మణికొండ: హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన 150 ఎకరాల రక్షణ భూమిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వచ్చే లోపు తీపికబురు చెప్పాలని ఐటీ, పట్టణాభి వృద్ధిశాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. అలా చేయలేదంటే ప్రజల వద్దనే తేల్చుకుంటామని స్పష్టంచేశారు. నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలో రూ.29.50 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన ఔటర్‌రింగ్ రోడ్డు ఇంటర్‌చేంజ్‌ను ఆయన ప్రారంభించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసి జూబ్లీబస్ స్టేషన్ నుంచి షామీర్‌పేట, కండ్లకోయ, సుచి త్ర సర్కిల్ వరకు 36 కి.మీ. స్కైవే, మెహిదీ పట్నంలో స్కైవాక్, అత్తాపూర్, మణికొండల లో లింక్‌రోడ్ల నిర్మాణాలకు రక్షణ భూములను ఇవ్వాలని కోరామన్నారు. మరో వారం రోజుల్లో ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తున్న ట్టు తెలిసిందని, అంతలోపు రక్షణశాఖ మంత్రి, అధికారులకు ఆదేశాలు ఇచ్చి భూములను బదలాయించాలని కోరారు.
పలుచోట్ల రక్షణ శాఖకు చెందిన 150 ఎకరాలు హైదరాబాద్ అభివృద్ధికి అవసరం పడుతోందని, దానికి బదులుగా శామీర్‌పేటలో 500 ఎకరాల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినా, ఎస్టీపీలు కట్టినా ఎలాంటి సహాయం చేయటం లేదన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలని, మిగతా సమయాల్లో అభివృద్ధి, ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి పి.సబితారెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ పాల్గొన్నారు.
విశ్వనగరంగా అభివృద్ధి
హైదరాబాద్‌కు మరిన్ని హంగులు కల్పించి విశ్వనగరంగా మార్చేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే నెలలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేస్తున్న సైకిల్ ట్రాక్, కోకాపేట, మల్లంపేటలలో మరో రెండు ఔటర్ ఇంటర్‌చేంజ్‌లను ప్రారంభిస్తామన్నారు.
నార్సింగి ఇంటర్‌చేంజ్ వల్ల నార్సింగి, మెహిదీపట్నం, గండిపేట, కోకాపేట, శంకర్‌పల్లి ప్రజలు ఔటర్‌రింగ్ రోడ్డు ఎక్కే అవకాశం సమీపంలోనే ఏర్పడిందన్నారు. రాబోయే రోజుల్లో మూసీనదిని శుద్ధి చేయడంతోపాటు దాని వెంట నార్సింగి నుంచి నాగోల్ వరకు 55 కి.మీ. మేర రూ.10వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తామని వెల్లడించారు.
వందశాతం శుద్ధీకరణ
వందశాతం మురుగునీటి శుద్ధీకరణను వచ్చే సెప్టెంబర్ వరకు పూర్తి చేసి దేశంలోనే మొదటి నగరంగా హైదరాబాద్‌ను నిలుపుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కోకాపేటలో ఆయన రూ.66.15 కోట్లతో జలమండలి ఏర్పాటు చేసిన అధునాతన 15 ఎంఎల్‌డీల ఎస్టీపీని ప్రారంభించిన. అనంతరం మాట్లాడారు.
వంద శాతం మురుగునీటిని శుద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందులో మొదటి అడుగు కోకాపేటలో వేశామన్నారు. రూ.3,866 కోట్లతో 31 చోట్ల 1200 ఎంఎల్‌డీల ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నామని వాటిని సెప్టెంబర్‌కల్లా ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో రోజూ 2వేల ఎంఎల్‌డీల మురికినీరు ఉత్పత్తవుతోందన్నారు. దేశంలో ఏ మహానగరంలో కూడా 30 నుంచి 40 శాతం మురుగునీటి శుద్ధి జరగటం లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment