సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి ఉరకలు పెడుతోంది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో ఏకధాటి వర్షాలతో ఇప్పటి వరకు కృష్ణా నదికి 1,345 టీఎంసీల వరద వచ్చింది. రాష్ట్రంలోని అన్ని జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 2019–20లో 3,050 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుదుత్పత్తి జరపాలని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) లక్ష్యం పెట్టుకోగా, గత మంగళవారం నాటికే 2,883.61 ఎంయూల ఉత్పత్తి జరిపింది.
కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రధాన జలాశయాల్లో మరో 1,953.8 ఎంయూల జల విద్యుదుత్పత్తికి సరిపడా జల నిల్వలున్నాయి. జలాశయాలకు గత కొంతకాలంగా కొనసాగుతున్న నిరంతర వరద ప్రవాహం దీనికి అదనం. ఈ అంకెలు పరిగణనలోకి తీసుకుంటే దశాబ్ద కాలం తర్వాత ఈ ఏడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జల విద్యుదుత్పత్తి సాధించనుందని జెన్‌కో ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగితే 5 వేల ఎంయూల మైలురాయిని సైతం తొలిసారిగా దాటి రాష్ట్రం కొత్త చరిత్రను సృష్టించనుంది.
ఎగువ డ్యామ్‌లతో తగ్గిన ఉత్పత్తి
తెలంగాణ ప్రాంతం పరిధిలోని జల విద్యుదుత్పత్తి కేంద్రాలు 2006–07లో 4,800 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేశాయి. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ చరిత్రలో సైతం జల విద్యుదుత్పత్తిలో ఇప్పటివరకు ఇదే రికార్డు. ఆ ఏడాది శ్రీశైలం ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రం నుంచే 2,511 ఎంయూల ఉత్పత్తి జరగడంతో ఇది సాధ్యమైందని జెన్‌కో హైడల్ డైరెక్టర్ వెంకటరాజం అన్నారు. ఆ తర్వాత కృష్ణా నదిపై కర్ణాటకలో ఆల్మట్టి, ఎగువ కృష్ణా తదితర జలాశయాలు నిర్మించడంతో దిగువన ఉన్న రాష్ట్రానికి వరద నీటి ప్రవాహం తగ్గిందని, దీంతో జల విద్యుదుత్పత్తి పడిపోయిందని పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయానికి గేట్లు ఏర్పాటు చేయడానికి ముందు, 1991–92లో నాగార్జునసాగర్ జల విద్యుదుత్పత్తి కేంద్రం రికార్డు స్థాయిలో 3,011 ఎంయూల ఉత్పత్తిని సాధించింది. ఎగువ కర్ణాటకలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచి్చన డ్యాంల కారణంగానే మూడు దశాబ్దాలు దాటినా ఆ రికార్డు అలాగే ఉంది. ఈ ఏడాది శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో 2100 ఎంయూలు, నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రంలో 2000 ఎంయూల ఉత్పత్తికి అవకాశముంది.
డిస్కంలకు భారీ ఊరట..
తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఈ ఏడాది జల విద్యుదుత్పత్తి భారీ ఊరట కలిగిస్తోంది. సగటున థర్మల్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.6 అవుతుండగా, జల విద్యుత్ సగటున ధర యూనిట్‌కు రూ.2.94 మాత్రమే. భారీ స్థాయిలో జల విద్యుదుత్పత్తి వస్తుండటంతో థర్మల్ విద్యుత్‌ను డిస్కంలు పక్కన పెట్టి ఆర్థిక భారం నుంచి బయటపడ్డాయి. వర్షాభావంతో గత నాలుగేళ్లలో లక్ష్యం మేరకు జల విద్యుదుత్పత్తి కాకపోవడంతో ఏటా డిస్కంలపై రూ.2 వేల కోట్లకు పైగా భారం పడింది. ఈ సారి లక్ష్యానికి మించి ఉత్పత్తి జరగనుండటంతో నష్టాలకు బ్రేక్ వేయొచ్చు. రూ.వెయ్యి కోట్ల వరకు అదనపు ప్రయోజనం కలగనుంది. విద్యుత్ వినియోగదారులపై భవిష్యత్తులో పడనున్న చార్జీల పెంపు భారం తగ్గనుందని అధికారవర్గాలు తెలిపాయి.
డిమాండ్ పతనం
ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం భారీగా తగ్గిపోయింది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో 45 శాతం వాటా వ్యవసాయ విద్యుత్‌దే కావడంతో మొత్తం డిమాండ్ పతనమైంది. గతేడాది అక్టోబర్‌లో అత్యధిక డిమాండ్ 10,600 మెగావాట్లు, రోజుకు 216.9 మిలియన్ యూనిట్లు (ఎంయూ) నమోదు కాగా, ఈ అక్టోబర్‌లో అత్యధిక డిమాండ్ 8,532 మెగావాట్లు, రోజుకు 166.35 ఎంయూలకు పడిపోయింది. ఖరీఫ్ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్‌లో దక్షిణాదిలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడుతుంది. కానీ ఈ ఏడాది ఖరీఫ్‌లో భారీ వర్షాలతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గిపోయింది. దీంతో ప్రైవేటు థర్మల్ విద్యుత్ కేంద్రాలను బ్యాకింగ్ డౌన్ చేసుకోవడం ద్వారా ఉత్పత్తి తగ్గించుకుని, జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట సామర్థ్యం మేర ఉత్పత్తి చేస్తున్నామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment