Oil rates
-
వంటనూనె ధరలు మరింత ప్రియం?
దేశీయంగా వంటనూనెల ధరలు మరింత పెరగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. గత నెలలో ప్రభుత్వం వంట నూనులకు సంబంధించి దిగుమతి సుంకాలు పెంచడంతో రానున్న రోజుల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) నివేదిక తెలిపింది.ప్రభుత్వం గత నెలలో ముడి పామాయిల్, సోయాబీన్, నన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాలను 27.5 శాతం పెంచింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా వీటి ధరలు వరుసగా 10.6 శాతం, 16.8 శాతం, 12.3 శాతం అధికమయ్యాయి. దేశంలో దాదాపు 58 శాతం ముడి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నారు. రిటైల్ ధరలు సైతం అందుకు తదనుగుణంగా పెరుగుతున్నట్లు ఎన్ఈఏ నివేదించింది.ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త! రియల్టీ సంస్థల నయా మోసంసాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకారం..గురువారం నాటికి ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల బేస్ ధరలు వరుసగా 1145 డాలర్లు/టన్ను(రూ.96వేలు), 1160/టన్ను(రూ.97వేలు), 1165/టన్ను(రూ.98వేలు)గా ఉన్నాయి. ఇది గతంలో కంటే వరుసగా 32 శాతం, 18 శాతం, 26 శాతం పెరిగింది. దాంతో రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2024 ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో 2.47 శాతం వంట నూనెల ధరల ద్రవ్యోల్బణం అధికమైంది. అయితే భారత్‌లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతోనే వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచినట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది. -
మళ్ళీ షాక్ ఇవ్వనున్న వంట నూనెల ధర ..!
-
గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్, వంట నూనెలు, చికెన్, పచ్చిమిర్చి.. తగ్గేదేలే!
ఇల్లు గుల్లవుతోంది. నానాటికీ పెరుగుతున్న చార్జీల భారం సామాన్యుడి ఇంటి బడ్జెట్‌ను అమాంతం పెంచేసింది. కోవిడ్ ఆంక్షలకు తోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేడు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేవలం రెండు నెలల్లోనే గ్రేటర్వాసిపై పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్, ఆయిల్ ఛార్జీలు దండెత్తాయి. దీంతో నగరంలోని సామాన్యుల పరిస్థితి ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్నట్టుగా తయారైంది. స్థూలంగా లెక్కకడితే నెలకు ఒక్కో మనిషిపై ఈ చార్జీల భారం రూ.500 పెరిగిందని అంచనా వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ గ్యాస్ బండపై తాజాగా రూ.50 పెరగడంతో మూడు జిల్లాల పరిధిలో మొత్తం 26 లక్షల గ్యాస్ కనెక్షన్లకు గాను గ్రేటర్‌పై నెలకు సగటున రూ.13 కోట్ల అదనపు భారం పడింది. అదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నగరంలో సుమారు 65 లక్షల వాహనాలు ఉండగా, రోజుకు సుమారు 50 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల డీజిల్ వినియోగం ఉంటుంది. తాజాగా ధరతో పెట్రోల్ వాహనదారులపై రోజుకు సగటున రూ.95 లక్షల చొప్పున నెలకు రూ.2850 కోట్లు భారం మోపగా, డీజిల్ వాహనదారులపై రోజుకు సగటున రూ.52 లక్షల చొప్పున నెలకు రూ. 1560 కోట్ల అధనపు భారం పడింది. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం: ‘అది పేలడం వల్లే మంటలు వ్యాపించాయి’ విద్యుత్ భారం రూ.165 కోట్లు గృహ విద్యుత్‌పై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌పై యూనిట్‌కు రూ.ఒకటి చొప్పున పెంచారు. గ్రేటర్లో 55 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉండగా, నెలకు సగటున 1900 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగమవుతుంది. గృహ వినియోగ దారులపై నెలకు రూ.25 కోట్లు, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై రూ.140 కోట్ల భారం మోపింది. ఏడాదికి రూ.1980 కోట్ల అదనపు భారం తప్పడం లేదు. మధ్య తరగతి, ఉద్యోగ, వ్యాపార, ఇతర వర్గాలకు చెందిన సుమారు 16 లక్షల మందికిపైగా ప్రయాణికులు సిటీబస్సుల్లో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితంగా ప్రతి ప్రయాణికునిపై రోజుకు సగటున రూ.10 అదనపు భారం పడుతోంది. ఛార్జీల రూపంలో గ్రేటర్ వాసులపై నెలకు రూ.6 కోట్లకు పైగా భారం మోపింది. వంట నూనెల భారం నెలకు రూ.54–60 కోట్లు జనవరిలో కిలో వేరుశనగ నూనె రూ.135 ఉండగా, ప్రçస్తుతం రూ.185 చేరింది. అదే విధంగా సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ రూ.155 ఉండగా, ప్రస్తుతం రూ.190 ఎగబాకింది. అదే విధంగా పామాయిల్ కేజీ రూ.125 ఉండగా, ప్రస్తుతం రూ.150 పెరిగింది. ఒక్కో కుటుంబం నెలకు మూడు కేజీల ఆయిల్ వినియోస్తోందని అంచనా. గ్రేటర్లో సుమారు 45 లక్షల గృహాలు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన ప్రతి ఇంటికి నెలకు రూ.120–150 అదనపు భారం పడనుంది. ఇలా నెలకు సగటున రూ.54–60 కోట్ల భారం గ్రేటర్ వాసులపై పడుతోంది. ముట్టుకుంటే షాక్ కోవిడ్ కారణంగా ఉపాధి లేకుండా పోయింది. కానీ అన్ని ఛార్జీలు మాత్రం ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. ఇప్పటి వరకు నెలవారీ గృహ విద్యుత్ బిల్లు రూ.500లోపే వచ్చేది. ప్రస్తుతం డిస్కం యూనిట్‌కు రూ.50 పైసల చొప్పున పెంచడంతో ఏప్రిల్ బిల్లులో భారీ వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. – నేమాల బెనర్జీ, డిఫెన్స్ కాలనీ వంటింటికి గుదిబండ గత ఆగస్టులో గ్యాస్ సిలిండర్ ధర రూ.890 ఉండగా, అక్టోబర్ ఐదో తేదీ నాటికి రూ.915కి చేరింది. ఆ తర్వాతి రోజే అనూహ్యంగా రూ.930 కి చేరింది. మార్చి రెండో వారంలో రూ.962 ఉండగా, నాలుగు రోజుల క్రితం ఏకంగా రూ.50 పెరిగింది. ప్రస్తుతం రూ.1002కు చేరింది. ఏదైనా వంట చేయలన్నా.. వెనుకా ముందు ఆలోచించాల్సి వస్తోంది. – గుర్రం అన్నపూర్ణ, బడంగ్పేట్ బైక్ ప్రయాణం భారం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పని చేస్తున్నా. బైక్‌లో గతంలో రూ.500 పెట్రోల్ కొట్టిస్తే..వారం రోజులు వచ్చేది. ప్రస్తుతం నాలుగైదు రోజులే వస్తుంది. జీతం పెరగలేదు కానీ..పెట్రోల్ వాత మాత్రం తప్ప లేదు. – టి.తిరుమలేష్, కర్మన్‌ఘాట్ -
ఏకంగా రూ.70 పెరిగిన వంట నూనె.. ఎట్టా బతికేది!
మహబూబ్‌నగర్ (మదనాపురం) : వంట నూనెల ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్ధంతో ఈ ప్రభావం మరింత ఎక్కువైంది. 20 రోజుల వ్యవధిలోనే కిలో నూనె ప్యాకెట్‌కు రూ.70 పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు నూనె కొనాలంటేనే జంకుతున్నారు. ఎప్పుడూ లేనంతగా.. నూనె ధరలు ఒక్కసారిగా పెరగడంతో అన్ని వర్గాల ప్రజలను కలవరపెడుతున్నాయి. గతంలో కిలో నూనె ధర రూ.120 నుంచి రూ.140 మధ్య ఉండగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూ.180 నుంచి రూ.200 లకు పెరిగింది. చిరు వ్యాపారుల అవస్థలు రోజురోజుకూ పెరుగుతున్న నూనె ధరలతో రోడ్ల పక్కన వ్యాపారాలు నిర్వహించే టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై పెనుభారం పడుతుంది. నూనె రేట్లతో తలకు మించిన భారం అవుతుందని వారు వాపోతున్నారు. పెళ్లిళ్లు, వివిధ శుభకార్యాలకు సైతం నూనె సెగ తగలనుంది. నూనె రేట్ల పెంపుతో ఇబ్బందులు గతంలో ఎన్నడూ లేనంతగా వంట నూనెల ధరలు పెరిగాయి. టిఫిన్ సెంటర్ నడపడం ఇబ్బందిగా మారింది. పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు గిట్టడం లేదు. రేట్లు పెంచితే ప్రజలు ఇబ్బందులు పడతారు. ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలను వెంటనే తగ్గించాలి. – సాయిబాబా, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, గోపాల్పేట ప్రభుత్వం చొరవ చూపాలి వంట నూనెల ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి. లేదంటే పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడతారు. పెరిగిన గ్యాస్, నూనె ధరలను తలుచుకుంటే వంట గదిలోకి వెళ్లాలంటేనే భయమైతుంది. – శ్యామల, గృహణి, మదనాపురం -
పోలింగ్ ముగుస్తూనే.. పెట్రో బాంబ్?
(సాక్షి, బిజినెస్/ సాక్షి,అమరావతి): జాతీయ పార్టీల తలరాతలు మార్చే ఉత్తర ప్రదేశ్‌తో సహా నాలుగు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికలు... గడిచిన మూడు నాలుగు నెలలుగా పెట్రో ధరల పెంపు నుంచి సామాన్యులను కాపాడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. వివిధ దేశాల్లో ఈ మేరకు స్థానికంగా రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరగటంతో ఆ ప్రభావం ఆయా దేశాల ద్రవ్యోల్బణం మీద పడింది. అమెరికా, బ్రిటన్, చైనా వంటి అగ్రరాజ్యాల్లో సైతం ద్రవ్యోల్బణం (ధరల మంట) విపరీతంగా పెరిగింది. ఎన్నికల్లో విజయావకాశాల దృష్ట్యా కొన్నాళ్లుగా ధరల పెంపు జోలికి కేంద్ర ప్రభుత్వం వెళ్లకపోవటంతో దేశంలో ఇంకా ద్రవ్యోల్బణం కాస్త అదుపులోనే ఉంది. కాకపోతే కొన్నాళ్లుగా పెరుగుతున్న అంతర్జాతీయ ధోరణికి తగ్గట్టుగా ఇక్కడా ధరలు పెంచక తప్పదు కనక ఎన్నికలు పూర్తయిన మరు క్షణంలోనే ఆ భారాన్ని జనంపై మోపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తోడయింది. ఇది ముడి చమురు ధరలను మరింతగా మండిస్తోంది. ఈ ధరలు ఏ స్థాయికి వెళతాయో కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఈ భారాన్ని కూడా అంతిమంగా జనంపైనే మోపుతారు కనక... ఈ రెండు పరిణామాలూ సామాన్యులపై భరించలేని భారాన్ని మోపే సంకేతాలొస్తున్నాయి. నెల జీతంలో కనీసం 8 నుంచి 15 శాతాన్ని పెట్రోలు, డీజిల్‌పైనే పెట్టే సామాన్యులకిది మింగుడుపడని వ్యవహారమే. బల్క్ ధరలు ఇప్పటికే పెంపు! నిజానికి కొన్నాళ్లుగా రిటైల్ అవుట్లెట్లలో సామాన్యులు కొనే పెట్రోలు, డీజిల్ ధర పెంచకపోయినా రైల్వే, ఆర్టీసీ వంటి సంస్థలు టోకుగా కొనుగోలు చేసే బల్క్ డీజిల్ ధర మాత్రం ఇప్పటికే పెంచేశారు. సహజంగా బల్క్ ధర రిటైల్ ధర కన్నా ఎంతో కొంత తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొన్నాళ్లుగా బంకుల్లో సామాన్యులకు విక్రయించే ధరలు పెంచకుండా... బల్క్‌గా కొనుగోలు చేసేవారికి మాత్రం పెంచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే రిటైల్‌గా కొనుగోలు చేసే లీటర్ డీజిల్ ధర రూ.96 ఉండగా... బల్క్‌గా కొనుగోలు చేస్తున్న వారికి మాత్రం ఈ ధర ఇప్పటికే రూ.100 దాటిపోయింది. అంటే.. రిటైల్‌పై పెంచాల్సిన భారం ఇప్పటికే పెండింగ్‌లో ఉందన్న మాట!!. మరి దీనికి రష్యా–ఉక్రెయిన్ యుద్ధ భయాల కారణంగా అమాంతంగా ఎగసిన ముడిచమురు ధరలు కూడా తోడయితే..? అమ్మో! తలచుకుంటేనే గుండె గుభేల్మనక మానదు. బల్క్‌కు ఎప్పుడూ తక్కువ ధరే! సాధారణంగా బల్క్ డీజిల్ ధరను 15 రోజులకోసారి నిర్ణయిస్తారు. రవాణా ఛార్జీలు, ఇతరత్రా కలిసొస్తాయి కనక రిటైల్ వినియోగదారులకు విక్రయించే ధరకంటే లీటరుకు రూ.6 నుంచి రూ.10 తక్కువకే ఆయిల్ సంస్థలు బల్క్ వినియోగదారులకు సరఫరా చేస్తాయి. గతేడాది నవంబరులో రిటైల్ డీజిల్ ధర కంటే బల్క్ డీజిల్ ధర లీటర్‌కు ఏకంగా రూ.15.36 తక్కువ ఉంది. జనవరి నుంచి బల్క్ డీజిల్ ధర పెరుగుతూ వచ్చింది. జనవరి 16న బల్క్ డీజిల్ ధర లీటరుకు రూ.90.68 ఉండగా.. రిటైల్ ధర లీటరుకు రూ.96.02 ఉంది. ఫిబ్రవరి 1 నాటికి రెండు ధరలూ దాదాపు సమానమయ్యాయి. ఇపుడైతే రిటైల్ డీజిల్ ధర రూ.96.02 ఉండగా బల్క్ ధర రూ.100.41కు చేరింది. అంటే రిటైల్ ధర కంటే బల్క్ డీజిల్ ధర లీటర్‌కు రూ.4.39 ఎక్కువ.!! రిటైల్ నుంచే కొంటున్న ఆర్టీసీ... రాష్ట్రంలో ఆర్టీసీ సగటున నెలకు 2.50 కోట్ల లీటర్ల డీజిల్ కొంటుంది. ఆ ప్రకారం ఆర్టీసీపై నెలకు ఏకంగా రూ.10 కోట్ల భారం అదనంగా పడుతోంది. దీంతో ఆర్టీసీ బస్సులకు పెట్రోల్ బంకుల్లో రిటైల్ డీజిల్ కొనడానికి అనుమతినిచ్చింది. దీనిద్వారా కొంత ఆర్థిక భారం తగ్గుతోంది. రైల్వేలో దేశవ్యాప్తంగా 65 శాతం రైళ్లు విద్యుత్తుతో, 35 శాతం రైళ్లు డీజిల్‌తో నడుస్తున్నాయి. రైల్వే శాఖ నెలకు 22 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది. ఆ ప్రకారం లీటరుకు సగటున రూ.4.39 చొప్పున రైల్వేపై నెలకు దాదాపు 96.58 కోట్ల ఆర్థికభారం అదనంగా పడుతోంది. ఎన్నికల తరువాత ఎంత బాదుడు? బల్క్– రిటైల్ ధరలను పోల్చినపుడు రిటైల్ ధర బల్క్కన్నా 15–20% ఎక్కువుండేది. అంటే లీటరుపై రూ.15 నుంచి 20 వరకూ పెరగొచ్చు. అది కూడా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం లేనపుడు. మరి యుద్ధంతో ఇప్పటికే ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి కనక రిటైలర్లపై బాదుడు ఏ స్థాయిలో ఉంటుందన్నది ఊహించుకోవాల్సిందే. ఎన్నికలప్పుడు పెంచకపోవటమనేది కేంద్రంలోని ప్రభుత్వాలకు కొత్త కాదు. 2013 చివర్లోనూ ఇలానే జరిగింది. 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు ఉండటంతో రిటైల్ డీజిల్ ధర పెంచలేదు. బల్క్ ధరను మాత్రం 2013 చివరి నుంచి ఆయిల్ కంపెనీలు పెంచుకుంటూపోయాయి. ఇప్పుడూ ఇదే పరిస్థితి. ఏపీలో ప్రస్తుతం రోజుకు 84.02 లక్షల లీటర్ల డీజిల్, 52.90 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తుండటం గమనార్హం. భయపెడుతున్న ద్రవ్యోల్బణం అమెరికా–చైనా నాలుగేళ్ల కిందట ప్రారంభించిన టారిఫ్‌ల యుద్ధం... ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య ఆంక్షలు ఇప్పటికే చాలా దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచేశాయి. ఇక కోవిడ్‌తో వివిధ దేశాల సరళతర ద్రవ్య విధానాలు మరింత ముమ్మరమై ధరల స్పీడ్‌ను తెగ పెంచేశాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమన్న పేరుతో అమెరికా రిజర్వు బ్యాంకు ‘ఫెడ్’.. ఎడాపెడా నిధులు కుమ్మరించింది. ఫలితం...అమెరికాలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ 2022 జనవరిలో నాలుగు దశాబ్దాల్లోనే గరిష్ట స్థాయి అయిన 7.5 శాతాన్ని తాకింది. 1982 తరవాత ఈ స్థాయి ద్రవ్యోల్బణం ఎప్పుడూ నమోదు కాలేదు మరి. చైనాలోనూ ద్రవ్యోల్బణం 10 శాతం స్థాయిలో కొనసాగుతోంది. భారత్ విషయానికొస్తే జనవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం ఏకంగా ఏడు నెలల గరిష్ట స్థాయి 6.01 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయింది. పెట్రో ధరలు పెంచకపోవటంతో ఇది ఈ స్థాయిలో ఉందని, అదే జరిగితే మరింత పైకెగసే ప్రమాదం లేకపోలేదని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇక తాజాగా తలెత్తిన యూరోప్ భౌగోళిక ఉద్రిక్తతలు మరో నెలపాటు కొనసాగితే... ఈ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 150 నుంచ 200 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. -
రూపాయి.. 70 దాటేసింది!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టర్కీ సంక్షోభం, చమురు రేట్లు.. దేశీయంగా కరెంటు అకౌంటు లోటు భయాలు మొదలైనవన్నీ కలిసి.. రూపాయి విలువను అంతకంతకూ పడదోస్తున్నాయి. తాజాగా మంగళవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 70 స్థాయి దిగువకి పడిపోయింది. ఇది చరిత్రాత్మక కనిష్టస్థాయి. అయితే, రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోవడం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఆర్థిక శాఖ ప్రకటించడం.. రూపాయి పతనానికి కాస్త బ్రేక్ వేశాయి. చివరికి స్వల్పంగా 4 పైసల పెరుగుదలతో 69.89 వద్ద రూపాయి క్లోజయ్యింది. ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కాస్త సానుకూలంగా ఉండటం కూడా రూపాయి సెంటిమెంటు కొంత మెరుగుపడటానికి కారణమయ్యాయి. వర్ధమాన దేశాల కరెన్సీలు అస్తవ్యస్తం కావడానికి కారణమైన టర్కీ లీరా మారకం విలువ కూడా కొంత కోలుకుంది. వరుసగా 2 రోజుల పతనం తర్వాత .. డాలర్‌తో పోలిస్తే 6.57 స్థాయికి, యూరోతో పోలిస్తే 7.50 స్థాయికి చేరింది. టర్కీలో ఆర్థిక సంక్షోభం, ఆ దేశ కరెన్సీ లీరా పతనం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న నేపథ్యంలో మంగళవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆల్‌టైం కనిష్ట స్థాయి 70.10కి పడిపోయింది. చమురు ధరలు మళ్లీ ఎగియడం, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటుండటం, కరెంటు అకౌంటు లోటుపై ఆందోళన వంటివన్నీ కలిసి.. దేశీ కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపాయని.. కొత్త కనిష్టానికి పడదోశాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. వర్ధమాన దేశాల కరెన్సీల క్షీణత, డాలర్ బలోపేతం, క్రూడాయిల్ ధరల తీరుతెన్నులు మొదలైనవి సమీపకాలంలో రూపాయి విలువను నిర్దేశించనున్నాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దేశీ కరెన్సీ మారకం విలువ ఈ ఏడాది ఇప్పటిదాకా 9.49 శాతం మేర పతనమైంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం క్షీణించింది. ముఖ్యంగా ఆగస్టులో ఈ తీవ్రత మరింత పెరిగింది. ఆదుకున్న ఆర్బీఐ జోక్యం.. రూపాయి మరింతగా క్షీణించకుండా ఆర్బీఐ భారీ స్థాయిలో జోక్యం చేసుకుని అడ్డుకట్ట వేసి ఉండొచ్చని కరెన్సీ ట్రేడర్లు తెలిపారు. దేశీ స్టాక్ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ, అంతర్జాతీయ మార్కెట్లలో రికవరీతో పాటు టర్కీ లీరా కొంత కోలుకోవడం కూడా ఫారెక్స్ సెంటిమెంటు కాస్త మెరుగుపడేందుకు దోహదపడింది. మరోవైపు, రూపాయి భారీ పతనానికి విదేశీ ప్రతికూల అంశాలే కారణమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. క్షీణత మిగతా కరెన్సీల స్థాయిలోనే ఉన్న పక్షంలో దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ వ్యాఖ్యానించారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర పుష్కలంగా విదేశీ మారక నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. మరీ అంతగా పడిపోలేదు: బ్యాంకర్లు డాలర్‌తో పోలిస్తే చాలా మటుకు కరెన్సీల మారకం విలువ గణనీయంగా పతనమైందని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. అయితే, మిగతా కరెన్సీలతో పోలిస్తే రూపాయి మరీ అంతగా బలహీనపడలేదన్నారు. ‘రూపాయి మారకం విలువ 69–70 మధ్యలో స్థిరపడొచ్చని భావిస్తున్నాను. బాండ్లు, స్టాక్ మార్కెట్లు.. ఇలా వివిధ సాధనాల్లోకి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు ఇందుకు తోడ్పడవచ్చు. విదేశీ పెట్టుబడులకు రూపాయి విలువ ఈ స్థాయిలో ఉండటం ఆకర్షణీయంగా కనిపించవచ్చు‘ అని కుమార్ తెలిపారు. టర్కీ సంక్షోభం సెగ వర్ధమాన మార్కెట్లన్నింటినీ చుట్టేస్తోందని, రూపాయిపై కూడా ఆ ప్రతికూల ప్రభావాలే పడుతున్నాయని ఐసీఐసీఐ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బి. ప్రసన్న పేర్కొన్నారు. మధ్యకాలికంగా ఇతర వ్యాపార భాగస్వామ్య దేశాల్లో పరిస్థితులకు అనుగుణంగా రూపాయి మారకం విలువ మరికాస్త క్షీణించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫారెక్స్‌పై ఆంక్షలు విధించాలి: ఆర్థికవేత్తలు రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయాలంటే.. వ్యక్తుల స్థాయిలో డాలర్ల లభ్యతపై ఆంక్షలు విధించాలని, అలాగే అనవసర దిగుమతులను కూడా నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్త అభిరూప్ సర్కార్ వ్యాఖ్యానించారు. విదేశాల్లో విహార యాత్రల కోసం తీసుకునే విదేశీ మారకంపై కూడా పరిమితులు విధించవచ్చన్నారు. అయితే, ఆంక్షలు విధించేంత స్థాయికి పరిస్థితి ఇంకా చేరలేదని క్రిసిల్ చీఫ్ ఎకానమిస్ట్ ధర్మకీర్తి జోషి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరిన విదేశీ మారక నిల్వలు.. ఇప్పటికీ ఇంకా గణనీయంగానే ఉన్నాయని ఇక్రా ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ అదితి నాయర్ చెప్పారు. ఒకవేళ వర్ధమాన దేశాల కరెన్సీలు పతనమవుతుంటే.. రూపాయి విలువ కూడా బలహీనపడాల్సిందేనని, లేకపోతే ఎగుమతులపరంగా పోటీపడలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆమె పేర్కొన్నారు. -
నూనెలు సలసల
సాక్షి, విశాఖపట్నం: నింగిలో విహరిస్తున్న కూరగాయల ధరలకు నూనెలు, చింతపండూ తోడయ్యాయి. ఇవి ఏకమై సామాన్యుడిపై దాడి చేస్తున్నాయి. దాదాపు రెండున్నర నెలలుగా కాయగూరలు కారాలూ మిరియాలూ నూరుతున్నాయి. ఒక్క బంగాళాదుంపలు తప్ప మరే దుంపలూ, కూరగాయలూ కిలో రూ.30 నుంచి 100కు పైగానే ఎగబాకాయి. కార్తీకమాసం, అకాల వర్షాల పేరు చెప్పి వీటి ధరలను అమాంతం పెంచేశారు. కార్తీకమాసం పూర్తయినా వీటి రేట్లు నామమాత్రంగానే దిగివచ్చాయి. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.50కి పైన ఉండగా, క్యారెట్ రూ.70 నుంచి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికీ పలు కూరగాయలు కిలో రూ.30 నుంచి 60 మధ్య పలుకుతున్నాయి. ఈ తరుణంలో వంట నూనెల ధరలు కూడా వాటికి వంత పాడుతున్నాయి. కొన్నాళ్లుగా లీటరు రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్టు రూ.76 నుంచి 78 మధ్య లభించేది. కొద్దిరోజుల క్రితం ఒక్కో ప్యాకెట్టుకు రూ.6–8 వరకు పెంచేశారు. దీంతో అది రూ.84 వరకు పెంచి విక్రయిస్తున్నారు. అలాగే రూ.62 ఉండే లీటరు పామాయిల్ ఇప్పుడు రూ.68–70కి పెరిగింది. హోల్‌సేల్‌లో 15 కేజీల రిఫైన్డ్ ఆయిల్ డబ్బా రూ.1180, పామాయిల్ రూ.980 ఉండేది. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ రూ.1250, పామాయిల్ రూ.1060కు చేరింది. ఇలా లీటరు ప్యాకెట్‌పై సగటున రూ.7, డబ్బాపై రూ.80 వరకు పెరిగింది. పెరిగిన ధరలను వ్యాపారులు వెనువెంటనే అమలులోకి తెచ్చారు. ఇటీవల ప్రభుత్వం నూనెలపై ఎక్సైజ్ డ్యూటీని 7.5 శాతం పెంచింది. ఇదే నూనెల ధరలు పెరుగుదలకు దారితీశాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా మలేసియా మార్కెట్ ఆధారంగా నూనెల ధరల పెరుగుదల, తగ్గుదల ఉంటుంది. ఇప్పుడిప్పుడే మలేసియా మార్కెట్లో ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో నాలుగైదు రోజుల క్రితం నుంచే వంట నూనెల ధరలు తగ్గుతున్నా, పాత ధరకు కొనుగోలు చేసిన నిల్వలుండడంతో వ్యాపారులు ఆ మేరకు ఇంకా పూర్తి స్థాయిలో ధరలు తగ్గించడం లేదు. చింతపండుదీ అదే దారి.. ఇక చింతపండు కూడా కూరగాయలు, నూనెల ధరతో పోటీ పడుతోంది. నిన్న మొన్నటి దాకా పిక్కతో ఉన్న కిలో చింతపండు రూ.60–70, పిక్క తీసినది రూ.120–130 వరకు లభించేది. ఇప్పుడు ఏకంగా యాభై శాతానికి పైగా పెరిగిపోయింది. అంటే అరకిలో రూ.100, కిలో రూ.190–200కు పెరిగిపోయింది. హోల్‌సేల్ మార్కెట్లో 15 కిలోల పిక్కతీసిన చింతపండు నెల రోజుల క్రితం రూ.1650 ఉండేది. ఇప్పుడది రూ.2400కు ఎగబాకింది. చింతపండు నిల్వలు తగ్గిపోయాయన్న సాకుతో మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు అమ్ముతున్నారు. అంతేకాదు.. మున్ముందు ఇంకా పెరిగిపోతుందన్న ప్రచారాన్ని కూడా విస్తృతం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే కూరగాయల ధరలతో సతమతమవుతున్న సగటు మధ్య తరగతి వారికి నిత్యావసర సరకులైన వంట నూనెలు, చింతపండు ధరలు కూడా మంట పెట్టిస్తుండడంతో ఆవేదన చెందుతున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం చోద్యం చూస్తుండడంపై తీవ్రంగా మండి పడుతున్నారు. -
మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా చమురు రేట్లలో తగ్గుదల కారణంగా పెట్రోల్ పై లీటర్ కు 91 పైసలు, డీజిల్ పై 84 పైసలు తగ్గింది. ఈ తగ్గిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్ విషయంలో ఎనిమిదో సారి, డీజిల్‌పై నాల్గోసారి తగ్గించనట్లయ్యింది. ఈ నవంబర్ మొదట్లో పెట్రోల్ పై లీటర్ కు రూ.2.41 పైసలు తగ్గగా, డీజిల్ పై లీటర్ కు రూ.2.21 తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, ప్రతి 15 రోజులకు రేట్లు సమీక్షించే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు మరోసారి డీజిల్, పెట్రోల్ రేట్లను సవరించాయి. ఈ తాజా సవరణతో పెట్రోల్ పై మొత్తంగా ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ రూ. 10.27 పైసలు తగ్గినట్లయ్యింది. -
మరోసారి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లలో తగ్గుదల కారణంగా ఈ వారాంతానికి దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి తగ్గే అవకాశం ఉంది. ఈ తగ్గుదల రూపాయి వరకూ ఉండవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రేటు తగ్గితే.. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్ విషయంలో ఏడోసారి, డీజిల్‌పై మూడో సారి తగ్గించినట్టవుతుంది. కాగా, ప్రతి 15 రోజులకు రేట్లు సమీక్షించే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు ఈ శనివారం డీజిల్, పెట్రోల్ రేట్లను సవరించనున్నాయి. నవంబర్ 1న పెట్రోల్‌పై రూ. 2.41 తగ్గించడంతో మొత్తంగా ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ రూ. 9.36 తగ్గించినట్టయింది. -
రూపాయికీ సెగ
ముంబై: ఇరాక్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు రూపాయిపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. సరఫరాపరమైన సమస్యలు తలెత్తవచ్చన్న ఆందోళలనల కారణంగా అంతర్జాతీయంగా చమురు రేట్లు ఎగయడంతో శుక్రవారం దేశీ కరెన్సీ భారీగా పతనం అయ్యింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 52 పైసలు క్షీణించి 59.77 వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరి 24 తర్వాత ఒక్కరోజులో ఇంతగా క్షీణించడం ఇదే ప్రథమం. ఆ రోజున రూపాయి మారకం విలువ 73 పైసలు పతనమైంది. ఇరాక్‌లో మిలిటెంట్లు చెలరేగిపోతుండటం వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందన్న భయాలు నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తొమ్మిది నెలల గరిష్టానికి ఎగిశాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు రిస్కులను తగ్గించుకునేందుకు డాలర్ల వైపు చూస్తుండటం వల్ల అమెరికా కరెన్సీ బలపడుతోందని, రూపాయి మారకం క్షీణిస్తోందని ట్రేడర్లు తెలిపారు. దేశీ స్టాక్‌మార్కెట్ల పతనం కూడా రూపాయి క్షీణతకు కారణమైందని వివరించారు.