సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఏకంగా రూ.6,813 కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు ప్రతిపాదించాయని, చరిత్రలో ఎన్నడూ ఇంతగా చార్జీలు పెంచిన దాఖలాలు లేవని విద్యుత్ రంగ నిపుణులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలు, లోపభూయిష్ట ప్రణాళికలు, లోపాయకారీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిం దని ఆరోపించారు. రాష్ట్రంలో ‘విద్యుత్ చార్జీ లు పెంచడమే మార్గమా?’అనే అంశంపై శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన వెబినార్‌లో పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను, సూచనలను వెల్లడించారు.
నిర్లక్ష్యం, వైఫల్యాలతోనే..
మార్కెట్లో సౌర విద్యుత్ ధరలు తగ్గినా, పాత అధిక ధరలతోనే కొనుగోలు ఒప్పందాలు కొనసాగించారని.. ప్లాంట్ల నిర్మాణ గడువు పెంచి ప్రజలపై వందల కోట్ల అనవసర భారం వేశారని విద్యుత్‌రంగ విశ్లేషకుడు ఎం.వేణుగోపాల్‌రావు విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ బిడ్ ద్వారా ఓ రాజకీయవేత్తకు చెందిన థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం చేసుకున్నారని, ఫలితంగా ప్రజలపై రూ.2,784 కోట్ల అదనపు భారం పడిందని చెప్పారు.
కాలం చెల్లిన సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో చేపట్టిన భద్రాద్రి ప్లాంటు, వెయ్యి మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం వంటివి రాష్ట్రానికి గుదిబండ మారాయన్నారు. 2018–22 మధ్య రూ.21,609 కోట్ల ఆదాయ లోటు ఉందని డిస్కంలు నివేదించాయని.. ఇంత భారం పేరుకుపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఈఆర్సీ, డిస్కంల వైఫల్యాలే కారణ మని విమర్శించారు.
ప్రస్తుత ఒప్పందాల ద్వారానే రాష్ట్రానికి 16,603 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందని.. 2022–23 నాటికి కొత్త ప్రాజెక్టులు పూర్తయితే ఇది 25,760 మెగావాట్లకు పెరుగుతుందని తెలిపారు. ఇలా భవిష్యత్ డిమాండ్‌ను అతిగా అంచనా వేసి ప్రాజెక్టులు కడుతున్నారని.. వాటి ఫిక్స్‌డ్ చార్జీల భారాన్ని ప్రజల నెత్తిన వేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
పేదలపై భారం తగదు
పేదలు, మధ్యతరగతిపై విద్యుత్ చార్జీల భారం మోపడం సరికాదని ‘ప్రయాస్ ఎనర్జీ’సంస్థ నిపుణుడు, ఐఐటీయన్ ఎన్.శ్రీకుమార్ అభిప్రాయపడ్డారు. ‘‘రాష్ట్రంలోని 1. 15 కోట్ల గృహ విద్యుత్ కనెక్షన్లలో 62 శాతం పేదలు, మధ్యతరగతి వారివే. చార్జీల పెం పుతో వారి విద్యుత్ బిల్లులు 75–80 శాతం వరకు పెరిగిపోతాయి.
100 యూని ట్లలోపు వినియోగంపై చార్జీల పెంపును 5 శాతానికే పరిమితం చేయాలి. 100–200 యూనిట్లు వాడేవారిపై 10 శాతం, 200 యూనిట్లు దా టి వాడితే 12–15శాతం చార్జీలు పెంచితే న్యా యంగా ఉంటుంది..’’అని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment