సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) అవినీతి చోటు చేసుకున్నప్పుడు వాటిని రద్దు చేయడంలో ఎలాంటి తప్పులేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. పీపీఏలను దుర్వినియోగం చేశారని ఆధారాలు లభించినప్పుడు వాటిని రద్దు చేయవచ్చని తెలిపింది. పీపీఏల్లో అక్రమాలు జరిగాయని ఆధారాలున్నప్పుడు వాటిని రద్దు చేయడంతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు సైతం చర్యలు తీసుకోవచ్చని వివరించింది.
సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల సమీక్షకు ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని (హెచ్‌ఎల్‌ఎస్‌సీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 63.. సౌర, పవన విద్యుత్ ధరల తగ్గింపునకు హెచ్‌ఎల్‌ఎస్‌సీతో సంప్రదింపులు జరపాలని విద్యుత్ ఉత్పత్తి కంపెనీలను ఆదేశిస్తూ ఎస్‌పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాసిన లేఖలను సవాలు చేస్తూ పలు సౌర, పవన విద్యుత్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు బుధవారం మరోసారి విచారణ జరిపారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున ఏఎస్‌జీ బొప్పిడి కృష్ణమోహన్ వాదనలు వినిపించారు. పీపీఏల విషయంలో కేంద్రం నిర్దిష్టమైన వైఖరిని అనుసరిస్తోందన్నారు. ఏపీలో జరిగిన పీపీఏల విషయంలోనూ కేంద్రానిది అదే వైఖరి అని చెప్పారు. అంతకు ముందు విద్యుత్ కంపెనీల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. విద్యుత్ ధరలను విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) నిర్ణయించాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం కాదన్నారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణ గురువారానికి వాయిదా పడింది.
అవినీతి జరిగితే పీపీఏలను రద్దు చేయొచ్చు
Published Thu, Aug 29 2019 5:20 AM | Last Updated on Thu, Aug 29 2019 5:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment