మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్
బెజ్జూర్: ప్రాణహిత నదిపై తలాయి జలవిద్యుత్ కేంద్రాన్ని ఎందుకు నిర్మించడంలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ‘ఓటు మీదే–నోటు మీదే‘ నినాదంతో పార్టీ సిర్పూర్ ఇన్‌చార్జి అర్షద్ హుస్సేన్ చేపట్టిన యాత్ర మండలంలోని పలు గ్రామాల్లో శనివారం కొనసాగింది. తలాయి గ్రామ సమీపంలో నిర్మించతలపెట్టిన జల విద్యుత్‌కేంద్రం స్థలాన్ని ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తలాయి జలవిద్యుత్ కేంద్రం నిర్మిస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయని, దీనికి అనుసంధానంగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తే ఇక్కడున్న బీడు భూములన్నీ సస్యశ్యామలమవుతాయని తెలిపారు. ఆదివాసీ, గిరిజనుల బతుకులు బాగు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆదివాసీలకు పోడు పట్టాలివ్వడంలో, రిజర్వేషన్లు పెంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
శిథిలావస్థకు చేరిన కృష్ణపల్లి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. 150 మంది విద్యార్థులన్న పాఠశాలలో సరిపడా టీచర్లు లేరని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజాసమస్యలు పరిష్కరించడంలో పూర్తి గా విఫలమయ్యారని ఆరోపించారు. బీఎస్పీ అధికా రంలోకి వస్తే వెంటనే ఆదివాసీ గూడేల్లో ప్రతీ నిరుపేదకు ఇల్లు నిర్మించే బాధ్యత తీసుకుంటామని, ప్రజాసమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment