State Electricity Distribution Company
-
విద్యుత్ బిల్లుల ఎత్తి‘మోత’లు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల విద్యుత్ వినియోగం 2020–21లో 3,575 మిలియన్ యూనిట్లు ఉండగా, 2021–22లో 4,282 ఎంయూలకు పెరిగింది. 2022–23లో వీటికి ఏకంగా 13,826 ఎంయూల విద్యుత్ అవసరం కానుందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంచనా వేశాయి. ఈ మేరకు విద్యుత్ సరఫరా చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.7,660 కోట్ల విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్ఆర్) నివేదిక–2022–23లో స్పష్టం చేశాయి. మరోవైపు రూ.5,652 కోట్ల వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలను ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంది. ఈ సబ్సిడీ, ఎత్తిపోతల పథకాల బిల్లులు కలిపి 2022–23లో డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.13,312 కోట్లను చెల్లించాల్సి ఉండనుంది. దక్షిణ డిస్కంలో ఇలా.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలోని ఎత్తిపోతల పథకాలు 2020–21లో 1,617 ఎంయూల విద్యుత్ వినియోగించగా, 2021–22లో 13 శాతం అదనంగా 1,830 ఎంయూలను వినియోగించాయి. కాగా 2022–23లో ఏకంగా 190 శాతం అదనంగా 5,325 ఎంయూల విద్యుత్ వినియోగించనున్నాయని దక్షిణ డిస్కం అంచనా వేసింది. 2021–22లో ఎత్తిపోతల పథకాల బిల్లుల ద్వారా రూ.1,211.89 కోట్లను సంస్థ ఆర్జించగా, సంస్థ మొత్తం వార్షిక ఆదాయం రూ.21,820.56 కోట్లలో ఇది 5 శాతం ఉంటుందని అంచనా. 2022–23లో రూ. 2,505.05 కోట్లను ఆర్జించనుండగా, సంస్థ మొత్తం వార్షిక ఆదాయం రూ.24,610.33 కోట్లలో ఎత్తిపోతల బిల్లుల వాటా 10 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఉత్తర డిస్కం పరిస్థితి ఇదీ.. ఇక ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలోని ఎత్తిపోతల పథకాలు 2020–21లో 1,958 ఎంయూల విద్యుత్‌ను వాడగా, 2021–22లో 25 శాతం వృద్ధితో 2,452 ఎంయూలు వినియోగించాయి. 2022–23లో ఏకంగా 246 శాతం వృద్ధితో 8,501 ఎంయూల విద్యుత్ అవసరం కానుందని ఉత్తర డిస్కం అంచనా వేసింది. సంస్థకు 2021–22లో రూ.7,175 కోట్ల వార్షిక ఆదాయం అంచనా కాగా, అందులో రూ.1,646 కోట్ల (23 శాతం)ను ఎత్తిపోతల విద్యుత్ బిల్లుల రూపంలో ఆర్జించనుంది. 2022–23లో సంస్థకు రూ.10,703 కోట్ల వార్షిక ఆదాయం రానుందని అంచనాలుండగా, అందులో ఏకంగా రూ.5,155 కోట్లు (48శాతం) ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లుల రూపంలో రానున్నాయి. -
సర్కారు తప్పిదాలతోనే విద్యుత్ మోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఏకంగా రూ.6,813 కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు ప్రతిపాదించాయని, చరిత్రలో ఎన్నడూ ఇంతగా చార్జీలు పెంచిన దాఖలాలు లేవని విద్యుత్ రంగ నిపుణులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలు, లోపభూయిష్ట ప్రణాళికలు, లోపాయకారీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిం దని ఆరోపించారు. రాష్ట్రంలో ‘విద్యుత్ చార్జీ లు పెంచడమే మార్గమా?’అనే అంశంపై శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన వెబినార్‌లో పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను, సూచనలను వెల్లడించారు. నిర్లక్ష్యం, వైఫల్యాలతోనే.. మార్కెట్లో సౌర విద్యుత్ ధరలు తగ్గినా, పాత అధిక ధరలతోనే కొనుగోలు ఒప్పందాలు కొనసాగించారని.. ప్లాంట్ల నిర్మాణ గడువు పెంచి ప్రజలపై వందల కోట్ల అనవసర భారం వేశారని విద్యుత్‌రంగ విశ్లేషకుడు ఎం.వేణుగోపాల్‌రావు విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ బిడ్ ద్వారా ఓ రాజకీయవేత్తకు చెందిన థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం చేసుకున్నారని, ఫలితంగా ప్రజలపై రూ.2,784 కోట్ల అదనపు భారం పడిందని చెప్పారు. కాలం చెల్లిన సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో చేపట్టిన భద్రాద్రి ప్లాంటు, వెయ్యి మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం వంటివి రాష్ట్రానికి గుదిబండ మారాయన్నారు. 2018–22 మధ్య రూ.21,609 కోట్ల ఆదాయ లోటు ఉందని డిస్కంలు నివేదించాయని.. ఇంత భారం పేరుకుపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఈఆర్సీ, డిస్కంల వైఫల్యాలే కారణ మని విమర్శించారు. ప్రస్తుత ఒప్పందాల ద్వారానే రాష్ట్రానికి 16,603 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందని.. 2022–23 నాటికి కొత్త ప్రాజెక్టులు పూర్తయితే ఇది 25,760 మెగావాట్లకు పెరుగుతుందని తెలిపారు. ఇలా భవిష్యత్ డిమాండ్‌ను అతిగా అంచనా వేసి ప్రాజెక్టులు కడుతున్నారని.. వాటి ఫిక్స్డ్ చార్జీల భారాన్ని ప్రజల నెత్తిన వేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలపై భారం తగదు పేదలు, మధ్యతరగతిపై విద్యుత్ చార్జీల భారం మోపడం సరికాదని ‘ప్రయాస్ ఎనర్జీ’సంస్థ నిపుణుడు, ఐఐటీయన్ ఎన్.శ్రీకుమార్ అభిప్రాయపడ్డారు. ‘‘రాష్ట్రంలోని 1. 15 కోట్ల గృహ విద్యుత్ కనెక్షన్లలో 62 శాతం పేదలు, మధ్యతరగతి వారివే. చార్జీల పెం పుతో వారి విద్యుత్ బిల్లులు 75–80 శాతం వరకు పెరిగిపోతాయి. 100 యూని ట్లలోపు వినియోగంపై చార్జీల పెంపును 5 శాతానికే పరిమితం చేయాలి. 100–200 యూనిట్లు వాడేవారిపై 10 శాతం, 200 యూనిట్లు దా టి వాడితే 12–15శాతం చార్జీలు పెంచితే న్యా యంగా ఉంటుంది..’’అని సూచించారు. -
50లోపు మినహాయింపు.. ఆపై పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐదేళ్ల విరామం తర్వాత విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు పేదలపై మాత్రం కరుణ చూపనున్నాయి. నెలకు 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే పేదల గృహాలకు చార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇవ్వాలని డిస్కంలు నిర్ణయించినట్లు తెలిసింది. చివరిసారిగా ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో 0–50 యూనిట్లలోపు గృహ వినియోగ విద్యుత్ చార్జీలు పెంచారు. 40 లక్షల పేదల గృహాలకు ఊరట.. గృహ కేటగిరీలో 0–50 యూనిట్లలోపు వినియోగానికి ఒక్కో యూనిట్‌కు రూ. 1.45 పైసలు, 51–100 యూనిట్లలోపు వినియోగానికి రూ. 2.60 పైసలు, 101–200 యూనిట్ల వరకు వినియోగానికి రూ. 4.30 పైసల చొప్పున ప్రస్తుతం డిస్కంలు విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. తాజాగా 0–50 యూనిట్లలోపు మినహా మిగిలిన అన్ని గ్రూపుల వినియోగదారుల విద్యుత్ చార్జీలు పెరగనున్నట్లు తెలిసింది. డిస్కంల నిర్ణయంతో 0–50 యూనిట్లలోపు వినియోగించే దాదాపు 40 లక్షల వరకు పేదల గృహాలకు ఊరట లభించనుందని అధికార వర్గాలు తెలిపాయి. 80 లక్షల గృహాలపై బాదుడు... రాష్ట్రంలో అన్ని కేటగిరీల విద్యుత్ కనెక్షన్లు కలిపి మొత్తం 1.64 కోట్లు ఉన్నాయి. అందులో 1.2 కోట్ల గృహ, 25 లక్షలు వ్యవసాయ, 15.6 లక్షల వాణి జ్య, 1.01 లక్షల పారిశ్రామిక, 2.8 లక్షల ఇతర కేటగిరీల కనెక్షన్లున్నాయి. నెలకు 51–100, 101–200 ఆపై యూనిట్లు వినియోగమయ్యే దాదాపు 80 లక్షల గృహాలకు సంబంధించిన విద్యుత్ చార్జీలను పెంచాలని డిస్కంలు నిర్ణయించినట్లు సమాచా రం. ఇతర రాష్ట్రాల్లో వినియోగదారుల నుంచి వ సూలు చేస్తున్న చార్జీలపై విద్యుత్ సంస్థలు అధ్యయనం చేశాయి. పలు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం లో గృహ, పరిశ్రమల కేటగిరీల చార్జీలు తక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చాయి. ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ చార్జీలను ప్రామాణికంగా తీసుకొని వాటికి మించకుండా రాష్ట్రంలోనూ చార్జీల పెంపు ను ప్రతిపాదించేందుకు సిద్ధమయ్యాయి. మధ్యతరగతిపై భారం.. వివిధ కేటగిరీలు, వినియోగం ఆధారిత గ్రూపు ల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను సైతం డి స్కంలు కొంత వరకు తగ్గించి హేతుబద్ధీకరణ చేపట్టినట్లు తెలిసింది. గృహ కేటగిరీలో 101– 200 యూనిట్లు, ఆపై వినియోగ గ్రూపుల మధ్య ఉన్న తీవ్ర వ్యత్యాసాలను కాస్త తగ్గించనున్నారు. దీంతో మధ్యతరగతిపై ఈసారి విద్యుత్ చా ర్జీల భారం భారీగానే పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా వారి విద్యుత్ బిల్లులు దాదాపు రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. సగటున యూనిట్‌పై రూపాయి వరకు టారిఫ్ పెంచి ఈ ఆదాయ లోటును పూడ్చుకోవాలని డిస్కంలు భావిస్తున్నట్లు తెలిసింది. నిర్దేశిత గడువులోగా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించని నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సోమవారం ప్రత్యేక విచారణ నిర్వహించతలపెట్టింది. ఆలోగా విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించవచ్చని తెలిసింది. -
నష్టాలను పూడ్చుకునేందుకు..
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయానికి సిద్ధమైంది. ఆర్టీసీ చార్జీల పెంపు తర్వాత రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచబోతోంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. డిస్కంలను నష్టాల నుంచి బయటపడేసేందుకు ఈసారి వాస్తవిక దృక్పథంతో విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిస్కంల ఆదాయ, వ్యయాలను సమతుల్యం చేసేందుకు ఎంత మేరకైనా చార్జీలు పెంచాలని భావిస్తోంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే విద్యుత్ రాయితీలు పోగా మిగిలే ఆర్థిక లోటును పూర్తిగా విద్యుత్ చార్జీల పెంపు ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల పెంపు భారం తీవ్రంగానే ఉండనుందని అధికారవర్గాలు సంకేతాలిస్తున్నారు. 2020–21 ఆర్థిక ఏడాదికి సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను ఈనెల 31న డిస్కంలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించే అవకాశాలున్నాయి. రాష్ట్రానికి విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు చేయనున్న వ్యయం, ప్రస్తుత చార్జీలతో వచ్చే ఆదాయ, వ్యయాలతో పోలిస్తే ఆదాయ లోటు అంచనాలు, విద్యుత్ రాయితీలు తీసేయగా మిగిలే ఆదాయ లోటును భర్తీ చేసేం దుకు పెంచాల్సిన విద్యుత్ చార్జీ ల సమాచారం ఈ నివేదికలో ఉండనుంది. ఏటా దాదా పు రూ.2 వేల కోట్ల వరకు విద్యుత్ చార్జీలను పెంచితేనే డిస్కం లు ఆర్థికంగా నిలబడనున్నాయని ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గృహ, పారిశ్రామిక, వాణిజ్య కేటగిరీల వినియోగదారులతో పాటు నీటిపారుదల ప్రాజెక్టులకు సరఫరా చేసే విద్యుత్ చార్జీలను సైతం డిస్కంలు పెంచబోతున్నాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష విద్యుత్ సంస్థల సీఎండీలతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఎత్తిపోతల ప్రాజెక్టులకు చౌకగా విద్యుత్ సరఫరా చేయడం సా ధ్యం కాదని విరమించుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. -
హైడ్రో పవర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి ఉరకలు పెడుతోంది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో ఏకధాటి వర్షాలతో ఇప్పటి వరకు కృష్ణా నదికి 1,345 టీఎంసీల వరద వచ్చింది. రాష్ట్రంలోని అన్ని జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 2019–20లో 3,050 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుదుత్పత్తి జరపాలని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) లక్ష్యం పెట్టుకోగా, గత మంగళవారం నాటికే 2,883.61 ఎంయూల ఉత్పత్తి జరిపింది. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రధాన జలాశయాల్లో మరో 1,953.8 ఎంయూల జల విద్యుదుత్పత్తికి సరిపడా జల నిల్వలున్నాయి. జలాశయాలకు గత కొంతకాలంగా కొనసాగుతున్న నిరంతర వరద ప్రవాహం దీనికి అదనం. ఈ అంకెలు పరిగణనలోకి తీసుకుంటే దశాబ్ద కాలం తర్వాత ఈ ఏడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జల విద్యుదుత్పత్తి సాధించనుందని జెన్కో ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగితే 5 వేల ఎంయూల మైలురాయిని సైతం తొలిసారిగా దాటి రాష్ట్రం కొత్త చరిత్రను సృష్టించనుంది. ఎగువ డ్యామ్‌లతో తగ్గిన ఉత్పత్తి తెలంగాణ ప్రాంతం పరిధిలోని జల విద్యుదుత్పత్తి కేంద్రాలు 2006–07లో 4,800 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేశాయి. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ చరిత్రలో సైతం జల విద్యుదుత్పత్తిలో ఇప్పటివరకు ఇదే రికార్డు. ఆ ఏడాది శ్రీశైలం ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రం నుంచే 2,511 ఎంయూల ఉత్పత్తి జరగడంతో ఇది సాధ్యమైందని జెన్కో హైడల్ డైరెక్టర్ వెంకటరాజం అన్నారు. ఆ తర్వాత కృష్ణా నదిపై కర్ణాటకలో ఆల్మట్టి, ఎగువ కృష్ణా తదితర జలాశయాలు నిర్మించడంతో దిగువన ఉన్న రాష్ట్రానికి వరద నీటి ప్రవాహం తగ్గిందని, దీంతో జల విద్యుదుత్పత్తి పడిపోయిందని పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయానికి గేట్లు ఏర్పాటు చేయడానికి ముందు, 1991–92లో నాగార్జునసాగర్ జల విద్యుదుత్పత్తి కేంద్రం రికార్డు స్థాయిలో 3,011 ఎంయూల ఉత్పత్తిని సాధించింది. ఎగువ కర్ణాటకలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచి్చన డ్యాంల కారణంగానే మూడు దశాబ్దాలు దాటినా ఆ రికార్డు అలాగే ఉంది. ఈ ఏడాది శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో 2100 ఎంయూలు, నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రంలో 2000 ఎంయూల ఉత్పత్తికి అవకాశముంది. డిస్కంలకు భారీ ఊరట.. తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఈ ఏడాది జల విద్యుదుత్పత్తి భారీ ఊరట కలిగిస్తోంది. సగటున థర్మల్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.6 అవుతుండగా, జల విద్యుత్ సగటున ధర యూనిట్‌కు రూ.2.94 మాత్రమే. భారీ స్థాయిలో జల విద్యుదుత్పత్తి వస్తుండటంతో థర్మల్ విద్యుత్‌ను డిస్కంలు పక్కన పెట్టి ఆర్థిక భారం నుంచి బయటపడ్డాయి. వర్షాభావంతో గత నాలుగేళ్లలో లక్ష్యం మేరకు జల విద్యుదుత్పత్తి కాకపోవడంతో ఏటా డిస్కంలపై రూ.2 వేల కోట్లకు పైగా భారం పడింది. ఈ సారి లక్ష్యానికి మించి ఉత్పత్తి జరగనుండటంతో నష్టాలకు బ్రేక్ వేయొచ్చు. రూ.వెయ్యి కోట్ల వరకు అదనపు ప్రయోజనం కలగనుంది. విద్యుత్ వినియోగదారులపై భవిష్యత్తులో పడనున్న చార్జీల పెంపు భారం తగ్గనుందని అధికారవర్గాలు తెలిపాయి. డిమాండ్ పతనం ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం భారీగా తగ్గిపోయింది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో 45 శాతం వాటా వ్యవసాయ విద్యుత్‌దే కావడంతో మొత్తం డిమాండ్ పతనమైంది. గతేడాది అక్టోబర్‌లో అత్యధిక డిమాండ్ 10,600 మెగావాట్లు, రోజుకు 216.9 మిలియన్ యూనిట్లు (ఎంయూ) నమోదు కాగా, ఈ అక్టోబర్‌లో అత్యధిక డిమాండ్ 8,532 మెగావాట్లు, రోజుకు 166.35 ఎంయూలకు పడిపోయింది. ఖరీఫ్ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్‌లో దక్షిణాదిలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడుతుంది. కానీ ఈ ఏడాది ఖరీఫ్‌లో భారీ వర్షాలతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గిపోయింది. దీంతో ప్రైవేటు థర్మల్ విద్యుత్ కేంద్రాలను బ్యాకింగ్ డౌన్ చేసుకోవడం ద్వారా ఉత్పత్తి తగ్గించుకుని, జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట సామర్థ్యం మేర ఉత్పత్తి చేస్తున్నామని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. -
విద్యుత్ స్తంభాలకు జీఎస్టీ షాక్
18 నుంచి 28 శాతానికి పెరిగిన పన్నులు సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి రావడంతో విద్యుత్ స్తంభాలపై పిడుగు పడింది. వ్యాట్ సహా ఇతర అన్ని రకాల పన్నులు కలిపి గతం లో విద్యుత్ స్తంభాలపై 18 శాతం పన్నులు ఉండేవి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ పన్ను 28 శాతానికి పెరిగింది. దీంతో విద్యుత్ సంస్థలపై 10 శాతం అదనపు పన్నుల భారం పడింది. దీంతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు, రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)తో పాటు మున్సిపాలిటీలు, రియల్టర్లపై పన్ను భారం పడనుంది. దీంతో ఒక్క విద్యుత్ స్తంభాల కొనుగోళ్లపైనే డిస్కంలపై ఏటా రూ. 5 కోట్ల వరకు పన్ను భారం పడుతుందని అధికారుల అంచనా. విద్యుత్ స్తంభా లపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని కేంద్రాన్ని కోరతామని, సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి చెప్పారు.