సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినందున ఆయిల్ కంపెనీలకు నష్టం వచ్చిందంటూ రూ. 22 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోదీ... సబ్సిడీలు ఎత్తేసి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ద్వారా ఆడబిడ్డలపై మోపిన భారానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఎందుకు ఇవ్వరని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె. తారక రామారావు ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం ఆడబిడ్డలపై మోపిన రూ. 42 వేల కోట్ల గ్యాస్ సిలిండర్ భారానికిగాను తగిన పరిహారం చెల్లించాలని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు.
2014కు ముందు కేవలం రూ. 400గా గ్యాస్ సిలిండర్ ధర ఉంటేనే అప్పటి ప్రధానిపై విమర్శలు చేసిన మోదీ... అడ్డగోలుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినందుకు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. మోదీ ప్రధాని కాకముందు రూ. 400 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1,100 దాటి పరుగులు తీస్తోందని, అప్పుడు రూ. 827 ఉన్న సబ్సిడీ ఇప్పుడు గుండుసున్నా అయిందని విమర్శించారు. కేవలం గత రెండేళ్లలోనే రూ. 42 వేల కోట్ల భారం మోపిన మోదీ సిలిండర్ ధర విశ్వగురువుగా నిలిచారని ఎద్దేవా చేశారు. మోదీ నిర్వాకం కారణంగా దేశంలోని 2.11 కోట్ల మంది వినియోగదారులు కనీసం ఒక్క సిలిండర్ కూడా తీసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెట్టడాన్నే ఆశయంగా మార్చుకున్న మోదీకి ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప దేశంలోని ఆడబిడ్డల కష్టాలు కనిపించవా? అని ప్రశ్నించారు. ఆర్థిక సాయం కేవలం ఆయిల్ కంపెనీలకేనా, ఆడబిడ్డలపై కనికరం లేదా నిలదీశారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్యపు బీజేపీ పాలనలో ధరలు దండయాత్ర చేస్తూ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని తెలిపారు. దేశ ప్రజలపై మోయలేని భారం మోపే వాడే మోదీ అని మహిళా లోకం భావిస్తోందన్నారు. మోదీ కావాలో, సబ్సిడీ కావాలో దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన తరుణం ఇదేనన్నారు.
మహిళాలోకంపై బీజేపీకి చులకన భావం ఉందని, ఏడాదికి మూడు సిలెండర్లు సరిపోవా? అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ అంటేనే భారమంతా జనంపై మోపే పార్టీగా మారిందని ఎద్దేవా చేసిన కేటీఆర్... బిహార్, బెంగాల్‌ల నుంచి కాదని, వంటింటి నుంచే బీజేపీ పతనం ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. మహిళలు తలుచుకుంటే బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని, గ్యాస్ ధరల భారాన్ని ఇక సహించలేమని మహిళలు తీర్మానాలు చేయాలని, సబ్సిడీలకు సర్వమంగళం పాడిన బీజేపీని తరిమికొట్టాలని కేటీఆర్ ఆ ప్రకటనలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment