
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చాలని విద్యుత్ శాఖను నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన అన్ని ప్రాజెక్టుల పంపుహౌజ్‌లకు ఈ వర్షాకాలం నుంచి విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్ల వద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. కంతనపల్లి ప్రాజెక్టుకు అనుబంధంగా జల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం జలసౌధలో జరిగిన నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారుల సమన్వయ సమావేశంలో జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, జెన్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, ఎస్‌ఈ సురేశ్, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు మురళీధర్, నాగేంద్రరావు, నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది ఎత్తిపోతల పథకాలకు గరిష్టంగా 3,234 మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుందని ఈ భేటీలో తుది అంచనాకు వచ్చారు. ఆ ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న ఎత్తి్తపోతల పథకాలకు 1,028.40 మెగావాట్లు, కాళేశ్వరంతోపాటు ఈ ఏడాది ప్రారంభమయ్యే ఇతర ఎత్తిపోతల పథకాలకు 2,206 మెగావాట్ల విద్యుత్ అవసరమని తేల్చారు. అలాగే పలు ప్రాజెక్టుల పరిధిలోని పంప్‌హౌజ్‌లలో ఈ ఏడాదిలో ఎప్పటి నుంచి నీటి పంపింగ్ ప్రారంభమవుతుంది, ఎన్నిరోజులపాటు పంపింగ్ చేసే అవకాశం వుంది, ఎంత విద్యుత్ వినియోగం అవుతుంది, ఏయే సమయాల్లో ఏయే పంప్ స్టేషన్లు పనిచేయాలి.. తదితర అంశాలపై నిర్ధారణకు వచ్చారు.
కాళేశ్వరానికి 1,916 మెగావాట్లు
కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశ పంపింగ్ ఈ ఏడాది జూలై–ఆగస్టులోనే ప్రారంభం అవుతుందని, దీనికి గరిష్టంగా ఈ ఏడాది 1,916 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనాకు వచ్చారు. ఈ పంప్‌హౌజ్‌లకు నిరాటంకంగా సరఫరా చేసేందుకు విద్యుత్‌ను సమకూరుస్తామని, సబ్‌స్టేషన్లు, లైన్ల నిర్మాణం పూర్తి చేశామని ప్రభాకర్ రావు తెలిపారు. కంతనపల్లి (తుపాకుల గూడెం) ప్రాజెక్టు వద్ద గోదావరి నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలించాలని హరీశ్‌రావు సూచించారు. జల విద్యుత్ ప్రాజెక్టుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment