ఇల్లు గుల్లవుతోంది. నానాటికీ పెరుగుతున్న చార్జీల భారం సామాన్యుడి ఇంటి బడ్జెట్‌ను అమాంతం పెంచేసింది. కోవిడ్ ఆంక్షలకు తోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేడు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేవలం రెండు నెలల్లోనే గ్రేటర్‌వాసిపై పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్, ఆయిల్ ఛార్జీలు దండెత్తాయి. దీంతో నగరంలోని సామాన్యుల పరిస్థితి ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్నట్టుగా తయారైంది. స్థూలంగా లెక్కకడితే నెలకు ఒక్కో మనిషిపై ఈ చార్జీల భారం రూ.500 పెరిగిందని అంచనా వేస్తున్నారు.
– సాక్షి, హైదరాబాద్
గ్యాస్ బండపై తాజాగా రూ.50 పెరగడంతో మూడు జిల్లాల పరిధిలో మొత్తం 26 లక్షల గ్యాస్ కనెక్షన్లకు గాను గ్రేటర్‌పై నెలకు సగటున రూ.13 కోట్ల అదనపు భారం పడింది. అదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నగరంలో సుమారు 65 లక్షల వాహనాలు ఉండగా, రోజుకు సుమారు 50 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల డీజిల్ వినియోగం ఉంటుంది. తాజాగా ధరతో పెట్రోల్ వాహనదారులపై రోజుకు సగటున రూ.95 లక్షల చొప్పున నెలకు రూ.2850 కోట్లు భారం మోపగా, డీజిల్ వాహనదారులపై రోజుకు సగటున రూ.52 లక్షల చొప్పున నెలకు రూ. 1560 కోట్ల అధనపు భారం పడింది.
చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం: ‘అది పేలడం వల్లే మంటలు వ్యాపించాయి’
విద్యుత్ భారం రూ.165 కోట్లు
గృహ విద్యుత్‌పై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌పై యూనిట్‌కు రూ.ఒకటి చొప్పున పెంచారు. గ్రేటర్‌లో 55 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉండగా, నెలకు సగటున 1900 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగమవుతుంది. గృహ వినియోగ దారులపై నెలకు రూ.25 కోట్లు, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై రూ.140 కోట్ల భారం మోపింది. ఏడాదికి రూ.1980 కోట్ల అదనపు భారం తప్పడం లేదు. మధ్య తరగతి, ఉద్యోగ, వ్యాపార, ఇతర వర్గాలకు చెందిన సుమారు 16 లక్షల మందికిపైగా ప్రయాణికులు సిటీబస్సుల్లో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితంగా ప్రతి ప్రయాణికునిపై రోజుకు సగటున రూ.10 అదనపు భారం పడుతోంది. ఛార్జీల రూపంలో గ్రేటర్ వాసులపై నెలకు రూ.6 కోట్లకు పైగా భారం మోపింది.
వంట నూనెల భారం నెలకు రూ.54–60 కోట్లు
జనవరిలో కిలో వేరుశనగ నూనె రూ.135 ఉండగా, ప్రçస్తుతం రూ.185 చేరింది. అదే విధంగా సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ రూ.155 ఉండగా, ప్రస్తుతం రూ.190 ఎగబాకింది. అదే విధంగా పామాయిల్ కేజీ రూ.125 ఉండగా, ప్రస్తుతం రూ.150 పెరిగింది. ఒక్కో కుటుంబం నెలకు మూడు కేజీల ఆయిల్ వినియోస్తోందని అంచనా. గ్రేటర్‌లో సుమారు 45 లక్షల గృహాలు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన ప్రతి ఇంటికి నెలకు రూ.120–150 అదనపు భారం పడనుంది. ఇలా నెలకు సగటున రూ.54–60 కోట్ల భారం గ్రేటర్ వాసులపై పడుతోంది.
ముట్టుకుంటే షాక్
కోవిడ్ కారణంగా ఉపాధి లేకుండా పోయింది. కానీ అన్ని ఛార్జీలు మాత్రం ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. ఇప్పటి వరకు నెలవారీ గృహ విద్యుత్ బిల్లు రూ.500లోపే వచ్చేది. ప్రస్తుతం డిస్కం యూనిట్‌కు రూ.50 పైసల చొప్పున పెంచడంతో ఏప్రిల్ బిల్లులో భారీ వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.
– నేమాల బెనర్జీ, డిఫెన్స్ కాలనీ
వంటింటికి గుదిబండ
గత ఆగస్టులో గ్యాస్ సిలిండర్ ధర రూ.890 ఉండగా, అక్టోబర్ ఐదో తేదీ నాటికి రూ.915కి చేరింది. ఆ తర్వాతి రోజే అనూహ్యంగా రూ.930 కి చేరింది. మార్చి రెండో వారంలో రూ.962 ఉండగా, నాలుగు రోజుల క్రితం ఏకంగా రూ.50 పెరిగింది. ప్రస్తుతం రూ.1002కు చేరింది. ఏదైనా వంట చేయలన్నా.. వెనుకా ముందు ఆలోచించాల్సి వస్తోంది.
– గుర్రం అన్నపూర్ణ, బడంగ్‌పేట్
బైక్ ప్రయాణం భారం
గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పని చేస్తున్నా. బైక్‌లో గతంలో రూ.500 పెట్రోల్ కొట్టిస్తే..వారం రోజులు వచ్చేది. ప్రస్తుతం నాలుగైదు రోజులే వస్తుంది. జీతం పెరగలేదు కానీ..పెట్రోల్ వాత మాత్రం తప్ప లేదు.
– టి.తిరుమలేష్, కర్మన్‌ఘాట్
Comments
Please login to add a commentAdd a comment