సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు పెట్రో మంట, మరోవైపు వంట గ్యాస్ ధర పెంపు సామాన్య ప్రజల్లో గుండెల్లో బాంబులై పేలుతున్నాయి. దేశంలో ఇప్పటికే నింగిని తాకిన పెట్రో ధరలతో ప్రజలు నానా తంటలు పడుతుంటే తాజాగా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర సెగలు మరో షాకిచ్చాయి. బడ్జెట్ రోజు ఫిబ్రవరి 1న వంట గ్యాస్ ధరలను యథాతథంగా ఉంచినా, తాజాగా రాయితీ సిలిండర్ ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు (గురువారం)నుండి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ పరిణామంతో వంట గ్యాస్ సిలిండర్ కూడా గుదిబండగా పరిణమించింది.
చమురు సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎల్‌పీజీ సిలిండర్ ధర తాజాగా 25 రూపాయలు పెరిగింది. వాణిజ్య సిలిండర్ ధరలను 184 రూపాయలు చొప్పున పెంచింది. ప్రస్తుత ధరల పెంపు తరువాత హైదరాబాద్‌లో వినియోగదారులు సిలిండర్‌కు రూ.771.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ధర రూ.746.50గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోలు సిలిండర్ ధర రూ .664 నుంచి రూ. 719కి పెరిగింది. కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment