New York Commodity Exchange
-
కోలుకున్న పసిడి, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై: దేశ, విదేశీ మార్కెట్లో గత వారం చివర్లో పతన బాటలో సాగిన బంగారం, వెండి ధరలు కోలుకున్నాయి. సెకండ్‌వేవ్‌లో భాగంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉండటంతో పసిడికి డిమాండ్ కనిపిస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు.. ఇటీవల బంగారం డెరివేటివ్ మార్కెట్లో భారీ అమ్మకాలు చేపట్టిన ట్రేడర్లు స్క్వేరప్ లావాదేవీలు చేపట్టడం ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశాయి. దేశీయంగా నవంబర్ నెలలో బంగారం ధరలు రూ. 2,500 నష్టపోయినట్లు ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు. కోవిడ్-19 కల్లోలం కారణంగా ఈ ఏడాది ఆగస్ట్‌లో 10 గ్రాముల బంగారం రూ. 56,200కు చేరడం ద్వారా చరిత్రాత్మక గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. కాగా.. కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు వెలువడనుండటం, అమెరికా కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించనుండటం వంటి అంశాలు పసిడి ధరలకు చెక్ పెట్టే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా.. లాభాలతో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 108 పుంజుకుని రూ. 47,900 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 48,272 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 47,900 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 608 బలపడి రూ. 59,730 వద్ద కదులుతోంది. తొలుత రూ. 60,000 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 59,512 వరకూ వెనకడుగు వేసింది. బలపడ్డాయ్.. న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు తాజాగా బలపడ్డాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.5 శాతం పెరిగి 1,790 డాలర్లను తాకింది. స్పాట్ మార్కెట్లోనూ 0.5 శాతం పుంజుకుని 1,786 డాలర్లకు చేరింది. వెండి మరింత అధికంగా 1.5 శాతం ఎగసి ఔన్స్ 22.94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
కరోనా భయాలకు బంగారం రక్ష
న్యూఢిల్లీ: అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా పసిడి సరికొత్త రికార్డులవైపు దూసుకుపోతోంది. న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్–నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ఔన్స్ (31.1 గ్రా) ధర బుధవారం ఒక దశలో 2,058 డాలర్లకు పెరిగింది. గత ముగింపుతో పోల్చితే దాదాపు 50 డాలర్లు అధికం. ఈ వార్తరాసే 9 గంటల సమయంలో ధర 2,048 డాలర్ల వద్ద (2 శాతం అప్) ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ఇది సరికొత్త రికార్డు కావడం గమనార్హం. తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన జూలై 27 తర్వాత కేవలం కొద్దిరోజుల్లోనే పసిడి 2,050 డాలర్లను దాటేయడం గమనార్హం. పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,428 డాలర్లు. కరోనా నేపథ్యం... పసిడి అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. పసిడి అంతర్జాతీయ డిమాండ్ సైతం ఏప్రిల్–జూన్ మధ్య 11 శాతం పడిపోయినా ( 1,136.9 టన్నుల నుంచి 1,015.7 టన్నులకు )పెట్టుబడులకు సంబంధించి డిమాండ్ మాత్రం భారీగా పెరగడం గమనార్హం. ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ విషయంలో డిమాండ్ 300 శాతం పెరిగి 76.1 టన్నుల నుంచి భారీగా 434.1 టన్నులకు చేరడం గమనార్హం. కారణాలను చూస్తే... ► ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ ► కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం ► ఆర్థిక అనిశ్చితి ► అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత ► వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం ► అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.25 శాతం) తగ్గిస్తుందన్న అంచనాలు దేశీయంగా ఒకేరోజు రూ.1,200కుపైగా అప్.. అంతర్జాతీయ ధోరణికి తోడు రూపాయి బలహీన ధోరణి (బుధవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో 74.94) దేశంలో పసిడి ధరకు బలమవుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో స్పాట్ మార్కెట్లో 10 గ్రాములు 24 క్యారెట్లు స్వచ్ఛత ధర బుధవారం రూ.1,365 పెరిగి రూ.56,181కి ఎగసింది. వెండి సైతం కేజీకి రూ.5,972 ఎగసి, 72,725కు చేరింది. దేశంలోకి పలు స్పాట్ మార్కెట్లలో సైతం ధర రూ.1,200కుపైగా పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛత ధర రూ.55,000 దాటిపోగా, ఆభరణాల బంగారం రూ. 53,000పైకి చేరింది. ఈ వార్తరాసే సమయానికి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పూర్తి స్వచ్ఛత ధర మంగళవారం ముగింపుతో పోల్చితే దాదాపు రూ.837 ఎగసి పెరిగి రూ.55,388 వద్ద ట్రేడవుతోంది. -
ఏడాది చివరకు రూ.33,500 స్థాయికి పసిడి..!
బ్రెగ్జిట్, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల ప్రభావం * ఫెడ్ వడ్డీరేటు పెంపు ఆలస్యమయ్యే ధోరణీ ‘ప్లస్’! * క్రూడ్ ధరలు వెనకడుగు మరోకారణం న్యూయార్క్/న్యూఢిల్లీ: ఇటు దేశీయంగా అటు అంతర్జాతీయంగా పసిడి వెలుగులు సమీప కాలంలో కొనసాగుతాయనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్‌లో ఈ ఏడాది చివరినాటికి 10 గ్రాముల ధర రూ.33,500 స్థాయికి చేరుతుందన్న అంచనా ఉండగా, అంతర్జాతీయ స్థాయికి సంబంధించి అంచనాలు చూస్తే న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో చురుగ్గా ట్రేడయ్యే కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర 1,350 డాలర్లు, 1,475 డాలర్ల శ్రేణిలో తిరుగుతుంది. కమోట్రెండ్జ్ రిసెర్ట్ డెరైక్టర్ జ్ఞాన్‌శేఖర్ త్యాగరాజన్ అంచనాల ప్రకారం... ⇒ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడం.. ఫలితంగా అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనటం పసిడిలో పెట్టుబడుల పటిష్టతకు కారణం. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి బ్రిటన్, యూరోపియన్ యూనియన్లు వేర్వేరుగా ఉద్దీపనలను ప్రకటించే అవకాశం. ⇒ అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుత 0.50% నుంచి ఇప్పట్లో పైకి పెంచదన్న అంచనా రెండవ కారణం. అమెరికా ఎన్నికల నేపథ్యమూ గమనార్హం. ⇒ ఇక మూడవ అంశానికి వస్తే- ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో క్రూడ్ ధరలు సైతం వెనకడుగు వేయడం. ⇒ అమెరికా డాలర్ మరింత బలహీన పడే అవకాశాలు ఉన్నాయని, ఇది పసిడికి మరింత మెరుపు తీసుకువస్తుందని ఏంజిల్ బ్రోకింగ్ కమోడిటీస్ అండ్ కరెన్సీస్ బిజినెస్ ఈక్విటీ రిసెర్చ్ విభాగం డెరైక్టర్ నవీన్ మాథూర్ అభిప్రాయపడ్డారు. దీనితో స్వల్ప కాలంలో రేటు దేశీయంగా రూ.31,500-32,500 శ్రేణిలో తిరిగే అవకాశం ఉందని అంచనావేశారు. ⇒ అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య చైర్మన్ జీవీ శ్రీథర్ కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆయా ఆర్థిక మందగమన అంశాలకు తోడు దేశంలో తగిన వర్షపాతమూ పసిడి డిమాండ్ బాగుండడానికి కారణమవుతుందని ఆయన అంచనా వేశారు. వారంలో భారీ జంప్.. బ్రెగ్జిట్ వార్తల నేపథ్యంలో పసిడి నెమైక్స్‌లో సమీక్షా వారంలో పరుగు పెట్టింది. శుక్రవారం ఒక దశలో మార్చి 2014 గరిష్ట స్థాయికి ఔన్స్‌కు 1,359 డాలర్లకు ఎగసింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 18 డాలర్ల లాభంతో 1,319 డాలర్ల వద్ద ముగిసింది. ఇక దేశీయంగానూ పసిడి ఇదే దూకుడు ప్రదర్శించింది. దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా శుక్రవారం 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.845 లాభంతో (3 శాతం) రూ.30,905 వద్ద ముగిసింది. ఇక 99.5 స్వచ్ఛత ధర కూడా అంతే మొత్తం ఎగసి రూ.30.755 వద్దకు చేరింది. ఇక వెండి కూడా కేజీకి రూ.1,370 ఎగసి రూ. 42,930 వద్దకు భారీ జంప్ చేసింది.