పసిడి పరుగు ఎందాక? | Gold Prices Hit All-Time High | Sakshi
Sakshi News home page

పసిడి పరుగు ఎందాక?

Published Mon, Apr 15 2024 5:39 AM | Last Updated on Mon, Apr 15 2024 5:39 AM

Gold Prices Hit All-Time High - Sakshi

సెంట్రల్‌ బ్యాంకుల భారీ కొనుగోళ్లు 

ఆర్‌బీఐదీ ఇదే దారి

విదేశీ మారక నిల్వల్లో ప్రాధాన్యం

భౌగోళిక ఉద్రిక్తతలు, కరెన్సీ అస్థిరతలు

ఫెడ్‌ రేట్ల కోతపై సందేహాలు

మధ్య, దీర్ఘకాల పెట్టుబడులకు అనుకూలం

పసిడి అందకుండా పరుగెడుతోంది. జీవితకాల గరిష్ట ధరల్లో ట్రేడ్‌ అవుతూ, ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ఇప్పటికే మూడు
నెలల్లో సుమారు 20 శాతం బంగారం విలువ ప్రియంగా మారింది. కరోనా సంక్షోభం నుంచి చూస్తే 70 శాతం ఎగసింది. 10 గ్రాముల బంగారం ధర రూ.74,500 దాటింది.

భారతీయులకు బంగారం అంటే సహజంగానే ఎంతో మక్కువ. పేద వారి నుంచి, ధనికుల వరకు ఎవరి స్థాయిలో వారు బంగారం కలిగి ఉంటారు. ధర ఇలా పెరిగిపోతుంటే, ఇక తాము కొనలేని స్థాయికి బంగారం చేరుకుంటుందా? అన్న గుబులు కొందరిలో మొదలైంది. ఈ తరుణంలో అసలు పసిడెందుకు ఇలా పరుగులు తీస్తోంది? ఇది ఎంత వరకు? దీనిపై మార్కెట్‌ అనలిస్టుల విశ్లేషణ చూద్దాం.  

ఆర్‌బీఐ దూకుడు
గత ఏడాది 2023 ఏప్రిల్‌ నుంచి 2024 ఫిబ్రవరి నాటికి ఆర్‌బీఐ 13 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆర్‌బీఐ నిర్వహణలోని బంగారం నిల్వలు 817 టన్నులకు చేరాయి. విదేశీ మారక నిల్వల్లో వైవిధ్యానికి వీలుగా, రిస్క్‌ తగ్గించుకునేందుకు బంగారం నిల్వలను ఆర్‌బీఐ పెంచుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్‌బీఐ 6 టన్నుల బంగారం నిల్వలు పెంచుకుంది. అంతకుముందు జనవరిలో 8.7 టన్నులను కొనుగోలు చేసింది.

2022 జూలై తర్వాత ఒక నెలలో గరిష్ట కొనుగోళ్లు ఇవి. ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ప్రకారం సెంట్రల్‌ బ్యాంక్‌లు అన్నీ కలసి ఫిబ్రవరిలో 19 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి.  అత్యధికంగా చైనా 12 టన్నులు కొంది. జనవరిలో టర్కీ 11.8 టన్నులు, చైనా 10 టన్నులు, కజకిస్థాన్‌ 6.2 టన్నుల చొప్పున బంగారం కొన్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సెంట్రల్‌ బ్యాంక్‌లు 64 టన్నుల బంగారం కొన్నాయి.

2023 మొదటి 2 నెలలతో పోలిస్తే 43% తక్కువ కాగా, 2022 మొదటి 2 నెలలతో పోల్చితే 4 రెట్లు అధికం. ఇక ముందూ సెంట్రల్‌ బ్యాంక్‌ల నుంచి డిమాండ్‌ కొనసాగొచ్చన్నది అనలిస్టుల అంచనా. అదే సమయంలో మార్కెట్‌ అంచనా వేసినట్టు ఫెడ్‌ రేట్ల కోత జూన్‌ లేదా సమీప కాలంలో లేకపోతే, అది బంగారం ధరల ర్యాలీకి బ్రేక్‌ వేయవచ్చని టీడీ సెక్యూరిటీస్‌ కమోడిటీ స్ట్రాటజీస్‌ హెడ్‌ వార్ట్‌ మెలెక్‌ పేర్కొన్నారు. కాకపోతే మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి పసిడిలో రాబడికే అవకాశాలు ఉంటాయన్నది అనలిస్టుల అభిప్రాయం.

మన దగ్గర కొంచెం ఎక్కువే
దేశీయ మార్కెట్‌ అనే కాదు, అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఔన్స్‌ బంగారం (31.10 గ్రాములకు సమానం) ధర 2,400 డాలర్లకు చేరింది. రూపాయల్లోకి మార్చి చూస్తే దేశీయ మార్కెట్లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.64,370గానే ఉండాలి. కానీ, ఇంతకంటే అధికంగా మన మార్కెట్లో ట్రేడ్‌ అవుతోంది. బంగారం దిగుమతి చేసుకునే లోహం. కనుక డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ దిగుమతి ధరలను నిర్ణయిస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. రూపాయి విలువ క్షీణిస్తున్న కొద్దీ, అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీయ మార్కెట్లో బంగారం ధర మధ్య అంతరం పెరుగుతూ వెళుతుంది. దీనికి తోడు బంగారం దిగుమతులపై కేంద్ర సర్కారు కస్టమ్స్‌ సుంకాన్ని కూడా వసూలు చేస్తుంటుంది. బంగారం, వెండిపై ప్రస్తుతం ఈ సుంకం 15 శాతంగా ఉంది. ఇవన్నీ కలిసి దేశీయ మార్కెట్లో బంగారం ధర అధికంగా ఉండేలా చేస్తున్నాయి.  

ఎందుకంటే..?
బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా ర్యాలీ చేస్తుండడం వెనుక పలు కారణాలను మార్కెట్‌ నిపుణులు, అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అమెరికా సహా అన్ని ప్రముఖ దేశాల్లోనూ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిల్లోనే చలిస్తున్నాయి. ఇక్కడి నుంచి తగ్గడమే కానీ, పెరగడానికి అవకాశాల్లేవు. సమీప కాలంలోనే వడ్డీ రేట్ల తగ్గింపు మొదలవుతుందన్న అంచనాలు నెలకొన్నాయి.

ముఖ్యంగా యూఎస్‌ ఫెడ్‌ జూన్‌ నుంచే రేట్ల కోతను మొదలు పెడుతుందని అంచనాలు ఏర్పడ్డాయి. ‘‘పసిడి ధర మరో రికార్డు స్థాయికి చేరింది. డాలర్‌ ఇండెక్స్‌ బలంగానే ఉన్నప్పటికీ బంగారం ర్యాలీ కొనసాగుతోంది. యూఎస్‌ ఫెడ్‌ మానిటరీ పాలసీని సులభతరం చేస్తుందన్న అంచనాలు పెరిగాయి. మధ్య ప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు మరింత క్షీణించడం కూడా కారణమే. బంగారం, వెండి ధరలు ఇటీవల ర్యాలీకి చైనా దూకుడైన కొనుగోళ్లు సైతం మద్దతునిస్తున్నాయి.

సెంట్రల్‌ బ్యాంకులు స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. ఈ ఏడాది ప్రముఖ దేశాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అనిశ్చితి కూడా ఒక కారణమే. ఈ పరిస్థితుల్లో బంగారం సురక్షిత సాధనంగా ఆకర్షిస్తోంది’’అని ఎస్‌ఎస్‌ వెల్త్‌ స్ట్రీట్‌ వ్యవస్థాపకురాలు సుగంధ సచ్‌దేవ తెలిపారు. ఇజ్రాయెల్‌ తన దాడులను లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపైకి విస్తరించింది. ఇది కూడా బంగారం ధరల ఆజ్యానికి కారణమైనందన్నది కొందరు విశ్లేషుకుల అంచనాగా ఉంది.    

ఎంత వరకు..?
 మొత్తం మీద బంగారం ధరల ధోరణి బుల్లిష్‌గా ఉన్నట్టు, మధ్యలో ధరలు తగ్గితే కొనుగోళ్లకు అవకాశంగా చూడొచ్చని సుగంధ సచ్‌దేవ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, భౌగోళిక రాజకీయ అంశాలు ఏ విధంగా మారుతున్నాయనే దానిపై దృష్టి సారించాలన్నారు. ‘‘బంగారం ధర సాంకేతికంగా రూ.69,600ను ఛేదించి అంతకుపైన ముగిసింది. ఇది పసిడి ర్యాలీకి మద్దతునిచ్చేది. ఇక్కడి నుంచి పసిడి ధర తగ్గితే మధ్య కాలం నుంచి దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు అవకాశంగా చూడొచ్చు’’అని ప్రభుదాస్‌ లీలాదర్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ షిజు కూత్తుపలక్కల్‌ సూచించారు.  

సురక్షిత సాధనం
ఆర్థిక అనిశి్చతుల్లో, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో బంగారానికి డిమాండ్‌ సాధారణ రోజులతో పోలిస్తే అధికమవుతుంది. ఈక్విటీలు, డాలర్‌ తదితర సాధనాల నుంచి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు బంగారంలోకి పెట్టుబడులు మళ్లిస్తుంటారు. చారిత్రకంగా చూస్తే ఇతర సాధనాల కంటే బంగారంలో అస్థిరతలు తక్కువ. అందుకే ఆ సమయంలో ఇన్వెస్టర్లు పసిడిని నమ్ముకుంటారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడల్లా బంగారం ర్యాలీ చేస్తుండడం సహజంగానే కనిపిస్తుంది.

వడ్డీ రేట్లు తగ్గడం వల్ల అది ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీస్తుంది. పైగా ముడి చమురు ధరలు మరోసారి పెరగడం మొదలైంది. ఇది కూడా ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం సమయలో పెట్టుబడుల విలువ కాపాడుకునేందుకు హెడ్జింగ్‌గా బంగారం మించిన సాధనం లేదు. చారిత్రకంగా చూస్తే ఎక్కువ సందర్భాల్లో ఈక్విటీలు ర్యాలీ చేసినప్పుడు బంగారం ధరలు తగ్గేవి.

కానీ, ఈ విడత ఈక్విటీలతో పాటు బంగారం కూడా ర్యాలీ చేయడానికి ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు, డాలర్‌ విలువ స్థిరత్వం విషయంలో సెంట్రల్‌ బ్యాంకుల్లో నమ్మకం సడలడమే ఒక కారణంగా కనిపిస్తోంది. యూఎస్‌ ద్రవ్యలోటు 6.2 శాతానికి, రుణం జీడీపీలో 120 శాతానికి చేరడం కూడా బంగారం ధరల ఆజ్యానికి కారణాల్లో ఒకటి. అమెరికా జీడీపీలో రుణ వడ్డీ వ్యయాలు 2015–2020 కాలంలో సగటున 1.4 శాతంగా ఉంటే, ఇప్పుడు 2.4 శాతానికి చేరాయి. ఈ వడ్డీ వ్యయాలు తగ్గించుకునేందుకు, గడువు తీరిన రుణాలను తక్కువ రేటుపై రీఫైనాన్స్‌ చేసుకునేందుకు వీలుగా ఫెడ్‌ నుంచి రేట్ల కోత రూపంలో సాయాన్ని అమెరికా ప్రభుత్వం ఆశిస్తున్న విషయాన్ని విస్మరించరాదు.  

రేట్ల కోత
ఫిబ్రవరి మధ్య నుంచి ర్యాలీ ఫలితంగా బంగారం సాంకేతికంగా రూ.70,000 మార్క్‌ (10 గ్రాములు), ఔన్స్‌ 2,300 డాలర్లను దాటింది. రేట్ల కోతపై యూఎస్‌ ఫెడ్‌ మిశ్రమ సంకేతాలే ఇచి్చనప్పటికీ, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ధరల ఒత్తిళ్లను తగ్గించేందుకు జూన్‌లోనే రేట్ల కోతను చేపట్టొచ్చన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయిఅని సుగంధ సచ్‌దేవ తెలిపారు. ముఖ్యంగా ఇటీవలే వెలువడిన అమెరికా నాన్‌ ఫార్మ్‌ పేరోల్‌ డేటా అంచనాలకు మించి ఉందని (తగ్గిన నిరుద్యోగం), ఇదే బంగారం, వెండి ధరల తాజా ట్రిగ్గర్‌కు దారితీసినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీ అండ్‌ కరెన్సీ హెడ్‌ అనుజ్‌ గుప్తా వెల్లడించారు.

అవసరమా–పెట్టుబడా?
పెరిగే ధరలు చూసి పసిడి వెంట పరుగులు తీయడం కాకుండా, ఎందుకు కొనుగోలు చేయాలన్న ప్రశ్న వేసుకోవాలి. రాబడి కోసం అయితే అది పెట్టుబడి అవుతుంది. తమ మొత్తం పెట్టుబడుల్లో బంగారానికి చేసే కేటాయింపులు 5–10% మించకూడదన్నది నిపుణుల సూచన. పైగా పెట్టుబడులు భౌతిక బంగారంపై ఉండకూడదు. గోల్డ్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

లేదంటే సావరీన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ)లో ఇన్వెస్ట్‌ చేసుకుంటే, పెరిగే విలువకు అదనంగా ఏటా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ రెండు సాధనాల్లోనూ క్రమానుగత పెట్టుబడులు చేసుకోవచ్చు. ఎస్‌జీబీలను ఆర్‌బీఐ ఏటా పలు విడతలుగా జారీ చేస్తుంటుంది. ఈటీఎఫ్‌లను రోజువారీ స్టాక్‌ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఆభరణాల కోసం అయితే తమకు కావాల్సినంత మేర బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు.  

వెండి సంగతి?
చారిత్రకంగా బంగారంతోపాటే వెండి పయనం కూడా సాగుతుంది. కానీ, ఇటీవలి కాలంలో బంగారం స్థాయిలో వెండి ధరల పెరుగుదల లేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి ఏప్రిల్‌ 8 నాటికి వెండి ధరలు 11 శాతం ర్యాలీ చేశాయి. పెట్టుబడుల కోణంలోనే కాకుండా, పారిశ్రామికంగానూ వెండి వినియోగం ఉంటుంది. ఎలక్ట్రిక్‌ వాహనాలు, సోలార్‌ తదితర పునరుత్పాదక ఇంధన ఎక్విప్‌మెంట్, ఎల్రక్టానిక్స్‌లో వెండి వినియోగిస్తుంటారు. చైనా మార్కెట్‌ కోలుకుంటుందన్న అంచనాలు వెండి ర్యాలీకి జోష్‌నిస్తున్నాయి. వెండి విషయంలో తాము బలమైన సానుకూలతతో ఉన్నట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ ప్రకటించింది. కిలో వెండి తగ్గితే రూ.75,000 వరకూ కొనుగోలు చేసుకోవచ్చని, మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.92,000–1,00,000 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు ఇటీవలే నోట్‌ను విడుదల చేసింది.  

కొనేది ఎవరు?
సెంట్రల్‌ బ్యాంక్‌లతోపాటు, వడ్డీ రేట్ల కోతపై అంచనాలతో ఇనిస్టిట్యూషన్లు (ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌లు, పెన్షన్‌ ఫండ్స్, సావరీన్‌ వెల్త్‌ ఫండ్స్‌) బంగారంపై ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. వ్యక్తులు, ప్రైవేటు ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కూడా డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. సెంట్రల్‌ బ్యాంక్‌లు అంతర్జాతీయంగా కరెన్సీని పెద్ద ఎత్తున ప్రింట్‌ చేస్తున్నాయి. ఇది వాటి కరెన్సీ విలువలకు ప్రతికూలం. పైగా భౌగోళిక ఉద్రిక్తతల ఫలితంగా నాన్‌ డాలర్‌ వాణిజ్య చెల్లింపుల వైపు కొన్ని దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఇది డాలర్‌కు ప్రతికూలం.

ఈ పరిస్థితుల్లో విదేశీ మారకం నిల్వల్లో ఎక్కువ భాగం కరెన్సీ రూపంలోనే కలిగి ఉండడం అంత శ్రేయస్కరం కాదని ఆర్‌బీఐ సహా వర్ధమాన దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు భావిస్తున్నాయి. కరెన్సీలతో పోలిస్తే బంగారమే స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుండడం గమనించాలి. మన దేశంలో ఇప్పటికీ అధిక శాతం మంది బంగారాన్ని విలువైన, పొదుపు సాధనంగా చూస్తున్నారు. బంగారం విలువ ఎప్పటికీ పెరిగేదే కానీ, తరిగేది కాదని, కష్టాల్లో ఆదుకుంటుందని ఎక్కువ మంది నమ్ముతుంటారు. ఫలితంగా దేశీయంగా బంగారానికి బలమైన డిమాండ్‌ కొనసాగుతూనే ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement