సాక్షి, అమరావతి: ప్రైవేటు సౌర, పవన విద్యుత్ కొనుగోలు కోసం థర్మల్ ఉత్పత్తికే కాదు... జల విద్యుత్‌కూ కోత పెట్టేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడలేదు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో పూర్తిస్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి చేసినా, ఏపీ మాత్రం దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. 2014 నుంచీ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నీళ్ళున్నా, జల విద్యుత్ కేంద్రాలను సకాలంలో మరమ్మతులు చేయలేదు. ఫలితంగా యూనిట్ రూ.1.80లకే లభించే జల విద్యుత్‌కు బదులు... యూనిట్ రూ. 5లుపైగా వెచ్చించి, పవన, సౌర విద్యుత్‌ను కొనుగోలు చేశారు. 2005 నుంచి 2007 వరకూ రాష్ట్రంలో (ఉమ్మడి రాష్ట్రంలో) జల విద్యుత్ ఉత్పత్తి 32 శాతం వరకూ పెరిగింది. 2007–08లో కూడా 11 శాతం అదనంగా జల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అప్పటి ప్రభుత్వం చౌకగా లభించే విద్యుత్‌కే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. కానీ 2014 తర్వాత ఏపీ జెన్‌కో పరిధిలోని జల, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని దారుణంగా తగ్గించింది. ఇది 2015 తర్వాత మరింత పెరిగింది. అప్పటికే ప్రైవేటు పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులతో ప్రభుత్వం బేరసారాలు చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జల విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది.
ఏపీఈఆర్‌సీ అనుమతించినా...
పవన, సౌర విద్యుత్ కన్నా ముందు జల విద్యుత్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని, దాని ఉత్పత్తిని పెంచాలని 2015–16లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) విద్యుత్ టారిఫ్ ఆర్డర్‌లో స్పష్టం చేసింది. ఈ కాలంలో 3,404 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని తెలిపింది. కానీ ఏపీ జెన్‌కో మాత్రం 2,320 మిలియన్ యూనిట్లకు మించి (32 శాతం తక్కువ) ఉత్పత్తి చేయలేదు. 2014–15లో 15 వేల మిలియన్ యూనిట్ల ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ప్రజలపై పెద్ద ఎత్తున విద్యుత్ భారం మోపాల్సి వచ్చిందని అప్పట్లో కమిషన్ ముందు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి సోలార్, విండ్ పవర్‌కు ప్రభుత్వం యూనిట్‌కు సగటున రూ. 5 వరకూ ఖర్చు పెడుతోంది. 2014లో సోలార్ పవర్‌ను యూనిట్ రూ. 6.25 చొప్పున కూడా కొనుగోలు చేసింది. కానీ జల విద్యుత్ కేవలం రూ.1.80కే లభిస్తుంది.
మరమ్మతులేవి?
నిజానికి రాష్ట్రంలో వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ, ఎగువ ప్రాంతాల వరద నీటితో డ్యాంల్లో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నీరు చేరుతూనే ఉంది. మాచ్‌ఖండ్, తుంగభద్ర వంటి పొరుగు రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో ఉన్న జల విద్యుత్ కేంద్రాల్లో మరమ్మతులు చేయని కారణంగా తరచూ రిపేర్లు వస్తున్నాయి. రాష్ట్ర జెన్‌కో పరిధిలోని అప్పర్, లోయర్ సీలేరు, డొంకరాయి, శ్రీశైలం కుడికాల్వ, నాగార్జునసాగర్ కుడి, టేల్‌పాండ్ జల విద్యుత్ ప్లాంట్లలోనూ ఇదే పరిస్థితి. వర్షాకాలం వచ్చే సమయానికే యంత్రాలను ఉత్పత్తికి అనుకూలంగా ఉండేలా చూసుకోవడంలో అధికారులు తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరోవైపు థర్మల్ ప్లాంట్లను తరచూ మరమ్మతుల కోసం ఉత్పత్తి నిలిపివేస్తున్నారు. వీటి స్థానంలో ప్రైవేటు పవన, సౌర విద్యుత్‌ను ప్రోత్సహించడం వల్ల విద్యుత్ డిమాండ్‌లో సగానికిపైగా ఇవే ఆక్రమిస్తున్నాయి. అనూహ్య పరిస్థితిల్లో పవన విద్యుత్ పడిపోతే, అప్పటికప్పుడు థర్మల్ ప్లాంట్లను ఉత్పత్తిలోకి తేవడం కష్టంగా ఉందని అధికారులు అంటున్నారు.