
న్యూయార్క్: కొన్నేళ్లుగా నిరవధికంగా మెరుస్తున్న పసిడి తాజాగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లలో తొలిసారి ఔన్స్(31.1 గ్రాములు) 3,000 డాలర్ల మైలురాయిని అధిగమించింది. తద్వారా వారాంతాన సైతం బులియన్ మార్కెట్ కళకళలాడుతోంది. న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్చంజీ(కామెక్స్)లో 3 శాతం బలపడి 3,001 డాలర్లకు చేరింది. ఒకానొక దశలో 3,017 డాలర్ల గరిష్టాన్ని కూడా తాకింది.
ఈ ప్రభావం దేశీయంగా నేడు(శనివారం) ఆభరణ మార్కెట్లో ప్రతిఫలించనున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి తరతరాలుగా రక్షణాత్మక పెట్టుబడి సాధనంగా తళతళలాడుతున్న బంగారం మరోసారి ప్రపంచ అనిశ్చి తులలో బలాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలియజేశాయి. గత 25ఏళ్లలో చూస్తే పసిడి 10 రెట్లు జంప్‌చేసింది. తద్వారా యూఎస్ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ ఎస్‌అండ్‌పీ–500ను సైతం మించి ర్యాలీ చేయడం గమనార్హం.
ర్యాలీ తీరిలా
గోల్డ్ ఔన్స్ ధర తొలుత 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తదుపరి 1,000 డాలర్ల మార్క్‌ను అధిగమించింది. తదుపరి కరోనా మహమ్మారి కాలంలో 2,000 డాలర్ల మైలురాయిని తాకింది. తిరిగి 2023, 2024లలో పరుగందుకుంది. ప్రధానంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు డాలర్లకు బదులుగా బంగారాన్ని భారీ స్థాయిలో కొనుగోలు చేస్తుండటం ధరల నిరంతర ర్యాలీకి దోహదపడుతున్నట్లు బులియన్ వర్గాలు తెలియజేశాయి. గతేడాది చివర్లో యూఎస్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ ఎన్నికయ్యాక పసిడి మరింత దూకుడు చూపుతోంది. 2024లో 26 శాతం బలపడగా.. 2025లోనూ ఇప్పటివరకూ 14%
పెరగడం విశేషం!
20 ట్రిలియన్ డాలర్లు
గత మూడేళ్లుగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు పుత్తడిలో కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో 2022, 2023, 2024లో 1,000 మెట్రిక్ టన్నులు చొప్పున సొంతం చేసుకున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా పసిడి మార్కెట్ విలువ 20.2 ట్రిలియన్ డాలర్లను తాకగా.. గత 13 నెలల్లోనే 7 ట్రిలియన్ డాలర్ల విలువ జత కలిసింది. యూఎస్ లిస్టెడ్ టాప్–10 దిగ్గజాలు యాపిల్, ఎన్‌విడియా, మైక్రోసాఫ్ట్, మెటా తదితరాల మార్కెట్ విలువసహా.. బిట్‌కాయిన్, సిల్వర్‌ను సైతం పరిగణిస్తే మొత్తం విలువ 19.6 ట్రిలియన్ డాలర్లు మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment