hydroelectric power
-
శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం ప్రారంభమైంది. జూరాల ప్రాజెక్టులో జలవిద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాల్లో ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 22,573 క్యూసెక్కులు చేరాయి. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు.. పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 808.90 అడుగుల్లో 33.67 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నారాయణపూర్, ఉజ్జయిని డ్యామ్‌లకు దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధాన పాయ, భీమాల నుంచి జూరాల ప్రాజెక్టులోకి 41,925 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో విద్యుదుత్పత్తి చేస్తూ 37,930 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల నాగార్జునసాగర్‌లోకి 2,015 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక రాష్ట్రంలో కురిసిన వర్షాల ప్రభావంతో మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 8,685 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.39 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతలకు దిగువన మున్నేరు, వాగులు, వంకల ప్రవాహం వల్ల ప్రకాశం బ్యారేజ్‌లోకి 15,698 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 6,114 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 9,584 క్యూసెక్కులను అధికారులు కడలిలోకి వదిలేస్తున్నారు. ఆల్మట్టిలోకి పెరిగిన వరద పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ఉద్ధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 1,07,769 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 54.56 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదలుతున్న ఆరు వేల క్యూసెక్కులు నారాయణపూర్ డ్యామ్‌కు చేరుతున్నాయి. సోమవారం ఆల్మట్టిలోకి మరింతగా వరద పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. తుంగభద్రలోనూ పెరిగిన ప్రవాహం తుంగభద్ర డ్యామ్, తుంగ ఆనకట్ట దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల తుంగభద్రలో వరద ఉద్ధృతి కొంత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 54,657 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 21.36 టీఎంసీలకు చేరుకుంది. -
రెన్యూ పవర్ చేతికి ఎల్అండ్టీ హైడ్రో ప్రాజెక్టు
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) తమ అనుబంధ సంస్థకు చెందిన హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంటులో 100 శాతం వాటాలను రెన్యూ పవర్ సర్వీసెస్‌కు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 985 కోట్లు. ఇతర వ్యాపారాల నుంచి తప్పుకుని ప్రధాన వ్యాపారాల మీద మరింతగా దృష్టి పెట్టాలనే ప్రణాళికకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్అండ్టీ హోల్‌టైమ్ డైరెక్టర్ డీకే సెన్ వెల్లడించారు. ఎల్అండ్టీ ఉత్తరాంచల్ హైడ్రోపవర్ (ఎల్‌టీయూహెచ్‌పీఎల్)కి చెందిన ఈ ప్రాజెక్టు విక్రయ డీల్ సెప్టెంబర్ 30లోగా పూర్తి కాగలదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టును కొనుగోలు చేయడం వల్ల తమకు అదనపు ప్రయోజనాలు లభించగలవని, రిస్కు స్థాయి కూడా తక్కువగా ఉండగలదని రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హా తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని హైడ్రో ప్రాజెక్టులన కొనుగోలుపై దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. -
జెన్కో జోరు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఖరీదైన విద్యుత్‌ను చాలావరకు తగ్గించింది. చౌక విద్యుత్‌కు మాత్రమే ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 987.39 మిలియన్ యూనిట్లు (ఎంయూలు) అదనంగా అందించగలిగింది. 2014–15తో పోలిస్తే ఏకంగా 6,407.09 ఎంయూలు ఎక్కువ. అప్పట్లో ఆనవాయితీగా మారిన బ్యాకింగ్ డౌన్ ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 5 వేల మెగావాట్లు. రోజుకు 105 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి చేసే వీలుంది. జెన్కో థర్మల్, జల విద్యుత్ కేంద్రాలతో ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కమ్‌లు) దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) ఉన్నాయి. పీపీఏ ప్రకారం విద్యుత్ కొనుగోలు చేయకపోతే ఫిక్స్డ్ (స్థిర) ఛార్జీలు (ప్లాంట్ల నిర్మాణ చార్జీలు) చెల్లించాలి. గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 మార్చి వరకు ఇదే జరిగింది. ప్రైవేట్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు జెన్కోలో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించింది. తరుచూ బ్యాకింగ్ డౌన్ (ఉత్పత్తి తగ్గించడం) ఆనవాయితీగా మారింది. అప్పుల్లో విద్యుత్ సంస్థలు థర్మల్ ప్లాంట్లు సామర్థ్యానికి తగినట్టుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయకుండా ఆపడం వల్ల డిస్కమ్‌లు యూనిట్‌కు రూ.1.50 వరకు చెల్లించాల్సి వచ్చింది. దీంతో భారీయెత్తున నష్టాలకు గురయ్యాయి. మరోవైపు ఉత్పత్తి పెంచుకోలేక జెన్కో ఆర్థిక నష్టాల్లోకి వెళ్లింది. 2015–16లో జెన్కో విద్యుత్‌ను 1,747 ఎంయూలు తగ్గిస్తే... 2016–17లో 5,103 ఎంయూలు, 2018–19లో ఏకంగా 7,013 మిలియన్ యూనిట్లు తగ్గించేశారు. ఈ విధంగా పవన, సౌర విద్యుత్ కోసం థర్మల్ కేంద్రాలను పడుకోబెట్టడంతో 2015–16లో రూ.157.1, 2016–17లో రూ.629.9, 2017–18లో రూ.1,943.9, 2018–19లో రూ.2,766.4 కోట్ల చొప్పున స్థిర చార్జీలు చెల్లించాల్సి వచ్చింది. భారీగా ఉత్పత్తి తగ్గించడం, డిస్కమ్‌లు చెల్లించే స్థిర చార్జీలతో సరిపెట్టుకోవడం వల్ల జెన్కో కేంద్రాలు అప్పుల్లోకెళ్లాయి. గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న పీపీఏల వల్ల ఇప్పటికీ పవన, సౌర తదితర విద్యుత్‌ను ఉత్పత్తి అయినంతవరకు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తోంది. ప్రైవేటీకరణ ప్రచారానికి తెర ప్రస్తుత ప్రభుత్వం ఈ విధానాన్ని సమూలంగా మార్చివేసింది. జెన్కో సంస్థల ప్రైవేటీకరణ దిశగా గత ప్రభుత్వం అడుగులేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రమాదం నుంచి బయటపడేసే ప్రయత్నాలు చేపట్టింది. ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి రుణాలిప్పించడం వంటి చర్యలు తీసుకుంటోంది. జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి పెంచడంతో పాటు కొనుగోలు కూడా చేస్తోంది. -
హైడ్రో పవర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి ఉరకలు పెడుతోంది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో ఏకధాటి వర్షాలతో ఇప్పటి వరకు కృష్ణా నదికి 1,345 టీఎంసీల వరద వచ్చింది. రాష్ట్రంలోని అన్ని జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 2019–20లో 3,050 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుదుత్పత్తి జరపాలని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) లక్ష్యం పెట్టుకోగా, గత మంగళవారం నాటికే 2,883.61 ఎంయూల ఉత్పత్తి జరిపింది. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రధాన జలాశయాల్లో మరో 1,953.8 ఎంయూల జల విద్యుదుత్పత్తికి సరిపడా జల నిల్వలున్నాయి. జలాశయాలకు గత కొంతకాలంగా కొనసాగుతున్న నిరంతర వరద ప్రవాహం దీనికి అదనం. ఈ అంకెలు పరిగణనలోకి తీసుకుంటే దశాబ్ద కాలం తర్వాత ఈ ఏడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జల విద్యుదుత్పత్తి సాధించనుందని జెన్కో ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగితే 5 వేల ఎంయూల మైలురాయిని సైతం తొలిసారిగా దాటి రాష్ట్రం కొత్త చరిత్రను సృష్టించనుంది. ఎగువ డ్యామ్‌లతో తగ్గిన ఉత్పత్తి తెలంగాణ ప్రాంతం పరిధిలోని జల విద్యుదుత్పత్తి కేంద్రాలు 2006–07లో 4,800 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేశాయి. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ చరిత్రలో సైతం జల విద్యుదుత్పత్తిలో ఇప్పటివరకు ఇదే రికార్డు. ఆ ఏడాది శ్రీశైలం ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రం నుంచే 2,511 ఎంయూల ఉత్పత్తి జరగడంతో ఇది సాధ్యమైందని జెన్కో హైడల్ డైరెక్టర్ వెంకటరాజం అన్నారు. ఆ తర్వాత కృష్ణా నదిపై కర్ణాటకలో ఆల్మట్టి, ఎగువ కృష్ణా తదితర జలాశయాలు నిర్మించడంతో దిగువన ఉన్న రాష్ట్రానికి వరద నీటి ప్రవాహం తగ్గిందని, దీంతో జల విద్యుదుత్పత్తి పడిపోయిందని పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయానికి గేట్లు ఏర్పాటు చేయడానికి ముందు, 1991–92లో నాగార్జునసాగర్ జల విద్యుదుత్పత్తి కేంద్రం రికార్డు స్థాయిలో 3,011 ఎంయూల ఉత్పత్తిని సాధించింది. ఎగువ కర్ణాటకలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచి్చన డ్యాంల కారణంగానే మూడు దశాబ్దాలు దాటినా ఆ రికార్డు అలాగే ఉంది. ఈ ఏడాది శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో 2100 ఎంయూలు, నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రంలో 2000 ఎంయూల ఉత్పత్తికి అవకాశముంది. డిస్కంలకు భారీ ఊరట.. తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఈ ఏడాది జల విద్యుదుత్పత్తి భారీ ఊరట కలిగిస్తోంది. సగటున థర్మల్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.6 అవుతుండగా, జల విద్యుత్ సగటున ధర యూనిట్‌కు రూ.2.94 మాత్రమే. భారీ స్థాయిలో జల విద్యుదుత్పత్తి వస్తుండటంతో థర్మల్ విద్యుత్‌ను డిస్కంలు పక్కన పెట్టి ఆర్థిక భారం నుంచి బయటపడ్డాయి. వర్షాభావంతో గత నాలుగేళ్లలో లక్ష్యం మేరకు జల విద్యుదుత్పత్తి కాకపోవడంతో ఏటా డిస్కంలపై రూ.2 వేల కోట్లకు పైగా భారం పడింది. ఈ సారి లక్ష్యానికి మించి ఉత్పత్తి జరగనుండటంతో నష్టాలకు బ్రేక్ వేయొచ్చు. రూ.వెయ్యి కోట్ల వరకు అదనపు ప్రయోజనం కలగనుంది. విద్యుత్ వినియోగదారులపై భవిష్యత్తులో పడనున్న చార్జీల పెంపు భారం తగ్గనుందని అధికారవర్గాలు తెలిపాయి. డిమాండ్ పతనం ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం భారీగా తగ్గిపోయింది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో 45 శాతం వాటా వ్యవసాయ విద్యుత్‌దే కావడంతో మొత్తం డిమాండ్ పతనమైంది. గతేడాది అక్టోబర్‌లో అత్యధిక డిమాండ్ 10,600 మెగావాట్లు, రోజుకు 216.9 మిలియన్ యూనిట్లు (ఎంయూ) నమోదు కాగా, ఈ అక్టోబర్‌లో అత్యధిక డిమాండ్ 8,532 మెగావాట్లు, రోజుకు 166.35 ఎంయూలకు పడిపోయింది. ఖరీఫ్ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్‌లో దక్షిణాదిలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడుతుంది. కానీ ఈ ఏడాది ఖరీఫ్‌లో భారీ వర్షాలతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గిపోయింది. దీంతో ప్రైవేటు థర్మల్ విద్యుత్ కేంద్రాలను బ్యాకింగ్ డౌన్ చేసుకోవడం ద్వారా ఉత్పత్తి తగ్గించుకుని, జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట సామర్థ్యం మేర ఉత్పత్తి చేస్తున్నామని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. -
నీళ్లు ఫుల్.. కరెంట్ నిల్
సాక్షి, అమరావతి: జలాశయాల్లో సరిపడా నీరున్నా జలవిద్యుదుత్పత్తిపై ఏపీ జెన్కో దృష్టి సారించడం లేదు. ఇప్పటికీ ప్రైవేట్ విద్యుత్‌కే ప్రాధాన్యమివ్వడం విస్మయ పరుస్తోంది. వర్షాకాలంలో వీలైనంత వరకూ జలవిద్యుత్‌ను వాడుకుంటే సగటు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి నీరు చేరడం వల్ల ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ఇప్పటికే 866 అడుగుల మేరకు చేరుకుంది. మరో నాలుగు అడుగుల మేర నీరు వస్తే జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా జలవిద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉన్నా జెన్కో ఇప్పటివరకూ ఆ సన్నాహాలేమీ చేయలేదు. వారం ముందు నుంచే విద్యుదుత్పత్తికి అనుకూలంగా యంత్రాలను సన్నద్ధం చేయాలి. ట్రయల్ రన్ ప్రారంభించాల్సి ఉంటుంది. 770 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని వందశాతం పీఎల్ఎఫ్(ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో వాడుకునే దిశగా ప్రణాళికలే సిద్ధం చేయలేదు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి మొదలైతే ఎక్కువ ధర ఉండే ప్రైవేట్ విద్యుత్‌లో దేన్ని నిలిపివేయాలనే అంశంపై ఇంకా చర్చించలేదు. మాచ్‌ఖండ్‌లో 20 మెగావాట్లే మాచ్‌ఖండ్‌లో 2,750 అడుగులకు గానూ 2,703 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఇక్కడ 35 మెగావాట్ల మేర జల విద్యుత్ సామర్థ్యం ఉంది. కానీ ప్రస్తుతం ఉత్పత్తి చేసేది కేవలం 20 మెగావాట్లే. పవన విద్యుత్ ఉత్పత్తి పెరిగితే అది కూడా ఆపేస్తున్నారు. సీలేరులో సగమే... సీలేరు నీటి సామర్థ్యం 1360 అడుగులు కాగా ఇప్పటికే పూర్తిస్థాయికి చేరుకుంది. ఇక్కడ 730 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నా ప్రస్తుతం 400 మెగావాట్లకే పరిమితం చేశారు. ప్రైవేట్ విద్యుత్‌పైనే ప్రేమ జలవిద్యుత్ సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యే లభిస్తుంది. యూనిట్ ధర కేవలం రూ. 2లోపే ఉంటుంది. బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ధర యూనిట్ రూ. 5పైన ఉంటోంది. పవన విద్యుత్ యూనిట్ సగటున రూ. 5.40 వరకూ ఉంది. ఈ నేపథ్యంలో ఏ లెక్కన చూసినా ఈ సీజన్లో జల విద్యుత్ లాభసాటి. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 156 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ డిమాండ్ ఉంది. శ్రీశైలం, మాచ్‌ఖండ్, సీలేరు నుంచి రోజుకు 36 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఇది ఆరు మిలియన్ యూనిట్లు కూడా ఉండటం లేదు. ఇదే సమయంలో ప్రైవేట్ ఉత్పత్తిదారులు అందించే పవన, సౌర విద్యుత్ రోజుకు 60 మిలియన్ యూనిట్ల వరకూ ఉంటోంది. ఏపీ జెన్కో జల, థర్మల్ విద్యుత్‌ను వాడుకుంటే ఖరీదైన పవన, సౌర విద్యుత్‌ను ఆపేయాల్సి ఉంటుంది. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం జల విద్యుదుత్పత్తిని నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎత్తిపోతలకు 3,234 మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చాలని విద్యుత్ శాఖను నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన అన్ని ప్రాజెక్టుల పంపుహౌజ్‌లకు ఈ వర్షాకాలం నుంచి విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్ల వద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. కంతనపల్లి ప్రాజెక్టుకు అనుబంధంగా జల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం జలసౌధలో జరిగిన నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారుల సమన్వయ సమావేశంలో జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, జెన్కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, ఎస్ఈ సురేశ్, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఎత్తిపోతల పథకాలకు గరిష్టంగా 3,234 మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుందని ఈ భేటీలో తుది అంచనాకు వచ్చారు. ఆ ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న ఎత్తి్తపోతల పథకాలకు 1,028.40 మెగావాట్లు, కాళేశ్వరంతోపాటు ఈ ఏడాది ప్రారంభమయ్యే ఇతర ఎత్తిపోతల పథకాలకు 2,206 మెగావాట్ల విద్యుత్ అవసరమని తేల్చారు. అలాగే పలు ప్రాజెక్టుల పరిధిలోని పంప్‌హౌజ్‌లలో ఈ ఏడాదిలో ఎప్పటి నుంచి నీటి పంపింగ్ ప్రారంభమవుతుంది, ఎన్నిరోజులపాటు పంపింగ్ చేసే అవకాశం వుంది, ఎంత విద్యుత్ వినియోగం అవుతుంది, ఏయే సమయాల్లో ఏయే పంప్ స్టేషన్లు పనిచేయాలి.. తదితర అంశాలపై నిర్ధారణకు వచ్చారు. కాళేశ్వరానికి 1,916 మెగావాట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశ పంపింగ్ ఈ ఏడాది జూలై–ఆగస్టులోనే ప్రారంభం అవుతుందని, దీనికి గరిష్టంగా ఈ ఏడాది 1,916 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనాకు వచ్చారు. ఈ పంప్‌హౌజ్‌లకు నిరాటంకంగా సరఫరా చేసేందుకు విద్యుత్‌ను సమకూరుస్తామని, సబ్స్టేషన్లు, లైన్ల నిర్మాణం పూర్తి చేశామని ప్రభాకర్ రావు తెలిపారు. కంతనపల్లి (తుపాకుల గూడెం) ప్రాజెక్టు వద్ద గోదావరి నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలించాలని హరీశ్‌రావు సూచించారు. జల విద్యుత్ ప్రాజెక్టుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
జల విద్యుత్‌పై ‘పవన’వేటు
సాక్షి, అమరావతి: ప్రైవేటు సౌర, పవన విద్యుత్ కొనుగోలు కోసం థర్మల్ ఉత్పత్తికే కాదు... జల విద్యుత్‌కూ కోత పెట్టేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడలేదు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో పూర్తిస్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి చేసినా, ఏపీ మాత్రం దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. 2014 నుంచీ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నీళ్ళున్నా, జల విద్యుత్ కేంద్రాలను సకాలంలో మరమ్మతులు చేయలేదు. ఫలితంగా యూనిట్ రూ.1.80లకే లభించే జల విద్యుత్‌కు బదులు... యూనిట్ రూ. 5లుపైగా వెచ్చించి, పవన, సౌర విద్యుత్‌ను కొనుగోలు చేశారు. 2005 నుంచి 2007 వరకూ రాష్ట్రంలో (ఉమ్మడి రాష్ట్రంలో) జల విద్యుత్ ఉత్పత్తి 32 శాతం వరకూ పెరిగింది. 2007–08లో కూడా 11 శాతం అదనంగా జల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అప్పటి ప్రభుత్వం చౌకగా లభించే విద్యుత్‌కే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. కానీ 2014 తర్వాత ఏపీ జెన్కో పరిధిలోని జల, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని దారుణంగా తగ్గించింది. ఇది 2015 తర్వాత మరింత పెరిగింది. అప్పటికే ప్రైవేటు పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులతో ప్రభుత్వం బేరసారాలు చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జల విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. ఏపీఈఆర్సీ అనుమతించినా... పవన, సౌర విద్యుత్ కన్నా ముందు జల విద్యుత్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని, దాని ఉత్పత్తిని పెంచాలని 2015–16లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) విద్యుత్ టారిఫ్ ఆర్డర్లో స్పష్టం చేసింది. ఈ కాలంలో 3,404 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని తెలిపింది. కానీ ఏపీ జెన్కో మాత్రం 2,320 మిలియన్ యూనిట్లకు మించి (32 శాతం తక్కువ) ఉత్పత్తి చేయలేదు. 2014–15లో 15 వేల మిలియన్ యూనిట్ల ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ప్రజలపై పెద్ద ఎత్తున విద్యుత్ భారం మోపాల్సి వచ్చిందని అప్పట్లో కమిషన్ ముందు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి సోలార్, విండ్ పవర్‌కు ప్రభుత్వం యూనిట్‌కు సగటున రూ. 5 వరకూ ఖర్చు పెడుతోంది. 2014లో సోలార్ పవర్‌ను యూనిట్ రూ. 6.25 చొప్పున కూడా కొనుగోలు చేసింది. కానీ జల విద్యుత్ కేవలం రూ.1.80కే లభిస్తుంది. మరమ్మతులేవి? నిజానికి రాష్ట్రంలో వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ, ఎగువ ప్రాంతాల వరద నీటితో డ్యాంల్లో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నీరు చేరుతూనే ఉంది. మాచ్‌ఖండ్, తుంగభద్ర వంటి పొరుగు రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో ఉన్న జల విద్యుత్ కేంద్రాల్లో మరమ్మతులు చేయని కారణంగా తరచూ రిపేర్లు వస్తున్నాయి. రాష్ట్ర జెన్కో పరిధిలోని అప్పర్, లోయర్ సీలేరు, డొంకరాయి, శ్రీశైలం కుడికాల్వ, నాగార్జునసాగర్ కుడి, టేల్పాండ్ జల విద్యుత్ ప్లాంట్లలోనూ ఇదే పరిస్థితి. వర్షాకాలం వచ్చే సమయానికే యంత్రాలను ఉత్పత్తికి అనుకూలంగా ఉండేలా చూసుకోవడంలో అధికారులు తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరోవైపు థర్మల్ ప్లాంట్లను తరచూ మరమ్మతుల కోసం ఉత్పత్తి నిలిపివేస్తున్నారు. వీటి స్థానంలో ప్రైవేటు పవన, సౌర విద్యుత్‌ను ప్రోత్సహించడం వల్ల విద్యుత్ డిమాండ్‌లో సగానికిపైగా ఇవే ఆక్రమిస్తున్నాయి. అనూహ్య పరిస్థితిల్లో పవన విద్యుత్ పడిపోతే, అప్పటికప్పుడు థర్మల్ ప్లాంట్లను ఉత్పత్తిలోకి తేవడం కష్టంగా ఉందని అధికారులు అంటున్నారు. -
‘పులిచింతల’పై ఆంధ్రప్రదేశ్ కొర్రీ
పవర్ ప్లాంట్ నిర్మాణానికి మోకాలడ్డు సాక్షి, హైదరాబాద్: ఒప్పందాల ప్రకారం తెలంగాణకు విద్యుత్ పంపిణీ చేసేందుకు ఇప్పటికే నిరాకరిస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కొర్రీ పెట్టింది. పులిచింతల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి మోకాలడ్డింది. రిజర్వాయర్‌లోని నీటిని ఖాళీ చేయకుండా మొండికేస్తోంది. దీంతో ఈ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్లాంటు నిర్మాణానికి సహకరించాలని, జలాశయంలోని నీటి నిల్వలను ఖాళీ చేయాలంటూ తెలంగాణ జెన్కో ఇప్పటికే ఏపీ నీటిపారుదల విభాగానికి లేఖ రాసినా ఏపీ అదేమీ పట్టించుకోనట్లుగా పెడచెవిన పెట్టింది. జెన్కో డెరైక్టర్లు, ఇరిగేషన్ ఉన్నతాధికారుల స్థాయిలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలకు స్పందన లేకపోవటంతో తాజాగా టీఎస్ జెన్కో చైర్మన్, ఎండీ డి.ప్రభాకరరావు ఏపీ ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శికి ఇదే అంశంపై లేఖ రాసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘ప్రస్తుతం పులిచింతల జలాశయం లో 13 టీఎంసీల నీరు ఉంది. మొత్తం ఖాళీ చేస్తే తప్ప ప్లాంట్ పనులు జరిగే అవకాశం లేదు. రబీ అవసరాలకు నీటిని ఖాళీ చేసి తర్వాత సాగర్ నుంచి నీటిని వాడుకోవాలని ఏపీ ఇరిగేషన్ విభాగానికి సూచించాం. కానీ అదేమీ పట్టించుకోకుండా ఏపీ సాగర్ నీటిని వాడుకుంటూ పులిచింతలను ఖాళీ చేయకపోవటం అనుమానాలకు తావిస్తోంది..’ అని జెన్కో అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
విద్యుదుత్పత్తికి అంతరాయం
ముంచంగిపుట్టు : ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఆరో నంబర్ జనరేటర్లో సాంకేతిక లోపంతో 23 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఇక్కడ 74 మెగావాట్లకు విద్యుదుత్పత్తి పడిపోయింది. ఇక్కడి ఆరు జనరేటర్లతో 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అయ్యేది. అయిదో నంబర్ జనరేటర్ ఆరు నెలల క్రితం మూలకు చేరింది. నాటి నుంచి 1,2,3,4,6 నంబర్ల జనరేటర్లతో 97 మెగావాట్ల విద్యుత్ ఉత్పతి అవుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆరో నంబర్ జనరేటర్‌కు సంబంధించిన గవర్నర్‌లో సాంకేతిక లోపం తలేత్తడంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీనిని వినియోగంలోకి తేవడానికి సిబ్బంది ఆది, సోమవారాలు శ్రమించినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రస్తుతం 1,2,3,4 నంబర్ల జనరేటర్లతో 74 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. -
జేపీ జల విద్యుత్ కేంద్రాలు టీఏక్యూఏ చేతికి!
న్యూఢిల్లీ/అబుదాబి: దేశీయ సంస్థ జైప్రకాష్ పవర్ వెంచర్స్‌కు చెందిన రెండు జల విద్యుత్ కేంద్రాలను అబుదాబి నేషనల్ ఎనర్జీ కంపెనీ(టీఏక్యూఏ) ఆధ్వర్యంలో ఏర్పాటైన కన్సార్షియం కొనుగోలు చేయనుంది. ఇందుకు 160 కోట్ల డాలర్లను(రూ. 10,000 కోట్లు) చెల్లించనున్నట్లు టీఏక్యూఏ తెలిపింది. దీనిలో ఈక్విటీ రూపేణా 61.6 కోట్ల డాలర్లను(రూ. 3,820 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. మిగిలిన మొత్తం ప్రధానంగా సెక్యూర్డ్(నాన్‌రికోర్స్) రుణం రూపేణా ఉంటుందని తెలిపింది. డీల్‌లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని కినౌర్ జిల్లాలోగల బాస్పా రెండో దశ, కర్చాం వాంగ్టూ ప్లాంట్లను సొంతం చేసుకోనుంది. వీటి సంయుక్త విద్యుదుత్పత్తి సామర్థ్యం 1,391 మెగావాట్లుకాగా, ఈక్విటీ పెట్టుబడులలో టీఏక్యూఏ 51% వాటాను సమకూరుస్తుంది. త ద్వారా రెండు జల విద్యుత్ ప్లాంట్లకు సంబంధిం చిన యాజ మాన్యం, కార్యకలాపాల నిర్వహణలను అబుదాబీ నేషనల్ ఎనర్జీ కంపెనీ సొంతం చేసుకోనుంది. కన్సార్షియంలో కెనడాకు చెందిన సంస్థాగత ఇన్వెస్టర్ సంస్థకు(పేరు వెల్లడించలేదు) 39% వాటా, ఐడీఎఫ్సీ ఆల్టర్నేటివ్స్ ఇండియా ఇన్ఫ్రా ఫండ్‌కు 10% వాటా ఉంటుందని టీఏక్యూఏ వివరించింది. ఈ కొనుగోలు ద్వారా ఇండియా జల విద్యుత్ రంగంలో తాము అతిపెద్ద ప్రయివేట్ కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు టీఏక్యూఏ తెలిపింది. -
పవర్‌ప్లాంట్ అనుమతి రద్దు చేయాలి : భాను
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం బుడమేరు డైవర్షన్ ఛానల్‌పై యాక్టివ్ పవర్ కార్పొరేషన్‌కు చెందిన జల విద్యుత్ కేంద్రానికి తిరిగి అనుమతి ఇవ్వడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను బుధవారం ఒక ప్రకటనలో తప్పుపట్టారు. ఈ నిర్ణయం వల్ల బుడమేరుకు వరద వస్తే పలు గ్రామాలతో పాటు విజయవాడ నగరంలో 16 డివిజన్లు నీట మునుగుతాయని హెచ్చరించారు. యాక్టివ్ పవర్‌ప్లాంట్ వల్ల ఎన్టీటీపీఎస్ కూడా నష్టపోతుందని ఆయన విమర్శించారు. ఏడాది పొడవునా నడిచే వీలున్న ప్రాజెక్టును ప్రభుత్వమే నడపడం వల్ల ఎన్టీటీపీఎస్కు కూడా ఇబ్బంది లేకుండా చూడవచ్చన్నారు. బుడమేరులో పోలవరం కాల్వను కూడా కలపాలన్న నిర్ణయంతో ఈ ప్రాజెక్టు వల్ల డెల్టా రైతాంగం కూడా ఇబ్బందిపడే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ ప్లాంట్ వల్ల రాయనపాడు, పైడూరుపాడు, ఈలప్రోలు గ్రామాలకు చెందిన సుమారు 12 వేల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగిన ఘటనలు గతంలో అనేకం జరిగిన సంగతి గుర్తుచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తన స్వార్థం కోసం ఆ భూమిని కేటాయిస్తూ అనుమతి ఇవ్వడంపై ప్రజలు, రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. నేడు ధర్నా ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నంలోని జలవిద్యుత్ కేంద్రానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రాజెక్టు ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ లంకె అంకమోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ పాల్గొంటారని వివరించారు. ప్రజలకు, రైతులకు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా నాటి సీఎం రాజశేఖరరెడ్డి దీన్ని నిలుపుదల చేయిస్తే ప్రస్తుత సీఎం తన స్వార్థం కోసం అనుమతి ఇవ్వడం దారుణమని విమర్శించారు. ఈ ధర్నాకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన కోరారు.