Hydropower stations
-
తలాయి జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలి
బెజ్జూర్: ప్రాణహిత నదిపై తలాయి జలవిద్యుత్ కేంద్రాన్ని ఎందుకు నిర్మించడంలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ‘ఓటు మీదే–నోటు మీదే‘ నినాదంతో పార్టీ సిర్పూర్ ఇన్చార్జి అర్షద్ హుస్సేన్ చేపట్టిన యాత్ర మండలంలోని పలు గ్రామాల్లో శనివారం కొనసాగింది. తలాయి గ్రామ సమీపంలో నిర్మించతలపెట్టిన జల విద్యుత్కేంద్రం స్థలాన్ని ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తలాయి జలవిద్యుత్ కేంద్రం నిర్మిస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయని, దీనికి అనుసంధానంగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తే ఇక్కడున్న బీడు భూములన్నీ సస్యశ్యామలమవుతాయని తెలిపారు. ఆదివాసీ, గిరిజనుల బతుకులు బాగు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆదివాసీలకు పోడు పట్టాలివ్వడంలో, రిజర్వేషన్లు పెంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. శిథిలావస్థకు చేరిన కృష్ణపల్లి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. 150 మంది విద్యార్థులన్న పాఠశాలలో సరిపడా టీచర్లు లేరని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజాసమస్యలు పరిష్కరించడంలో పూర్తి గా విఫలమయ్యారని ఆరోపించారు. బీఎస్పీ అధికా రంలోకి వస్తే వెంటనే ఆదివాసీ గూడేల్లో ప్రతీ నిరుపేదకు ఇల్లు నిర్మించే బాధ్యత తీసుకుంటామని, ప్రజాసమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
రాష్ట్రంలో పెరగనున్న జల విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరగబోతోంది. 2030 నాటికి 7,700 మెగావాట్లకు చేరుతుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. ఈ దిశగా పెద్ద ఎత్తున చేపడుతున్న మినీ హైడల్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు అధికారులు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రాజెక్టుల రూపకల్పన దిశగా అడుగులేసే వీలుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,700 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దీన్ని 7,700 మెగావాట్లకు తీసుకెళ్లడం ద్వారా చౌక విద్యుత్ లభిస్తుంది. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం నుంచి యూనిట్ విద్యుత్ 90 పైసలకే లభిస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకోవాలంటే.. 30 శాతం వరకూ స్థిర విద్యుత్ (24 గంటలూ ఉత్పత్తి చేయగల విద్యుత్) అందుబాటులో ఉండాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రణాళికలు సిద్ధం చేసిన నెడ్‌క్యాప్ ఏపీలో ప్రస్తుతం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. మరో 10 వేల మెగావాట్లకుపైగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో 6 వేల మెగావాట్ల జల విద్యుత్ అవసరం. నదుల దిగువ భాగాన ఉన్న నీటిని ఎగువకు పంపి, డిమాండ్ వేళ విద్యుదుత్పత్తి చేస్తారు. అలాగే కొండ ప్రాంతాల్లో జలపాతాల ద్వారా వెళ్లే నీరు వృథా కాకుండా ఆనకట్ట ద్వారా నిల్వ చేసి ఎగువకు పంప్ చేసి విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ రెండు పద్ధతుల్లో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టులకు సంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 29 ప్రాంతాలను గుర్తించి డీపీఆర్‌లు రూపొందిస్తోంది. వీటి ద్వారా 31 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తేవచ్చని భావిస్తున్నారు. -
రాష్ట్రంలో ఏడు పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాలు
సాక్షి, అమరావతి: సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల విభాగం (నెడ్‌క్యాప్) రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. వీటి సామర్థ్యం 6,300 మెగావాట్లు. వీటి ఏర్పాటుకు సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు నెడ్‌క్యాప్ టెండర్లు పిలిచింది. ఏడు కంపెనీలు సాంకేతిక బిడ్‌కు అర్హత సాధించాయి. త్వరలో ఆర్థిక బిడ్ తెరిచి టెండర్లు ఖరారు చేస్తామని, డీపీఆర్ ప్రక్రియ పూర్తయ్యాక నిర్మాణ పనులు చేపడతామని నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి గురువారం తెలిపారు. కోతలకు అవకాశం లేకుండా.. పీక్ డిమాండ్ (ఎక్కువ వినియోగం ఉండే సమయం)లో విద్యుత్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ సమయంలో విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉంటే కోతలకు ఆస్కారం ఉండదు. సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి సమయంలో వినియోగం తక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఇలా.. నీటి రిజర్వాయర్ల దగ్గర ఎత్తయిన ప్రదేశంలో ప్రత్యేకంగా నీటి నిల్వ కోసం ఓ రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. కిందకు వెళ్లిన నీటిని పంపుల ద్వారా ఎగువ ప్రాంతంలో ఉన్న రిజర్వాయర్‌లోకి పంపుతారు. నాన్ పీక్ అవర్స్ (డిమాండ్ లేని సమయం)లో సౌర, పవన విద్యుత్‌తో దిగువన ఉన్న నీటిని ఎగువన ఉన్న రిజర్వాయర్‌కు తరలిస్తారు. దీనివల్ల అవసరమైనప్పుడు జల విద్యుత్‌కు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో డిమాండ్ ఉండే సమయంలో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దీంతో ఎక్కువ ధరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను కొనే ఇబ్బంది తప్పుతుంది. సౌర, పవన విద్యుత్‌లనూ మనమే ఉపయోగించుకోవచ్చు. ఈ కేంద్రాల కాలపరిమితి దాదాపు 80 ఏళ్లు. నిర్మాణ వ్యయం తొలి 25 ఏళ్లలోనే తీరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. తర్వాత చౌకగా జలవిద్యుత్ అందుతుంది. రాష్ట్రంలో 29 ప్రాంతాల్లో 32 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలున్నాయని గుర్తించారు. -
జలవిద్యుత్ ప్రాజెక్టులు జెన్‌కోకే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలు తెలంగాణ రాష్ట్ర విద్యుదు త్పత్తి సంస్థ(జెన్కో)కే తిరిగి అప్పగిం చాలని ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ లేఖ రాసింది. గోదావరి నదిపై జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలు నీటిపారుదల శాఖకు అప్ప గిస్తూ 2010 మార్చి 11న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 21ను పునః సమీక్షించాలని కోరింది. బహుళార్థక ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో డ్యాం లు, జెన్కో ఆధ్వర్యంలో జల విద్యుదుత్పత్తి కేంద్రాలు నిర్మించడం ఆనవాయితీ. జల విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం, డిజైన్ల రూపకల్పన, నిర్వహణలో జెన్కోకు విస్తృత అనుభవం ఉంది. అయితే, గోదావరిపై జెన్కో కొత్త జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు జీవో 21 అడ్డుగా ఉంది. దీంతో పాత ఉత్తర్వులు సవరించి తుపాకులగూడెం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు అప్పగించాలని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖపై నీటిపారుదల శాఖ అభిప్రాయాన్ని ప్రభుత్వం కోరగా ఆ శాఖ ఈఎన్సీ సానుకూలంగా స్పందించారు. పూర్తయిన దిగువ జూరాల.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జెన్కో ఆధ్వర్యంలో దిగువ జూరాల, పులిచింతల జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టగా ఇప్పటికే దిగువ జూరాల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. పులి చింతల విద్యుదుత్పత్తి కేంద్రం పను లూ చివరిదశలో ఉన్నాయి. ఈప్రాజెక్టు పూర్తయితే జెన్కో చేతిలో జల విద్యుత్ కేంద్రాల నిర్మాణాల పనులండవు. -
జెన్కో విద్యుత్తు కేంద్రాలు బోర్డు పరిధిలోకి!
‘విద్యుత్తు’ విభజనపై ముసాయిదా ప్రతిపాదనలివ్వండి ఇంధన శాఖ అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశం సాక్షి, హైదరాబాద్: జెన్కోకు చెందిన జలవిద్యుత్తు కేంద్రాలు బోర్డు పరిధిలోకి పోనున్నాయా? నీటి నిర్వహణ బోర్డు పరిధిలోకి రానుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గోదావరి, కృష్ణా జలాల పంపిణీపై ఇప్పటికే నీటి బోర్డుల ఏర్పాటు గురించి రాష్ట్ర పునర్విభజన బిల్లులో ఉంది. దీంతో ఈ నదులపై జెన్కోకు చెందిన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులి చింతల తదితర ప్రాజెక్టులన్నీ ఆ బోర్డుల పరిధిలోకే రానున్నట్లు సమాచారం. ఇదే విషయమై బుధవారం జరిగిన ఇంధనశాఖ సమావేశంలో చర్చ జరిగింది. అయితే ఆయా విద్యుత్తు కేంద్రాలు బోర్డు పరిధిలోకి వెళ్తే వాటి నిర్వహణ ఎలా ఉంటుందనే విషయమై, అలాగే జెన్కో, ట్రాన్స్‌కోలను ఎలా విభజిం చాలనే దానిపై ముసాయిదా ప్రతిపాదనలు రెండు, మూడు రోజుల్లో సమర్పించాలని అధికారులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాహూ ఆదేశించారు. అయితే, విద్యుత్ సంస్థలు సూచించిన ప్రతిపాదనల్లో తలెత్తే ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై ముసాయిదా ప్రతిపాదనల అనంతరం చర్చిద్దామని సాహూ అన్నట్టు తెలిసింది. జెన్కోను ప్లాంట్ల వారీగా విభజించినప్పటికీ ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడంపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇంకా ఆర్డినెన్స్ జారీ కాలేదు. దీంతో సీలేరు విద్యుత్ ప్లాంటును ఏ ప్రాంతంలో చూపించాలనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఆర్డినెన్స్ వచ్చాక దీనిపై నిర్ణయానికి వద్దామని అధికారులు భావిస్తున్నారు. అలాగే ట్రాన్స్‌కోను విద్యుత్ సరఫరా లైన్లు ఆధారం గా విభజించాలా, లేదా సబ్స్టేషన్ల వారీగానా అనే విషయంపైనా చర్చ జరిగింది. ఏ విధానం సరైనదనే విషయంపై ప్రతిపాదనలు ఇవ్వాలని సాహూ అధికారులను కోరారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఫైళ్లను వేర్వేరుగా విడదీయాలని, ఇరు ప్రాంతాలకు సంబంధించిన ఫైళ్లను మాత్రం రెండు కాపీలు తీసి భద్రపరచాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ ఫైళ్లను సంబంధిత అధికారితో ధ్రువీకరణ చేయించాలని సూచించారు. ఏపీపీడీసీఎల్ ఎక్కడ? రాష్ట్ర విభజనతో ఉద్యోగుల్లో వేడి పెరుగుతోంది.. ఎవరు ఎక్కడకు వెళ్లాలనే చర్చ విస్తృతంగా సాగుతోంది. అయితే మొత్తం ప్రక్రియలో తమ కంపెనీ పేరే కనిపించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ (ఏపీపీడీసీఎల్) ఉద్యోగుల్లో కలకలం చెలరేగుతోంది. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం వద్ద 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ ప్లాంట్లను చేపట్టేందుకు ఈ సంస్థ ఏర్పాటైంది. ఆ ప్లాంట్లలో మొదటిదానిలో నెలాఖరులోగా విద్యుదుత్పత్తి ప్రారంభం కానుంది. మరో 6 నెలల తర్వాత మరో ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇవేగాక మరో 800 మెగావాట్ల ప్లాంటును చేపట్టాలనీ నిర్ణయించారు. ఈ సంస్థ జెన్కోతోపాటు రాష్ట్రంలోని 4 విద్యుత్ పంపిణీ సంస్థలకు వాటా ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఎర్రగడ్డలో జెన్కోకు చెందిన భవనంలో ఉంది. దీనిలో అనేకమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ, ఈ కంపెనీ పేరు బిల్లులో ఎక్కడా లేకపోవడం వారిలో కలవరం రేపుతోంది. తాము ఏ ప్రాంతానికి చెందుతామని, తమను ఎలా విభజిస్తారోనని ఆందోళన చెందుతున్నారు.