న్యూయార్క్/ ముంబై: దేశ, విదేశీ మార్కెట్లో గత వారం చివర్లో పతన బాటలో సాగిన బంగారం, వెండి ధరలు కోలుకున్నాయి. సెకండ్‌వేవ్‌లో భాగంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉండటంతో పసిడికి డిమాండ్ కనిపిస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు.. ఇటీవల బంగారం డెరివేటివ్ మార్కెట్లో భారీ అమ్మకాలు చేపట్టిన ట్రేడర్లు స్క్వేరప్ లావాదేవీలు చేపట్టడం ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశాయి. దేశీయంగా నవంబర్ నెలలో బంగారం ధరలు రూ. 2,500 నష్టపోయినట్లు ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు. కోవిడ్-19 కల్లోలం కారణంగా ఈ ఏడాది ఆగస్ట్‌లో 10 గ్రాముల బంగారం రూ. 56,200కు చేరడం ద్వారా చరిత్రాత్మక గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. కాగా.. కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు వెలువడనుండటం, అమెరికా కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించనుండటం వంటి అంశాలు పసిడి ధరలకు చెక్ పెట్టే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా..
లాభాలతో
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 108 పుంజుకుని రూ. 47,900 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 48,272 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 47,900 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 608 బలపడి రూ. 59,730 వద్ద కదులుతోంది. తొలుత రూ. 60,000 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 59,512 వరకూ వెనకడుగు వేసింది.
బలపడ్డాయ్..
న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు తాజాగా బలపడ్డాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.5 శాతం పెరిగి 1,790 డాలర్లను తాకింది. స్పాట్ మార్కెట్లోనూ 0.5 శాతం పుంజుకుని 1,786 డాలర్లకు చేరింది. వెండి మరింత అధికంగా 1.5 శాతం ఎగసి ఔన్స్ 22.94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment