సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరగబోతోంది. 2030 నాటికి 7,700 మెగావాట్లకు చేరుతుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. ఈ దిశగా పెద్ద ఎత్తున చేపడుతున్న మినీ హైడల్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు అధికారులు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రాజెక్టుల రూపకల్పన దిశగా అడుగులేసే వీలుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,700 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దీన్ని 7,700 మెగావాట్లకు తీసుకెళ్లడం ద్వారా చౌక విద్యుత్ లభిస్తుంది. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం నుంచి యూనిట్ విద్యుత్ 90 పైసలకే లభిస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకోవాలంటే.. 30 శాతం వరకూ స్థిర విద్యుత్ (24 గంటలూ ఉత్పత్తి చేయగల విద్యుత్) అందుబాటులో ఉండాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రణాళికలు సిద్ధం చేసిన నెడ్‌క్యాప్
ఏపీలో ప్రస్తుతం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. మరో 10 వేల మెగావాట్లకుపైగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో 6 వేల మెగావాట్ల జల విద్యుత్ అవసరం. నదుల దిగువ భాగాన ఉన్న నీటిని ఎగువకు పంపి, డిమాండ్ వేళ విద్యుదుత్పత్తి చేస్తారు. అలాగే కొండ ప్రాంతాల్లో జలపాతాల ద్వారా వెళ్లే నీరు వృథా కాకుండా ఆనకట్ట ద్వారా నిల్వ చేసి ఎగువకు పంప్ చేసి విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ రెండు పద్ధతుల్లో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టులకు సంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 29 ప్రాంతాలను గుర్తించి డీపీఆర్‌లు రూపొందిస్తోంది. వీటి ద్వారా 31 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తేవచ్చని భావిస్తున్నారు.
రాష్ట్రంలో పెరగనున్న జల విద్యుత్
Published Mon, Dec 14 2020 4:00 AM | Last Updated on Mon, Dec 14 2020 4:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment