Gas cylinder price
-
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి. మెట్రో నగరాలు న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశవ్యాప్తంగా 19 కిలోగ్రాముల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బుధవారం ప్రకటించాయి.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకారం.. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.19 మేర తగ్గింది. సవరించిన ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయి. వాణిజ్య సిలిండర్ కొత్త ధరలు ఢిల్లీలో రూ.1,745.50, ముంబైలో రూ.1,698.50, చెన్నైలో రూ.1,911, కోల్‌కతాలో రూ.1,859 గా ఉన్నాయి. -
మోదీ కానుక: గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు
సాక్షి, ఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త అందించారు. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా మోదీ తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ‘ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది. వంట గ్యాస్ ధరను తగ్గించడంతో ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారికి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను అందించడానికి అనుగుణంగా ఉంటుంది’ అని వ్యాఖ్యలు చేశారు. Today, on Women's Day, our Government has decided to reduce LPG cylinder prices by Rs. 100. This will significantly ease the financial burden on millions of households across the country, especially benefiting our Nari Shakti. By making cooking gas more affordable, we also aim… — Narendra Modi (@narendramodi) March 8, 2024 -
మోయలేని భారం మోపే వాడే మోదీ: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినందున ఆయిల్ కంపెనీలకు నష్టం వచ్చిందంటూ రూ. 22 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోదీ... సబ్సిడీలు ఎత్తేసి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ద్వారా ఆడబిడ్డలపై మోపిన భారానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఎందుకు ఇవ్వరని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె. తారక రామారావు ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం ఆడబిడ్డలపై మోపిన రూ. 42 వేల కోట్ల గ్యాస్ సిలిండర్ భారానికిగాను తగిన పరిహారం చెల్లించాలని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. 2014కు ముందు కేవలం రూ. 400గా గ్యాస్ సిలిండర్ ధర ఉంటేనే అప్పటి ప్రధానిపై విమర్శలు చేసిన మోదీ... అడ్డగోలుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినందుకు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. మోదీ ప్రధాని కాకముందు రూ. 400 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1,100 దాటి పరుగులు తీస్తోందని, అప్పుడు రూ. 827 ఉన్న సబ్సిడీ ఇప్పుడు గుండుసున్నా అయిందని విమర్శించారు. కేవలం గత రెండేళ్లలోనే రూ. 42 వేల కోట్ల భారం మోపిన మోదీ సిలిండర్ ధర విశ్వగురువుగా నిలిచారని ఎద్దేవా చేశారు. మోదీ నిర్వాకం కారణంగా దేశంలోని 2.11 కోట్ల మంది వినియోగదారులు కనీసం ఒక్క సిలిండర్ కూడా తీసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెట్టడాన్నే ఆశయంగా మార్చుకున్న మోదీకి ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప దేశంలోని ఆడబిడ్డల కష్టాలు కనిపించవా? అని ప్రశ్నించారు. ఆర్థిక సాయం కేవలం ఆయిల్ కంపెనీలకేనా, ఆడబిడ్డలపై కనికరం లేదా నిలదీశారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్యపు బీజేపీ పాలనలో ధరలు దండయాత్ర చేస్తూ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని తెలిపారు. దేశ ప్రజలపై మోయలేని భారం మోపే వాడే మోదీ అని మహిళా లోకం భావిస్తోందన్నారు. మోదీ కావాలో, సబ్సిడీ కావాలో దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన తరుణం ఇదేనన్నారు. మహిళాలోకంపై బీజేపీకి చులకన భావం ఉందని, ఏడాదికి మూడు సిలెండర్లు సరిపోవా? అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ అంటేనే భారమంతా జనంపై మోపే పార్టీగా మారిందని ఎద్దేవా చేసిన కేటీఆర్... బిహార్, బెంగాల్‌ల నుంచి కాదని, వంటింటి నుంచే బీజేపీ పతనం ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. మహిళలు తలుచుకుంటే బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని, గ్యాస్ ధరల భారాన్ని ఇక సహించలేమని మహిళలు తీర్మానాలు చేయాలని, సబ్సిడీలకు సర్వమంగళం పాడిన బీజేపీని తరిమికొట్టాలని కేటీఆర్ ఆ ప్రకటనలో కోరారు. -
HYD: బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: దేశంలో గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. నేడు(బుధవారం) ఇళ్లలో ఉపయోగించే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధరల పెంపుపై కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. బీజేపీ కార్యాలయ ముట్టడికి మహిళా కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా బీజేపీ మైనార్టీ మోర్చా ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తతకర వాతావరణం చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో వైరస్ కలకలం.. హెచ్చరించిన వైద్యులు -
కేటీఆర్ సెటైర్, దేశ ప్రజలకు మోదీ అందించిన బహుమతి ఇదే!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. బుధవారం వంటిట్లో వినియోగించే 14.2కేజీల సిలిండర్‌పై రూ.50 ధరని పెంచుతూ చమురు కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన ధరలపై కేటీఆర్ స్పందించారు. #AchheDin Aa Gaye 👏 Badhai Ho #LPG over ₹1050 👇 An increase again of ₹50 Modi Ji’s Gift to all Indian Households👍 https://t.co/BknwJ2zNfi — KTR (@KTRTRS) July 6, 2022 బీజేపీని విమర్శిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. "అచ్చేదిన్ ఆ గయే. బధాయి హో" ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. భారతీయ కుటుంబాలకు మోడీ జీ బహుమతి ఇదేనంటూ సెటైర్లు వేశారు. అప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ అంటూ మంత్రి కేటీఆర్ సందర్భానుసారం బీజేపీపై విమర్శల దాడిని పెంచుతూనే ఉన్నారు. పెరిగిన గ్యాస్ ధరలపై అచ్చేదిన్ ఆగయే అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్.. మొన్న జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై పరోక్షంగా సెటైర్లు వేశారు. Welcome the WhatsApp University for its executive council meeting to the beautiful city of Hyderabad To all the Jhumla Jeevis; Don’t forget to enjoy our Dum Biryani & Irani Chai ☕️ #TelanganaThePowerhouse 👇 please visit, take notes & try to implement in your states pic.twitter.com/Ub0JRXSIUA — KTR (@KTRTRS) July 1, 2022 జులై 2, 3 తేదీలలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలపై ‘‘అందమైన హైదరాబాద్ నగరంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి వాట్సాప్ యూనివర్సిటీకి(బీజేపీని పరోక్షంగా ఉద్దేశిస్తూ..) స్వాగతం అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. థ్యాంక్యూ డియర్ మోదీ జీ ఏప్రిల్ నెలలో దేశ జీడీపీపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. దేశ జీడీపీ పెరగడం లేదని ఎవరన్నారని ప్రశ్నించారు. థ్యాంక్యూ డియర్ మోదీ జీ. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని వెల్లడించారు. Who says GDP is not going up? Thank You dear Modi Ji for the making this Gas Diesel & Petrol hike as a daily habit for all Indians👏 Am sure there will be some bright BJP folks who will tell us now that this is Modi Ji’s master strategy to promote EVs 👍 https://t.co/6Ah3dmzhSO — KTR (@KTRTRS) April 5, 2022 జీడీపీ పెరుగుదలను ప్రధాని మోదీ రోజువారీ అలవాటుగా మార్చారని ఎద్దేవా చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలనే మోదీ వ్యూహమా అని ట్వీట్ చేశారు. -
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర
సాక్షి, హైదరాబాద్: సామాన్యుడి నెత్తిపై వంట గ్యాస్ సిలిండర్ ‘బాదుడు’ బరువు మరింత పెరిగింది. ఒక్కసారిగా రూ. 50 పెంచేశాయి చమురు సంస్థలు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచినట్లు, పెంచిన ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చినట్లు ప్రకటించాయి. దీంతో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1052కి చేరింది. గత వారం వ్యవధిలో సిలిండర్ బుక్ చేసుకున్న కొందరికి సైతం ఈ పెంపు వర్తించడం గమనార్హం. ఇక నెల గ్యాప్ తర్వాత ఇప్పుడు యాభై రూపాయలు పెంచాయి కంపెనీలు. డొమెస్టిక్ సిలిండర్లపై మార్చి 22న పెంపు ఇచ్చిన కంపెనీలు.. ఆ టైంలోనూ 50 రూ. పెంచాయి. ఏప్రిల్‌లో పెంపు ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. కమర్షియల్ సిలిండర్ ధరలూ ఈ మధ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఏకంగా 102 రూ. పెంచాయి కంపెనీలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2, 563గా ఉంది. చదవండి: సంతానోత్పత్తి తగ్గింది.. ఊబకాయం పెరిగింది -
పంచేటోళ్లు కావాలా? పెంచేటోళ్లు కావాలా?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలన్నీ పెంచుకుంటూ పోతోంది. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. పెట్రోల్, మంచినూనె ధరలు పెంచింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ పంచుకుంటూ పోతోంది. రైతుబంధు కింద ఎకరానికి రూ.పది వేలు ఇస్తోంది. కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష ఇస్తోంది. స్త్రీనిధి కింద మహిళలకు రుణాలిస్తోంది. మరి పంచెటోళ్లు కావాలా? పెంచెటోళ్లు కావాలా? అని ప్రజలు ఆలోచన చేయాలి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీని గుద్దుడు గుద్ది.. గద్దెదించాలి..’అని మంత్రి హరీశ్‌రావు బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం సంగారెడ్డి అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో హరీశ్‌రావు అభయహస్తం పథకంలో ఎస్‌హెచ్‌జీ మహిళలు తమ వాటా కింద చెల్లించిన మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేసేందుకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు బీజేపీ, కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ‘ఒకడు పాదయాత్ర.. ఇంకోడు సైకిల్‌యాత్ర.. ఇంకోడు మోకాళ్లయాత్ర.. బయలెల్లిండ్రు.. ఏం యాత్రలు.. తిట్టుడు తప్ప ఏమీలేదు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలో అమలవుతయా? చెప్పాలి.. కాంగ్రెస్, బీజేపీ పాలనల్లో ఏం జరిగింది?.. ఈ ఆరేండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలి’ అని హరీశ్‌రావు అన్నారు. దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, 57 ఏళ్లు దాటిన వారికి ఆసరా పింఛన్ల మంజూరు ఈనెల నుంచే ప్రారంభిస్తామని ప్రకటించారు. -
గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్, వంట నూనెలు, చికెన్, పచ్చిమిర్చి.. తగ్గేదేలే!
ఇల్లు గుల్లవుతోంది. నానాటికీ పెరుగుతున్న చార్జీల భారం సామాన్యుడి ఇంటి బడ్జెట్‌ను అమాంతం పెంచేసింది. కోవిడ్ ఆంక్షలకు తోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేడు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేవలం రెండు నెలల్లోనే గ్రేటర్వాసిపై పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్, ఆయిల్ ఛార్జీలు దండెత్తాయి. దీంతో నగరంలోని సామాన్యుల పరిస్థితి ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్నట్టుగా తయారైంది. స్థూలంగా లెక్కకడితే నెలకు ఒక్కో మనిషిపై ఈ చార్జీల భారం రూ.500 పెరిగిందని అంచనా వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ గ్యాస్ బండపై తాజాగా రూ.50 పెరగడంతో మూడు జిల్లాల పరిధిలో మొత్తం 26 లక్షల గ్యాస్ కనెక్షన్లకు గాను గ్రేటర్‌పై నెలకు సగటున రూ.13 కోట్ల అదనపు భారం పడింది. అదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నగరంలో సుమారు 65 లక్షల వాహనాలు ఉండగా, రోజుకు సుమారు 50 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల డీజిల్ వినియోగం ఉంటుంది. తాజాగా ధరతో పెట్రోల్ వాహనదారులపై రోజుకు సగటున రూ.95 లక్షల చొప్పున నెలకు రూ.2850 కోట్లు భారం మోపగా, డీజిల్ వాహనదారులపై రోజుకు సగటున రూ.52 లక్షల చొప్పున నెలకు రూ. 1560 కోట్ల అధనపు భారం పడింది. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం: ‘అది పేలడం వల్లే మంటలు వ్యాపించాయి’ విద్యుత్ భారం రూ.165 కోట్లు గృహ విద్యుత్‌పై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌పై యూనిట్‌కు రూ.ఒకటి చొప్పున పెంచారు. గ్రేటర్లో 55 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉండగా, నెలకు సగటున 1900 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగమవుతుంది. గృహ వినియోగ దారులపై నెలకు రూ.25 కోట్లు, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై రూ.140 కోట్ల భారం మోపింది. ఏడాదికి రూ.1980 కోట్ల అదనపు భారం తప్పడం లేదు. మధ్య తరగతి, ఉద్యోగ, వ్యాపార, ఇతర వర్గాలకు చెందిన సుమారు 16 లక్షల మందికిపైగా ప్రయాణికులు సిటీబస్సుల్లో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితంగా ప్రతి ప్రయాణికునిపై రోజుకు సగటున రూ.10 అదనపు భారం పడుతోంది. ఛార్జీల రూపంలో గ్రేటర్ వాసులపై నెలకు రూ.6 కోట్లకు పైగా భారం మోపింది. వంట నూనెల భారం నెలకు రూ.54–60 కోట్లు జనవరిలో కిలో వేరుశనగ నూనె రూ.135 ఉండగా, ప్రçస్తుతం రూ.185 చేరింది. అదే విధంగా సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ రూ.155 ఉండగా, ప్రస్తుతం రూ.190 ఎగబాకింది. అదే విధంగా పామాయిల్ కేజీ రూ.125 ఉండగా, ప్రస్తుతం రూ.150 పెరిగింది. ఒక్కో కుటుంబం నెలకు మూడు కేజీల ఆయిల్ వినియోస్తోందని అంచనా. గ్రేటర్లో సుమారు 45 లక్షల గృహాలు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన ప్రతి ఇంటికి నెలకు రూ.120–150 అదనపు భారం పడనుంది. ఇలా నెలకు సగటున రూ.54–60 కోట్ల భారం గ్రేటర్ వాసులపై పడుతోంది. ముట్టుకుంటే షాక్ కోవిడ్ కారణంగా ఉపాధి లేకుండా పోయింది. కానీ అన్ని ఛార్జీలు మాత్రం ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. ఇప్పటి వరకు నెలవారీ గృహ విద్యుత్ బిల్లు రూ.500లోపే వచ్చేది. ప్రస్తుతం డిస్కం యూనిట్‌కు రూ.50 పైసల చొప్పున పెంచడంతో ఏప్రిల్ బిల్లులో భారీ వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. – నేమాల బెనర్జీ, డిఫెన్స్ కాలనీ వంటింటికి గుదిబండ గత ఆగస్టులో గ్యాస్ సిలిండర్ ధర రూ.890 ఉండగా, అక్టోబర్ ఐదో తేదీ నాటికి రూ.915కి చేరింది. ఆ తర్వాతి రోజే అనూహ్యంగా రూ.930 కి చేరింది. మార్చి రెండో వారంలో రూ.962 ఉండగా, నాలుగు రోజుల క్రితం ఏకంగా రూ.50 పెరిగింది. ప్రస్తుతం రూ.1002కు చేరింది. ఏదైనా వంట చేయలన్నా.. వెనుకా ముందు ఆలోచించాల్సి వస్తోంది. – గుర్రం అన్నపూర్ణ, బడంగ్పేట్ బైక్ ప్రయాణం భారం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పని చేస్తున్నా. బైక్‌లో గతంలో రూ.500 పెట్రోల్ కొట్టిస్తే..వారం రోజులు వచ్చేది. ప్రస్తుతం నాలుగైదు రోజులే వస్తుంది. జీతం పెరగలేదు కానీ..పెట్రోల్ వాత మాత్రం తప్ప లేదు. – టి.తిరుమలేష్, కర్మన్‌ఘాట్ -
బీజేపీకి గ్యాస్ బండ దెబ్బ ఖాయం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఈనెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నెత్తిన గ్యాస్ సిలిండర్ దెబ్బ పడటం, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే పలు సంస్థలు, మీడియా విభాగాలు చేసిన సర్వేలు టీఆర్ఎస్ విజయం ఖాయమని తేల్చాయన్నారు. దీంతో నిరాశలో కూరుకుపోయిన బీజేపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజాసంక్షేమం, పథకాలు, అభివృద్ధి తదితర విషయాల్లో తాము ప్రజలకు చేసిన మేలును మాత్రమే చెప్పామన్నారు. కానీ.. బీజేపీ నేతలు కూల్చేస్తాం, చీల్చేస్తాం, బద్దలు కొడుతాం అంటూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించేందుకు ఏమైనా హామీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇది చాలదన్నట్లుగా నవంబరు 2వ తేదీ తరువాత సిలిండర్‌పై మరో రూ.200 పెంచబోతున్నారని ఆరోపించారు. ఈ ప్రచారం మొత్తంలో ప్రజలకు బీజేపీ ఎలాంటి హామీలు ఇవ్వకపోగా దళితబంధుపై లేఖలు రాసి ఆపేసిందని ధ్వజమెత్తారు. తాము రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో రైతు, పేదల సంక్షేమానికి పట్టం కట్టామన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం కేంద్రంలో రైతుల పాలిట శాపంగా మారిన నల్లచట్టాలను తీసుకువచ్చిందన్నారు. ఈ ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం– టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేశాయో బేరీజు వేసుకుని ఓటేయాలని కోరారు. బీజేపీ అంటే కోతలు.. వాతలే ‘బీజేపీ అంటే ప్రజా సంక్షేమ పథకాల సబ్సిడీల్లో కోతలు, ప్రజలపై పన్నుల వాతలు’అని మంత్రి హరీశ్ ఎద్దేవా చేశారు. ఈ ఏడేళ్లలో పెట్రోలు, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచి జనం నడ్డి విరిచారన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి ఉద్యోగులను రోడ్డుకీడ్చారన్నారు. కరీంనగర్–జమ్మికుంట–హుజూరాబాద్ రైల్వేలైన్‌ను ఆపివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బానిస అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఎట్లా అంటారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ బీజేపీ అహంకారానికి, బీసీలపై వ్యతిరేకతకు నిదర్శనమని విమర్శించారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వచ్చే మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టులను నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు. హుజూరాబాద్‌లో అభివృద్ధికి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. -
‘గ్యాస్ పన్ను’పై బీజేపీ అబద్ధాలు
హుజూరాబాద్/ ఇల్లందకుంట: గ్యాస్ సిలిండర్ ధరలో రాష్ట్ర ప్రభుత్వానిది 291 రూపాయల పన్ను ఉందని బీజేపీ నాయకులు అబద్ధం ఆడుతున్నారని, అది నిరూపిస్తే తాను ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరారు. జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ధూంధాం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఏడు సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు కొద్దికొద్దిగా పెంచుకుంటూ కొత్తగా 28 రూపాయలు, పాతది రూ.10 కలిపి మొత్తం లీటర్ మీద రూ.38 తీసుకుంటోందన్నారు. దమ్ముంటే కిషన్‌రెడ్డి బడ్జెట్‌కు సంబంధించిన పుస్తకాలు తీసుకొని టీవీ చానళ్లకుగానీ, బహిరంగ చర్చకుగానీ రావాలని సవాల్ చేశారు. అబద్ధాలు చెప్పే బీజేపీ కావాలా.. నమ్మకాలు నిలబెట్టే టీఆర్ఎస్ పార్టీ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులు ఇబ్బందులు పడకుండా రైతుబంధు పథకం అమలు చేశామని, టీఆర్ఎస్ హయాంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. రానున్న రోజుల్లో సొంత జాగాలు ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల 4 వేలు సాయం అందిస్తామని, మహిళలకు అభయ హస్తం డబ్బులు వడ్డీలతో చెల్లించేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు చేస్తున్నారని తెలిపారు. ‘ఈటల ఎలాగూ గెలిచేది లేదు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు’అని హరీశ్ పేర్కొన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి హరీశ్ 15 ప్రశ్నలు ‘టీఆర్ఎస్ సంపద పెంచింది. రైతుల అప్పు మాఫీ చేసింది. బీజేపీ పేద రైతుల పన్నులు పెంచి బడా పారిశ్రామిక వేత్తలకు అప్పులు మాఫీ చేసింది. హుజూరాబాద్ రైతులు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలి’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. శనివారం హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. ‘బీజేపీకి 15 ప్రశ్నలు వేస్తున్నాం. వాటికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సమాధానం ఇవ్వాలి’అని బహిరంగ లేఖ విడుదల చేసినట్లు తెలిపారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాల వల్ల సంవత్సర కాలంగా రైతులు పోరాడుతున్నారని, కానీ ఆ పార్టీకి చీమ కుట్టినంత బాధ కూడా లేదని, ఇంత క్రూరంగా ప్రవర్తించిన ప్రభుత్వం బీజేపీ తప్ప మరోటి లేదన్నారు. రైతులను లాఠీలతో చితక్కొట్టండని బీజేపీకి చెందిన హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్ అన్నారని పేర్కొన్నారు. రైతులను చితక్కొట్టండని ఆదేశించిన బీజేపీకి రైతులు ఎందుకు ఓట్లు వేయాలని కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. -
వంటింట్లో గ్యాస్ మంట
సాక్షి, హైదరాబాద్ : వంటింట్లో గ్యాస్ మంట పుట్టిస్తోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలకు అనుగుణంగా ధరలను పెంచుతుండటంతో సిలిండర్ ధర ఆకాశానికి చేరుతోంది. రెండు నెలల వ్యవధిలోనే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ. 125 మేర పెరిగింది. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రాయితీలు చెల్లించాల్సిన కేంద్రం... వాటిని ఇవ్వకపోవడంతో సామాన్యులపై మోత తప్పడం లేదు. నిజానికి గత ఏడాది నవంబర్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 646.50గా ఉండగా చమురు సంస్థలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఒక్క డిసెంబర్లోనే రూ. 100 మేర ధర పెంచాయి. దీంతో సిలిండర్ ధర రూ. 746.50కు చేరింది. జనవరిలో ఈ ధరలు స్ధిరంగా కొనసాగినా తాజాగా మరోసారి చమురు కంపెనీలు ధరను రూ. 25 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సిలిండర్ ధర రూ. 771.50కి చేరింది. కరోనా సమయానికి ముందు వరకు ఒక్కో సిలిండర్ ధరలో రూ. 520 చొప్పున వినియోగదారుడు చెల్లిస్తే ఆపై ఎంత ధర ఉన్నా ఆ సొమ్మును కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది. ఈ లెక్కన రూ. 200 నుంచి రూ. 220 వరకు తిరిగి వినియోగదారుల ఖాతాల్లో జమ అయ్యేవి. ఈ విధానాన్ని కేంద్రం తొలి రోజుల్లో విజయవంతంగా నిర్వహించినా క్రమేణా రాయితీ డబ్బుల జమను తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం రూ. 40 మాత్రమే వినియోగదారుని ఖాతాలో జమ చేస్తోంది. రాయితీల్లో భారీగా కోత పడటంతో సిలిండర్ ధర పెరిగినప్పుడల్లా ఆ భారమంతా వినియోగదారులపైనే పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.18 కోట్ల గృహావసర సిలిండర్లు వినియోగంలో ఉండగా ప్రతిరోజూ సగటున 1.20 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతోంది. పెరిగిన ధరలు, రాయితీల్లో కోతతో ఏటా రూ. వేల కోట్ల మేర సామాన్యుడిపై భారం పడుతోంది. పెట్రో ధరల దూకుడు... రాష్ట్రంలో పెట్రో ధరలు మండుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుండటంతో పెట్రోల్ ధర పది రోజుల వ్యవధిలోనే రూ. 1.27 పైసలు పెరిగింది. జనవరి 25న పెట్రోల్ ధర రూ. 89.15 ఉండగా ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రల్ ధర రూ. 90.42కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకు సగటున 13 నుంచి 15 కోట్ల లీటర్ల మేర పెట్రోల్ వినియోగం ఉంటోంది. ఈ లెక్కన పది రోజుల్లోనే వినియోగదారులపై రూ. 19 కోట్ల మేర భారం పడింది. ఇక డీజిల్ ధర సైతం పెట్రోల్‌తో పోటీ పడుతోంది. ఈ పది రోజల వ్యవధిలోనే దాని ధర సైతం రూ. 1.34 మేర పెరిగింది. గత నెల 25న లీటర్ ధర రూ. 82.80 ఉండగా అది ప్రస్తుతం రూ. 84.14కి చేరింది. -
వంటింట్లో గ్యాస్ మంట
సాక్షి,హైదరాబాద్: వంటింట్లో గ్యాస్ మంట పుట్టిస్తోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలకు అనుగుణంగా ధరలను పెంచుతుండటంతో సిలిండర్ ధర ఆకాశానికి చేరుతోంది. రెండు నెలల వ్యవధిలోనే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.125 మేర పెరిగింది. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రాయితీలు చెల్లించాల్సిన కేంద్రం... వాటిని ఇవ్వకపోవడంతో సామాన్యులపై మోత తప్పడం లేదు. గతేడాది నవంబర్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 646.50 ఉండగా.. చమురు సంస్థలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఒక్క డిసెంబర్లోనే రూ.100 మేర ధర పెంచాయి. దీంతో ధర రూ. 746.50కు చేరింది. తాజాగా మరోసారి చమురు కంపెనీలు ధరను రూ. 25 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సిలిండర్ ధర రూ.771.50కి చేరింది. కరోనా సమయానికి ముందు వరకు ఒక్కో సిలిండర్ ధరలో రూ.520 చొప్పున వినియోగదారుడు చెల్లిస్తే ఆపై ఎంత ధర ఉన్నా ఆ సొమ్మును కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది. ఈ లెక్కన రూ.200 నుంచి రూ. 220 వరకు తిరిగి వినియోగదారులకు వచ్చేవి. ఈ విధానాన్ని కేంద్రం తొలి రోజుల్లో విజయవంతంగా నిర్వహించినా క్రమేణా రాయితీ డబ్బుల జమను తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం రూ.40 మాత్రమే వినియోగదారుని ఖాతాలో జమ చేస్తోంది. పెట్రో ధరలు సైతం మండుతూనే ఉన్నాయి. -
సామాన్యుడికి షాక్ : వంట గ్యాస్ ధర పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు పెట్రో మంట, మరోవైపు వంట గ్యాస్ ధర పెంపు సామాన్య ప్రజల్లో గుండెల్లో బాంబులై పేలుతున్నాయి. దేశంలో ఇప్పటికే నింగిని తాకిన పెట్రో ధరలతో ప్రజలు నానా తంటలు పడుతుంటే తాజాగా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర సెగలు మరో షాకిచ్చాయి. బడ్జెట్ రోజు ఫిబ్రవరి 1న వంట గ్యాస్ ధరలను యథాతథంగా ఉంచినా, తాజాగా రాయితీ సిలిండర్ ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు (గురువారం)నుండి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ పరిణామంతో వంట గ్యాస్ సిలిండర్ కూడా గుదిబండగా పరిణమించింది. చమురు సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎల్పీజీ సిలిండర్ ధర తాజాగా 25 రూపాయలు పెరిగింది. వాణిజ్య సిలిండర్ ధరలను 184 రూపాయలు చొప్పున పెంచింది. ప్రస్తుత ధరల పెంపు తరువాత హైదరాబాద్‌లో వినియోగదారులు సిలిండర్‌కు రూ.771.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ధర రూ.746.50గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోలు సిలిండర్ ధర రూ .664 నుంచి రూ. 719కి పెరిగింది. కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735కి చేరింది. -
సిలిండర్ ధర మళ్లీ పెంపు!
సాక్షి, సిటీబ్యూరో: వంటగ్యాస్ ధర మళ్లీ పెరిగింది. నాలుగు నెలలుగా ధర పైపైకి వెళ్తోంది. తాజాగా సిలిండర్‌పై రూ.76 పెంచడంతో నగరంలో సిలిండర్ ధర రూ.733.50కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరగుతుండడంతో గ్యాస్‌పై ప్రభావం పడుతోంది. తాజా పెంపుతో కేవలం నాలుగు నెలల్లో రూ.105.50 పెరిగినట్లయింది. అయితే సబ్సిడీ సిలిండర్ ధరలో మాత్రం మార్పు లేదు. పెరిగిన ధరకు తగట్టుగా సిలిండర్‌పై సబ్సిడీ జమ కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో సబ్సిడీ సిలిండర్ వినియోగదారులపై నయా పైసా అదనపు భారం ఉండదు. గృహవినియోగదారులు ముందుగా డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకుంటే.. వారికి వచ్చే సబ్సిడీ తర్వాత బ్యాంక్ ఖాతాలో జమవుతున్న విషయం విదితమే. సిలిండర్ ధర పెరిగిందిలా.. నెల ధర (రూ.ల్లో) ఆగస్టు 628.00 సెప్టెంబర్ 644.00 అక్టోబర్ 657.50 నవంబర్ 733.50 -
ధర మండే.. దారి మళ్లే!
సాక్షి, సిటీబ్యూరో: ఎల్పీజీ కమర్షియల్ (వాణిజ్య) సిలిండర్ల ధర మండుతోంది. మూడు నెలల్లోనే రూ.90 పెరిగింది. ఫలితంగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1470.23కి చేరింది. దీంతో గృహావసరాలకు వినియోగించాల్సిన డొమెస్టిక్ సిలిండర్ దారి మళ్లుతోంది. హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థల అవసరాలు తీరుస్తోంది. గ్రేటర్లో పెద్ద హోటళ్లు 5వేలకు పైగా ఉండగా... చిన్న హోటళ్లు, టీ, టిఫిన్, మిర్చి సెంటర్లు దాదాపు లక్ష వరకు ఉంటాయని అంచనా. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో వాణిజ్య సిలిండర్లు వినియోగమవుతుండగా.. మిగిలిన చిన్న హోటళ్లు, టీ, టిఫిన్ సెంటర్లు, మిర్చి బండ్లు తదితరాల్లో డొమెస్టిక్ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి. ఈ లెక్కన ప్రతిరోజు లక్ష వరకు డొమెస్టిక్ సిలిండర్లు దారి మళ్లుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక టాస్క్‌పోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), పోలీసులు అప్పుడప్పుడు చేసే తనిఖీల్లో ఈ అక్రమదందా వెలుగుచూస్తూనే ఉంది. కానీ వంటగ్యాస్ అమలుతీరును పర్యవేక్షించాల్సిన పౌరసరఫరాల శాఖ నిద్రమత్తులో ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. ఫిర్యాదులు వస్తే గానీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం ఆ శాఖ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. కనెక్షన్లు 60 వేలే... గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి మూడు చమురు సంస్థలకు సంబంధించి మొత్తం వాణిజ్య కనెక్షన్లు 60 వేలకు మించిలేవని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు వాణిజ్య సిలిండర్ ధర అధికంగా ఉండడం, డొమెస్టిక్‌ది తక్కువ ఉండడంతో... వ్యాపారులు వీటిపైనే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో డొమెస్టిక్ కనెక్షన్లు 26.21 లక్షల వరకు ఉంటాయి. నగరంలో మొత్తం 135 ఎల్పీజీ ఏజెన్సీలు ఉండగా.. ప్రతిరోజు 1.50 లక్షల వరకు డొమెస్టిక్ సిలిండర్లు అవసరం ఉంటాయి. కానీ ప్రస్తుతం 60 వేలకు మించి డోర్ డెలివరీ కావడం లేదని తెలుస్తోంది. కానీ వాణిజ్య అవసరాలకు మాత్రం కొరత లేకుండా బ్లాక్ మార్కెట్లో లభిస్తుండడం గమనార్హం. ఇక 5కిలోల సిలిండర్ ధర కూడా భారీగా ఉంటోంది. దీని ధర బహిరంగ మార్కెట్లో రూ.417.78 ఉండగా.. బ్లాక్ మార్కెట్లో రూ.800 ఉంది. ఎంతోమంది నిరుద్యోగులు, చిన్నాచితక ఉద్యోగులు, విద్యార్థులు నగరానికి వచ్చి ఉంటున్నారు. వీరంతా ఈ చిన్న సిలిండర్లపైనే ఆధారపడి ఉంటారు. వీటికి అధికారికంగా కనెక్షన్లు లేని కారణంగా బ్లాక్‌లోనే గ్యాస్ నింపుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ఇష్టానుసారంగా వసూల్ చేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర పెరిగిందిలా... మార్చి రూ.1,380.87 ఏప్రిల్ రూ.1,448.50 మే రూ.1,470.23 గ్రేటర్లో ఎల్పీజీ ధరలు ఇలా... సిలిండర్ ప్రభుత్వ ధర బ్లాక్ మార్కెట్ ధర 14.2 కిలోల డొమెస్టిక్ రూ.768.36 రూ.1,000 19 కిలోల కమర్షియల్ రూ.1,470.23 రూ.1,600 5 కిలోల సిలిండర్ రూ.417.78 రూ.800 -
సిలిండర్ ధర... పేలుతోంది
తూర్పుగోదావరి,కాకినాడ సిటీ: అక్టోబర్ నెలలో మళ్లీ రూ.2.94 ధర పెరగడంతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1010కి చేరింది. సిలిండర్ ధర ఇంత భారీగా పెరగడం ఇదే ప్రథమం. అదే పనిగా సిలిండర్ ధర ప్రతి నెలా పెరుగుతుండడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం నుంచి వివిధ గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్ సరఫరాకు ప్రస్తుతం ధర రూ.980, ఇతర ఛార్జీలు రూ.30 కలిపి రూ.1010కి చేరింది. రోజు రోజుకూ పెరుగుతున్న వంట గ్యాస్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. జిల్లాలో 79 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. ఈ ఏజెన్సీల్లో 15,89,740 మంది వినియోగదారులున్నారు. వీరిలో ‘దీపం పథకం’ ద్వారా వంట గ్యాస్‌నువాడుతున్న పేదలు 8 లక్షల 92వేల మందికి పైగా ఉన్నారు. తాజాగా పెరిగిన ధరతో రూ.614 సబ్సిడీ సిలిండర్‌కు వినియోగదారులు చెల్లించాల్సి వస్తోంది. 2014తో పోలిస్తే రూ.216 అధికం. సబ్సిడీయేతర సిలిండర్ వినియోగదారులు రూ.980 ఖర్చు చేయాల్సి వస్తోంది. సరఫరా చేసినందుకు ఏజెన్సీని బట్టి రూ.30 నుంచి రూ.60 వరకూ ఇవ్వాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. తప్పని వాతలు... జీఎస్టీ అమలు చేస్తున్న సమయంలో వంట గ్యాస్‌పై పన్ను విధించేదిలేని కేంద్రం మాట ఇచ్చింది. దీంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సబ్సీడీ సిలిండర్‌పైనే ప్రతి నెలా ధర పెంచుతూ ప్రజలపై మోయలేని భారం వేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలే నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్నంటుతున్న తరుణంలో వంట గ్యాస్ ధరలు సైతం అమాంతం పెరుగుతుండడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపం పథకం అంటూ అందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఇలా మంటలు పెట్టడం సరికాదని వాపోతున్నారు. ఇలాగే పెంచుకుంటూ పోతే కట్టెల పొయ్యిమీదే వంట చేయాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 216 పెంపు... ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 216 గ్యాస్ ధర పెరిగింది. 2014లో రూ.414 ఉంటే ప్రస్తుతం సబ్సిడీతో వినియోగదారులు రూ.630 చెల్లించాల్సి వస్తోంది. సబ్సిడీ పూర్తిగా తొలగించుకునేందుకు ప్రభుత్వం ధరలు పెంచుతోందని ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. అసలే పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యుడిపై గుదిబండలా మారగా గ్యాస్ ధరలు కూడా పెరగడంతో విలవిల్లాడుతున్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలి... గ్యాస్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఇలా అయితే సామాన్యులు ఎలా బతకాలి. నిత్యావసర ధరలూ ఆకాశన్నంటిన నేపథ్యంలో గ్యాస్ సైతం పెరగడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి ధర తగ్గించాలి. – వై. దుర్గాభవాని, ఉండూరు సబ్సిడీ వెంటనే జమ చేయాలి గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిలిండరుకు ప్రభుత్వం చెల్లించే సబ్సిడీ నెలల తరబడి వినియోగదారుల ఖాతాలకు జమ కావడం లేదు. సిలిండరు కొనుగోలు చేసిన వెంటనే సబ్సిడీ జమ చేస్తే కొంత మేర ఆర్థిక భారం తగ్గుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.– కెఎస్ శ్రీనివాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి -
గ్యాస్ సిలిండర్ ధర రూ.86 పెంపు
-
గ్యాస్ సిలిండర్ ధర రూ.86 పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సబ్సిడీయేతర వంటగ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ.86 పెంచాయి. దీంతో ఏడాదిలో 12 సబ్సిడీ సిలిండర్ల కోటా పూర్తిచేసుకున్న వారు, సబ్సిడీని వదులుకున్న వారు ఇకపై ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్‌కు రూ.737.50 చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరను కూడా చమురు కంపెనీలు 13 పైసలు పెంచాయి. దీంతో 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర 434.93కి చేరింది. విమానయాన రంగంలో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) ధరను కిలో లీటర్‌కు రూ.214 పెంచారు. దీంతో ఇది రూ.54293.38కి చేరింది. మార్చి 1 నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. -
ఈ సర్కారుపై బండేస్తాం..
‘ఈ ప్రభుత్వాలకు పేదళ్ల బాగోగులు పట్టవు. వాళ్లు ఎట్టా సస్తేనేం.. మనం బాగుంటేసాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వ పెద్దలు.. మీ మొహాలకు గ్యాసు పొయ్యి కావాల్సి వచ్చిందా అనుకునే కాబోలు ఇలా ధర పెంచేత్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలపై బండ పడేయండ’ని మహిళలు నిప్పులు చెరిగారు. వంట గ్యాస్ సిలిండ్ ధర భారీగా పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం అనంతపురంలో కట్టెల పొయ్యి వెలిగించి ‘స్త్రీ విముక్తి సంఘటన’ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. - న్యూస్‌లైన్, అనంతపురం -
గ్యాస్ ధర పెంపుపై మిన్నంటిన ఆందోళనలు
వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో ఆందోళన సీపీఎం, టీడీపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం కర్నూలు, న్యూస్‌లైన్: గ్యాస్ సిలిండర్ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజకీయ పక్షాలు భగ్గుమన్నాయి. నిత్యావసర ధరలతో అల్లాడుతున్న సామాన్య జనంపై అదనపు భారాన్ని మోపడంపై సర్వత్రా నిరసన వెల్లువెత్తింది. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ ఆధ్వర్యంలో కర్నూలులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక వైఎస్సార్ విగ్రహం దగ్గర ఖాళీ సిలిండర్లతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణమ్మ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో వంట గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచినప్పటికీ ఆ భారాన్ని ప్రజలపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని గుర్తు చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసమే మహానేత ఆనాడు అదనపు భారాన్ని భరించినట్లు గుర్తు చేశారు. అలాగే సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో పూల బజార్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే రద్దు చేయకపోతే యూపీఏ-2 ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పత్తికొండలో సీపీఎం ఆధ్వర్యంలో నాలుగు స్తంభాల వద్ద ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నందికొట్కూరులో సీపీఎం కార్యాలయం నుంచి తహశీల్దారు కార్యాలయం వరకు పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. తనిఖీ నిమిత్తం వెళ్లిన కర్నూలు ఆర్డీఓ కూర్మానాథ్‌కు వినతి పత్రాలు సమర్పించారు. ఆలూరులో టీడీపీ మండల కన్వీనర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
జనంపై గ్యాస్ ‘బండ’!
దేనికైనా సమయమూ, సందర్భమూ ఉండాలంటారు. యూపీఏ ప్రభుత్వానికి ఆ ఔచిత్యం కూడా లోపించింది. గత ఏడాది ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని అలసి సొలసి... కనీసం భవిష్యత్తు అయినా బాగుండాలని అందరూ ఆకాంక్షించే నూతన సంవత్సరాగమన వేళ వంటగ్యాస్ ధరను భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. సామాన్యుడి పేరు చెప్పుకుని అధికారంలోకొచ్చిన కేంద్ర సర్కారు సబ్సిడీ సిలెండరు, సబ్సిడీయేతర సిలెండరు అంటూ రెండు రకాలను సృష్టించి వాటికి చెరో రకం ధరనూ అమల్లోకి తెచ్చి...వాటిని క్రమబద్ధంగా పెంచుతూ జన జీవితాలతో ఆటలాడుకోవడం మొదలుపెట్టి చాన్నాళ్లయింది. నొప్పి తెలియకుండా చావబాదడానికి ఎంచుకున్న ఈ మార్గంలో సామాన్య వినియోగదారులు దేని ధర ఎంత పెరిగిందో, తమ జేబులు ఇకపై ఏమేరకు ఖాళీ కాబోతున్నాయో తెలుసుకోలేక అయోమయంలో పడతారని... తీరా గ్యాస్ బండ ఇంటికొచ్చి తలుపు తట్టేవేళకు అంతా అర్ధమై చ చ్చినట్టు చెల్లిస్తారని ఏలినవారి అంచనా. ఇప్పుడు సబ్సిడీయేతర సిలిండరు ధర ఒకేసారి రూ. 215 మేర పెరిగింది. అంటే, ఇంతవరకూ రూ. 1,112.50 ఉన్న సిలెండరును ఇకపై రూ. 1,327.50 పెట్టి కొనుక్కోవాలన్న మాట! సబ్సిడీ సిలిండరు ధరను రూ. 10 పెంచారు. గత జూన్ వరకూ సబ్సిడీ సిలిండర్లపై పరిమితి ఉండేది కాదు గనుక సబ్సిడీయేతర సిలిండరు ధర ఎంత పెరిగినా ఎవరికీ పట్టేది కాదు. అటు తర్వాత నగదు బదిలీ పథకాన్ని అమల్లోకి తెచ్చి సబ్సిడీ సిలిండర్లను ఏడాది కాలంలో తొమ్మిది మాత్రమే ఇస్తామని ప్రకటించాక ‘గ్యాస్ మంట’ అందరినీ తాకడం మొదలైంది. పదో సిలిండరుతో మొదలై ఇక ఏడాదికాలంలో ఎన్నయితే అన్నీ దాదాపు మూడురెట్ల ధర చెల్లించి కొనాల్సిందేనని చెప్పడంవల్ల మధ్యతరగతి, పేదవర్గాల ప్రజలు అల్లల్లాడుతున్నారు. వాస్తవానికి పదో సిలిండరునుంచి మాత్రమే సబ్సిడీయేతర ధర వర్తిస్తుందని చెప్పడం అర్ధ సత్యం మాత్రమే. ఎంపికచేసిన కొన్ని జిల్లాల్లో ఆధార్ కార్డున్న వారికే నగదు బదిలీ పథకం వర్తింపజేస్తామని, సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఆధార్ కార్డు కోసం వివరాలు అందించినా ఆ కార్డులు రానివారున్నారు. అలాగే, అసలు నమోదే చేయించుకోలేనివారున్నారు. బ్యాంకు ఖాతాలు ప్రారంభించలేని అశక్తతలో ఉన్నవారున్నారు. ఆధార్ కార్డు లేని ఎల్పీజీ కనెక్షన్లను బోగస్ అని నిర్ధారించడానికి, సబ్సిడీ ఎగ్గొట్టడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 28.29 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లుండగా అందులో 9.03 లక్షల మందికి సబ్సిడీ వర్తించడంలేదు. ఇలాంటివారంతా ఏ క్యాటగిరీలతో సంబంధం లేకుండా ఇప్పుడు అధిక మొత్తం చెల్లించి సిలిండర్లు కొనుక్కోవాల్సి వస్తోంది. ఇక ఆధార్ కార్డు ఉన్నా పదో సిలిండరును అత్యధిక ధర చెల్లించి తీసుకోవడం చాలామందికి కష్టమవుతున్నది. ఒక్కసారి అంత మొత్తం ఇవ్వడం అరకొర వేతనాలపైనా, జీతాలపైనా ఆధారపడే కుటుంబాలకు ఎంత కష్టమో పాలకులకు అర్ధం కావడం లేదు. నెలకు సంపాదించే మొత్తంలో దాదాపు 20 శాతం ఒక్క సిలిండరుకే ఖర్చయిపోతుంటే ఆ కుటుంబాలు ఇక ఏం వండుకోవాలి? ఏం తినాలి? పోనీ, ఏదోవిధంగా అంత సొమ్ము చెల్లించి సిలిండరు సుకుంటున్నవారికి వెనువెంటనే ఖాతాల్లోకి ఆ మొత్తం బదిలీ కావడంలేదు. తీసుకున్న ఎన్నో నెలలకు డబ్బులు వస్తున్నవారు కొందరైతే, ఎంతకాలమైనా రానివారు కూడా ఉంటున్నారు. అసలు సిలిండరు తీసుకోనివారికి సైతం ‘మీ ఖాతాలోకి సబ్సిడీ సొమ్ము బదిలీ అయింద’ంటూ ఎస్సెమ్మెస్‌లు వస్తున్నాయి. ఇది సరిగాలేదని అర్ధమై ఆధార్ గడువును కేంద్రం ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ పోతున్నది. ఇంత నాసిరకంగా, ఇంత అస్తవ్యస్థంగా అమలవుతున్న నగదు బదిలీ పథకాన్ని చూపించి, చిత్తమొచ్చినట్టు ధరలు పెంచుకుంటూ పోవడం ఆశ్చర్యకలిగిస్తుంది. వాణిజ్యావసరాల కోసం వినియోగించే సిలిండరు ధర రూ. 1882.50 ఒక్కసారిగా రూ. 2,268కి పెరిగింది. ఈ భారం కూడా అంతిమంగా సాధారణ ప్రజానీకంపైనే పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా దాదాపు 15 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని అంచనా. మన రాష్ట్రంలో ఈ సంఖ్య కోటి 60 లక్షలుంటుందని గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 55 శాతం కుటుంబాలు ఏడాదికి తొమ్మిది సిలిండర్లను మించి వినియోగిస్తాయని నిపుణుల అంచనా. ఇలా చూస్తే ప్రజలపై ఎన్నివందల కోట్ల అదనపు భారం పడిందో అర్ధం చేసుకోవచ్చు. కేంద్రం నిర్ణీత కాలవ్యవధిలో ప్రజలపై మోపే భారంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా వ్యాట్ రూపంలో అదనంగా వడ్డిస్తోంది. ఇదంతా సామాన్యులకు తడిసిమోపెడవుతున్నది. సామాన్యులెదుర్కొంటున్న ఇబ్బందులపై అవగాహన ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలా భారం పడిన సందర్భంలో తానే కాపుగాశారు. కేంద్రం సిలిండర్ ధరను రూ. 50 పెంచినప్పుడు ఆ పెరిగిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్వీకరిస్తుందని ప్రకటించిన పెద్ద మనసు ఆయనది. ఆ పెంపును రూ. 25కు తగ్గించాక కూడా ఆయన దాన్ని కొనసాగించారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఆ సబ్సిడీని ఎత్తేయడమే కాదు...అదనంగా వ్యాట్ భారం మోపింది. వంటగ్యాస్, ఇతర పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచే ప్రక్రియలో పారదర్శకతకు కాస్తయినా చోటివ్వాలని పాలకులకు తోచడంలేదు. చమురు సంస్థలను ముందుకు తోసి సాగిస్తున్న ఈ తతంగంలో పైకి కనబడని కంతలు చాలా ఉన్నాయి. సుంకాల పేరుమీదా, పన్నులపేరుమీదా అటు కేంద్రమూ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలూ నిలువుదోపిడీ చేస్తూ... కేవలం సబ్సిడీల కారణంగానే చమురు కంపెనీలకు నష్టం వచ్చిపడిపోతున్నట్టు నాటకాలాడుతున్నాయి. ఇలాంటి కపటనాటకాలకు ప్రభుత్వాలు ఇక స్వస్తి చెప్పి పెంచిన భారాన్ని వెంటనే తగ్గించాలి. లేదంటే ప్రజాగ్రహాన్ని అవి చవిచూడక తప్పదు. -
ధర గడువు పెంపు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్యాస్ వినియోగదారులతో కేంద్ర ప్రభుత్వం, ఇంధన సంస్థలు ఆడుకుంటున్నాయి. కొత్త సంవత్సర కానుకగా గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయగా, ఇదే సమయంలో చడీచప్పుడు లేకుండా గ్యాస్ సిలెండర్ ధరను ఉత్పత్తి సంస్థలు ఒకేసారి రూ.217 మేరకు పెంచేశాయి. ఈ నిర్ణయాలు అంతిమంగా ఆధార్ అనుసంధానం చేసుకున్న వారికే ఎక్కువ నష్టం కలుగజేస్తున్నాయి. జిల్లాలో గ్యాస్‌తో ఆధార్ అనుసంధానానికి డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. అప్పటివరకు అనుసంధానం చేసుకోనివారికి సబ్సిడీ పోగా రూ.419కి సిలెండర్ సరఫరా చేస్తున్నారు. అనుసంధానం చేసుకున్న వారు మాత్రం సిలెండర్‌కు మొదట రూ.1109 చెల్లిస్తే.. ఆ తర్వాత వారి బ్యాంకు ఖాతాకు రూ.614 సబ్సిడీ మొత్తం జమ చేస్తున్నారు. ఈ లెక్కన వారు సిలెండర్‌కు మిగతావారి కంటే అదనంగా రూ.152 భరిస్తున్నారు. తాజాగా రూ.217 పెంచడంతో సిలెండర్ ధర రూ.1326కు చేరింది. పెరిగిన ధర ప్రకారం సబ్సిడీ కూడా పెరిగి బ్యాంకు ఖాతాల్లో రూ.800 మేరకు జమ అవుతుందంటున్నారు. అదే సమయంలో అనుసంధానం చేసుకోని వారికి ఈ పెరుగుదల రూ.25 మాత్రమే. ఇప్పటివరకు రూ.419 చెల్లించిన వీరు ఇక నుంచి రూ.444 చెల్లించాల్సి ఉంటుంది. పైగా అనుసంధానం చేసుకోవడానికి మరో రెండు నెలల అవకాశం లభించడంతో అప్పటివరకు ధర పెరగకుండా ఉంటే ఈ సబ్సిడీ రేటే వర్తిస్తుంది. దీంతో ఎలా చూసినా ప్రభుత్వ సూచన మేరకు ముందుగానే అనుసంధానం చేసుకున్న వారే ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో 2.92 లక్షల మంది వంటగ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 80 శాతం మందే ఆధార్ అనుసంధానం చేయించుకున్నారు. ఇంకా సుమారు 60 వేల మంది మిగిలిపోవడంతో డిసెంబర్ 31తో ముగిసిన గడువును కేంద్రం ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. ఇది వీరికి ఉపయుక్తంగానే ఉన్నా.. అనుసంధాన చేసుకున్న వారు ధర పెరుగుదలతో బెంబేలెత్తుతున్నారు. సిలెండర్ విడిపించుకున్నప్పుడు పూర్తి మొత్తం చెల్లిస్తున్నప్పటికీ సబ్సిడీ మొత్తం బ్యాంకు ఖాతాలకు సక్రమంగా జమ కావడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బ్యాంకుల చుట్టూ, గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. దీనికి తోడు ధర ఎప్పటికప్పుడు పెంచేస్తుండటంతో ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. మరోవైపు డెలివరీ చార్జీల పేరిట కొంతమంది డెలివరీ బాయ్స్ అదనపు సొమ్ము గుంజుతున్నారని ఆరోపిస్తున్నారు.