నక్కపల్లి, న్యూస్‌లైన్: నక్కపల్లి మండలంలో గ్యాస్ కృత్రిమ కొరత ఏర్పడింది. సిలిండర్ ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగబాకింది. ఫలితంగా గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో రాజ్యమేలుతున్నాయి. సబ్సిడీపై వినియోగదారులకు ఇవ్వాల్సిన వంట గ్యాస్‌ను కొంతమంది ఏజెన్సీ నిర్వాహకులు అక్రమ వ్యాపారులతో కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధిక ధరలకు విక్రయించి రెట్టింపు లాభం కోసం తమకు గ్యాస్ అందకుండా చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు.
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారని, నెలలు గడుస్తున్నా సిలెండర్ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. నక్కపల్లి, కాగిత, పెదతీనార్ల ,చినతీనార్ల, ఉపమాక, తదితర గ్రామాల వినియోగదారులకు అడ్డురోడు, యలమంచిలి తదితర పట్టణాల్లో ఉన్న గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా అవుతోంది. సబ్సిడిపై రూ.450లకు లభించే గ్యాస్ బ్లాక్ మార్కెట్లో రూ.1000 నుంచి 1500లకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు.
నక్కపల్లి, ఉపమాకలలో సుమారు 15 వరకు బ్లాక్‌లో గ్యాస్ విక్రయించే కేంద్రాలున్నాయి. సబ్సిడీపై గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్లను కాఫీ హోటళ్లు, వెల్డింగ్ షాపులు, నక్కపల్లి పరిసరాల్లోని కంపెనీల క్యాంటీన్లకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నక్కపల్లిలో ఒక నెలలో 100 మందికి డోర్ డెలివరీ చేయాల్సి ఉండగా గట్టి గా నిలదీసే వారికిచ్చి, మిగిలిన వారికి ఆధార్ కార్డు లేదనో, బ్యాంక్ అకౌంట్ లేదనో సాకులు చూపి బ్లాక్‌లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమకు సబ్సీడీపై దక్కాల్సిన గ్యాస్‌ను బ్లాక్‌లో రెట్టింపు ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.
అలాగే ఇటీవల దీపం పథకం కింద ఇబ్బడి ముబ్బడిగా కనెక్షన్‌లు మంజూరు చేశారు. వీరిలో చాలామంది గ్యాస్ విడిపించుకోవడంలేదు, వారి గ్యాస్‌ను కూడా పక్కదారిపట్టిస్తున్నారు. ప్రభుత్వ శాఖల సిబ్బంది సమైక్య బంద్‌లో ఉండటం వల్ల ఏజెన్సీలు, అక్రమ వ్యాపారుల ఆగడాలు మరీ ఎక్కువయ్యాయి. ఉన్నతాధికారులు అక్రమ గ్యాస్ సిలెండర్ల నిల్వ కేంద్రాలపై దాడులు చేసి సబ్సిడీ గ్యాస్ పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
బ్లాక్‌లో మండుతున్న సబ్సిడీ గ్యాస్
Published Mon, Sep 2 2013 2:04 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement
Advertisement