లాభాల్లో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఎందుకు?  | Andhra Pradesh High Court On Visakha Steel Plant Privatization | Sakshi
Sakshi News home page

లాభాల్లో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఎందుకు? 

Published Thu, Oct 13 2022 4:37 AM | Last Updated on Thu, Oct 13 2022 4:37 AM

Andhra Pradesh High Court On Visakha Steel Plant Privatization - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లాభాల్లో కొనసాగుతున్నప్పుడు దాన్ని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాభాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరించే విషయాన్ని పునఃపరిశీలించాలని సూచించింది. నిర్వాసితులకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాల కల్పనపై దాఖలైన వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

తదుపరి విచారణను నవంబర్‌ 9కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఇదే అంశంపై సువర్ణరాజు అనే వ్యక్తి కూడా పిల్‌ దాఖలు చేశారు. అలాగే ఈ అంశంతోపాటు నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ ధనలక్ష్మి, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ మూడు వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది.  

ఎంత మేర నష్టాల్లో ఉంది? 
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ముందుకెళుతూనే ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు?.. ఆ సంస్థ నష్టాల్లో ఉందా? అంటూ ప్రశ్నించింది. సొంత అవసరాల నిమిత్తం క్యాప్టివ్‌ మైనింగ్‌ లేకపోవడంతో ఆ సంస్థ నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆదినారాయణరావు తెలిపారు. దీనిని సాకుగా చూపి ఆ సంస్థను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు.

అయితే ప్రైవేటీకరణకు కారణాలు ఏమిటో కేంద్రం స్పష్టంగా చెప్పడం లేదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ గత ఐదేళ్ల కాలంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఎంత మేర నష్టాలు వచ్చాయని ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్రం నోరుమెదపడం లేదని ఆదినారాయణరావు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. కోవిడ్‌ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల వ్యాపారాలు మందకొడిగా సాగినా, ఒక్క ఉక్కు వ్యాపారం మాత్రం భారీ ఎత్తున సాగిందని తెలిపింది. ఆ సమయంలో చైనా ఉక్కును సరఫరా చేసే పరిస్థితి లేకపోవడంతో అది మన ఉక్కు పరిశ్రమలకు కలిసొచ్చిందని గుర్తు చేసింది.  

స్టీల్‌ ప్లాంట్‌ లాభాల్లో నడుస్తోంది.. 
ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రస్తుతం లాభాల్లో నడుస్తోందని చెప్పారు. వందల కోట్ల రూపాయల మేర లాభాలు ఆర్జించిందన్నారు. ప్రైవేటీకరణకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. లాభాల్లో ఉంటే ప్రైవేటీకరణ ఎందుకని ప్రశ్నించింది.

కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ (డీఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ స్పందిస్తూ.. నిరంతర నష్టాల వల్లే ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సమయంలో ఆదినారాయణరావు జోక్యం చేసుకుంటూ.. ప్రపంచంలో ధనవంతులుగా చలామణి అవుతున్న కొంతమంది ఈ సంస్థను నడపగలరని కేంద్రం భావిస్తోందని, ఆ వ్యక్తులెవరో అందరికీ తెలుసన్నారు. ఈ నేపథ్యంలో లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే విషయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రానికి ధర్మాసనం సూచించింది.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement