సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో శాసనసభ ఎన్నికలు సెగ పుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సిర్పూర్ బరిలో నిలిచిన బీఆర్‌ఎస్, బీఎస్పీ అభ్యర్థులు ‘నువ్వా– నేనా’ అన్నట్లు సిగపట్లకు దిగుతుండటంతో నియోజకవర్గంలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రచారంలో భాగంగా ఇరు పార్టీల శ్రేణులు బాహాబాహీకి దిగుతుండటం ఘర్షణకు దారితీస్తోంది. అభ్యర్థులు ఏకంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్లడంతో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆరోపణలు.. ప్రత్యారోపణలు
రాష్ట్రంలోనే వరుస పరంగా నంబర్– 1 నియోజకవర్గమైన సిర్పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోనేరు కోనప్ప నాలుగోసారి బరిలో ఉన్నారు. రావి శ్రీనివాస్, పాల్వాయి హరీశ్‌బాబు, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. కాగా.. 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కోనేరు కోనప్ప బీఎస్పీ తరఫున ఎన్నికల్లో నిలబడి గెలిచి.. బీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అదే బీఎస్పీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్(ఆర్‌ఎస్పీ) కోనప్పకు పోటీగా నిలబడ్డారు. కోనప్పను కచ్చితంగా ఓడించి తీరుతానని ఆర్‌ఎస్పీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చాపకింద నీరులా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఎస్పీ దూసుకెళ్లేలా ప్రణాళికలు రచించారు. గ్రామం, మండలం, పట్టణం.. ఇలా ఇంటింటా తిరుగుతూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఒక దశలో ‘కోనేరు కోనప్ప.. కలప దొంగ’ అంటూ మీడియా ముందు తీవ్ర ఆరోపణలు చేయడం.. అందుకు కౌంటర్‌గా కోనప్ప ‘మర్డర్లు చేసిన ఘనత మాకే ఉంది. ఎన్‌కౌంటర్లు కూడా మేమే చేపించాం. పరిటాల రవిని మేమే చంపించాం. బెల్లంపల్లి, కరీంనగర్‌లో హత్యలు మేమే చేపించాం. ప్రవీణ్‌కుమార్ ఒక పొలిటికల్ టూరిస్ట్’ అంటూ ఆర్‌ఎస్పీపై ప్రత్యారోపణలు చేశారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పార్టీ శ్రేణుల్లో ఘర్షణ వాతావరణం..
నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, బీఎస్పీలకు చెందిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు వర్గాలుగా విడిపోయి ప్రచారంలో పాల్గొంటున్నారు. శ్రేణుల ప్రచారం తారస్థాయికి చేరడమే కాకుండా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెల 11న కాగజ్‌నగర్ పట్టణంలోని బస్టాండ్ ఏరియాలో బీఎస్పీ కార్యకర్త షేక్ ఆసిఫ్‌ను బీఆర్‌ఎస్ నాయకుడు కోనేరు ఫణితోపాటు పలువురు ఆకారణంగా దాడిచేయడమే కాకుండా చంపుతామని బెదిరించినట్లు ఆరోపిస్తూ బాధితుడు ఆసిఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పోలీసులు ఫణితోపాటు పలువురిపై కేసు సైతం నమోదు చేశారు.
ఇక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల్లో ఉన్న అసంతృప్తులకు అభ్యర్థులు గాలం వేస్తుండటం.. భారీ ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చి తమవైపు తిప్పుకోవడం పరిపాటిగా మారింది. పార్టీ ఫిరాయింపులు గెలుపోటములపై ప్రభావం చూపుతుండటంతో అభ్యర్థులు దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఫలితంగా ప్రచారంలో ప్రత్యర్థులపై దాడులకు దిగడానికి సైతం వెనుకాడకపోవడంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆదివారం రాత్రి కాగజ్‌నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయబస్తీలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
అనంతరం బీఆర్‌ఎస్ ప్రచార రథం డైవర్‌పై దాడి చేశారంటూ ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. తమ ప్రచారాన్ని అడ్డుకోవడమే కాకుండా అన్యాయంగా కేసు పెట్టారని నిరసన తెలుపుతూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్పీ కాగజ్‌నగర్ పోలీసు స్టేషన్‌లో బైఠాయించారు. పోలీసులు చివరకు ఇరువర్గాల అభ్యర్థులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. అయితే ఇలాంటివి పునరావృతమైతే మాత్రం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం పోలీసులకు సవాలుగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment