సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ దాఖలైన పిటిషన్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొట్టేసింది. ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని రకాల కీలక అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్‌లో విచారించడానికి ఇంకేం లేదని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని, ఇటీవల వచ్చిన అనుమతులు చెల్లవని పేర్కొంటూ హయాతుద్దీన్ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను జస్టిస్ రఘువేంద్ర రాథోర్ బెంచ్ మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభించారని, పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండానే అటవీ భూముల్లో నిర్మాణాలు చేపట్టారని వాదించారు. తాగునీటి అవసరాల కోసం అని చెప్పి సాగునీటి అవసరాల కోసం పనులు చేపట్టారన్నారు.
అందుకే గతంలో ఇదే ఎన్జీటీ పనులు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయితే న్యాయ విచారణ పరిధి తదితర అంశాలను ప్రస్తావిస్తూ పనులు నిలుపుదల ఉత్తర్వులను హైకోర్టు కొట్టేస్తూ కొన్ని షరతులు విధించిందని చెప్పారు. అన్ని రకాల అనుమతులు వచ్చాకే సాగునీటి అవసరాలకు పనులు ప్రారంభించాలని, అటవీ అనుమతులు లేనిదే అటవీ భూముల్లో పనులు చేపట్టరాదని చెప్పిందన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే పిటిషనర్లు తిరిగి ఎన్జీటీని ఆశ్రయించే అవకాశం కల్పిస్తున్నట్టు ఉత్తర్వులిచ్చిందన్నారు. దీని ప్రకారం ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, కావాలంటే ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని వాదించారు.
కమిషన్ అవసరం ఏముంది?
సంజయ్ ఉపాధ్యాయ వాదనలపై స్పందించిన ట్రిబ్యునల్.. ప్రాజెక్టుకు ఇప్పుడు అన్ని రకాల అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఈ కేసును విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. అయితే అనుమతులు రాక ముందు ప్రభుత్వం అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని సంజయ్ అన్నారు. మరి అలా అయితే ఎన్జీటీ స్టే ఇచ్చిన తరువాత రాజ్యాంగ న్యాయస్థానాలైన హైకోర్టు, సుప్రీం కోర్టులే ఈ కేసులను కొట్టేశాయిగా అని బెంచ్ వ్యాఖ్యానించింది. అనుమతులన్నీ వచ్చిన నేపథ్యంలో కమిషన్ అవసరం ఏముందని ప్రశ్నించింది. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అనుమతులు చెల్లవంటూ దాఖలైన పిటిషన్‌కు జత చేయాలని బెంచ్ సూచించింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది పినాకి మిశ్రా స్పందిస్తూ.. ఇక ఈ కేసును విచారించాల్సిన అవసరం లేదని, కేసు కొట్టేయాలని కోరారు. దీంతో ఏకీభవించిన బెంచ్ అనుమతులు లేవన్న పిటిషన్‌ను కొట్టేసింది. వచ్చిన అనుమతులు చెల్లవంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 18న విచారిస్తామని తెలిపింది.
తీర్పుపై మంత్రి హరీశ్ హర్షం..
ఈ తీర్పుపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్న శక్తులకు ఈ తీర్పు చెంపపెట్టులాంటిదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టుల కోసం అన్ని పక్షాలు ఒక్కతాటిపై నిలిస్తే ఇక్కడ మాత్రం ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా అనుమతులు చెల్లవంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కు తీసుకోవాలని ఆయన హితవు పలికారు. ట్రిబ్యునల్ తీరుపై కాళేశ్వరం ప్రాజెక్టు ఈసీ హరిరాం, న్యాయవాది సంజీవ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment