గతంలో రూ.150 – 250 దాటని ఇంటికి ఏకంగా రూ.5 వేలు
అపరాధ రుసుముతో ముక్కు పిండి మరీ వసూలు
వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన
ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న కరెంట్ బిల్లులు
నవంబర్‌తో పోలిస్తే భారీగా పెరిగిన విద్యుత్తు చార్జీలు
ఇక వేసవిని తలుచుకుంటే ముచ్చెమటలే
ఇప్పటికే రూ.6,072.86 కోట్ల వసూలు ప్రారంభం
జనవరి నుంచి మరో రూ.9412.50 కోట్ల బాదుడు
సంపద సృష్టిస్తానంటూ జనం నెత్తిన రూ.15,485.36 కోట్ల చార్జీల భారం మోపిన చంద్రబాబు
ఎవరిదీ అపరాధం?
శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎన్టీఆర్ కాలనీలో నివసించే గృహిణి విజయ ఇంటికి ఈసారి రూ.4,950 కరెంట్ బిల్లు రావడంతో ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. జనరల్ కేటగిరీకి చెందిన ఆమె ఇంటికి గతంలో బిల్లు ఎప్పుడూ రూ.150 నుంచి రూ.250 దాటలేదు. 3 నెలలుగా బిల్లు ఇవ్వకుండా డిసెంబర్‌లో షాక్ కొట్టేలా బిల్లు ఇచ్చారు. దీనిపై ఆమె పలుమార్లు విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లినా ఫలితం శూన్యం. దీంతో గత్యంతరం లేక అపరాధ రుసుముతో సహా రూ.5 వేలు బిల్లు చెల్లించినట్లు బాధితురాలు తెలిపారు.
ఇంతలో ఎంత భారం!
పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముగూడెంలో నివసించే వెలిశెట్టి అచ్చుత గణేష్ వ్యవసాయదారుడు. ఆయన ఇంటికి సెపె్టంబర్‌లో 139 యూనిట్లు విద్యుత్ వినియోగించగా రూ.684.53 బిల్లు వచ్చింది. ఇప్పుడు శీతాకాలం కావడంతో వాడకం తగ్గింది. నవంబర్‌లో కేవలం 115 యూనిట్లు మాత్రమే వాడినా బిల్లు మాత్రం రూ.756.97 వచ్చింది. 24 యూనిట్లు తక్కువ వాడినప్పటికీ బిల్లు రూ.72.44 పెరిగింది.
పైగా ఇందులో గణేష్ వినియోగించిన విద్యుత్‌కు చెల్లించాల్సిన చార్జీ రూ.464.97 మాత్రమే. అంటే కూటమి ప్రభుత్వం ఆయనపై అదనంగా రూ.292 భారం వేసింది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందక.. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులతో సతమతవుతున్న తమపై ఇలా అదనపు భారం మోపడం అన్యాయమని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోణం గణేష్, ‘సాక్షి’ ప్రతినిధి: రాష్ట్రంలో చలితోపాటు కరెంట్ బిల్లులు పొగలు కక్కుతున్నాయి! ప్రతి నెలా పెరిగిపోతున్న విద్యుత్తు చార్జీల బాదుడుకు వినియోగదారులు వణికిపోతున్నారు. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో బిల్లులు భారీగా పెరిగాయి. శీతకాలంలో వాడకం తగ్గినా బిల్లులు మాత్రం పైపైకి వెళుతూనే ఉన్నాయి. గతంలో నెలకు రూ.రెండు మూడొందలు దాటని వారికి సైతం రూ.వేలల్లో బిల్లులు రావడంతో తీవ్ర షాక్‌కు గురవుతున్నారు.
రైతన్నలు, మహిళలు ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదని విద్యుత్తు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు. విద్యుత్తు శాఖ సిబ్బంది అపరాధ రుసుముతో సహా బిల్లులు వసూలు చేస్తున్నారు. రూ.6,000 కోట్ల విద్యుత్తు చార్జీల బాదుడుకే బిల్లులు ఇంత భారీగా పెరిగితే ఇక జనవరి నుంచి అదనంగా మరో రూ.9 వేల కోట్లకుపైగా భారం పడనుండటంతో ఏ స్థాయిలో బిల్లులు జారీ అవుతాయోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది.
మొత్తంగా రూ.15,485.36 కోట్ల విద్యుత్ చార్జీల పిడుగును టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై వేస్తోంది. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని, అవసరమైతే ఇంకా తగ్గిస్తామని నమ్మబలికిన సీఎం చంద్రబాబు కనీవినీ ఎరుగని రీతిలో హై ఓల్టేజీ షాకులిస్తున్నారు. సంపద సృష్టిస్తానంటూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారు.
సబ్సిడీలు లేవ్.. చార్జీల బాదుడే
గతంలో టీడీపీ అధికారంలో ఉండగా దాదాపు రూ.20 వేల కోట్ల సర్దుబాటు చార్జీలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అంటగట్టి దిగిపోయింది. అయినా సరే ఆ భారాన్నంతా ప్రజలపై మోపకుండా గత ప్రభుత్వం డిస్కంలకు సకాలంలో రాయితీలు అందించింది.
2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీల కింద చెల్లించగా వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా రూ.47,800.92 కోట్లను అందించింది. చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. తాజాగా కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించకుండా వినియోగదారులపైనే చార్జీల భారాన్ని మోపుతోంది.
ఇదేం బాదుడు బాబూ!
విద్యుత్ చార్జీలు పెంచి మధ్య తరగతి ప్రజలపై ఈ ప్రభుత్వం పెను భారం మోపుతోంది. అకో్టబర్ నెలలో 140 యూనిట్లు వాడితే రూ.694 బిల్లు వచ్చింది. నవంబర్‌లో 114 యూనిట్లే వాడినా రూ.741 బిల్లు వచ్చింది. ఇదేం బాదుడు బాబూ! తక్కువ వినియోగించినా అదనంగా మాపై భారం మోపడం సరికాదు.
– సుబ్బ రత్తమ్మ, మార్కాపురం, ప్రకాశం జిల్లా
⇒ విశాఖలోని ఆరిలోవలో ఓ ఇంటికి నవంబర్‌లో 150 యూనిట్లకు రూ.705.69 బిల్లు వచ్చింది. డిసెంబర్ 10న తీసిన రీడింగ్‌లో 131 యూనిట్లకు రూ.816.79 బిల్లు జారీ అయింది.
⇒ కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన మహమ్మద్ రఫీ వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన దుకాణానికి 55 యూనిట్లు విద్యుత్ వినియోగించినందుకు నవంబర్‌లో రూ.599 బిల్లు వచ్చింది. ఈ నెల 58 యూనిట్లు వాడగా రూ.794 బిల్లు జారీ చేశారు. కేవలం మూడు యూనిట్లు అదనంగా వాడినందుకు రూ.195 ఎక్కువగా బిల్లు వచ్చింది.
ఇలా బాదేస్తున్నారు..
విద్యుత్ చార్జీలు భారీగా పెరిగాయి. గత నెల కంటే ఈ నెల వినియోగం తక్కువగా ఉన్నా బిల్లు తగ్గలేదు. అదనపు చార్జీలంటూ వేశారు. వ్యవసాయం చేసుకుని బతికేవాళ్లం. ఇంతంత బిల్లులు మేమెలా కట్టగలం? కరెంటు చార్జీలు పెంచబోమని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడేమో ఇలా బాదేస్తున్నారు.
– చిగురుపాటి మహేష్, కొమ్ముగూడెం.
మా డబ్బులతో సంపద సృష్టి!
శీతాకాలం కావడంతో ఇంట్లో ఫ్యాను కూడా సరిగ్గా వాడటం లేదు. పగలంతా పొలాల్లోనే పనులు చేసుకుంటూ ఉంటాం. సాయంత్రానికి ఇంటికొస్తాం. విద్యుత్ వాడకం బాగా తక్కువ. బిల్లులు మాత్రం బాగా పెరిగిపోయాయి. సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెబితే నిజమనుకున్నాం. కానీ ఇలా మాపై భారం వేసి మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి పెంచుతారనుకోలేదు.
– సూర్పని గోపీకృష్ణ, రైతు, కొమ్ముగూడెం.
ఫెర్రో అల్లాయిస్‌పై పెను భారం
ఫెర్రో అల్లాయిస్ కంపెనీల్లో విద్యుత్ చాలా కీలక అంశం. ఇప్పటికే పరిశ్రమ తీవ్ర కష్టాల్లో ఉంది. ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపు మరింత కుంగదీస్తోంది. దీంతో చాలా ఫెర్రో అల్లాయిస్ కంపెనీలు క్యాపిటివ్ పవర్ వైపు మళ్లుతున్నాయి. మేం రాష్ట్రం నుంచి ఒక్క యూనిట్ కూడా కొనుగోలు చేయడం లేదు. పూర్తిగా సొంత విద్యుత్ యూనిట్ నుంచే సమకూర్చుకుంటున్నాం. కానీ గ్రిడ్ సపోర్ట్ చార్జీలు చాలా అధికంగా ఉన్నాయి. వీటిని తగ్గించాలని సుప్రీం కోర్టు దాకా వెళ్లి పోరాడుతున్నాం.
– నీరజ్ శర్దా, డీఎండీ, శర్దా మెటల్స్ అండ్ అల్లాయిస్
మన రాష్ట్రంలో అధికం..
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు అధికంగా ఉండటం పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రతికూలంగా ఉంది. విద్యుత్ చార్జీలను రేషనలైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– పొట్లూరి భాస్కరరావు, ప్రెసిడెంట్, ఏపీ చాంబర్స్
⇒ కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన సత్యనారాయణ శెట్టి ఇంటికి నవంబర్‌లో 98 యూనిట్లకు రూ.482 బిల్లు వచ్చింది. డిసెంబర్‌లో 92 యూనిట్లకు రూ.574 బిల్లు జారీ అయింది.
⇒ కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబళం ప్రాంతానికి చెందిన బల్లెకల్ నరసయ్య ఇంటికి నవంబర్‌లో రూ.189 బిల్లు రాగా ఈ నెల కరెంట్ బిల్లు రూ.335 వచ్చింది. వీరు కేవలం రాత్రి పూట మాత్రమే విద్యుత్ వాడతారు. అయినా సరే రూ.146 అదనపు భారం పడింది.
తగ్గించమని కోరాం
విద్యుత్ చార్జీల పెంపు ఎంఎస్‌ఎంఈలకు భారంగా మారింది. పెంచిన చార్జీలను తగ్గించాలని ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కోరాం. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం.
– వి.మురళీకృష్ణ, ప్రెసిడెంట్, ఫ్యాప్సియా
భారంగా కొత్త కనెక్షన్లు
ఒక ఎంఎస్‌ఎంఈ యూనిట్ నెలకొల్పి కొత్త విద్యుత్ కనెక్షన్ తీసుకోవడం చాలా భారంగా ఉంది. కనెక్షన్ తీసుకోవాలంటే కనీసం రూ.ఐదారు లక్షలకు పైనే ఖర్చు అవుతోంది. ఈ భారాన్ని సబ్సిడీ రూపంలో భరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్‌ఎంఈ రంగానికి చార్జీల పెంపు మరింత భారంగా మారింది.
– మామిడి సుదర్శన్, అధ్యక్షుడు, దళిత్ ఇండ్రస్టియల్ అసోసియేషన్.
Comments
Please login to add a commentAdd a comment