంది. 2016–17 నుంచి 2018–19 మధ్య కాలంలో 6,190 మిలియన్ యూనిట్ల పవన, సౌర విద్యుత్ తీసుకోవాల్సి ఉండగా.. దీనికి రెట్టింపునకు పైగా 13,142 మిలియన్ యూనిట్లు తీసుకుంది. దేశంలో పవన విద్యుత్ ధరలు పడిపోతే.. మన రాష్ట్రంలో మాత్రం యూనిట్‌కు రూ.4.84 చొప్పున 25 ఏళ్లకు పీపీఏలు చేసుకున్నారు. 2014లో ఎలాంటి బిడ్డింగ్ లేకుండానే సోలార్ విద్యుత్‌కు యూనిట్ రూ.5.25 నుంచి రూ.6.99 చొప్పున ఏకంగా 649 మెగావాట్ల మేర చంద్రబాబు ప్రభుత్వం పీపీఏలు చేసుకుంది. ఈ ధరను కూడా ఏటా 3 శాతం పెంచేలా ఒప్పందాలు కుదుర్చుకుంది. అంటే.. పదేళ్ల తర్వాత యూనిట్ విద్యుత్ ధర ఏకంగా రూ.9 వరకూ వెళ్లే అవకాశం ఉంది. 2017లో రాజస్తాన్‌లో బిడ్డింగ్‌లో సోలార్ ధర యూనిట్ రూ.2.44కు పడిపోయింది. ఏపీ మాత్రమే పీపీఏలు ఉండటం వల్ల యూనిట్‌కు రూ.6.99 వరకూ చెల్లించాల్సి వస్తోంది. -
రాష్ట్రంలో పెరగనున్న జల విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరగబోతోంది. 2030 నాటికి 7,700 మెగావాట్లకు చేరుతుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. ఈ దిశగా పెద్ద ఎత్తున చేపడుతున్న మినీ హైడల్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు అధికారులు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రాజెక్టుల రూపకల్పన దిశగా అడుగులేసే వీలుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,700 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దీన్ని 7,700 మెగావాట్లకు తీసుకెళ్లడం ద్వారా చౌక విద్యుత్ లభిస్తుంది. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం నుంచి యూనిట్ విద్యుత్ 90 పైసలకే లభిస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకోవాలంటే.. 30 శాతం వరకూ స్థిర విద్యుత్ (24 గంటలూ ఉత్పత్తి చేయగల విద్యుత్) అందుబాటులో ఉండాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రణాళికలు సిద్ధం చేసిన నెడ్‌క్యాప్ ఏపీలో ప్రస్తుతం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. మరో 10 వేల మెగావాట్లకుపైగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో 6 వేల మెగావాట్ల జల విద్యుత్ అవసరం. నదుల దిగువ భాగాన ఉన్న నీటిని ఎగువకు పంపి, డిమాండ్ వేళ విద్యుదుత్పత్తి చేస్తారు. అలాగే కొండ ప్రాంతాల్లో జలపాతాల ద్వారా వెళ్లే నీరు వృథా కాకుండా ఆనకట్ట ద్వారా నిల్వ చేసి ఎగువకు పంప్ చేసి విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ రెండు పద్ధతుల్లో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టులకు సంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 29 ప్రాంతాలను గుర్తించి డీపీఆర్‌లు రూపొందిస్తోంది. వీటి ద్వారా 31 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తేవచ్చని భావిస్తున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ రేట్లు తగ్గింపు
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం లేకుండా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునః సమీక్షించింది. మార్కెట్ రేట్లకు అనుగుణంగా వాటి ధరలను తగ్గించింది. ఫలితంగా డిస్కమ్‌లకు రూ.60 కోట్ల మేర ఆదా అవుతుందని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. ఈ మేరకు కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులకు వివరించారు. ► గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ల్యాంకో, స్పెక్ట్రంతో ఏపీ డిస్కమ్‌లకు ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం 2016తోనే ముగిసింది. అయినప్పటికీ పాత ప్రభుత్వం గడచిన మూడేళ్లుగా పాత ధరలతోనే విద్యుత్ కొనుగోలు చేస్తోంది. ల్యాంకోకు యూనిట్‌కు రూ.3.29, స్పెక్ట్రంకు యూనిట్‌కు రూ.3.31 చొప్పున డిస్కమ్‌లు చెల్లిస్తున్నాయి. ► అయితే, ఈ ఏడాది రెండు విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు కమిషన్ అనుమతించలేదు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండటం, ఆ రెండు సంస్థల కన్నా మార్కెట్లో తక్కువకే విద్యుత్ లభిస్తుండటమే కారణంగా ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. ► లాక్డౌన్ కాలంలో బొగ్గు సమస్య రావచ్చని భావించిన డిస్కమ్‌లు గ్యాస్ విద్యుత్‌ను తీసుకోవాలని కోరడంతో ఏప్రిల్, మే నెలలకు కమిషన్ అనుమతించింది. అయితే వారం రోజుల్లోనే ప్రపంచ మార్కెట్లో గ్యాస్ రేట్లు తగ్గాయి. దీంతో జూన్ నుంచి విద్యుత్ తీసుకోవాల్సిన అవసరం లేదని కమిషన్ అభిప్రాయపడింది. ఒకవేళ తీసుకుంటే, స్పెక్ట్రంకు యూనిట్‌కు రూ.3.31కి బదులు రూ. 2.71, ల్యాంకోకు రూ.3.29కి బదులు యూనిట్‌కు రూ.2.69 చొప్పున చెల్లించాలని డిస్కమ్‌లను ఆదేశిస్తూ టారిఫ్ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకే అనుమతించింది. ► అక్టోబర్, నవంబర్ నెలల్లో తదుపరి సంవత్సరానికి అవసరమైన వార్షిక, ఆదాయ అవసర నివేదికలను డిస్కమ్‌లు రూపొందిస్తాయి. అప్పుడు ఈ రెండు సంస్థల నుంచి విద్యుత్ తీసుకోవాలా? వద్దా? అనేది నిర్ణయిస్తాయి. ► సెప్టెంబర్ వరకూ తీసుకునే ఈ విద్యుత్ దాదాపు వెయ్యి మిలియన్ యూనిట్లు ఉంటుందని విద్యుత్ సంస్థలు అంచనా వేశాయి. కమిషన్ తగ్గించిన రేట్ల వల్ల విద్యుత్ సంస్థలకు యూనిట్‌కు 60 పైసల చొప్పున, మొత్తం రూ.60 కోట్లు ఆదా అవుతుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. -
గుజరాత్‌లోనూ పీపీఏలు రద్దు
సాక్షి, అమరావతి: చౌక విద్యుత్‌కే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాటను గుజరాత్ కూడా అనుసరిస్తోంది. ఎక్కువ ధర చెల్లించే పాత విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏల)ను గుజరాత్ తాజాగా రద్దు చేసింది. ఈ పీపీఏల్లో పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. అంతకు ముందు ప్రభుత్వం ఈ పీపీఏలను చేసుకుంది. విదేశీ బొగ్గుతో నడిచే థర్మల్ ప్లాంట్లకు వేరియబుల్ కాస్ట్ (చర వ్యయం) రోజురోజుకు పెరుగుతోంది. ఇది డిస్కమ్‌లకు భారంగా మారిందని గుజరాత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్కువ టారిఫ్ ఉన్న పీపీఏలను సమీక్షించాలని 2019 జూన్‌లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ ప్రస్తుతం విద్యుత్ నియంత్రణ మండలి పరిధిలో ఉంది. శాపంలా పాత పీపీఏలు.. ► టీడీపీ సర్కారు అధికారంలో ఉండగా అడ్డగోలుగా అత్యధిక టారిఫ్‌తో పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. 2015 నుంచి 2019 వరకు 13,794 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ను అవసరం లేకున్నా కొనుగోలు చేయడంతో డిస్కమ్‌లపై రూ.5,497.3 కోట్ల అదనపు భారం పడింది. పాత పీపీఏల కారణంగా ఇప్పటికీ ఏటా రూ. 2 వేల కోట్లు అదనంగా విద్యుత్ కొనుగోలుకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ► 2016–17లో పవన, సౌర విద్యుత్‌ను 2,433 మిలియన్ యూనిట్లు (5%) కొనాల్సిన అవసరం ఉంటే 4,173 ఎంయూలు (8.6%) కొనుగోలు చేశారు. 2017–18లో 4,612 (9%) ఎంయూలకు బదులు 9,714 (19%) ఎంయూలు కొన్నారు. 2018–19లో 6,190 (11%) ఎంయూలు కొనాల్సి ఉంటే 13,142 (23.4 శాతం) ఎంయూలు కొనుగోలు చేశారు. ► ప్రస్తుతం సోలార్ విద్యుత్ యూనిట్ రూ.3 లోపే లభిస్తుండగా టీడీపీ సర్కారు కుదుర్చుకున్న పీపీఏల వల్ల యూనిట్‌కు గరిష్టంగా రూ. 5.96 వరకూ చెల్లించాల్సి వస్తోంది. పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ. 4.84 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. భవిష్యత్తులో రేట్లు మరింత తగ్గినా పీపీఏలున్న ప్రైవేట్ సంస్థలకు ఇదే రేట్లు చెల్లించాల్సి రావడం డిస్కమ్‌లకు గుదిబండగా మారుతోంది. ► రాష్ట్రంలో గత ప్రభుత్వం అత్యధిక టారిఫ్ ఇచ్చేలా 47 సౌర విద్యుత్ పీపీఏలు చేసుకుంది. పవన విద్యుత్ పీపీఏలు ఇలాంటివి 220 వరకూ ఉన్నాయి. 2014కు ముందు పవన విద్యుత్ పీపీఏలు 88 మాత్రమే ఉన్నాయి. ఆదర్శంగా ఏపీ అడుగులు.. డిస్కమ్‌లను పీల్చి పిప్పిచేసి గత సర్కారు హయాంలో విద్యుత్ చార్జీలు పెరగడానికి కారణమైన కొనుగోలు ఒప్పందాలపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమీక్ష చేపట్టింది. కమిటీ వేసి వాస్తవాలు రాబట్టింది. పీపీఏల వెనుక గుట్టు రట్టవుతుందనే భయంతో విపక్షాలు ప్రైవేట్ ఉత్పత్తిదారులతో చేతులు కలిపి అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కోర్టు సూచనలతో ఏపీఈఆర్సీ అధిక ధరలున్న పీపీఏలపై విచారణ జరపాల్సి ఉంది. ఏదేమైనా ఏపీ ముందడుగు వేసి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. -
కరెంటు కొనుగోళ్లపై నేడు ప్రత్యేక కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: పవన, సౌర విద్యుత్ కొనుగోలు వల్ల విద్యుత్ సంస్థలపై(డిస్కంలు) పడే ఆర్థిక భారంపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. డిస్కంలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 12న రాసిన లేఖను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. విద్యుత్ కొనుగోళ్లు, డిస్కంల సమస్యలపై సంప్రదింపుల కోసం నవంబర్ 4న ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర సంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి శాఖ (ఎంఎన్ఆర్ఈ) కార్యదర్శి, కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. కమిటీ తొలి సమావేశం గురువారం ఢిల్లీలో జరగనుంది. పవన, సౌర విద్యుత్ కొనుగోలు వల్ల డిస్కంలకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలపై చర్చించనున్నారు. పవన, సౌర విద్యుత్ కొనుగోలును కేంద్రం తప్పనిసరి చేయడం వల్ల డిస్కమ్‌లు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. ఇలాంటి కరెంటు కొనాలంటే యూనిట్‌కు రూ.3.50 చొప్పున పరిహారంగా రాష్ట్రాలకు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. -
దోపిడీ గుట్టు.. 'గూగుల్ ఎర్త్' పట్టు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రైవేటు సోలార్ ప్లాంట్ల అక్రమాలను ఫొటో ఆధారాలతో సహా నిరూపించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ‘గూగుల్ ఎర్త్’ను వినియోగించుకునేందుకు డిస్కంలు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకున్న సామర్థ్యానికి మించి సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అది కూడా సోలార్ విద్యుత్ ధరలు భారీగా తగ్గుతున్న క్రమంలో.. అదనపు సామర్థ్యాన్ని జోడించడం ద్వారా అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి అధిక ధరను డిస్కంల నుంచి కాజేశాయనేది ప్రధానమైన విమర్శగా ఉంది. పీపీఏ చేసుకున్న తర్వాత 12 నెలల కాలంలో నెలకొల్పాల్సిన విద్యుత్ ప్లాంట్లను ఆ తర్వాత కూడా అదనపు సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసి అదనపు విద్యుత్‌ను ఆ సంస్థలు ఉత్పత్తి చేశాయి. ఈ విధంగా 619 మెగావాట్లకు కుదిరిన పీపీఏలతో ఏకంగా 950 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నెలకొల్పాయి. వాస్తవానికి సోలార్ విద్యుత్ ధరలు క్రమంగా తగ్గి యూనిట్ ధర రూ. 2.50కు కూడా పడిపోయింది. అయినా ఈ ప్రైవేటు సోలార్ ప్లాంట్లు మాత్రం.. పాత ధర అంటే రూ. 6.80 చొప్పున బిల్లులు చేసుకున్నాయి. దీనికి సబంధించి గూగుల్ ఎర్త్ ద్వారా ఆధారాలు సేకరించి వాటికి చెక్ పెట్టేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. దోపిడీ ఎలా సాగిందంటే.. వాస్తవానికి 500 మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు 2014 ఆగస్టులో డిస్కంలు టెండర్లను పిలిచాయి. అయితే, అప్పటి సీఎం చంద్రబాబు బంధువు కోసం 500 మెగావాట్లను 619 మెగావాట్లకు పెంచి.. 14 కంపెనీలకు బదులు 19 కంపెనీలతో యూనిట్ విద్యుత్ ధర రూ. 6.80గా పీపీఏలను ప్రభుత్వం చేసుకుంది. 2015 జనవరిలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ)ను అందజేసిన డిస్కంలు.. 12 నెలల్లో ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్‌ను సరఫరా చేయాలని పీపీఏలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తర్వాత సోలార్ ప్యానల్స్ ధరలు అంతర్జాతీయంగా తగ్గడంతో సోలార్ విద్యుత్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ ధరలు రూ. 2.50కి తగ్గిపోయిన క్రమంలో ప్రైవేట్ సోలార్ ప్లాంట్లు దోపిడీకి స్కెచ్ వేశాయని తెలుస్తోంది. 619 మెగావాట్లకు పీపీఏలు కుదరగా.. ఏకంగా 950 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్లను నెలకొల్పాయి. ఈ పెరిగిన 950 మెగావాట్లకు యూనిట్‌కు రూ. 6.80 చొప్పున డిస్కంలు బిల్లులు చెల్లిస్తూ వస్తున్నాయి. అయితే, ఈ విషయం ట్రాన్స్‌కో విజిలెన్స్ విచారణలో గతంలోనే తేలినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కనపెట్టింది. ఇటీవల మొత్తం 19 కంపెనీలలో ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగం తనిఖీలు నిర్వహించగా.. 8 నుంచి 54 శాతం వరకూ అధిక సామర్థ్యంతో ప్లాంట్లను నెలకొల్పినట్టు తేలింది. ఇందుకు అనుగుణంగా ఈ అదనపు సామర్థ్యాన్ని ఎప్పుడెప్పుడు సదరు కంపెనీలు నెలకొల్పాయనే అంశాన్ని నిరూపించేందుకు గూగుల్ ఎర్త్ ద్వారా పాత ఫొటోలను సేకరించి ఆధారాలతో సహా నిరూపించాలని డిస్కంలు భావిస్తున్నాయి. -
ధరల సమీక్షాధికారం ఈఆర్సీకి ఉంది
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను (పీపీఏ) పునఃసమీక్షించే అధికారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ఉందన్న ప్రభుత్వ వాదనతో మంగళవారం హైకోర్టు ఏకీభవించింది. పవన, సౌర విద్యుత్ ధరలు ఎక్కువగా ఉన్నందున, వాటిని పునఃసమీక్షించాలని కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించాలన్న ఈఆర్సీ నిర్ణయాన్ని రద్దు చేసేందుకు నిరాకరించింది. ధరల పునఃసమీక్ష కోసం ఈఆర్సీ ముందు డిస్కమ్‌లు దాఖలు చేసిన పిటిషన్ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 41 పీపీఏల విషయంలో వాటి నిబంధనలను నియంత్రించే, మార్చే, సవరించే అధికారం ఈఆర్సీకి ఉందంది. ఈఆర్సీలో అనుభవజ్ఞుడైన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, సాంకేతిక విషయాల్లో నైపుణ్యం ఉన్న వ్యక్తులు సభ్యులుగా ఉంటారు కాబట్టి పవన, సౌర విద్యుత్ కంపెనీలు వారి అభ్యంతరాలను ఈఆర్సీ ముందు లేవనెత్తవచ్చునని తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు లేవనెత్తే అభ్యంతరాలన్నింటిపై స్వతంత్ర విచారణ జరపాలని ఈఆర్సీకి తేల్చిచెప్పింది. ప్రభుత్వం నుంచి భారీ బకాయిలు రావాల్సి ఉందన్న ఆరోపణలు ఉండటం, అలాగే పవన, సౌర విద్యుత్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, డిస్కమ్‌లు భారీ నష్టాల్లో ఉన్నాయని, ప్రస్తుతం ఉన్న ధరలు కొనసాగితే భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని ఆరు నెలల్లో తేల్చాలని ఈఆర్సీకి స్పష్టం చేసింది. పవన, సౌర విద్యుత్ కొనుగోలు ధరలు అధికంగా ఉన్నాయని, వాటిని పునః సమీక్షించాలని కోరుతూ డిస్కమ్‌లు ఏపీఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేశాయి. ఇప్పటికే ఈఆర్సీ ధరలను నిర్ణయించినందున, మరోసారి ఆ ప్రక్రియను చేపట్టడానికి వీల్లేదంటూ డిస్కమ్‌ల పిటిషన్‌పై కొన్ని పవన, సౌర విద్యుత్ కంపెనీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటితోపాటు వివిధ అంశాల్లో మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై ఇటీవల తుది విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం తన తీర్పును వెలువరించారు. ప్రభుత్వ ధరల ప్రకారమే చెల్లింపులు.. ‘పవన, సౌర విద్యుత్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.43, సౌర విద్యుత్‌కు రూ.2.44 చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే.. ప్రభుత్వం ఇస్తున్న వివిధ రకాల సబ్సిడీల వల్ల పంపిణీ సంస్థలకు నష్టం వస్తుందే తప్ప, విద్యుత్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కాదని విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల హక్కులను పరిగణనలోకి తీసుకున్నాక యూనిట్‌కు రూ.2.43, రూ.2.44 ధరలకే పవన, సౌర విద్యుత్ బిల్లులు చెల్లించాలని డిస్కమ్‌లను ఆదేశిస్తున్నాం. ప్రస్తుత బకాయిలను, భవిష్యత్తు చెల్లింపులను కూడా ఈ మధ్యంతర రేట్ల ప్రకారమే చేయాలి. ఏపీఈఆర్సీ ఈ వ్యవహారాన్ని తేల్చే వరకు ఈ రేట్ల ప్రకారమే చెల్లింపులు చేయాలి’ అని హైకోర్టు తెలిపింది. పీపీఏల సమీక్షకు ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీ (హెచ్‌ఎల్‌ఎస్‌సీ)ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 63ను రద్దు చేసింది. అలాగే పవన, సౌర విద్యుత్ ధరల తగ్గింపునకు హెచ్‌ఎల్‌ఎస్‌సీతో సంప్రదింపులు జరపాలని విద్యుత్ ఉత్పత్తి కంపెనీలను ఆదేశిస్తూ ఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాసిన లేఖలను సైతం రద్దు చేసింది. రాష్ట్ర గ్రిడ్‌తో అనుసంధానించిన విద్యుత్ సరఫరా కనెక్షన్లను తొలగించిన నేపథ్యంలో, ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించేందుకు నిపుణులతో అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనతో పవన, సౌర విద్యుత్ కంపెనీలు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. -
అవినీతి జరిగితే పీపీఏలను రద్దు చేయొచ్చు
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) అవినీతి చోటు చేసుకున్నప్పుడు వాటిని రద్దు చేయడంలో ఎలాంటి తప్పులేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. పీపీఏలను దుర్వినియోగం చేశారని ఆధారాలు లభించినప్పుడు వాటిని రద్దు చేయవచ్చని తెలిపింది. పీపీఏల్లో అక్రమాలు జరిగాయని ఆధారాలున్నప్పుడు వాటిని రద్దు చేయడంతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు సైతం చర్యలు తీసుకోవచ్చని వివరించింది. సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల సమీక్షకు ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని (హెచ్‌ఎల్‌ఎస్‌సీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 63.. సౌర, పవన విద్యుత్ ధరల తగ్గింపునకు హెచ్‌ఎల్‌ఎస్‌సీతో సంప్రదింపులు జరపాలని విద్యుత్ ఉత్పత్తి కంపెనీలను ఆదేశిస్తూ ఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాసిన లేఖలను సవాలు చేస్తూ పలు సౌర, పవన విద్యుత్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం మరోసారి విచారణ జరిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఏఎస్జీ బొప్పిడి కృష్ణమోహన్ వాదనలు వినిపించారు. పీపీఏల విషయంలో కేంద్రం నిర్దిష్టమైన వైఖరిని అనుసరిస్తోందన్నారు. ఏపీలో జరిగిన పీపీఏల విషయంలోనూ కేంద్రానిది అదే వైఖరి అని చెప్పారు. అంతకు ముందు విద్యుత్ కంపెనీల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. విద్యుత్ ధరలను విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) నిర్ణయించాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం కాదన్నారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణ గురువారానికి వాయిదా పడింది. -
నాపై బురద జల్లుతున్నారు
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారమిస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు శుక్రవారం అసెంబ్లీలో ఆరోపించారు. తాము కుదిర్చిన పీపీఏలపైన రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన సమాచారం ఆధారంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో సమాధానం ఇస్తున్నారని వాపోయారు. ఇంధన వనరుల బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సంప్రదాయేతర ఇంధన వనరులు– పవన, సౌర విద్యుత్ తదితరాలతో రాష్ట్రంలో భవిష్యత్‌లో కరెంటు చార్జీలు పెంచకుండా చూడాలన్న ఉద్దేశంతో ప్రాథమిక దశలో ఖర్చు ఎక్కువైనా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. ‘‘కర్ణాటకలో సండూర్ పవర్ పెట్టి ఎక్కువ ధరకు విద్యుత్తు అమ్ముతున్న జగన్ ఇక్కడ ముఖ్యమంత్రి అయినందున జరిగిపోయిన వాటిపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. బురదచల్లే కార్యక్రమం చేపడితే ఆ బురదలో మీరే మునిగిపోతారు. మీరు ఒక వ్యక్తిని, కొందరిని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. పీపీఏలను తోడవద్దని కేంద్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది. మీ సర్కారు తీరు చూసి రాజధానికి ప్రపంచబ్యాంకు రుణాన్ని కూడా రద్దు చేసింది. మీ పనివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోంది’’ అంటూ ధ్వజమెత్తారు. మీరెందుకు తయారు కాలేదు?: డిప్యూటీ స్పీకర్ ప్రశ్న అంతకుముందు సీఎం జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అమ్మేసే తరహాలో గత సీఎం చంద్రబాబు అడ్డగోలుగా పీపీఏలు కుదుర్చుకున్నారని, దానిపై అసెంబ్లీలో చర్చలో పాల్గొనడానికి బదులు బయట ప్రెస్‌కాన్ఫరెన్స్‌లు పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ దశలో సభలోకొచ్చిన చంద్రబాబు.. ‘‘అధ్యక్షా, వాళ్లు(అధికార పక్షం) బాగా తయారయి చర్చకు వచ్చారు. నాకు సమయం కావాలి’ అని కోరారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.. ‘ఇంధన పద్దులపై చర్చ జరుగుతుందని మీకూ తెలుసుకదా, మీరెందుకు తయారు కాలేదు’ అనడంతో చంద్రబాబు నాలుక్కరుచుకుని చర్చకు ఉపక్రమించారు. పీపీఏలపై జగన్ అస్పష్టత: చంద్రబాబు కాగా చంద్రబాబు శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్లో మీడియాతో ముచ్చటిస్తూ.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ముఖ్యమంత్రి అస్పష్టంగా ఉన్నారని, సభలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని, సమాధానం చెప్పలేక వెళ్లిపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. -
విద్యుత్ కొనుగోళ్లలో అంతులేని అవినీతి
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అంతులేని అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చౌక ధరకు థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ, అధిక ధరతో సంప్రదాయేతర విద్యుత్ కొనుగోలు చేయడం వెనుక అసలు రహస్యం దోపీడీనేనని ఎండగట్టారు. కేంద్రం నిర్దేశించిన పరిమాణాన్ని మించి సంప్రదాయేతర విద్యుత్‌ను అధిక ధరలకు ఎందుకు కొనుగోలు చేశారని మాజీ సీఎం చంద్రబాబును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలదీశారు. ‘టెక్నాలజీ పెరిగే కొద్దీ విద్యుత్ ధరలు తగ్గుతాయనేది జగమెరిగిన సత్యం.. అదే విషయాన్ని మీరు కూడా (చంద్రబాబు) చెప్పారు.. మరి 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే ఈ పెద్ద మనిషి ఆ మేరకు స్పృహ కూడా లేకుండా 25 ఏళ్ల కోసం పీపీఏలు ఎందుకు చేశార’ని మండిపడ్డారు. మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ నచ్చిన కంపెనీలకు దోచిపెట్టేందుకు అన్ని రాష్ట్రాలకంటే అత్యధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేసి డిస్కంలను అప్పుల ఊబిలోకి నెట్టేశారని దుయ్యబట్టారు. ఇలా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ఏటా రూ. 2,766 కోట్ల నష్టం వాటిల్లిందని గణాంకాలు, ఆధారాలతో వివరించారు. శుక్రవారం శాసనసభలో ఇంధన శాఖ పద్దులపై చర్చ సందర్భంగా గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందాల ముసుగులో జరిగిన దోపీడీని సీఎం తూర్పారబట్టారు. అప్పటి సర్కారు పెద్దలకు కావాల్సిన కేవలం ఆ మూడే మూడు సంస్థలతోనే 63 శాతం ఒప్పందాలు చేసుకున్నారని, వాటికే అత్యధిక చెల్లింపులు జరిగాయని ఎత్తిచూపారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత రుణ ఊబిలోకి నెడితే ఇక రాష్ట్రం ముందుకెళ్లేదెలా? అని సీఎం జగ న్ నిలదీశారు. ‘విద్యుత్ రంగం బాగుపడాలంటే పారిశ్రామిక వినియోగం పెరగాలి.. ఇలా జరిగితేనే డిస్కంలకు ఆదాయం పెరుగుతుంది. అయితే ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే పారిశ్రామిక రంగం కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిపుణుల కమిటీ గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సీఎం దుయ్యబట్టారు. అసలు నిపుణుల కమిటీలో ఎవరున్నారో చూడకుండా, కమిటీ నివేదిక కూడా ఇవ్వకముందే ముఖ్య సలహాదారు అజేయ కల్లంతోపాటు అధికారులపై చంద్రబాబు బాధ, అక్కసు, ఆక్రోశం వెళ్లగక్కారని, నిపుణుల కమిటీతో అక్రమాలు బయటకు వస్తాయని చంద్రబాబుకు ఉన్న భయమే ఇందుకు కారణమని ఆయన వివరించారు. ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ గోపాల్ రెడ్డి, ట్రాన్స్ కో మాజీ డైరెక్టర్ రామారావు, ప్రొఫెసర్ ఉషా రామచంద్ర, ఏపీఈఆర్సీ మాజీ సభ్యుడు గోపాల్ రావు, ఏపీ ట్రాన్స్ కో సీజీఎం వీఎస్ సుబ్బారావు సభ్యులుగా ఉన్న నిపుణుల కమిటీ పనిచేస్తోందని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలియాల్సిందే... ‘చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడిన అంశాలు విన్నాం. ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంది’ అంటూ ప్రసంగాన్ని ఆరంభించిన ముఖ్యమంత్రి జగన్ గత ఐదేళ్లలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోని అక్రమాలను, దీనివల్ల జరిగిన నష్టాన్ని సాక్ష్యాలతో, గణాంకాలతో టీవీ స్క్రీన్లపై ప్రదర్శిస్తూ వివరించారు. ‘అసలు టీడీపీ హయాంలో ఏం జరిగిందనడానికి చిన్న ఉదాహరణ చెబుతా. రెన్యువబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్స్ (ఆర్పీపీఓ) గురించి ప్రజలందరికీ తెలియాలి. కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (సీఈఆర్సీ), ఆర్పీపీఓ మార్గదర్శకాలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఏపీఈఆర్సీ) ఎప్పుడూ అనుసరించదు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తికి (చంద్రబాబును ఉద్దేశించి) ఈ విషయం తెలియదు. ఏటా ఏపీఈఆర్సీ కొన్ని మార్గదర్శకాలు ఖరారు చేసి ఆ మేరకు విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్దేశిస్తుంది. మేం టీవీ తెరపై చూపుతున్నాం. మాజీ సీఎం చూడాలి’ అని సీఎం పేర్కొన్నారు. (సీఎం వివరిస్తుండగానే చంద్రబాబు, టీడీపీ సభ్యులు లేచి గోల చేస్తుండగా.. వారంతే. వారిది కుక్కతోక వంకర చందమే. వారితో పనిలేదు. వారి వైపు చూడవద్దు. వాస్తవాలు జనాలకు తెలియాలి... అంటూ సీఎం కొనసాగించారు) ఏపీఈఆర్సీ సూచనలు బేఖాతరు.. ‘2015 – 16లో సంప్రదాయేతర ఇంధనం 5 శాతం కొనాలని ఏపీఈఆర్సీ నిర్దేశించగా రాష్ట్ర ప్రభుత్వం 5.59 శాతం వరకూ కొనుగోలు చేసింది. 2016–17లో ఆర్పీపీఓ 5 శాతం కొనాలని నిర్దేశించగా 8.6 శాతం, 2017 –18లో 9 శాతానికి 19 శాతం, 2018 –19లో 11 శాతానికి గాను ఏకంగా 23.4 శాతం కొనుగోలు చేశారు. థర్మల్ విద్యుత్ యూనిట్ రూ. 4.20కే అందుబాటులో ఉన్నా అధిక ధర చెల్లించి పవన విద్యుత్ కొనుగోలు చేశారు. దీనివల్ల రాష్ట్రం దారుణంగా నష్టపోయింది. మూడంటే మూడు కంపెనీల (గ్రీన్కో, రెన్యూ, మిత్రా) నుంచే 63 శాతం పవన విద్యుత్‌ను చంద్రబాబు సర్కారు కొనుగోలు చేసింది. నిబంధనలకు మించి ఎక్కువగా సంప్రదాయేతర ఇంధనాన్ని అధిక ధరకు కొనడంవల్ల 2016 – 17లో రూ. 436 కోట్లు, 2017 – 18లో రూ. 924 కోట్లు , 2018– 19లో రూ. 1,293 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ విధంగా మూడేళ్లలోనే రూ. 2,653 కోట్లు ఎక్కువ చెల్లించారు. యూనిట్‌కు రూ. 1.74 అధిక ధర చెల్లింపు ముందే చేసుకున్న పీపీఏ నిబంధనల ప్రకారం విద్యుత్ కొనుగోలు చేసినా, చేయకపోయినా ప్రభుత్వం థర్మల్ కేంద్రాలకు యూనిట్‌కు రూ. 1.10 చొప్పున చెల్లించాల్సిందే. గత సర్కారు యూనిట్ 4.20కి లభించే థర్మల్ విద్యుత్‌ను బ్యాక్ డౌన్ చేసి రూ. 4.84 ధరతో పవన, సౌర విద్యుత్ కొనుగోలు చేయడంతో థర్మల్ కేంద్రాలకు యూనిట్‌కు రూ. 1.10 ఉత్తిపుణ్యానికి చెల్లించాల్సి వచ్చింది. దీంతో యూనిట్ ధర (రూ. 4.84 ప్లస్ రూ. 1.10 కలిపి) రూ. 5.94కు చేరింది. అంటే యూనిట్‌కు రూ. 1.74 అదనం. ఈ విధంగా ఏటా రూ. 2,766 కోట్లు ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడింది. ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే నష్టం ఇంకా ఎక్కువే జరిగింది. ఉదాహరణకు గుజరాత్లో యూనిట్ విద్యుత్ రూ. 2.43కే అందుబాటులో ఉంది. దాంతో మనం చెల్లించిన ధర పోల్చి చూస్తే ఏటా మనం రూ. 3,831 కోట్లు ఎక్కువ చెల్లించినట్లు అవుతోంది. వితిన్ రెన్యువబుల్ పవర్ ఆబ్లిగేషన్, ఔట్ సైడ్ రెన్యువవల్ పవర్ ఆబ్లిగేషన్ రెండూ కలిపి ఒక్కో యూనిట్‌కు రూ. 1.74 చొప్పున ఎక్కువ చెల్లించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఒక్క 2018 –19లోనే మనకు తెలిసి అక్షరాలా రూ. 2,766 కోట్లు ఎక్కువ పెట్టి విద్యుత్ కొన్నారు. అలాగే 2017–18లో రూ. 1,943 కోట్లు, 2016 –17లో రూ. 629 కోట్లు అధికంగా చెల్లించారు. ఈ స్థాయిలో అవినీతి చోటుచేసుకుంది. కేంద్రం నుంచి రాయితీ ఎంత? రాష్ట్రానికి జరిగిన నష్టమెంత? సంప్రదాయేతర విద్యుత్ కొనడం వల్ల మనకు కేంద్రం నుంచి ఒక్కో యూనిట్‌కు రూ. 1.54 రాయితీ వస్తోందని చంద్రబాబు చెప్పింది నిజమే. సంప్రదాయేతర ఇంధనాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్రం ఈ రాయితీ ఇస్తోంది. అయితే మనకు ఆ విధంగా 2016– 17లో కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాయితీ కూడా రాలేదు. 2017– 18లో రూ. 20 కోట్లు, 2018– 19లో రూ. 320 కోట్లు మాత్రమే రాయితీ వచ్చింది. అయితే మూడేళ్లలో సంప్రదాయేతర ఇంధనం కొనడానికి అధిక మొత్తం చెల్లించడంవల్ల నష్టపోయింది రూ. 5,497 కోట్లు. ఒక్కసారి ఆలోచించండి. కేంద్రం నుంచి వచ్చిన అత్యల్ప ప్రోత్సాహకం చూడాలా? లేక వేల కోట్ల రూపాయల నష్టం చూడాలా ? అంత మొత్తం మనం భరించాలా? 25 ఏళ్లకు పీపీఏలా? పదే పదే టెక్నాలజీ గురించి చంద్రబాబు మాట్లాడుతుంటారు. టెక్నాలజీ వల్ల ధరలు తగ్గుతున్నాయని చెబుతున్నారని గుర్తు చేశారు. మరి ఆ స్పృహ ఆ పెద్దమనిషికి ఉంటే అధిక ధర పెట్టి విద్యుత్తు కొనుగోలు చేసేందుకు ఏకంగా 25 ఏళ్ల కోసం ఇలా విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు ఎందుకు చేసుకున్నట్లు? ఇది ధర్మమేనా?. అంటే దానర్ధం.. ఏటా రూ. 2,766 కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు మనం నష్టపోతున్నట్లు కాదా! ఇతర రాష్ట్రాల్లో ఉన్న తక్కువ ధరతో చూస్తే ఆ నష్టం ఏకంగా దాదాపు రూ. 4 వేల కోట్లకు చేరుతుంది. ఇవన్నీ తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. ప్రజలపై ఇంత భారం మోపడం ధర్మమేనా? కోరుకున్న వ్యక్తిని చైర్మన్‌ను చేయడం కోసం... 65 ఏళ్లలోపు వారినే ఏపీఈఆర్సీ చైర్మన్‌గా నియమించాలని చట్టం ఉంది. అయితే కోరుకున్న వ్యక్తిని ఏపీఈఆర్సీ చైర్మన్‌గా నియమించేందుకు ఇదే అసెంబ్లీలో 2016 ఏప్రిల్ 29న ఏపీఈఆర్సీ చట్టానికి చంద్రబాబు సవరణ చేసి చైర్మన్ వయసును 70 ఏళ్లకు పెంచారు. కుంభకోణాలు చేసేందుకు ఏకంగా చట్టాలనే మార్చడం ధర్మమేనా? ఇలాంటి వ్యక్తా ఏపీఆర్ఈసీ గురించి మాట్లాడేది? రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో ఉంటే పరిస్థితి చక్కదిద్దినట్లు బాబు చెబుతున్నారు. వాస్తవాలు చూస్తే దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంటోంది. 2015– 16లో 642 మిలియన్ యూనిట్లు, 2016– 17లో 10, 473 మిలియన్ యూనిట్లు, 2017– 18లో 12,014 మిలియన్ యూనిట్లు, 2018– 19లో 7,629 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగులు ఉందని ఏపీఈఆర్సీ లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటప్పుడు వరుసగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారు? తగ్గుతున్న జీవీఏ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం.. గ్రాస్ వాల్యూ యాడెడ్ (రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి– జీవీఏ) పారిశ్రామిక రంగం నుంచి క్రమంగా తగ్గుతోంది. అది 2014 –15లో 25.48 శాతం ఉంటే.. 2017–18కి వచ్చే సరికి 22.09 శాతానికి తగ్గిపోయింది. అంటే మనకు డబ్బులు చెల్లించే వినియోగదారులు క్రమంగా తగ్గిపోతున్నారని అర్థం. పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. వారికి ఒక వైపు ప్రోత్సాహకాలు లేవు. మనం కరెంటు ఎక్కువ ధరకు కొంటున్నాం. అంత కంటే ఎక్కువ ధరకు పరిశ్రమలకు సరఫరా చేస్తున్నాం. దీంతో పారిశ్రామిక రంగం నానాటికీ దిగజారుతోంది. డిస్కమ్‌ల పరిస్థితి ఏమిటి? 2015–16 నుంచి 2018–19 మధ్య ఎస్పీడీసీఎల్ విద్యుత్ కొనుగోలు వ్యయం, అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు ఇలా.. రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ అనే రెండు డిస్కమ్‌లు ఉన్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలోనే ఎక్కువగా సంప్రదాయేతర విద్యుత్తు కొనుగోళ్లు సాగుతున్నాయి. 2015–16లో ఆ సంస్థలో కాస్ట్ ఆఫ్ పవర్ ఆపరేషన్స్ (విద్యుత్ కొనుగోలు మొత్తం ) రూ.14,920 కోట్లు కాగా, అన్ని రకాల ఆదాయం కేవలం రూ. 11,546 కోట్లు మాత్రమే. 2016– 17లో నిర్వహణ వ్యయం రూ. 15,076 కోట్లు కాగా, ఆదాయం రూ. 12,157 కోట్లు. 2017– 18లో విద్యుత్ కొనుగోలు మొత్తం రూ. 16,642 కోట్లు కాగా, వచ్చిన ఆదాయం రూ. 13,609 కోట్లు. 2018–19లో నిర్వహణ వ్యయం రూ. 19,139 కోట్లు కాగా, ఆదాయం రూ. 14,956 కోట్లు. డిస్కమ్‌లు ఏవిధంగా నష్టపోతున్నాయో దీనిని బట్టి అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో డిస్కమ్‌లు బతకాలంటే ప్రభుత్వ సబ్సిడీ పెంచుతూ పోవాలి. 2015–16లో రూ. 2,318 కోట్లు, 2016–17లో రూ. 3,153 కోట్లు, 2017–18లో రూ. 4,167 కోట్లు, 2018– 19లో రూ. 4,937 కోట్లు చొప్పున ప్రభుత్వం డిస్కమ్‌లకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిది. మరి ఈ స్థాయిలో సబ్సిడీ భరించే పరిస్థితిలో రాష్ట్రం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వ రెవెన్యూ లోటు 2015– 16లో రూ. 7,302 కోట్లు, 2016–17లో రూ. 17,194 కోట్లు, 2017–18లో రూ.16,152 కోట్లు, 2018–19లో రూ. 11,937 కోట్లుగా ఉంది. ఆ రకంగా ఈ 5 ఏళ్లలో రాష్ట్ర రెవెన్యూ లోటు ఏకంగా రూ. 66, 361 కోట్లకు చేరింది. అసలే ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రంపై ఇలా విద్యుత్ కొనుగోళ్ల పేరుతో స్కాంలు చేస్తే ఎలా తట్టుకుంటుంది? ఈ అంశాలను ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇంత దారుణంగా కుంభకోణాలు చేస్తూ మళ్లీ ఏమీ ఎరుగనట్లు ఇక్కడ కూర్చొని వీరు (బాబు) మాట్లాడుతున్న మాటలు చేస్తూంటే వారు మనుషులు దశ దాటిపోయి రాక్షసులగా మారారా అనిపిస్తోంది.’ అని సీఎం జగన్ ఆవేదనతో ప్రసంగం ముగించారు. వెంటనే స్పీకరు సభను సోమవారానికి వాయిదా వేశారు. -
పీపీఏలపై సమీక్ష అనవసరం
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై సమీక్ష అవసరం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. విద్యుత్ ధరలపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని ఒక రిసార్ట్‌లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తమ హయాంలో విద్యుత్ ధరలు నిర్ణయించడంలో పెద్ద కుంభకోణం జరిగిందని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. సంప్రదాయేతర ఇంధనాన్ని ఐదు శాతానికి మించి తీసుకోకూడదని చెబుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అలాంటిదేమీ లేదన్నారు. కాలుష్యం తగ్గించేందుకే పునరుత్పాదక ఇంధనం వైపు వెళ్లామని, 2021 నాటికి సాంప్రదాయేతర ఇంధన వినియోగం 20 శాతానికి చేరాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించిందని తెలిపారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపై సమస్యలు వస్తుండడంతో అన్ని దేశాలు సౌర, పవన విద్యుత్ వైపు వెళ్తున్నాయన్నారు. సాంప్రదాయేతర ఇంధనం వల్ల నష్టం లేదన్నారు. పవన్ విద్యుత్ ధరలపై తమిళనాడుతో పోల్చుతున్నారని, కానీ అక్కడ గాలి వేగం ఎక్కువగా ఉంటుందని అందుకే అక్కడ ధర తక్కువగా ఉందని చెప్పారు. గాలి వేగాన్ని బట్టి పవన్ విద్యుత్ ధరలను నిర్ణయిస్తారని తెలిపారు. సోలార్ విద్యుత్‌ను యూనిట్ రూ.6.90కు ఎక్కడా తీసుకోలేదన్నారు. ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదు తమ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఎలాంటి క్విడ్ ప్రోకోలు లేవని చంద్రబాబు అన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు రెండు పవర్ ప్లాంట్లు ఉన్నాయని, కర్ణాటకలో వాటికి లాభం చేకూర్చుకుని ఇక్కడ అవినీతి అంటూ హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. టెండర్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్న జ్యుడీషియల్ కమిషన్ సాధ్యం కాదని తెలిపారు. హైకోర్టు నుంచి సిట్టింగ్ జడ్జి ఎలా వస్తారని, కార్యనిర్వాహక వ్యవస్థలో తాము జోక్యం చేసుకోమని న్యాయ వ్యవస్థ ఎప్పుడో చెప్పిందన్నారు. అయినా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు రిటైర్డ్ జడ్జి చైర్మన్‌గా ఉంటారని, వారి సిఫారసుల ప్రకారమే ధరలు నిర్ణయిస్తారన్నారు. పీపీఏల విషయంలో ప్రభుత్వం పాత్ర నామమాత్రమన్నారు. 221 పీపీఏల్లో ఎక్కువ ఐదుగురికే ఇచ్చామంటున్నారని ఇందులో తమ పాత్ర ఏదీ లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. తాము ఒప్పందాలు చేసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి అంశంలోనూ తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సున్నా వడ్డీ రుణాలకు వైఎస్సార్ పేరు పెట్టి దాన్ని ఇప్పుడే తెచ్చినట్లు చెప్పారని, తాము చిల్లిగవ్వ దానికి ఇవ్వలేదని అసెంబ్లీలో సవాల్ విసిరారని, తాను రెడ్‌హ్యాండెడ్‌గా దానిపై వాస్తవాలు బయటపెడితే పారిపోయారని విమర్శించారు. -
‘అందుకే విద్యుత్ ఒప్పందాలపై పునఃసమీక్ష’
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను సరిదిద్దేందుకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. గతంలో పోలిస్తే విద్యుత్ రేట్లు భారీగా తగ్గాయని, ఈ పరిస్థితుల్లో ఎక్కువ రేటు పెట్టి విద్యుత్ కొనాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..అందులో భాగంగా గతంలో ఎవరూ తీసుకోని విధంగా గతంలో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. పీపీఏల రద్దువల్ల పెట్టుబడులు వెనక్కివెళ్లిపోతాయని కొంతమంది దుష్ఫ్రచారం చేస్తోన్నారని..కానీ ఎలాంటి ఒప్పందాలు లేకుండానే కరెంటు సరఫరా చేసేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ‘విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాలి. ప్రస్తుతం మనం ఎక్కువ ధరకు విద్యుత్‌ను కొంటున్నాం. గత ప్రభుత్వం పీపీఏలను రూ.6లకు ఒప్పందం చేసుకుంది. సౌర విద్యుత్‌ఒప్పందం రూ. 4.84కు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విండ్ సోలార్, విద్యుత్ ధరలు తగ్గిపోయాయి. 2010లో రూ.18 ఉన్న సౌర విద్యుత్ యూనిట్ రూ.2.45 తగ్గింది. పవన విద్యుత్ యూనిట్ రూ.4.20 నుంచి 43 పైసలకు తగ్గిపోయింది. ఎక్కువ ధరకు విద్యుత్ కొనాల్సిన అవసరం రాష్ట్రానికి లేదు. అధిక ధరల ఒప్పందం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. పీపీఏలు లేకుండానే యూనిట్ విద్యుత్‌ను రూ. 2.72లకు అందించేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి’ అని అజేయ కల్లం అన్నారు. ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. డిస్కంలు రుణపరిమితి దాటి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారన్నారు. ప్రస్తుతం డిస్కంలు రూ. 20వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రూ.26.6శాతానికి చేరుకుందని తెలిపారు. కొత్తగా వస్తున్న పరిశ్రమలపై విద్యుత్ భారం వేయలేమని తేల్చి చెప్పారు. ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీలో మార్పులు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీలో మార్పులు జరిగాయి. అడ్వకేట్ జనరల్ స్థానంలో న్యాయశాఖ కార్యదర్శిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత స్థాయి సంప్రదింపు కమిటీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్‌లు ఉన్నారు. -
విద్యుత్ పీపీఏలపై కమిటీ
సాక్షి, అమరావతి / సాక్షి ప్రతినిధి, కర్నూలు: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అడ్డగోలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పరిశీలించే ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా తొమ్మిది మందితో కూడిన ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీని ప్రభుత్వం నియమించింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ళ వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఆర్థిక ఊబిలో కూరుకుపోయాయి. దాదాపు రూ.20 వేల కోట్ల మేర విద్యుత్ ఉత్పత్తిదారులకు డిస్కమ్‌లు బాకీ పడ్డాయి. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు సౌర, పవన విద్యుత్‌ను అవసరానికి మించి, అత్యధిక రేట్లకు కొనుగోలు చేయడమే. బిడ్డింగ్‌కు వెళ్లి ఉంటే, సంప్రదాయేతర ఇంధన వనరుల రేట్లు గణనీయంగా తగ్గేవి. కానీ గత ప్రభుత్వం ఈ పనిచేయలేదు. ఎక్కడా లేనివిధంగా యూనిట్ పవన విద్యుత్‌కు యూనిట్ రూ.4.84 వరకూ, సౌర విద్యుత్‌కు గరిష్టంగా రూ.6.14 వరకూ చెల్లించాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల తప్పనిసరి (రెన్యూవబుల్ ఆబ్లిగేషన్) 5 శాతం ఉంటే, ఏకంగా 22 శాతం మేర కొనుగోలు చేశారు. ఈ కారణంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. ఫలితంగా థర్మల్ ఉత్పత్తిదారులకు విద్యుత్ తీసుకోకపోయినా యూనిట్‌కు రూ.1.10 మేర స్థిర వ్యయం (ఫిక్స్డ్) ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో ఏపీ డిస్కమ్‌ల మీద రూ.2636 కోట్ల భారం పడింది. గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలు ఇంకా కొనసాగితే డిస్కమ్‌లు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం విండ్, సోలార్ విద్యుత్ ధరలను తగ్గించి, ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్ అందించాలనే ప్రయత్నం చేస్తోంది. పీపీఏల్లో మార్పులు చేయాల్సిందే.. రాష్ట్రంలో సోలార్, విండ్ పవర్ విద్యుత్ ధరలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు యూనిట్ ధరలను తగ్గించుకోవాలంటూ సోలార్, విండ్ పవర్ కంపెనీలకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు త్వరలో నోటీసులు జారీ చేయనున్నాయి. యూనిట్ విద్యుత్ ధరను రూ.2.50 చొప్పున ఇచ్చేందుకు ముందుకు రావాలని ఈ నోటీసుల్లో కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా నోటీసులు జారీ చేయనున్న కంపెనీల జాబితాలో ప్రైవేట్ కంపెనీలతో పాటు నెడ్‌క్యాప్ సంస్థ కూడా ఉండటం గమనార్హం. ఇన్ని రోజులుగా అధిక ధరకు విద్యుత్‌ను విక్రయించినందుకుగాను కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కూడా ఈ నోటీసుల్లో కోరనున్నట్టు సమాచారం. గత చంద్రబాబు ప్రభుత్వం ఆయా విద్యుత్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు విధించిన ‘కచ్చితంగా నిర్వహించాలి, ఆ విద్యుత్‌ను ప్రభుత్వం కొనాలి’ (మస్ట్ రన్) అనే నిబంధనను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)లో డిస్కంలు పిటీషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా 82 కంపెనీలతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) మార్పులు చేయాలని కూడా ఏపీఈఆర్సీని డిస్కంలు కోరుతున్నాయి. పై నిబంధనతో ఏకంగా రూ.2,636 కోట్ల మేర నష్టం జరిగిందని అధికారులు తేల్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి విద్యుత్‌ను కొనుగోలు చేయడంలో డిస్కంలు అవేలబులిటీ బేస్డ్ టారీఫ్ (ఏబీటీ) పాటిస్తుంటాయి. అంటే తమకు అందుబాటులో ఏ విద్యుత్ తక్కువ ధరకు దొరుకుతుందో దానికే ప్రాధాన్యత ఇవ్వడం. కానీ ‘మస్ట్ రన్’ నిబంధన వల్ల డిస్కంలు ధరతో సంబంధం లేకుండా విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. తద్వారా మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ సోలార్, విండ్ కంపెనీలకు అధిక ధరను చెల్లించాయి. ఆస్తులు, అప్పుల పంపకానికి ప్రత్యేక కన్సల్టెన్సీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల పలు అంశాలపై చర్చలు జరిపిన ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించబోతోంది. విద్యుత్ ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన, బకాయిల పరిష్కారంపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సానుకూలంగా సంప్రదింపులు జరిపారు. అంతిమంగా ఆస్తులు, అప్పుల లెక్క తేల్చేందుకు రెండు రాష్ట్రాలకు కలిపి ఓ చార్టర్డ్ అకౌంటెంట్‌ను నియమించాలని నిర్ణయించారు. ఆయన అందించే నివేదిక ఆధారంగా ఆస్తులు, అప్పుల పంపకం ఉంటుందని సీనియర్ అధికారులు తెలిపారు. ఉద్యోగుల విభజన విషయమై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ధర్మాధికారి కమిటీ నివేదికతో పాటు రెండు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఏపీ స్థానికత ఆధారంగా 1,152 మందిని తెలంగాణ విద్యుత్ సంస్థలు 2015లోనే రిలీవ్ చేశాయి. ఈ వివాదం అప్పటి నుంచి న్యాయస్థానాల పరిధిలో నలుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి, సామరస్య ధోరణితో పరిష్కారం చూపాలని రెండు రాష్ట్రాలు భావిస్తున్నాయి. విద్యుత్ బకాయిల చెల్లింపు విషయంలోనూ ఏకాభిప్రాయం దిశగా చర్చలుంటాయని, కన్సల్టెన్సీ సంస్థ నివేదిక తర్వాత అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ సభ్యులు వీరే.. కమిటీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్ శాఖ మంత్రి బి.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సీఎం స్పెషల్ సెక్రటరీ డి.కృష్ణ, ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ గోపాల్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం పలు కీలక అంశాలను ఈ సంప్రదింపుల కమిటీ ముందు ఉంచింది. కమిటీ ఏం చేస్తుందంటే.. - గత ప్రభుత్వం పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులతో అత్యధిక రేట్లకు చేసుకున్న ఒప్పందాలను పరిశీలిస్తుంది. - విండ్, సోలార్ ఉత్పత్తిదారులతో కమిటీ నేరుగా సంప్రదింపులు జరుపుతుంది. డిస్కమ్‌లకు అందించే విద్యుత్ ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. - చర్చల నేపథ్యంలో ప్రభుత్వానికి కీలకమైన, అవసరమైన సిఫార్సులు చేస్తుంది. - గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు చేసుకునే సమయంలో పవన, సోలార్ విద్యుత్ రేట్లు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తుంది. ఇప్పుడెలా ఉన్నాయో అధ్యయనం చేస్తుంది. - ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్ల నుంచి, కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా అవకాశాలను పరిశీలిస్తుంది. - 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. -
సోలార్, పవన విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు
-
విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవకతవకలు!
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో సోలార్, పవన విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో ట్రాన్స్ కో సీఎండీ కన్వీనర్‌గా తొమ్మిది మందితో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, అడ్వకేట్ జనరల్, అజయ్‌కల్లాం, రావత్, ఇంధన శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలపై సంప్రదింపులు జరుపనుంది. అదే విధంగా గత ప్రభుత్వంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన సోలార్, విండ్ పవర్ ధరలను సమీక్షించనుంది. డిస్కంలకు తక్కువ ధరలకు అమ్మేవారితో కూడా సంప్రదింపులు చేయనుంది. గతంలో ఉన్న ధరలు, ప్రస్తుత ధరలపై రివ్యూ చేయనుంది. -
‘సుప్రీం’కు పీపీఏల రద్దు వివాదం!
సీఈఏ కమిటీ నిర్ణయంపై ఏపీ మండిపాటు తుది నివేదిక అనంతరం సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయం నేడు వాడివేడిగా జరుగనున్న సమావేశం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దు వివాదం చివరకు సుప్రీంకోర్టుకు చేరేట్టుగా ఉంది. రెండు రాష్ట్రాల్లోని విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం విద్యుత్ సరఫరా జరగాల్సిందేనన్న కమిటీ ముసాయిదా నివేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండిపడుతోంది. కమిటీ నివేదికను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తుండగా, దానిపై సంతకం చేయరాదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో జరిగే సీఈఏ కమిటీ సమావేశం వేడివేడిగా సాగనుంది. ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు సీఈఏ చైర్పర్సన్ నీర్జా మాథూర్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకసారి సమావేశమైన కమిటీ సోమవారం మరోసారి సమావేశం కానుంది. ఈ సందర్భంగా కమిటీ ఇరు రాష్ట్రాలకు ఒక ముసాయిదాను పంపింది. ‘గ్రిడ్ సంరక్షణ కోసం ఇరు రాష్ట్రాల్లోని విద్యుత్ ప్లాంట్ల నుంచి వాటా మేరకు తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ సరఫరా కావాల్సిందే. పీపీఏలకు ఈఆర్సీ అనుమతి ఉందా? లేదా అన్న న్యాయపరమైన అంశాల జోలికి మేం వెళ్లలేం. కేవలం సాంకేతిక అంశాల మీద ఆధారపడి మాత్రమే మేం నిర్ణయం తీసుకుంటున్నాం’ అంటూ ముసాయిదాలో కమిటీ పేర్కొంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ నుంచి న్యాయసలహా కూడా తీసుకుంది. సుప్రీంకోర్టు, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఈఆర్సీ అనుమతి లేని పీపీఏలు రద్దవుతాయని ఈ మేరకు ఏజీ సలహా ఇచ్చారు. ‘న్యాయపరమైన అంశాన్ని న్యాయ నిపుణులు లేని కమిటీ నిర్ణయించడం సరియైనది కాదు. కమిటీ ఇచ్చే నిర్ణయం న్యాయపరంగా ఉండాలి. కేవలం సాంకేతికంగా ఇస్తే సరిపోదు’ అని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. కేంద్రం కూడా ఇదే నిర్ణయం ప్రకటిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణపట్నం ప్లాంటు నిర్వహణ మాకే! కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్‌లో తమకే మెజారిటీ వాటా ఉన్నందున నిర్వహణ బాధ్యతలు తమకే అప్పగించాలని కొత్త వాదనను తెలంగాణ తెరమీదకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) ఆధ్వర్యంలో 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే పూర్తయిన 800 మెగావాట్ల మొదటి యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ ప్లాంట్‌ను జెన్కోతో పాటు విద్యుత్‌పంపిణీ సంస్థ(డిస్కం)లు కలిసి సంయుక్తంగా చేపడుతున్నాయి. ఈ ప్లాంటులో ఉమ్మడి రాష్ట్రంలోని జెన్కోకు 51 శాతం వాటా, నాలుగు డిస్కంలకు 49 శాతం వాటా ఉంది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ జెన్కోతో పాటు తెలంగాణ డిస్కం అయిన టీఎస్పీడీసీఎల్ (గతంలో సీపీడీసీఎల్)కు అధిక శాతం వాటా ఉంది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ట్రాన్స్‌కో, జెన్కోలు కొనుగోలు చేసిన వివిధ రకాల సాఫ్ట్వేర్ ఖర్చులో తమ వాటా తమకు ఇవ్వాలని కూడా తెలంగాణ వాదించనున్నట్టు సమాచారం. మరోవైపు కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని సంప్రదాయేతర ఇంధన వనరుల (ఎన్సీఈ) విద్యుత్ మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే అన్న కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.