విద్యుత్‌ పీపీఏలపై కమిటీ | Committee on Electricity PPAs | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ పీపీఏలపై కమిటీ

Published Tue, Jul 2 2019 4:12 AM | Last Updated on Tue, Jul 2 2019 10:19 AM

Committee on Electricity PPAs - Sakshi

సాక్షి, అమరావతి / సాక్షి ప్రతినిధి, కర్నూలు:  గత ప్రభుత్వ హయాంలో జరిగిన అడ్డగోలు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను పరిశీలించే ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా తొమ్మిది మందితో కూడిన ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీని ప్రభుత్వం నియమించింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ప్రైవేటు విద్యుత్‌ కొనుగోళ్ళ వల్ల విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఆర్థిక ఊబిలో కూరుకుపోయాయి. దాదాపు రూ.20 వేల కోట్ల మేర విద్యుత్‌ ఉత్పత్తిదారులకు డిస్కమ్‌లు బాకీ పడ్డాయి. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు సౌర, పవన విద్యుత్‌ను అవసరానికి మించి, అత్యధిక రేట్లకు కొనుగోలు చేయడమే. బిడ్డింగ్‌కు వెళ్లి ఉంటే, సంప్రదాయేతర ఇంధన వనరుల రేట్లు గణనీయంగా తగ్గేవి. కానీ గత ప్రభుత్వం ఈ పనిచేయలేదు.

ఎక్కడా లేనివిధంగా యూనిట్‌ పవన విద్యుత్‌కు యూనిట్‌ రూ.4.84 వరకూ, సౌర విద్యుత్‌కు గరిష్టంగా రూ.6.14 వరకూ చెల్లించాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల తప్పనిసరి (రెన్యూవబుల్‌ ఆబ్లిగేషన్‌) 5 శాతం ఉంటే, ఏకంగా 22 శాతం మేర కొనుగోలు చేశారు. ఈ కారణంగా థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేశారు. ఫలితంగా థర్మల్‌ ఉత్పత్తిదారులకు విద్యుత్‌ తీసుకోకపోయినా యూనిట్‌కు రూ.1.10 మేర స్థిర వ్యయం (ఫిక్స్‌డ్‌) ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో ఏపీ డిస్కమ్‌ల మీద రూ.2636 కోట్ల భారం పడింది. గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలు ఇంకా కొనసాగితే డిస్కమ్‌లు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం విండ్, సోలార్‌ విద్యుత్‌ ధరలను తగ్గించి, ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్‌ అందించాలనే ప్రయత్నం చేస్తోంది. 

పీపీఏల్లో మార్పులు చేయాల్సిందే..
రాష్ట్రంలో సోలార్, విండ్‌ పవర్‌ విద్యుత్‌ ధరలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు యూనిట్‌ ధరలను తగ్గించుకోవాలంటూ సోలార్, విండ్‌ పవర్‌ కంపెనీలకు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు త్వరలో నోటీసులు జారీ చేయనున్నాయి. యూనిట్‌ విద్యుత్‌ ధరను రూ.2.50 చొప్పున ఇచ్చేందుకు ముందుకు రావాలని ఈ నోటీసుల్లో కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా నోటీసులు జారీ చేయనున్న కంపెనీల జాబితాలో ప్రైవేట్‌ కంపెనీలతో పాటు నెడ్‌క్యాప్‌ సంస్థ కూడా ఉండటం గమనార్హం. ఇన్ని రోజులుగా అధిక ధరకు విద్యుత్‌ను విక్రయించినందుకుగాను కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కూడా ఈ నోటీసుల్లో కోరనున్నట్టు సమాచారం. గత చంద్రబాబు ప్రభుత్వం ఆయా విద్యుత్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు విధించిన ‘కచ్చితంగా నిర్వహించాలి, ఆ విద్యుత్‌ను ప్రభుత్వం కొనాలి’ (మస్ట్‌ రన్‌) అనే నిబంధనను తొలగించాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)లో డిస్కంలు పిటీషన్‌ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇందుకు అనుగుణంగా 82 కంపెనీలతో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) మార్పులు చేయాలని కూడా ఏపీఈఆర్‌సీని డిస్కంలు కోరుతున్నాయి. పై నిబంధనతో ఏకంగా రూ.2,636 కోట్ల మేర నష్టం జరిగిందని అధికారులు తేల్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి విద్యుత్‌ను కొనుగోలు చేయడంలో డిస్కంలు అవేలబులిటీ బేస్డ్‌ టారీఫ్‌ (ఏబీటీ) పాటిస్తుంటాయి. అంటే తమకు అందుబాటులో ఏ విద్యుత్‌ తక్కువ ధరకు దొరుకుతుందో దానికే ప్రాధాన్యత ఇవ్వడం. కానీ ‘మస్ట్‌ రన్‌’ నిబంధన వల్ల డిస్కంలు  ధరతో సంబంధం లేకుండా విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. తద్వారా మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్‌ అందుబాటులో ఉన్నప్పటికీ సోలార్, విండ్‌ కంపెనీలకు అధిక ధరను చెల్లించాయి.

ఆస్తులు, అప్పుల పంపకానికి ప్రత్యేక కన్సల్టెన్సీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల పలు అంశాలపై చర్చలు జరిపిన ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్‌ సమస్యలకు పరిష్కారం లభించబోతోంది. విద్యుత్‌ ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన, బకాయిల పరిష్కారంపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సానుకూలంగా సంప్రదింపులు జరిపారు. అంతిమంగా ఆస్తులు, అప్పుల లెక్క తేల్చేందుకు రెండు రాష్ట్రాలకు కలిపి ఓ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ను నియమించాలని నిర్ణయించారు. ఆయన అందించే నివేదిక ఆధారంగా ఆస్తులు, అప్పుల పంపకం ఉంటుందని సీనియర్‌ అధికారులు తెలిపారు. ఉద్యోగుల విభజన విషయమై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ధర్మాధికారి కమిటీ నివేదికతో పాటు రెండు రాష్ట్రాల విద్యుత్‌ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఏపీ స్థానికత ఆధారంగా 1,152 మందిని తెలంగాణ విద్యుత్‌ సంస్థలు 2015లోనే రిలీవ్‌ చేశాయి. ఈ వివాదం అప్పటి నుంచి న్యాయస్థానాల పరిధిలో నలుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి, సామరస్య ధోరణితో పరిష్కారం చూపాలని రెండు రాష్ట్రాలు భావిస్తున్నాయి. విద్యుత్‌ బకాయిల చెల్లింపు విషయంలోనూ ఏకాభిప్రాయం దిశగా చర్చలుంటాయని, కన్సల్టెన్సీ సంస్థ నివేదిక తర్వాత అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కమిటీ సభ్యులు వీరే..
కమిటీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్‌ శాఖ మంత్రి బి.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌ఎస్‌ రావత్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, సీఎం స్పెషల్‌ సెక్రటరీ డి.కృష్ణ, ఎస్పీడీసీఎల్‌ మాజీ సీఎండీ గోపాల్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం పలు కీలక అంశాలను ఈ సంప్రదింపుల కమిటీ ముందు ఉంచింది. 

కమిటీ ఏం చేస్తుందంటే.. 
- గత ప్రభుత్వం పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తిదారులతో అత్యధిక రేట్లకు చేసుకున్న ఒప్పందాలను పరిశీలిస్తుంది. 
విండ్, సోలార్‌ ఉత్పత్తిదారులతో కమిటీ నేరుగా సంప్రదింపులు జరుపుతుంది. డిస్కమ్‌లకు అందించే విద్యుత్‌ ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తుంది.
చర్చల నేపథ్యంలో ప్రభుత్వానికి కీలకమైన, అవసరమైన సిఫార్సులు చేస్తుంది.
గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు చేసుకునే సమయంలో పవన, సోలార్‌ విద్యుత్‌ రేట్లు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తుంది. ఇప్పుడెలా ఉన్నాయో అధ్యయనం చేస్తుంది.
ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్ల నుంచి, కేంద్రం నుంచి విద్యుత్‌ సరఫరా అవకాశాలను పరిశీలిస్తుంది. 
45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement