Subsidized gas
-
గ్యాస్ సిలిండర్ ధర రూ.86 పెంపు
-
గ్యాస్ సిలిండర్ ధర రూ.86 పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సబ్సిడీయేతర వంటగ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ.86 పెంచాయి. దీంతో ఏడాదిలో 12 సబ్సిడీ సిలిండర్ల కోటా పూర్తిచేసుకున్న వారు, సబ్సిడీని వదులుకున్న వారు ఇకపై ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్‌కు రూ.737.50 చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరను కూడా చమురు కంపెనీలు 13 పైసలు పెంచాయి. దీంతో 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర 434.93కి చేరింది. విమానయాన రంగంలో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) ధరను కిలో లీటర్‌కు రూ.214 పెంచారు. దీంతో ఇది రూ.54293.38కి చేరింది. మార్చి 1 నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. -
కరెంటు ఉంటే..కిరోసిన్ కట్!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా గ్యాస్ సబ్సిడీ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిన ప్రభుత్వం తాజాగా సబ్సిడీపై కిరోసిన్ పొందుతున్నవారిపై దృష్టి పెట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం విద్యుత్ సదుపాయం ఉన్న గృహాలను గుర్తించి.. ఆ ఇళ్లకు సబ్సిడీ కిరోసిన్ సదుపాయాన్ని నిలిపేయాలనే ప్రతిపాదన తమకు వచ్చిందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం వెల్లడించారు. ఆ ప్రతిపాదనను అధ్యయనం చేసిన తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ, రిటైల్ మార్కెట్లో ధరను సమయం వచ్చినప్పుడు తగ్గిస్తామని ప్రధాన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం కిరోసిన్ సబ్సిడీ కోసం రూ. 30,575 కోట్లను, ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ. 46,458 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.నగదు బదిలీ వల్ల ఎల్పీజీ సబ్సీడీ భారాన్ని 15శాతం తగ్గించుకుంది. -
12 వేల సబ్సిడీ కనెక్షన్లు వెనక్కి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 12,450 మంది వినియోగదారులు తమ సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లను స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేశారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, 15 కోట్ల మంది వంటగ్యాస్ వినియోగదారుల్లో వెనక్కి ఇచ్చినవి 0.008 శాతమేనని లోక్‌సభలో సోమవారం పెట్రోలియం మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. అవసరార్థులకు సబ్సిడీ గ్యాస్ అందుబాటులో ఉండేందుకు వీలుగా ధనికులు తమ గ్యాస్ సబ్సిడీలను వెనక్కి ఇచ్చేందుకు ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం 2012లో పిలుపునివ్వగా మోదీ సర్కారు కూడా అలాంటి ప్రకటనే చేసింది. దేశవ్యాప్తంగా గ్యాస్‌కు నగదు బదిలీ వచ్చే ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా వంటగ్యాస్ వినియోగదారులు అందరూ సిలిండర్లను మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తొలివిడతగా వివిధ రాష్ట్రాల్లోని 54 జిల్లాల్లో నవంబర్ 15 నుంచి వంటగ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుండగా... ఈ ప్రక్రియను కేంద్రం జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. www.myLPG.in వెబ్‌సైట్‌ను హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోకి తీసుకురావాలని మంత్రి ప్రధాన్ ఆదేశించారు. కాగా, బ్యాంకు ఖాతాలతో 10 కోట్ల ఆధార్ నంబర్లు అనుసంధానమయ్యాయని విశిష్ట గుర్తింపు సంస్థ తెలిపింది. గంగాజలాల తీవ్రస్థాయి కాలుష్యానికి కారణమైన 764 పరిశ్రమలను కాలుష్య నియంత్రణ మండల గుర్తించిందని, వాటిలో 687 యూపీలో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. -
అంతా గ్యాస్
ఒంగోలు: ప్రతిపక్షంలో ఉండగా ఆధార్ వద్దు....రాయితీనే ముద్దు అంటూ ధర్నాలు, ఆందోళనలు నిర్వహించిన టీడీపీ, బీజేపీలు సీటు ఎక్కగానే నిస్సిగ్గుగా ఆ బాటనే పడుతున్నాయి. రాయితీ గ్యాస్‌కూ ఆధార్ తప్పనిసరిచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్యాస్ వినియోగదారులను బెంబేలెత్తించేలా చేస్తోంది. ఏతావాతా ఏడాదికి కనీసంగా రూ.27.14 కోట్లు భారం తప్పనిసరిగా మారనుంది. ఈ నేపథ్యంలో ‘కట్టె పొయ్యిలు వద్దు... గ్యాస్ వాడకమే ముద్దు’ అనే సామాజిక లక్ష్యం అర్థమే మారిపోతోంది. జిల్లాలో మొత్తం 5.79 లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీటిలో 5.22 లక్షలమంది వినియోగదారులు ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నట్లు అధికారిక సమాచారం. దీని ప్రకారం ఇంకా ఆధార్ అనుసంధానం చేసుకోని వారి సంఖ్య 57 వేలపైమాటే. అంటే 5.79 లక్షల మంది గ్యాస్‌ను బుక్‌చేసుకుంటే వారికి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. ఆధార్‌తో సంబంధం లేకుండా ఇచ్చే సిలిండర్ ధర రూ.449. ఒంగోలులో ఎల్పీజీ హెచ్‌పీ కంపెనీ సిలిండర్ ధర రూ.449లు . ఆధార్ లేని వారికి రాబోయే మూడు నెలలపాటు ఇదే ధరకు సిలిండర్‌ను సరఫరా చేస్తారు. ఆ తరువాత మూడు నెలలు మాత్రం బహిరంగ రేటుకు కొనుగోలుచేసుకోవాలి. అయితే మే 15వ తేదీలోపు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. అప్పటివరకు అంటే మూడు నెలల్లోగా బుక్ చేసుకున్న సిలిండర్లకు సంబంధించి రాయితీ వారి బ్యాంకు ఖాతాకు జమవుతుందన్నమాట. ఏటా భారం రూ.27.14 కోట్లు ఒక్కో కనెక్షన్‌కు సంబంధించి ఏడాదికి 12 సిలిండర్లను రాయితీపై ఇస్తారు. మరీ పేద వర్గాలకు వినియోగం తక్కువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సగటున ప్రతి కనెక్షన్‌కు ఏడాదికి 9 సిలిండర్ల చొప్పున కొనుగోలు జరిగాయని భావిస్తే అమ్ముడైన మొత్తం సిలిండర్ల సంఖ్య 46.98 లక్షలుగా ఉంటుంది. ప్రస్తుతం గ్యాస్ కంపెనీలు ఒక్కో సిలిండర్‌పై పాతిక రూపాయల భారం మాత్రమే పడుతుందని చెబుతున్నప్పటికీ వాస్తవంగా అంతకంటే ఎక్కువే భారం పడుతుందని గత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2013 డిసెంబర్ 12వ తేదీన ఒంగోలు మార్కెట్లో సబ్సిడీ సిలిండర్ ధర రూ.420.50. కానీ ఆధార్ సీడింగ్ అయిన వారికి అంటే నగదు బదిలీ పథకానికి అర్హులైనవారికి విక్రయించిన సిలిండర్ ధర రూ.1111.50. అంటే రెండింటి మధ్య వ్యత్యాసం రూ.691. కానీ బ్యాంకు ఖాతాలలో జమ పడిన మొత్తం మాత్రం రూ.633.50. అంటే ప్రభుత్వం రాయితీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటూ ప్రకటించి రూ.57.64 అదనపు భారం ప్రజానీకం మీదరుద్దింది. ఇది ఎల్పీజీకి సంబంధించి వ్యాట్ భారం అన్నమాట. అంటే కంపెనీ ఇచ్చే మొత్తానికి, రాయితీ మొత్తానికి వ్యాట్ భారం మాత్రం ప్రజలపైనే రద్దడం ద్వారా కొంతమేర భారాన్ని ప్రభుత్వాలు తగ్గించుకుంటూ ఆ మొత్తాన్ని వినియోగదారులపైనే నెత్తేయడం గమనించవచ్చు. ఆ ప్రకారమే సాగితే ప్రతి ఏటా జిల్లా వినియోగదారులపై ఏటా రూ.27.14 కోట్లు అదనపు భారం పడనుంది. ముందుగా బుక్‌చేసుకున్నా డీబీటీ పరిధిలోకే... గ్యాస్ కోసం ఓ వ్యక్తి ఈ నెల 9వ తేదీన బుక్చేసుకున్నాడనుకుందాం. ఇది ఆన్లైన్ కావడంతో బుక్‌చేసుకోగానే అతని సెల్‌కు రిఫరెన్స్ నెంబర్ అంటూ ఇండేన్ గ్యాస్ కంపెనీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అయితే గతంలో ఆన్లైన్ సిస్టం అందుబాటులోకి తెచ్చిన కొత్తలో హెచ్‌పీ కంపెనీ మాత్రం సిలిండర్ ఎప్పుడు డెలివరీ ఇచ్చేది కూడా తెలియజేసేది. కానీ ప్రస్తుతం ఇండేన్గ్యాస్ను బుక్‌చేసుకుంటే బుక్ చేసుకున్నట్లుగా ఒక మెసేజ్‌ను మాత్రమే పంపిస్తుంది. దానికి రిఫరెన్స్ అంటూ ఇస్తుంది. దాని ప్రకారం ఈ నెల 9వ తేదీ బుక్ చేసుకున్న వినియోగదారుడి రిఫరెన్స్ నెంబర్ 233638. అయితే ఈనెల 17వ తేదీవరకు కూడా సిలిండర్ అందలేదు. సరికదా ...డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీము అందుబాటులోకి రావడంతో తనకు రాయితీ సిలిండర్ ఇస్తారా...లేక డీబీటీ కింద డబ్బులు చెల్లించాలా అనే సందేహంతో టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేస్తే వారు చెప్పిన సమాధానం విని షాక్ తినడం వినియోగదారుడి వంతైంది. ఈ నెల 15వ తేదీనుంచి డీబీటీ అమలులోకి వచ్చినందున మీరు మరోమారు మీ రీఫిల్‌ను బుక్‌చేసుకోండి...అప్పటికి రాకుంటే మీ ఫిర్యాదును స్వీకరిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఒక పక్క సిలిండర్ ఖాళీ అయిపోవస్తుంటే మరో మారు బుక్చేసుకోవాలంటూ వచ్చిన ఉచిత సలహా మరింత ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో మరో మారు బుక్ చేసుకునేందుకు ఫోన్‌చేయడం ఆలస్యం....మీరు రీఫిల్‌ను బుక్‌చేసుకున్న తేదీ ఈ నెల 15వ తేదీ అంటూ ప్రకటించడం ఆశ్చర్యకరం. అంటే ఈనెల 14వ తేదీవరకు బుక్‌చేసుకున్న వినియోగదారులకు గ్యాస్‌ను సరఫరా చేయకుండా ...ఈ నెల 15వ తేదీన బుక్ చేసుకున్నట్లుగా వారికి వారే మార్చేసుకున్నారు. కొరవడనున్న సామాజిక లక్ష్యం: సాధారణంగా గృహిణికి వంటింటి బాధలు తప్పించడంలో ఎల్పీజీ గ్యాస్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. తొలుత వాటి వినియోగం కేవలం చాలా కొద్దిమందికే పరిమితమైనా రాను...రాను ప్రభుత్వం తీసుకువచ్చిన చైతన్యంతో నేడు నిరుపేదల ఇళ్ళల్లోను గ్యాస్ పొయ్యిలు ప్రత్యక్షమయ్యాయి. అయితే గత ఏడాది నగదు బదిలీ అమలులో ఉన్న సమయంలో ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లను తీసుకువెళ్లినా గ్రామంలో తమ వద్ద అంత మొత్తం లేదంటూ తిప్పి పంపిన సందర్భాలు అధికమవుతున్నాయి. దీంతో పల్లెటూర్లకు వాహనాల ద్వారా డెలివరీ ఇవ్వాలంటేనే గ్యాస్ ఏజెన్సీలు తటపటాయించే పరిస్థితి ఏర్పడింది. దీంతో జనం తిరిగి కట్టెల పొయ్యిలకు ఆలవాటు పడబోతున్న తరుణంలో నగదు బదిలీ పథకాన్ని నిలిపివేయడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా మళ్లీ ప్రారంభించడంతో జనంలో అలజడి ప్రారంభమైంది. -
రాయితీ గ్యాస్ పక్కదారి
వేంపాడులో వంట గ్యాస్ రాకెట్ యథేచ్ఛగా రాయితీ గ్యాస్ అమ్మకం వ్యాపారులతో కుమ్మక్కయిన ఏజెన్సీలు విడిపించుకోని సిలెండర్లతో వ్యాపారం నాలుగు నెలల్లో 55 సిలెండర్ల స్వాధీనం రాయితీ గ్యాస్ సిలెండర్లు పక్కదారి పడుతున్నాయి. వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఏటా నాలుగుకు మించి విడిపించని వారి సిలెండర్లు అధిక ధరకు అమ్ముడవుతున్నాయి. భారీగా సాగుతున్న ఈ వ్యవహారం వెనక గ్యాస్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. వేంపాడు కేంద్రంగా ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. పౌర సరఫరాల శాఖ మొద్దు నిద్రలో జోగుతోంది. నక్కపల్లి, న్యూస్‌లైన్ : వేంపాడు కేంద్రంగా అక్రమ గ్యాస్ సిలెండర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. తూర్పుగోదావ రి జిల్లా గొల్లప్రోలు, చేబ్రోలు తదితర ప్రాంతాలకు చెందిన కొందరు వ్యాపారులు, స్థానికులు, గ్యాస్‌ఏజెన్సీ నిర్వాహకులతో కుమ్మక్కయి గ్యాస్ సిలెండర్లను, రాయితీ గ్యాస్‌ను పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయించి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఒక్కొక్క సిలెండర్‌పై రూ.800 నుంచి రూ.1000 లాభం వస్తోంది. కాసులు కురిపిస్తున్న రాయితీ గ్యాస్ నాలుగు నెలల్లో హెచ్‌పీ, బారత్ గ్యాస్ కంపెనీలకు చెందిన 55 సిలెండర్లు వేంపాడు కూడలిలో పోలీసులకు పట్టుబడ్డాయి. ఈ వ్యాపారానికి సమీప గ్యాస్ ఏజెన్సీల సహకారం ఉందన్న ఆరోపణలున్నాయి. వినియోగదారులకు ప్రస్తుతం ఏటా 9 సిలెండర్లను రాయితీపై సరఫరా చేస్తున్నారు. చాలామంది దీపం లబ్దిదారులు ఏడాదికి నాలుగు సిలెండర్లకు మించి విడిపించుకోకపోవడం ఏజెన్సీలకు కాసులు కురిపిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి ఖాళీ సిలెండర్లను తీసుకొచ్చి జాతీయరహదారిని ఆనుకుని వేంపాడు సమీప ప్రాంతాల్లోని తోటలు, మారుమూల ప్రాంతాల్లో ఉంచుతున్నారు. ఈ వ్యాపారానికి వేంపాడు, ఉద్దండపురం గ్రామాలకు చెందిన కొందరి సహకారం ఉంది. డోర్ డెలివరీ పేరుతో ఏజెన్సీ నిర్వాహకులు కూడా తమ వాహనాల్లో నిండు సిలెండర్లను ఈ వ్యాపారం జరిగే స్థావరాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యాపారం ఇటీవల నక్కపల్లి పోలీసుల కంటపడింది. నాలుగు నెలల క్రితం ఎస్ఐ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు వేంపాడు కొత్తురు వద్ద 42 గ్యాస్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అక్రమమని గుర్తించి కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసారు. వీరిలో ఒకరు స్థానికుడు కాగా మరొకరు తునికి చెందిన వ్యాపారి. తాజాగా ఈనెల13వ తేదీన ఇదే వేంపాడు కూడలిలో ఆటోలో తీసుకొస్తున్న 14 ఖాళీ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. కిరాణా వ్యాపారుల హస్తం వేంపాడుతోపాటు నక్కపల్లిలో కూడా పలువురు కిరాణా వ్యాపారులు అక్రమంగా సిలండర్లను నిల్వ ఉంచి ఏజెన్సీలతో కుమ్మక్కయి గ్యాస్ విడిపించి రూ.1200 నుంచి రూ.1500కి విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పౌర సరఫరాల శాఖ అధికారుల కంటపడకపోవడం ఆశ్చర్యకరం. ఈ నెల 13వ తేదీన పట్టుబడ్డ సిలెండర్లను పోలీసులు పౌర సరఫరాల శాఖాధికారులకు అప్పగించడంతో వాటిని తీసుకొచ్చిన వాహనం, వ్యక్తులపై 6-ఏ కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి సారించి గ్యాస్ సిలెండర్ల రాకెట్ గుట్టు రట్టు చేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. -
బ్లాక్‌లో మండుతున్న సబ్సిడీ గ్యాస్
నక్కపల్లి, న్యూస్‌లైన్: నక్కపల్లి మండలంలో గ్యాస్ కృత్రిమ కొరత ఏర్పడింది. సిలిండర్ ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగబాకింది. ఫలితంగా గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో రాజ్యమేలుతున్నాయి. సబ్సిడీపై వినియోగదారులకు ఇవ్వాల్సిన వంట గ్యాస్‌ను కొంతమంది ఏజెన్సీ నిర్వాహకులు అక్రమ వ్యాపారులతో కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధిక ధరలకు విక్రయించి రెట్టింపు లాభం కోసం తమకు గ్యాస్ అందకుండా చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారని, నెలలు గడుస్తున్నా సిలెండర్ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. నక్కపల్లి, కాగిత, పెదతీనార్ల ,చినతీనార్ల, ఉపమాక, తదితర గ్రామాల వినియోగదారులకు అడ్డురోడు, యలమంచిలి తదితర పట్టణాల్లో ఉన్న గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా అవుతోంది. సబ్సిడిపై రూ.450లకు లభించే గ్యాస్ బ్లాక్ మార్కెట్లో రూ.1000 నుంచి 1500లకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. నక్కపల్లి, ఉపమాకలలో సుమారు 15 వరకు బ్లాక్‌లో గ్యాస్ విక్రయించే కేంద్రాలున్నాయి. సబ్సిడీపై గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్లను కాఫీ హోటళ్లు, వెల్డింగ్ షాపులు, నక్కపల్లి పరిసరాల్లోని కంపెనీల క్యాంటీన్లకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నక్కపల్లిలో ఒక నెలలో 100 మందికి డోర్ డెలివరీ చేయాల్సి ఉండగా గట్టి గా నిలదీసే వారికిచ్చి, మిగిలిన వారికి ఆధార్ కార్డు లేదనో, బ్యాంక్ అకౌంట్ లేదనో సాకులు చూపి బ్లాక్‌లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమకు సబ్సీడీపై దక్కాల్సిన గ్యాస్‌ను బ్లాక్‌లో రెట్టింపు ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. అలాగే ఇటీవల దీపం పథకం కింద ఇబ్బడి ముబ్బడిగా కనెక్షన్లు మంజూరు చేశారు. వీరిలో చాలామంది గ్యాస్ విడిపించుకోవడంలేదు, వారి గ్యాస్‌ను కూడా పక్కదారిపట్టిస్తున్నారు. ప్రభుత్వ శాఖల సిబ్బంది సమైక్య బంద్‌లో ఉండటం వల్ల ఏజెన్సీలు, అక్రమ వ్యాపారుల ఆగడాలు మరీ ఎక్కువయ్యాయి. ఉన్నతాధికారులు అక్రమ గ్యాస్ సిలెండర్ల నిల్వ కేంద్రాలపై దాడులు చేసి సబ్సిడీ గ్యాస్ పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.