గ్యాస్ సిలిండర్ ధర రూ.86 పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సబ్సిడీయేతర వంటగ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ.86 పెంచాయి. దీంతో ఏడాదిలో 12 సబ్సిడీ సిలిండర్ల కోటా పూర్తిచేసుకున్న వారు, సబ్సిడీని వదులుకున్న వారు ఇకపై ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్‌కు రూ.737.50 చెల్లించాల్సి ఉంటుంది.
సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరను కూడా చమురు కంపెనీలు 13 పైసలు పెంచాయి. దీంతో 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర 434.93కి చేరింది. విమానయాన రంగంలో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) ధరను కిలో లీటర్‌కు రూ.214 పెంచారు. దీంతో ఇది రూ.54293.38కి చేరింది. మార్చి 1 నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.