జెన్‌కో జోరు | Increasing Thermal And Hydroelectric Power Generation | Sakshi
Sakshi News home page

జెన్‌కో జోరు

Published Mon, Nov 23 2020 4:02 AM | Last Updated on Mon, Nov 23 2020 4:02 AM

Increasing Thermal And Hydroelectric Power Generation - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఖరీదైన విద్యుత్‌ను చాలావరకు తగ్గించింది. చౌక విద్యుత్‌కు మాత్రమే ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్‌కోలో విద్యుత్‌ ఉత్పత్తి పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 987.39 మిలియన్‌ యూనిట్లు (ఎంయూలు) అదనంగా అందించగలిగింది. 2014–15తో పోలిస్తే ఏకంగా 6,407.09 ఎంయూలు ఎక్కువ. 

అప్పట్లో ఆనవాయితీగా మారిన బ్యాకింగ్‌ డౌన్‌
ఏపీ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 5 వేల మెగావాట్లు. రోజుకు 105 ఎంయూల విద్యుత్‌ ఉత్పత్తి చేసే వీలుంది. జెన్‌కో థర్మల్, జల విద్యుత్‌ కేంద్రాలతో ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు (డిస్కమ్‌లు) దీర్ఘకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) ఉన్నాయి. పీపీఏ ప్రకారం విద్యుత్‌ కొనుగోలు చేయకపోతే ఫిక్స్‌డ్‌ (స్థిర) ఛార్జీలు (ప్లాంట్ల నిర్మాణ చార్జీలు) చెల్లించాలి. గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 మార్చి వరకు ఇదే జరిగింది. ప్రైవేట్‌ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు జెన్‌కోలో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించింది. తరుచూ బ్యాకింగ్‌ డౌన్‌ (ఉత్పత్తి తగ్గించడం) ఆనవాయితీగా మారింది. 

అప్పుల్లో విద్యుత్‌ సంస్థలు 
థర్మల్‌ ప్లాంట్లు సామర్థ్యానికి తగినట్టుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయకుండా ఆపడం వల్ల డిస్కమ్‌లు యూనిట్‌కు రూ.1.50 వరకు చెల్లించాల్సి వచ్చింది. దీంతో భారీయెత్తున నష్టాలకు గురయ్యాయి. మరోవైపు ఉత్పత్తి పెంచుకోలేక జెన్‌కో ఆర్థిక నష్టాల్లోకి వెళ్లింది. 2015–16లో జెన్‌కో విద్యుత్‌ను 1,747 ఎంయూలు తగ్గిస్తే... 2016–17లో 5,103 ఎంయూలు, 2018–19లో ఏకంగా 7,013 మిలియన్‌ యూనిట్లు తగ్గించేశారు. ఈ విధంగా పవన, సౌర విద్యుత్‌ కోసం థర్మల్‌ కేంద్రాలను పడుకోబెట్టడంతో 2015–16లో రూ.157.1, 2016–17లో రూ.629.9, 2017–18లో రూ.1,943.9, 2018–19లో రూ.2,766.4 కోట్ల చొప్పున స్థిర చార్జీలు చెల్లించాల్సి వచ్చింది. భారీగా ఉత్పత్తి తగ్గించడం, డిస్కమ్‌లు చెల్లించే స్థిర చార్జీలతో సరిపెట్టుకోవడం వల్ల జెన్‌కో కేంద్రాలు అప్పుల్లోకెళ్లాయి. గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న పీపీఏల వల్ల ఇప్పటికీ పవన, సౌర తదితర విద్యుత్‌ను ఉత్పత్తి అయినంతవరకు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తోంది.


ప్రైవేటీకరణ ప్రచారానికి తెర
ప్రస్తుత ప్రభుత్వం ఈ విధానాన్ని సమూలంగా మార్చివేసింది. జెన్‌కో సంస్థల ప్రైవేటీకరణ దిశగా గత ప్రభుత్వం అడుగులేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రమాదం నుంచి బయటపడేసే ప్రయత్నాలు చేపట్టింది. ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి రుణాలిప్పించడం వంటి చర్యలు తీసుకుంటోంది. జెన్‌కో ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తి పెంచడంతో పాటు కొనుగోలు కూడా చేస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement