అంతా గ్యాస్ | aadhar card should be to subsidy gas | Sakshi
Sakshi News home page

అంతా గ్యాస్

Published Tue, Nov 18 2014 2:00 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM

అంతా గ్యాస్ - Sakshi

అంతా గ్యాస్

ఒంగోలు: ప్రతిపక్షంలో ఉండగా ఆధార్ వద్దు....రాయితీనే ముద్దు అంటూ ధర్నాలు, ఆందోళనలు నిర్వహించిన టీడీపీ, బీజేపీలు సీటు ఎక్కగానే నిస్సిగ్గుగా ఆ బాటనే పడుతున్నాయి. రాయితీ గ్యాస్‌కూ ఆధార్ తప్పనిసరిచేస్తూ  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్యాస్ వినియోగదారులను బెంబేలెత్తించేలా చేస్తోంది. ఏతావాతా ఏడాదికి కనీసంగా రూ.27.14 కోట్లు భారం తప్పనిసరిగా మారనుంది. ఈ నేపథ్యంలో ‘కట్టె పొయ్యిలు వద్దు... గ్యాస్ వాడకమే ముద్దు’ అనే సామాజిక లక్ష్యం అర్థమే మారిపోతోంది.

  జిల్లాలో మొత్తం 5.79 లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీటిలో 5.22 లక్షలమంది వినియోగదారులు ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నట్లు అధికారిక సమాచారం. దీని ప్రకారం ఇంకా ఆధార్ అనుసంధానం చేసుకోని వారి సంఖ్య 57 వేలపైమాటే. అంటే 5.79 లక్షల మంది గ్యాస్‌ను బుక్‌చేసుకుంటే వారికి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది.

ఆధార్‌తో
 సంబంధం లేకుండా ఇచ్చే సిలిండర్ ధర రూ.449.  ఒంగోలులో ఎల్‌పీజీ హెచ్‌పీ కంపెనీ సిలిండర్ ధర రూ.449లు . ఆధార్ లేని వారికి రాబోయే మూడు నెలలపాటు ఇదే ధరకు సిలిండర్‌ను సరఫరా చేస్తారు. ఆ తరువాత మూడు నెలలు మాత్రం బహిరంగ రేటుకు కొనుగోలుచేసుకోవాలి. అయితే మే 15వ తేదీలోపు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. అప్పటివరకు అంటే మూడు నెలల్లోగా బుక్ చేసుకున్న సిలిండర్లకు సంబంధించి రాయితీ వారి బ్యాంకు ఖాతాకు జమవుతుందన్నమాట.
 
ఏటా భారం రూ.27.14 కోట్లు
 ఒక్కో కనెక్షన్‌కు సంబంధించి ఏడాదికి 12 సిలిండర్లను రాయితీపై ఇస్తారు. మరీ పేద వర్గాలకు వినియోగం తక్కువుగా ఉంటుంది.  ఈ నేపథ్యంలో సగటున ప్రతి కనెక్షన్‌కు ఏడాదికి 9 సిలిండర్ల చొప్పున కొనుగోలు జరిగాయని భావిస్తే అమ్ముడైన మొత్తం సిలిండర్ల సంఖ్య 46.98 లక్షలుగా ఉంటుంది. ప్రస్తుతం గ్యాస్ కంపెనీలు ఒక్కో సిలిండర్‌పై పాతిక రూపాయల భారం మాత్రమే పడుతుందని చెబుతున్నప్పటికీ వాస్తవంగా అంతకంటే ఎక్కువే భారం పడుతుందని గత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

2013 డిసెంబర్ 12వ తేదీన ఒంగోలు మార్కెట్‌లో సబ్సిడీ సిలిండర్ ధర రూ.420.50. కానీ ఆధార్ సీడింగ్ అయిన వారికి అంటే నగదు బదిలీ పథకానికి అర్హులైనవారికి విక్రయించిన సిలిండర్ ధర రూ.1111.50. అంటే రెండింటి మధ్య వ్యత్యాసం రూ.691. కానీ బ్యాంకు ఖాతాలలో జమ పడిన మొత్తం మాత్రం రూ.633.50. అంటే ప్రభుత్వం రాయితీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటూ ప్రకటించి రూ.57.64 అదనపు భారం ప్రజానీకం మీదరుద్దింది.

ఇది ఎల్‌పీజీకి సంబంధించి వ్యాట్ భారం అన్నమాట. అంటే కంపెనీ ఇచ్చే మొత్తానికి, రాయితీ మొత్తానికి వ్యాట్ భారం మాత్రం ప్రజలపైనే రద్దడం ద్వారా కొంతమేర భారాన్ని ప్రభుత్వాలు తగ్గించుకుంటూ ఆ మొత్తాన్ని వినియోగదారులపైనే నెత్తేయడం గమనించవచ్చు. ఆ ప్రకారమే సాగితే ప్రతి ఏటా జిల్లా వినియోగదారులపై ఏటా రూ.27.14 కోట్లు అదనపు భారం పడనుంది.

 ముందుగా బుక్‌చేసుకున్నా డీబీటీ పరిధిలోకే...
 గ్యాస్ కోసం ఓ వ్యక్తి ఈ నెల 9వ తేదీన బుక్‌చేసుకున్నాడనుకుందాం. ఇది ఆన్‌లైన్ కావడంతో బుక్‌చేసుకోగానే అతని సెల్‌కు రిఫరెన్స్ నెంబర్ అంటూ ఇండేన్ గ్యాస్ కంపెనీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అయితే గతంలో ఆన్‌లైన్ సిస్టం అందుబాటులోకి తెచ్చిన కొత్తలో హెచ్‌పీ కంపెనీ మాత్రం సిలిండర్ ఎప్పుడు డెలివరీ ఇచ్చేది కూడా తెలియజేసేది.

కానీ ప్రస్తుతం ఇండేన్‌గ్యాస్‌ను బుక్‌చేసుకుంటే బుక్ చేసుకున్నట్లుగా ఒక మెసేజ్‌ను మాత్రమే పంపిస్తుంది. దానికి రిఫరెన్స్ అంటూ ఇస్తుంది. దాని ప్రకారం ఈ నెల 9వ తేదీ బుక్ చేసుకున్న వినియోగదారుడి రిఫరెన్స్ నెంబర్ 233638. అయితే ఈనెల 17వ తేదీవరకు కూడా సిలిండర్ అందలేదు. సరికదా ...డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీము అందుబాటులోకి రావడంతో తనకు రాయితీ సిలిండర్ ఇస్తారా...లేక డీబీటీ కింద డబ్బులు చెల్లించాలా అనే సందేహంతో టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేస్తే వారు చెప్పిన సమాధానం విని షాక్ తినడం వినియోగదారుడి వంతైంది.

ఈ నెల 15వ తేదీనుంచి డీబీటీ అమలులోకి వచ్చినందున మీరు మరోమారు మీ రీఫిల్‌ను బుక్‌చేసుకోండి...అప్పటికి రాకుంటే మీ ఫిర్యాదును స్వీకరిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఒక పక్క సిలిండర్ ఖాళీ అయిపోవస్తుంటే మరో మారు బుక్‌చేసుకోవాలంటూ వచ్చిన ఉచిత సలహా మరింత ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో మరో మారు బుక్ చేసుకునేందుకు ఫోన్‌చేయడం ఆలస్యం....మీరు రీఫిల్‌ను బుక్‌చేసుకున్న తేదీ ఈ నెల 15వ తేదీ అంటూ ప్రకటించడం ఆశ్చర్యకరం. అంటే  ఈనెల 14వ తేదీవరకు బుక్‌చేసుకున్న వినియోగదారులకు గ్యాస్‌ను సరఫరా చేయకుండా ...ఈ నెల 15వ తేదీన బుక్ చేసుకున్నట్లుగా వారికి వారే మార్చేసుకున్నారు.

 కొరవడనున్న సామాజిక లక్ష్యం:
 సాధారణంగా గృహిణికి వంటింటి బాధలు తప్పించడంలో ఎల్‌పీజీ గ్యాస్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. తొలుత వాటి వినియోగం కేవలం చాలా కొద్దిమందికే పరిమితమైనా రాను...రాను ప్రభుత్వం తీసుకువచ్చిన చైతన్యంతో నేడు నిరుపేదల ఇళ్ళల్లోను గ్యాస్ పొయ్యిలు ప్రత్యక్షమయ్యాయి.

అయితే గత ఏడాది నగదు బదిలీ అమలులో ఉన్న సమయంలో ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లను తీసుకువెళ్లినా గ్రామంలో తమ వద్ద అంత మొత్తం లేదంటూ తిప్పి పంపిన సందర్భాలు అధికమవుతున్నాయి.  దీంతో  పల్లెటూర్లకు వాహనాల ద్వారా డెలివరీ ఇవ్వాలంటేనే గ్యాస్ ఏజెన్సీలు తటపటాయించే పరిస్థితి ఏర్పడింది. దీంతో జనం తిరిగి కట్టెల పొయ్యిలకు ఆలవాటు పడబోతున్న తరుణంలో నగదు బదిలీ పథకాన్ని నిలిపివేయడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా మళ్లీ ప్రారంభించడంతో జనంలో అలజడి ప్రారంభమైంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement