సెన్సెక్స్ తొమ్మిదో రోజూ లాభాలే
ఇంట్రాడే, ముగింపుల్లోనూ కొత్త గరిష్టాలు
9 రోజుల్లో 10 లక్షల కోట్ల సంపద
ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, యుటిలిటీ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. అధిక వెయిటేజీ షేర్లు భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీ బ్యాంకు, ఇన్ఫోసిస్ సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.
1996లో ఎన్‌ఎస్‌ఈ ప్రారంభం తర్వాత 12 రోజులు వరుసగా లాభాలు గడించిన నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 25,236 వద్ద స్థిరపడింది. ఒక దశలో 116 పాయింట్లు బలపడి 25,268 వద్ద కొత్త ఆల్‌టైం హైని తాకింది.
సెన్సెక్స్ 502 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్టం వద్ద మొదలైంది. చివరికి 231 పాయింట్ల లాభంతో 82,366 సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ఈ సూచీకిది తొమ్మిదో రోజు లాభాల ముగింపు. ఎఫ్‌ఎంసీజీ మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
గడిచిన తొమ్మిది రోజుల్లో సెన్సెక్స్ 1,941 పాయింట్లు(2.41%) పెరగడంతో బీఎస్‌ఈలో 10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.464.39 లక్షల కోట్ల(5.54 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే రూ.1.85 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సొంతమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment