12 వేల సబ్సిడీ కనెక్షన్లు వెనక్కి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 12,450 మంది వినియోగదారులు తమ సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లను స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేశారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, 15 కోట్ల మంది వంటగ్యాస్ వినియోగదారుల్లో వెనక్కి ఇచ్చినవి 0.008 శాతమేనని లోక్‌సభలో సోమవారం పెట్రోలియం మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. అవసరార్థులకు సబ్సిడీ గ్యాస్ అందుబాటులో ఉండేందుకు వీలుగా ధనికులు తమ గ్యాస్ సబ్సిడీలను వెనక్కి ఇచ్చేందుకు ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం 2012లో పిలుపునివ్వగా మోదీ సర్కారు కూడా అలాంటి ప్రకటనే చేసింది.
దేశవ్యాప్తంగా గ్యాస్‌కు నగదు బదిలీ
వచ్చే ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా వంటగ్యాస్ వినియోగదారులు అందరూ సిలిండర్‌లను మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తొలివిడతగా వివిధ రాష్ట్రాల్లోని 54 జిల్లాల్లో నవంబర్ 15 నుంచి వంటగ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుండగా... ఈ ప్రక్రియను కేంద్రం జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. www.myLPG.in వెబ్‌సైట్‌ను హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోకి తీసుకురావాలని మంత్రి ప్రధాన్ ఆదేశించారు. కాగా, బ్యాంకు ఖాతాలతో 10 కోట్ల ఆధార్ నంబర్లు అనుసంధానమయ్యాయని విశిష్ట గుర్తింపు సంస్థ తెలిపింది. గంగాజలాల తీవ్రస్థాయి కాలుష్యానికి కారణమైన 764 పరిశ్రమలను కాలుష్య నియంత్రణ మండల గుర్తించిందని, వాటిలో 687 యూపీలో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.