Lifetime High
-
నిఫ్టీ ‘వరుస లాభాల’ రికార్డు
ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, యుటిలిటీ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. అధిక వెయిటేజీ షేర్లు భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీ బ్యాంకు, ఇన్ఫోసిస్ సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. 1996లో ఎన్ఎస్ఈ ప్రారంభం తర్వాత 12 రోజులు వరుసగా లాభాలు గడించిన నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 25,236 వద్ద స్థిరపడింది. ఒక దశలో 116 పాయింట్లు బలపడి 25,268 వద్ద కొత్త ఆల్‌టైం హైని తాకింది. సెన్సెక్స్ 502 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్టం వద్ద మొదలైంది. చివరికి 231 పాయింట్ల లాభంతో 82,366 సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ఈ సూచీకిది తొమ్మిదో రోజు లాభాల ముగింపు. ఎఫ్ఎంసీజీ మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో సెన్సెక్స్ 1,941 పాయింట్లు(2.41%) పెరగడంతో బీఎస్ఈలో 10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.464.39 లక్షల కోట్ల(5.54 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే రూ.1.85 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సొంతమయ్యాయి. -
పసిడి పరుగు ఎందాక?
పసిడి అందకుండా పరుగెడుతోంది. జీవితకాల గరిష్ట ధరల్లో ట్రేడ్ అవుతూ, ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ఇప్పటికే మూడు నెలల్లో సుమారు 20 శాతం బంగారం విలువ ప్రియంగా మారింది. కరోనా సంక్షోభం నుంచి చూస్తే 70 శాతం ఎగసింది. 10 గ్రాముల బంగారం ధర రూ.74,500 దాటింది. భారతీయులకు బంగారం అంటే సహజంగానే ఎంతో మక్కువ. పేద వారి నుంచి, ధనికుల వరకు ఎవరి స్థాయిలో వారు బంగారం కలిగి ఉంటారు. ధర ఇలా పెరిగిపోతుంటే, ఇక తాము కొనలేని స్థాయికి బంగారం చేరుకుంటుందా? అన్న గుబులు కొందరిలో మొదలైంది. ఈ తరుణంలో అసలు పసిడెందుకు ఇలా పరుగులు తీస్తోంది? ఇది ఎంత వరకు? దీనిపై మార్కెట్ అనలిస్టుల విశ్లేషణ చూద్దాం. ఆర్బీఐ దూకుడు గత ఏడాది 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి నాటికి ఆర్బీఐ 13 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆర్బీఐ నిర్వహణలోని బంగారం నిల్వలు 817 టన్నులకు చేరాయి. విదేశీ మారక నిల్వల్లో వైవిధ్యానికి వీలుగా, రిస్క్ తగ్గించుకునేందుకు బంగారం నిల్వలను ఆర్బీఐ పెంచుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ 6 టన్నుల బంగారం నిల్వలు పెంచుకుంది. అంతకుముందు జనవరిలో 8.7 టన్నులను కొనుగోలు చేసింది. 2022 జూలై తర్వాత ఒక నెలలో గరిష్ట కొనుగోళ్లు ఇవి. ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ప్రకారం సెంట్రల్ బ్యాంక్‌లు అన్నీ కలసి ఫిబ్రవరిలో 19 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. అత్యధికంగా చైనా 12 టన్నులు కొంది. జనవరిలో టర్కీ 11.8 టన్నులు, చైనా 10 టన్నులు, కజకిస్థాన్ 6.2 టన్నుల చొప్పున బంగారం కొన్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సెంట్రల్ బ్యాంక్‌లు 64 టన్నుల బంగారం కొన్నాయి. 2023 మొదటి 2 నెలలతో పోలిస్తే 43% తక్కువ కాగా, 2022 మొదటి 2 నెలలతో పోల్చితే 4 రెట్లు అధికం. ఇక ముందూ సెంట్రల్ బ్యాంక్‌ల నుంచి డిమాండ్ కొనసాగొచ్చన్నది అనలిస్టుల అంచనా. అదే సమయంలో మార్కెట్ అంచనా వేసినట్టు ఫెడ్ రేట్ల కోత జూన్ లేదా సమీప కాలంలో లేకపోతే, అది బంగారం ధరల ర్యాలీకి బ్రేక్ వేయవచ్చని టీడీ సెక్యూరిటీస్ కమోడిటీ స్ట్రాటజీస్ హెడ్ వార్ట్ మెలెక్ పేర్కొన్నారు. కాకపోతే మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి పసిడిలో రాబడికే అవకాశాలు ఉంటాయన్నది అనలిస్టుల అభిప్రాయం. మన దగ్గర కొంచెం ఎక్కువే దేశీయ మార్కెట్ అనే కాదు, అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఔన్స్ బంగారం (31.10 గ్రాములకు సమానం) ధర 2,400 డాలర్లకు చేరింది. రూపాయల్లోకి మార్చి చూస్తే దేశీయ మార్కెట్లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.64,370గానే ఉండాలి. కానీ, ఇంతకంటే అధికంగా మన మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. బంగారం దిగుమతి చేసుకునే లోహం. కనుక డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ దిగుమతి ధరలను నిర్ణయిస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. రూపాయి విలువ క్షీణిస్తున్న కొద్దీ, అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీయ మార్కెట్లో బంగారం ధర మధ్య అంతరం పెరుగుతూ వెళుతుంది. దీనికి తోడు బంగారం దిగుమతులపై కేంద్ర సర్కారు కస్టమ్స్ సుంకాన్ని కూడా వసూలు చేస్తుంటుంది. బంగారం, వెండిపై ప్రస్తుతం ఈ సుంకం 15 శాతంగా ఉంది. ఇవన్నీ కలిసి దేశీయ మార్కెట్లో బంగారం ధర అధికంగా ఉండేలా చేస్తున్నాయి. ఎందుకంటే..? బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా ర్యాలీ చేస్తుండడం వెనుక పలు కారణాలను మార్కెట్ నిపుణులు, అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అమెరికా సహా అన్ని ప్రముఖ దేశాల్లోనూ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిల్లోనే చలిస్తున్నాయి. ఇక్కడి నుంచి తగ్గడమే కానీ, పెరగడానికి అవకాశాల్లేవు. సమీప కాలంలోనే వడ్డీ రేట్ల తగ్గింపు మొదలవుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యూఎస్ ఫెడ్ జూన్ నుంచే రేట్ల కోతను మొదలు పెడుతుందని అంచనాలు ఏర్పడ్డాయి. ‘‘పసిడి ధర మరో రికార్డు స్థాయికి చేరింది. డాలర్ ఇండెక్స్ బలంగానే ఉన్నప్పటికీ బంగారం ర్యాలీ కొనసాగుతోంది. యూఎస్ ఫెడ్ మానిటరీ పాలసీని సులభతరం చేస్తుందన్న అంచనాలు పెరిగాయి. మధ్య ప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు మరింత క్షీణించడం కూడా కారణమే. బంగారం, వెండి ధరలు ఇటీవల ర్యాలీకి చైనా దూకుడైన కొనుగోళ్లు సైతం మద్దతునిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకులు స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. ఈ ఏడాది ప్రముఖ దేశాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అనిశ్చితి కూడా ఒక కారణమే. ఈ పరిస్థితుల్లో బంగారం సురక్షిత సాధనంగా ఆకర్షిస్తోంది’’అని ఎస్ఎస్ వెల్త్ స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధ సచ్దేవ తెలిపారు. ఇజ్రాయెల్ తన దాడులను లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపైకి విస్తరించింది. ఇది కూడా బంగారం ధరల ఆజ్యానికి కారణమైనందన్నది కొందరు విశ్లేషుకుల అంచనాగా ఉంది. ఎంత వరకు..? మొత్తం మీద బంగారం ధరల ధోరణి బుల్లిష్‌గా ఉన్నట్టు, మధ్యలో ధరలు తగ్గితే కొనుగోళ్లకు అవకాశంగా చూడొచ్చని సుగంధ సచ్దేవ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, భౌగోళిక రాజకీయ అంశాలు ఏ విధంగా మారుతున్నాయనే దానిపై దృష్టి సారించాలన్నారు. ‘‘బంగారం ధర సాంకేతికంగా రూ.69,600ను ఛేదించి అంతకుపైన ముగిసింది. ఇది పసిడి ర్యాలీకి మద్దతునిచ్చేది. ఇక్కడి నుంచి పసిడి ధర తగ్గితే మధ్య కాలం నుంచి దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు అవకాశంగా చూడొచ్చు’’అని ప్రభుదాస్ లీలాదర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ షిజు కూత్తుపలక్కల్ సూచించారు. సురక్షిత సాధనం ఆర్థిక అనిశి్చతుల్లో, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో బంగారానికి డిమాండ్ సాధారణ రోజులతో పోలిస్తే అధికమవుతుంది. ఈక్విటీలు, డాలర్ తదితర సాధనాల నుంచి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు బంగారంలోకి పెట్టుబడులు మళ్లిస్తుంటారు. చారిత్రకంగా చూస్తే ఇతర సాధనాల కంటే బంగారంలో అస్థిరతలు తక్కువ. అందుకే ఆ సమయంలో ఇన్వెస్టర్లు పసిడిని నమ్ముకుంటారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడల్లా బంగారం ర్యాలీ చేస్తుండడం సహజంగానే కనిపిస్తుంది. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల అది ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీస్తుంది. పైగా ముడి చమురు ధరలు మరోసారి పెరగడం మొదలైంది. ఇది కూడా ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం సమయలో పెట్టుబడుల విలువ కాపాడుకునేందుకు హెడ్జింగ్‌గా బంగారం మించిన సాధనం లేదు. చారిత్రకంగా చూస్తే ఎక్కువ సందర్భాల్లో ఈక్విటీలు ర్యాలీ చేసినప్పుడు బంగారం ధరలు తగ్గేవి. కానీ, ఈ విడత ఈక్విటీలతో పాటు బంగారం కూడా ర్యాలీ చేయడానికి ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు, డాలర్ విలువ స్థిరత్వం విషయంలో సెంట్రల్ బ్యాంకుల్లో నమ్మకం సడలడమే ఒక కారణంగా కనిపిస్తోంది. యూఎస్ ద్రవ్యలోటు 6.2 శాతానికి, రుణం జీడీపీలో 120 శాతానికి చేరడం కూడా బంగారం ధరల ఆజ్యానికి కారణాల్లో ఒకటి. అమెరికా జీడీపీలో రుణ వడ్డీ వ్యయాలు 2015–2020 కాలంలో సగటున 1.4 శాతంగా ఉంటే, ఇప్పుడు 2.4 శాతానికి చేరాయి. ఈ వడ్డీ వ్యయాలు తగ్గించుకునేందుకు, గడువు తీరిన రుణాలను తక్కువ రేటుపై రీఫైనాన్స్ చేసుకునేందుకు వీలుగా ఫెడ్ నుంచి రేట్ల కోత రూపంలో సాయాన్ని అమెరికా ప్రభుత్వం ఆశిస్తున్న విషయాన్ని విస్మరించరాదు. రేట్ల కోత ఫిబ్రవరి మధ్య నుంచి ర్యాలీ ఫలితంగా బంగారం సాంకేతికంగా రూ.70,000 మార్క్ (10 గ్రాములు), ఔన్స్ 2,300 డాలర్లను దాటింది. రేట్ల కోతపై యూఎస్ ఫెడ్ మిశ్రమ సంకేతాలే ఇచి్చనప్పటికీ, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ధరల ఒత్తిళ్లను తగ్గించేందుకు జూన్‌లోనే రేట్ల కోతను చేపట్టొచ్చన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయిఅని సుగంధ సచ్దేవ తెలిపారు. ముఖ్యంగా ఇటీవలే వెలువడిన అమెరికా నాన్ ఫార్మ్ పేరోల్ డేటా అంచనాలకు మించి ఉందని (తగ్గిన నిరుద్యోగం), ఇదే బంగారం, వెండి ధరల తాజా ట్రిగ్గర్‌కు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనుజ్ గుప్తా వెల్లడించారు. అవసరమా–పెట్టుబడా? పెరిగే ధరలు చూసి పసిడి వెంట పరుగులు తీయడం కాకుండా, ఎందుకు కొనుగోలు చేయాలన్న ప్రశ్న వేసుకోవాలి. రాబడి కోసం అయితే అది పెట్టుబడి అవుతుంది. తమ మొత్తం పెట్టుబడుల్లో బంగారానికి చేసే కేటాయింపులు 5–10% మించకూడదన్నది నిపుణుల సూచన. పైగా పెట్టుబడులు భౌతిక బంగారంపై ఉండకూడదు. గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ)లో ఇన్వెస్ట్ చేసుకుంటే, పెరిగే విలువకు అదనంగా ఏటా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ రెండు సాధనాల్లోనూ క్రమానుగత పెట్టుబడులు చేసుకోవచ్చు. ఎస్జీబీలను ఆర్బీఐ ఏటా పలు విడతలుగా జారీ చేస్తుంటుంది. ఈటీఎఫ్‌లను రోజువారీ స్టాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఆభరణాల కోసం అయితే తమకు కావాల్సినంత మేర బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. వెండి సంగతి? చారిత్రకంగా బంగారంతోపాటే వెండి పయనం కూడా సాగుతుంది. కానీ, ఇటీవలి కాలంలో బంగారం స్థాయిలో వెండి ధరల పెరుగుదల లేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి ఏప్రిల్ 8 నాటికి వెండి ధరలు 11 శాతం ర్యాలీ చేశాయి. పెట్టుబడుల కోణంలోనే కాకుండా, పారిశ్రామికంగానూ వెండి వినియోగం ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ తదితర పునరుత్పాదక ఇంధన ఎక్విప్మెంట్, ఎల్రక్టానిక్స్‌లో వెండి వినియోగిస్తుంటారు. చైనా మార్కెట్ కోలుకుంటుందన్న అంచనాలు వెండి ర్యాలీకి జోష్‌నిస్తున్నాయి. వెండి విషయంలో తాము బలమైన సానుకూలతతో ఉన్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ప్రకటించింది. కిలో వెండి తగ్గితే రూ.75,000 వరకూ కొనుగోలు చేసుకోవచ్చని, మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.92,000–1,00,000 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు ఇటీవలే నోట్‌ను విడుదల చేసింది. కొనేది ఎవరు? సెంట్రల్ బ్యాంక్‌లతోపాటు, వడ్డీ రేట్ల కోతపై అంచనాలతో ఇనిస్టిట్యూషన్లు (ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లు, పెన్షన్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్) బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వ్యక్తులు, ప్రైవేటు ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కూడా డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్‌లు అంతర్జాతీయంగా కరెన్సీని పెద్ద ఎత్తున ప్రింట్ చేస్తున్నాయి. ఇది వాటి కరెన్సీ విలువలకు ప్రతికూలం. పైగా భౌగోళిక ఉద్రిక్తతల ఫలితంగా నాన్ డాలర్ వాణిజ్య చెల్లింపుల వైపు కొన్ని దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఇది డాలర్‌కు ప్రతికూలం. ఈ పరిస్థితుల్లో విదేశీ మారకం నిల్వల్లో ఎక్కువ భాగం కరెన్సీ రూపంలోనే కలిగి ఉండడం అంత శ్రేయస్కరం కాదని ఆర్బీఐ సహా వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు భావిస్తున్నాయి. కరెన్సీలతో పోలిస్తే బంగారమే స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుండడం గమనించాలి. మన దేశంలో ఇప్పటికీ అధిక శాతం మంది బంగారాన్ని విలువైన, పొదుపు సాధనంగా చూస్తున్నారు. బంగారం విలువ ఎప్పటికీ పెరిగేదే కానీ, తరిగేది కాదని, కష్టాల్లో ఆదుకుంటుందని ఎక్కువ మంది నమ్ముతుంటారు. ఫలితంగా దేశీయంగా బంగారానికి బలమైన డిమాండ్ కొనసాగుతూనే ఉంది. -
స్థిరీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు వరుస ర్యాలీతో పాటు జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్న తరుణంలో.., ఈ వారం కొంత స్థిరీకరణకు లోనవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఫెడ్ రిజర్వ్) ద్రవ్య విధాన నిర్ణయాలు, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటునన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు, స్థూల ఆర్థిక గణాంకాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని చెబుతున్నారు. వినాయక చవితి సందర్భంగా మంగళవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు ఉదయం సెషన్లో మాత్రమే సెలవు పాటిస్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ 20 సదస్సు విజయవంతం, అంచనాలకు తగ్గట్లు ద్రవ్యల్బోణ డేటా నమోదుతో సూచీలు వరుసగా మూడోవారమూ లాభాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 1240 పాయింట్లు, నిఫ్టీ 372 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. వారాంతపు రోజైన శుక్రవారం సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ‘‘లార్జ్‌క్యాప్ షేర్ల రాణించే వీలున్నందున మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ కొనసాగొచ్చు. విస్తృత మార్కెట్లో కొనుగోళ్ల ప్రాధాన్యత రంగాల వారీగా మారొచ్చు. ఫెడ్ రిజర్వ్ సమావేశ నిర్ణయాల వెల్లడి ముందు అప్రమత్తత నేపథ్యంలో కొంత స్థిరీకరణకు అవకాశం లేకపోలేదు. సాంకేతికంగా నిఫ్టీకి దిగువును 20,050 – 20,000 శ్రేణిలో తక్షణ మద్దతు, ఎగువ స్థాయిలో 20,200 – 20,250 పాయింట్ల పరిధిలో కీలక నిరోధం కలిగి ఉందని ఆప్షన్స్ డేటా సూచిస్తోంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు ప్రవేశ్ గౌర్ తెలిపారు. ఫెడ్ వడ్డీరేట్ల నిర్ణయ ప్రభావం రెండురోజుల పాటు జరిగే అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్రల్ రిజర్వ్ కమిటీ సమావేశం నిర్ణయాలు బుధవారం వెలువడతాయి. ఇదే సందర్భంగా ఫెడ్ రిజర్వ్ యూఎస్ ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్ సర్వే వెల్లడించనుంది. వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించేందుకే ఫెడ్ మొగ్గుచూపొచ్చని ఆర్థికవేత్తల భావిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపు జరిగితే ఈక్విటీ మార్కెట్లు కొంత అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. ద్రవ్య విధాన వైఖరికి ముందు కొందరు ట్రేడర్లు తమ పొజిషన్లను వెనక్కి తీసుకోవచ్చు. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(గురువారం), బ్యాంక్ ఆఫ్ జపాన్(శుక్రవారం)లూ ఇదే వారంలో వడ్డీరేట్లు వెల్లడించనున్నాయి. అమెరికా ఎస్అండ్పీ తయారీ, సేవారంగ పీఎంఐ, నిరుద్యోగ డేటా, ఇంగ్లాండ్, యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా, జపాన్ వాణిజ్య లోటు గణాంకాలు ఇదే వారంలో విడుదల కానున్నాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబింజేసే ఈ స్థూల గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. ఐపీఓ మార్కెట్‌పై దృష్టి గతవారంలో మొదలైన సంహీ హోటల్స్, జాగిల్‌ప్రీపెయిడ్ ఓషన్ సరీ్వసెస్ ఐపీఓలు సోమవారం(సెపె్టంబర్ 18న), యాత్రా ఆన్లైన్ ఐపీఓ బుధవారం(సెపె్టంబర్ 20న) ముగియనున్నాయి. ఇక సాయి సిల్క్స్ కళామందిర్, సిగ్నేచర్‌గ్లోబల్ ఇండియా పబ్లిక్ ఇష్యూలు బుధవారం ప్రారంభమై, శుక్రవారం ముగియనున్నాయి. వైభవ్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఐపీఓ ఈ నెల 22–26 తేదీల మధ్య జరగనుంది. ప్రథమార్ధంలో రూ.4,800 కోట్ల ఉపసంహరణ భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగిస్తున్నారు. ఈ సెపె్టంబర్ ప్రథమార్ధంలో దాదాపు రూ. 4,800 కోట్లను ఉపసంహరించుకున్నారు. ‘‘అమెరికా బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. డాలర్ విలువ బలపడుతోంది. ప్రపంచ ఆర్థికవృద్ధిపై ఆందోళనలు అధికమవుతున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా ఎఫ్ఐఐలు అమ్మకాలకు పాల్పడుతున్నారు. భారత మార్కెట్లు రికార్డు స్థాయిలో ర్యాలీ చేయడం, వాల్యూయేషన్లు ఎక్కువగా ఉండటంతో రానున్న రోజుల్లో విక్రయాలు కొనసాగే వీలుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ చెప్పారు. -
సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి భారత ఫారెక్స్ నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి చేరాయి. జూలై 2వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చితే 1.013 బిలియన్ డాలర్లు ఎగసి 610.012 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.45 లక్షల కోట్లు) చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. 2020 జూన్ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్ ఫారెక్స్ నిల్వలు అర ట్రిలియన్ స్థాయిని అధిగమించి 501.70 బిలియన్ డాలర్లకు చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఏడాది తిరిగే సరికి నిల్వలు మరో 100 బిలియన్ డాలర్లు పెరిగాయి. జూన్ 4వతేదీతో ముగిసిన వారంలో మొదటిసారి 600 బిలియన్ డాలర్లను దాటి 605.008 డాలర్ల స్థాయికి చేరాయి. అటు తర్వాత కొంత తగ్గినా... తాజా సమీక్షా వారంలో రికార్డుల దూకుడు కొనసాగింది. ప్రస్తుత నిల్వలు భారత్ 20 నెలల దిగుమతులకు దాదాపు సరిపోతాయన్నది అంచనా. అంతర్జాతీయంగా భారత్ ఎకానమీకి వచ్చే కష్టనష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి ప్రస్తుత స్థాయి నిల్వలు దోహదపడతాయని ఇటీవలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ విశ్లేషించిన సంగతి తెలిసిందే. గణాంకాలను విభాగాల వారీగా పరిశీలిస్తే.. మొత్తం నిల్వల్లో డాలర్ల రూపంలో చూస్తే ప్రధానమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) విలువ తాజా సమీక్షా వారంలో 748 మిలియన్ డాలర్లు పెరిగి 566.988 బిలియన్ డాలర్లకు చేరింది. పసిడి నిల్వలు 76 మిలియన్ డాలర్లు ఎగసి 36.372 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద స్పెషల్ డ్రాయింగ్స్ రైట్స్ విలువ 49 మిలియన్ డాలర్లు పెరిగి 1.548 డాలర్లకు చేరింది. ఐఎంఎఫ్ వద్ద రిజర్వ్స్ 139 మిలియన్ డాలర్లు పెరిగి 5.105 బిలియన్ డాలర్లకు చేరాయి. -
పసిడి పరుగో పరుగు..
న్యూఢిల్లీ: దేశీయంగా బంగారం ధరల పరుగులు కొనసాగుతున్నాయి. గతకొద్ది రోజులుగా జీవితకాల గరిష్టస్థాయిలను తిరగరాస్తూ ర్యాలీ చేస్తోన్న పసిడి ధరలు తాజాగా మరో నూతన గరిష్టస్థాయిని నమోదుచేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల (బిస్కెట్ గోల్డ్) బంగారం ధర రూ.38,970 వద్దకు చేరుకుంది. తాజాగా రూ. 39,000 ధరకు సమీపించింది. ప్రాంతీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ క్రమంగా పెరుగుతున్న కారణంగా ఇక్కడి ధర ఒక్క రోజులోనే రూ.150 పెరిగి ఆల్ టైం రికార్డు హైకి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడిపోవడం, దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమౌతున్నందున ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపునకు మళ్లడమే డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా విశ్లేషించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం న్యూయార్క్‌లో స్పాట్ గోల్డ్ ధర ఒక దశలో 1,498.80 డాలర్లకు తగ్గింది. శుక్రవారం జాక్సన్ హోల్ ఎకనామిక్ పాలసీ సదస్సులో అమెరికా ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం, జీ7 సమిట్ ఫలితాల వెల్లడి వంటి అంశాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1,500 డాలర్ల స్థాయిలోనే ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ విభాగం హెడ్ హరీష్ అన్నారు. ఇక సావరిన్ గోల్డ్ ధర ఎనిమిది గ్రాములకు రూ.28,800 వద్ద ఉంది. పసిడి బాటలోనే వెండి.. దేశ రాజధానిలో వెండి ధరలు గురువారం çస్వల్ప పెరుగుదలను నమోదుచేశాయి. ఇండస్ట్రీ, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగిన కారణంగా స్పాట్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.60 పెరిగి రూ.45,100 చేరుకోగా.. వీక్లీ డెలివరీ సిల్వర్ ధర రూ.113 పెరిగి రూ.43,765 వద్దకు చేరుకుంది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.91,000 కాగా, అమ్మకం ధర రూ.92,000. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు ధర 17.09 డాలర్లకు ఎగబాకింది. -
స్టాక్మార్కెట్లో రికార్డుల హోరు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో రికార్డుల జోరుకొనసాగుతోంది. బుధవారం 35వేలకు ఎగువన స్థిరంగా ముగిసిన సెన్సెక్స్ నేడు భారీలాభాలతో షురూ అయింది. సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ లాభాలను సాధించింది. అటు నిఫ్టీ 10,850 వద్ద మరో గరిష్టాన్ని అధిగమించింది. అంతేకాదు 11వేల వైపు శరవేగంగా పయనిస్తోంది. బ్యాంకింగ్ సెక్టార్ మరోసారి పుంజుకుంది. బ్యాంక్ నిఫ్టీ సరికొత్త రికార్డ్ స్తాయిని దాటి ట్రేడ్ అవుతోంది. భారీ లాభాలతో మార్కెట్లకు జోష్ నిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ, ఎస్‌బ్యాంక్, ఐసీఐసీఐ లాభపడుతుండగా ఇన్ఫ్రాటెల్, ఇన్ఫోసిస్, గెయిల్, ఐడీసీ, హిందాల్కో, అంబుజా, విప్రో, అల్ట్రాటెక్, హెచ్‌పీసీఎల్, వేదాంతా నష్టపోతున్నాయి. -
8100 పైన ముగిసిన నిఫ్టీ!
ఐటీ, మీడియా, టెక్నాలజీ, ఆటో రంగాల కంపెనీల షేర్లు రాణించడంతో స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మరోసారి జీవితకాలపు గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ప్రధాన సూచీల్లో నిఫ్టీ 8100 పైన ముగియడం ఇదే తొలిసారి. బుధవారం నాటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 120 పాయింట్ల వృద్ధితో 27139 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో నిఫ్టీ 8114 వద్ద ముగిసింది. కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, విప్రో, టీసీఎస్ కంపెనీలు సుమారు మూడు శాతం లాభపడగా, గెయిల్, ఓఎన్ జీసీ, ఐటీసీ, బజాజ్ ఆటో, భెల్ కంపెనీలు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకుంది. -
సెన్సెక్స్ రికార్డు ముగింపు!
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో పరుగులు పెట్టాయి. గత కొద్ది రోజులుగా బుల్ రన్ కొనసాగిస్తున్న ప్రధాన సూచీలు సోమవారం రోజున భారీగా లాభపడటమే కాకుండా.. జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 229 పాయింట్లతో 26987 పాయింట్ల వద్ద, నిఫ్టీ 73 పాయింట్లతో 8027 పాయింట్ల వద్ద ముగిసాయి. జిందాల్ స్టీల్ అత్యధికంగా 6.44 శాతం లాభపడగా, హీరో మోటో కార్ప్, మారుతి సుజుకి, టాటా పవర్, గెయిల్ కంపెనీలు 4శాతానికి పైగా లాభపడ్డాయి. సన్ ఫార్మ, హెచ్ డీఎఫ్ సీ, ఐటీసీ, భెల్, టాటా మోటార్స్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి. -
రికార్డు గరిష్టస్థాయి వద్ద సెన్సెక్స్ క్లోజ్
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా ఆరవ రోజు లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 26420 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల వృద్దితో 7897 వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాలపు గరిష్టస్థాయి వద్ద క్లోజవ్వడం విశేషం. బీపీసీఎల్, ఎంఅండ్ఎం, ఇండస్ ఇండియా బ్యాంక్ మూడు శాతానికి పైగా..టాటా మోటార్స్, యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీలు సుమారు మూడు శాతం లాభపడ్డాయి. నష్టపోయిన షేర్లలో హెచ్ డీఎఫ్ సీ, టీసీఎస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, సన్ ఫార్మా, హిండాల్కోలు ఉన్నాయి.