నగరాలలోనే అర లక్ష మందికి.. నో ఆధార్
ఒంగోలు: వందశాతం ఆధార్ సాధించామంటున్న జిల్లా యంత్రాంగం చెబుతున్న మాటలు నీటిమీద బుడగల్లా మారాయి. జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో నివాసం ఉంటున్న అర లక్ష మందికిపైగా జనాభాకు ఆధార్ లేదని మున్సిపల్ వెబ్‌సైట్ స్పష్టం చేస్తోంది. ఇది కూడా కేవలం 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే. ఆధార్ నమోదుకు సంబంధించి మున్సిపల్ శాఖ చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ విషయం స్పష్టమైంది.
2011 జనాభా లెక్కల ప్రకారం పరిశీలిస్తే...
అప్పటి జనాభా లెక్కల ప్రకారం ఒంగోలు నగరపాలక సంస్థ, మూడు మున్సిపాల్టీలు, నాలుగు నగర పంచాయతీల పరిధిలో నివాసం ఉంటున్న జనాభా 6,22,425 మంది. వారిలో ఇప్పటివరకు 5,71,089 మందికి మాత్రమే ఆధార్ కార్డులు న్నాయి. అంటే 51, 336 మందికి ఆధార్ కార్డులు లేవని మున్సిపల్ వెబ్‌సైట్ స్పష్టం చెస్తోంది. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో 15,161, అద్దంకిలో4,669, చీమకుర్తిలో 4,179, చీరాలలో 6,700, గిద్దలూరు 5303, కందుకూరులో 2,584, కనిగిరిలో 4920, మార్కాపురం7,820 మంది ఆధార్‌కు దూరంగా ఉన్నారు.
ఆధార్ అనుసంధానంతో అష్టకష్టాలు..
ప్రతి ఇంటికీ ఆధార్ అనుసంధానం కావాలి. అనుసంధానం చేస్తేనే ఇంటి పన్ను కట్టించుకోవాలి. వందశాతం ఆధార్ సీడింగ్ చేయాల్సిన బాధ్యత అధికారులదే అంటూ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. వాస్తవానికి నగరాలలో నివాసం ఉండేవారిలో 5,704 గృహాలకు ఆధార్‌ను సీడింగ్ చేయలేని పరిస్థితి. అందుకు కారణం లేకపోలేదు. గృహ యజమానులు ఆధార్ నమోదుచేయించుకున్నా ఇంతవరకు వారికి ఆధార్ కార్డులు అందకపోవడమే కారణమని మున్సిపల్ వెబ్‌సైట్ ద్వారా స్పష్టమవుతోంది.
ఒంగోలు నగరపాలక సంస్థ, మూడు మున్సిపాల్టీలు, నాలుగు నగర పంచాయతీలలో కలిపి మొత్తం 1,25,644 గృహాలున్నాయి. వీటిలో ఇప్పటివరకు 71,530 గృహాలకు ఆధార్ సీడింగ్ పూర్తిచేశారు. మరో 54,114 గృహాలకు సీడింగ్ చేయాల్సి ఉంది. వాటిలో 20,082 గృహాలకు సంబంధించి గృహ యజమానుల పేర్లను మార్చాల్సి ఉంది. మరో 20,451 గృహాలకు యజమానులు అందుబాటులో లేరని చూపిస్తున్నారు. ఇది కాకుండా మరో 5,704 గృహాలకు యజమానులు తమకు ఆధార్ కార్డులే రాలేదని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే 618 ప్రభుత్వ భవనాలున్నాయి. వాటికి ఎవరి ఆధార్‌ను అనుసంధానం చేయాలనేది ప్రస్తుతం జరుగుతున్న తర్జన భర్జన. ఇవి కాకుండా 3,705 గృహాలకు సంబంధించి ఇంటి యజమానుల వివరాలను వెబ్‌సైట్ తిరస్కరిస్తోంది. అందుకు కారణం గతంలో పేర్ల నమోదు సమయంలో జరిగిన చిన్న చిన్న లోపాల కారణంగా వెబ్‌సైట్లు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమస్య కూడా కేవలం ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో 2,465, గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో 1,240 సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే లక్షల్లోనే...
ఆధార్ కార్డులు రాకపోవడంతో పింఛన్లు ఆగిన వారు కొందరైతే, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నోచుకోక తల్లడిల్లుతున్న వారు ఇంకొందరు. ఇక చేతిలో ఆధార్ తీయించుకున్నట్లు కాగితాలుంటున్నా వెబ్‌సైట్ మాత్రం అండర్ ప్రాసెస్ అనో, లేక తిరస్కరించినట్లో పేర్కొంటుండడంతో నెలవారీ రేషన్‌కు సైతం అనేకమందికి కోత పడింది. ఈ నాలుగేళ్లలో కనీసంగా మరో 15 వేలమందైనా జనాభా పెరిగే ఉంటారు. అంటే మొత్తంగా నగరాలలోనే ఆధార్ కార్డులు లేనివారి సంఖ్య 65వేలకుపైమాటే అన్నమాట. మరి...జిల్లా వ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే లక్షల్లో ఉంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.