‘విద్యుత్తు’ విభజనపై ముసాయిదా ప్రతిపాదనలివ్వండి
ఇంధన శాఖ అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: జెన్‌కోకు చెందిన జలవిద్యుత్తు కేంద్రాలు బోర్డు పరిధిలోకి పోనున్నాయా? నీటి నిర్వహణ బోర్డు పరిధిలోకి రానుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గోదావరి, కృష్ణా జలాల పంపిణీపై ఇప్పటికే నీటి బోర్డుల ఏర్పాటు గురించి రాష్ట్ర పునర్విభజన బిల్లులో ఉంది. దీంతో ఈ నదులపై జెన్‌కోకు చెందిన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులి చింతల తదితర ప్రాజెక్టులన్నీ ఆ బోర్డుల పరిధిలోకే రానున్నట్లు సమాచారం. ఇదే విషయమై బుధవారం జరిగిన ఇంధనశాఖ సమావేశంలో చర్చ జరిగింది. అయితే ఆయా విద్యుత్తు కేంద్రాలు బోర్డు పరిధిలోకి వెళ్తే వాటి నిర్వహణ ఎలా ఉంటుందనే విషయమై, అలాగే జెన్‌కో, ట్రాన్స్‌కోలను ఎలా విభజిం చాలనే దానిపై ముసాయిదా ప్రతిపాదనలు రెండు, మూడు రోజుల్లో సమర్పించాలని అధికారులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాహూ ఆదేశించారు.
అయితే, విద్యుత్ సంస్థలు సూచించిన ప్రతిపాదనల్లో తలెత్తే ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై ముసాయిదా ప్రతిపాదనల అనంతరం చర్చిద్దామని సాహూ అన్నట్టు తెలిసింది. జెన్‌కోను ప్లాంట్ల వారీగా విభజించినప్పటికీ ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడంపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇంకా ఆర్డినెన్స్ జారీ కాలేదు. దీంతో సీలేరు విద్యుత్ ప్లాంటును ఏ ప్రాంతంలో చూపించాలనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఆర్డినెన్స్ వచ్చాక దీనిపై నిర్ణయానికి వద్దామని అధికారులు భావిస్తున్నారు. అలాగే ట్రాన్స్‌కోను విద్యుత్ సరఫరా లైన్లు ఆధారం గా విభజించాలా, లేదా సబ్‌స్టేషన్ల వారీగానా అనే విషయంపైనా చర్చ జరిగింది. ఏ విధానం సరైనదనే విషయంపై ప్రతిపాదనలు ఇవ్వాలని సాహూ అధికారులను కోరారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఫైళ్లను వేర్వేరుగా విడదీయాలని, ఇరు ప్రాంతాలకు సంబంధించిన ఫైళ్లను మాత్రం రెండు కాపీలు తీసి భద్రపరచాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ ఫైళ్లను సంబంధిత అధికారితో ధ్రువీకరణ చేయించాలని సూచించారు.
ఏపీపీడీసీఎల్ ఎక్కడ?
రాష్ట్ర విభజనతో ఉద్యోగుల్లో వేడి పెరుగుతోంది.. ఎవరు ఎక్కడకు వెళ్లాలనే చర్చ విస్తృతంగా సాగుతోంది. అయితే మొత్తం ప్రక్రియలో తమ కంపెనీ పేరే కనిపించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ (ఏపీపీడీసీఎల్) ఉద్యోగుల్లో కలకలం చెలరేగుతోంది. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం వద్ద 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ ప్లాంట్లను చేపట్టేందుకు ఈ సంస్థ ఏర్పాటైంది. ఆ ప్లాంట్లలో మొదటిదానిలో నెలాఖరులోగా విద్యుదుత్పత్తి ప్రారంభం కానుంది. మరో 6 నెలల తర్వాత మరో ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇవేగాక మరో 800 మెగావాట్ల ప్లాంటును చేపట్టాలనీ నిర్ణయించారు. ఈ సంస్థ జెన్‌కోతోపాటు రాష్ట్రంలోని 4 విద్యుత్ పంపిణీ సంస్థలకు వాటా ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఎర్రగడ్డలో జెన్‌కోకు చెందిన భవనంలో ఉంది. దీనిలో అనేకమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ, ఈ కంపెనీ పేరు బిల్లులో ఎక్కడా లేకపోవడం వారిలో కలవరం రేపుతోంది. తాము ఏ ప్రాంతానికి చెందుతామని, తమను ఎలా విభజిస్తారోనని ఆందోళన చెందుతున్నారు.
జెన్‌కో విద్యుత్తు కేంద్రాలు బోర్డు పరిధిలోకి!
Published Thu, Mar 6 2014 5:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM
Advertisement
Advertisement