
న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్జీటీ పలు కీలక వ్యాఖ‍్యలు చేసింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున ఇప్పుడు ఉపశమన చర్యల తీసుకోవాల్సిన బాధ్యత ఉందిని తెలిపింది. సరైన పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టరాదని స్పష్టం చేసింది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో పర్యావరణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, పర్యావరణ అనుమతులపై కమిటీ ఏర్పాటు అవసరమని ఎన్జీటీ అభిప్రాయపడింది.
ఈ మేరకు ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. 2008 నుంచి 2017 వరకు పర్యావరణ అనుమతుల లేకుండా చేసిన నిర్మాణాలకు.. జరిగిన పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. నిర్వాసితులకు పరిహారం, పునరావసం అంశాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పింది. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తర్వాత నెల రోజుల్లో అధ్యయనం పూర్తి చేయాలని కమిటీకి ఆదేశాలిచ్చింది. కమిటీ పురోగతిని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ తన తీర్పులో వెల్లడించింది. ప్రాజెక్టు విస్తరణపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని తేల్చి చెప్పింది. ఇటీవల అపెక్స్ కౌన్సిల్‌లో చెప్పినట్లు డీపీఆర్‌లు సమర్పించి, కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment