సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: పర్యావరణ అనుమతి తీసుకున్న తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దిశానిర్దేశం చేసింది. పర్యావరణ ప్రభావ మదింపు ప్రకటన (ఈఐఏ)–2006 ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను పరిశీలించి.. పర్యావరణ అనుమతి జారీచేసే ప్రక్రియను వేగంగా ముగించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఎన్జీటీ (చెన్నై బెంచ్) ఉత్తర్వులు జారీచేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రైతు, తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్జీటీ విచారించింది. డీపీఆర్ రూపకల్పన కోసం అవసరమైన పనులు మాత్రమే చేశామని ఏపీ సర్కార్ చేసిన వాదనతో ఏకీభవించింది.
ఎత్తిపోతల పనులు చేపట్టినందుకుగానూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. డీపీఆర్ రూపకల్పన కోసం చేసిన పనులను మదింపు చేయడానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయం, సీడబ్ల్యూసీ అధికారి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఈ కమిటీతో ఎత్తిపోతల పనులను మదింపు చేసి.. వాటివల్ల పర్యావరణానికి ఏమైనా విఘాతం కలిగిందా? లేదా? అనే కోణంలో అధ్యయనం చేసి, నాలుగు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. డీపీఆర్ రూపకల్పన కోసం మార్గదర్శకాలు రూపొందించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ సూచించిన మార్గదర్శకాలను ఈఐఏ–2006లో చేర్చి.. పర్యావరణ అనుమతివ్వాలని నిర్దేశించింది. నివేదిక, పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ డీపీఆర్‌కు సంబంధించిన పనులతో సహా ఎలాంటి పనులు చేపట్టరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది.
చదవండి: చురుగ్గా ‘వైద్య’ పోస్టుల భర్తీ
Comments
Please login to add a commentAdd a comment