‘సుప్రీం’కు పీపీఏల రద్దు వివాదం! | Supreme' to cancel the dispute ppa | Sakshi
Sakshi News home page

‘సుప్రీం’కు పీపీఏల రద్దు వివాదం!

Published Mon, Aug 4 2014 2:24 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

‘సుప్రీం’కు పీపీఏల రద్దు వివాదం! - Sakshi

‘సుప్రీం’కు పీపీఏల రద్దు వివాదం!

సీఈఏ కమిటీ నిర్ణయంపై ఏపీ మండిపాటు
తుది నివేదిక అనంతరం సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయం
నేడు వాడివేడిగా జరుగనున్న సమావేశం

 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దు వివాదం చివరకు సుప్రీంకోర్టుకు చేరేట్టుగా ఉంది. రెండు రాష్ట్రాల్లోని విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం విద్యుత్ సరఫరా జరగాల్సిందేనన్న కమిటీ ముసాయిదా నివేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండిపడుతోంది. కమిటీ నివేదికను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తుండగా, దానిపై సంతకం చేయరాదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో జరిగే సీఈఏ కమిటీ సమావేశం వేడివేడిగా సాగనుంది.  ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు సీఈఏ చైర్‌పర్సన్ నీర్జా మాథూర్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకసారి సమావేశమైన కమిటీ సోమవారం మరోసారి సమావేశం కానుంది. ఈ సందర్భంగా కమిటీ ఇరు రాష్ట్రాలకు ఒక ముసాయిదాను పంపింది. ‘గ్రిడ్ సంరక్షణ కోసం ఇరు రాష్ట్రాల్లోని విద్యుత్ ప్లాంట్ల నుంచి వాటా మేరకు తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ సరఫరా కావాల్సిందే. పీపీఏలకు ఈఆర్‌సీ అనుమతి ఉందా? లేదా అన్న న్యాయపరమైన అంశాల జోలికి మేం వెళ్లలేం.

కేవలం సాంకేతిక అంశాల మీద ఆధారపడి మాత్రమే మేం నిర్ణయం తీసుకుంటున్నాం’ అంటూ ముసాయిదాలో కమిటీ పేర్కొంది.  దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ నుంచి న్యాయసలహా కూడా తీసుకుంది. సుప్రీంకోర్టు, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఈఆర్‌సీ అనుమతి లేని పీపీఏలు రద్దవుతాయని ఈ మేరకు ఏజీ సలహా ఇచ్చారు. ‘న్యాయపరమైన అంశాన్ని న్యాయ నిపుణులు లేని కమిటీ నిర్ణయించడం సరియైనది కాదు. కమిటీ ఇచ్చే నిర్ణయం న్యాయపరంగా ఉండాలి. కేవలం సాంకేతికంగా ఇస్తే సరిపోదు’ అని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. కేంద్రం కూడా ఇదే నిర్ణయం ప్రకటిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
 
కృష్ణపట్నం ప్లాంటు నిర్వహణ మాకే!


కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్‌లో తమకే మెజారిటీ వాటా ఉన్నందున నిర్వహణ బాధ్యతలు తమకే అప్పగించాలని  కొత్త వాదనను తెలంగాణ తెరమీదకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) ఆధ్వర్యంలో 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే పూర్తయిన 800 మెగావాట్ల మొదటి యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ ప్లాంట్‌ను జెన్‌కోతో పాటు విద్యుత్‌పంపిణీ సంస్థ(డిస్కం)లు కలిసి సంయుక్తంగా చేపడుతున్నాయి. ఈ ప్లాంటులో ఉమ్మడి రాష్ట్రంలోని జెన్‌కోకు 51 శాతం వాటా, నాలుగు డిస్కంలకు 49 శాతం వాటా ఉంది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ జెన్‌కోతో పాటు తెలంగాణ డిస్కం అయిన టీఎస్‌పీడీసీఎల్ (గతంలో సీపీడీసీఎల్)కు అధిక శాతం వాటా ఉంది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ట్రాన్స్‌కో, జెన్‌కోలు కొనుగోలు చేసిన వివిధ రకాల సాఫ్ట్‌వేర్ ఖర్చులో తమ వాటా తమకు ఇవ్వాలని కూడా తెలంగాణ వాదించనున్నట్టు సమాచారం. మరోవైపు కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని సంప్రదాయేతర ఇంధన వనరుల (ఎన్‌సీఈ) విద్యుత్ మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే అన్న కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement