(సాక్షి, బిజినెస్/ సాక్షి,అమరావతి): జాతీయ పార్టీల తలరాతలు మార్చే ఉత్తర ప్రదేశ్‌తో సహా నాలుగు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికలు... గడిచిన మూడు నాలుగు నెలలుగా పెట్రో ధరల పెంపు నుంచి సామాన్యులను కాపాడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. వివిధ దేశాల్లో ఈ మేరకు స్థానికంగా రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరగటంతో ఆ ప్రభావం ఆయా దేశాల ద్రవ్యోల్బణం మీద పడింది. అమెరికా, బ్రిటన్, చైనా వంటి అగ్రరాజ్యాల్లో సైతం ద్రవ్యోల్బణం (ధరల మంట) విపరీతంగా పెరిగింది. ఎన్నికల్లో విజయావకాశాల దృష్ట్యా కొన్నాళ్లుగా ధరల పెంపు జోలికి కేంద్ర ప్రభుత్వం వెళ్లకపోవటంతో దేశంలో ఇంకా ద్రవ్యోల్బణం కాస్త అదుపులోనే ఉంది.
కాకపోతే కొన్నాళ్లుగా పెరుగుతున్న అంతర్జాతీయ ధోరణికి తగ్గట్టుగా ఇక్కడా ధరలు పెంచక తప్పదు కనక ఎన్నికలు పూర్తయిన మరు క్షణంలోనే ఆ భారాన్ని జనంపై మోపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తోడయింది. ఇది ముడి చమురు ధరలను మరింతగా మండిస్తోంది. ఈ ధరలు ఏ స్థాయికి వెళతాయో కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఈ భారాన్ని కూడా అంతిమంగా జనంపైనే మోపుతారు కనక... ఈ రెండు పరిణామాలూ సామాన్యులపై భరించలేని భారాన్ని మోపే సంకేతాలొస్తున్నాయి. నెల జీతంలో కనీసం 8 నుంచి 15 శాతాన్ని పెట్రోలు, డీజిల్‌పైనే పెట్టే సామాన్యులకిది మింగుడుపడని వ్యవహారమే.
బల్క్ ధరలు ఇప్పటికే పెంపు!
నిజానికి కొన్నాళ్లుగా రిటైల్ అవుట్‌లెట్లలో సామాన్యులు కొనే పెట్రోలు, డీజిల్ ధర పెంచకపోయినా రైల్వే, ఆర్టీసీ వంటి సంస్థలు టోకుగా కొనుగోలు చేసే బల్క్ డీజిల్ ధర మాత్రం ఇప్పటికే పెంచేశారు. సహజంగా బల్క్ ధర రిటైల్ ధర కన్నా ఎంతో కొంత తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొన్నాళ్లుగా బంకుల్లో సామాన్యులకు విక్రయించే ధరలు పెంచకుండా... బల్క్‌గా కొనుగోలు చేసేవారికి మాత్రం పెంచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే రిటైల్‌గా కొనుగోలు చేసే లీటర్ డీజిల్ ధర రూ.96 ఉండగా... బల్క్‌గా కొనుగోలు చేస్తున్న వారికి మాత్రం ఈ ధర ఇప్పటికే రూ.100 దాటిపోయింది. అంటే.. రిటైల్‌పై పెంచాల్సిన భారం ఇప్పటికే పెండింగ్‌లో ఉందన్న మాట!!. మరి దీనికి రష్యా–ఉక్రెయిన్ యుద్ధ భయాల కారణంగా అమాంతంగా ఎగసిన ముడిచమురు ధరలు కూడా తోడయితే..? అమ్మో! తలచుకుంటేనే గుండె గుభేల్‌మనక మానదు.
బల్క్‌కు ఎప్పుడూ తక్కువ ధరే!
సాధారణంగా బల్క్ డీజిల్ ధరను 15 రోజులకోసారి నిర్ణయిస్తారు. రవాణా ఛార్జీలు, ఇతరత్రా కలిసొస్తాయి కనక రిటైల్ వినియోగదారులకు విక్రయించే ధరకంటే లీటరుకు రూ.6 నుంచి రూ.10 తక్కువకే ఆయిల్ సంస్థలు బల్క్ వినియోగదారులకు సరఫరా చేస్తాయి. గతేడాది నవంబరులో రిటైల్ డీజిల్ ధర కంటే బల్క్ డీజిల్ ధర లీటర్‌కు ఏకంగా రూ.15.36 తక్కువ ఉంది. జనవరి నుంచి బల్క్ డీజిల్ ధర పెరుగుతూ వచ్చింది. జనవరి 16న బల్క్ డీజిల్ ధర లీటరుకు రూ.90.68 ఉండగా.. రిటైల్ ధర లీటరుకు రూ.96.02 ఉంది. ఫిబ్రవరి 1 నాటికి రెండు ధరలూ దాదాపు సమానమయ్యాయి. ఇపుడైతే రిటైల్ డీజిల్ ధర రూ.96.02 ఉండగా బల్క్ ధర రూ.100.41కు చేరింది. అంటే రిటైల్ ధర కంటే బల్క్ డీజిల్ ధర లీటర్‌కు రూ.4.39 ఎక్కువ.!!
రిటైల్ నుంచే కొంటున్న ఆర్టీసీ...
రాష్ట్రంలో ఆర్టీసీ సగటున నెలకు 2.50 కోట్ల లీటర్ల డీజిల్ కొంటుంది. ఆ ప్రకారం ఆర్టీసీపై నెలకు ఏకంగా రూ.10 కోట్ల భారం అదనంగా పడుతోంది. దీంతో ఆర్టీసీ బస్సులకు పెట్రోల్ బంకుల్లో రిటైల్ డీజిల్ కొనడానికి అనుమతినిచ్చింది. దీనిద్వారా కొంత ఆర్థిక భారం తగ్గుతోంది. రైల్వేలో దేశవ్యాప్తంగా 65 శాతం రైళ్లు విద్యుత్తుతో, 35 శాతం రైళ్లు డీజిల్‌తో నడుస్తున్నాయి. రైల్వే శాఖ నెలకు 22 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది. ఆ ప్రకారం లీటరుకు సగటున రూ.4.39 చొప్పున రైల్వేపై నెలకు దాదాపు 96.58 కోట్ల ఆర్థికభారం అదనంగా పడుతోంది.
ఎన్నికల తరువాత ఎంత బాదుడు?
బల్క్– రిటైల్ ధరలను పోల్చినపుడు రిటైల్ ధర బల్క్‌కన్నా 15–20% ఎక్కువుండేది. అంటే లీటరుపై రూ.15 నుంచి 20 వరకూ పెరగొచ్చు. అది కూడా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం లేనపుడు. మరి యుద్ధంతో ఇప్పటికే ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి కనక రిటైలర్లపై బాదుడు ఏ స్థాయిలో ఉంటుందన్నది ఊహించుకోవాల్సిందే. ఎన్నికలప్పుడు పెంచకపోవటమనేది కేంద్రంలోని ప్రభుత్వాలకు కొత్త కాదు. 2013 చివర్లోనూ ఇలానే జరిగింది. 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు ఉండటంతో రిటైల్ డీజిల్ ధర పెంచలేదు. బల్క్ ధరను మాత్రం 2013 చివరి నుంచి ఆయిల్ కంపెనీలు పెంచుకుంటూపోయాయి. ఇప్పుడూ ఇదే పరిస్థితి. ఏపీలో ప్రస్తుతం రోజుకు 84.02 లక్షల లీటర్ల డీజిల్, 52.90 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తుండటం గమనార్హం.
భయపెడుతున్న ద్రవ్యోల్బణం
అమెరికా–చైనా నాలుగేళ్ల కిందట ప్రారంభించిన టారిఫ్‌ల యుద్ధం... ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య ఆంక్షలు ఇప్పటికే చాలా దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచేశాయి. ఇక కోవిడ్‌తో వివిధ దేశాల సరళతర ద్రవ్య విధానాలు మరింత ముమ్మరమై ధరల స్పీడ్‌ను తెగ పెంచేశాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమన్న పేరుతో అమెరికా రిజర్వు బ్యాంకు ‘ఫెడ్’.. ఎడాపెడా నిధులు కుమ్మరించింది. ఫలితం...అమెరికాలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ 2022 జనవరిలో నాలుగు దశాబ్దాల్లోనే గరిష్ట స్థాయి అయిన 7.5 శాతాన్ని తాకింది. 1982 తరవాత ఈ స్థాయి ద్రవ్యోల్బణం ఎప్పుడూ నమోదు కాలేదు మరి. చైనాలోనూ ద్రవ్యోల్బణం 10 శాతం స్థాయిలో కొనసాగుతోంది.
భారత్ విషయానికొస్తే జనవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం ఏకంగా ఏడు నెలల గరిష్ట స్థాయి 6.01 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయింది. పెట్రో ధరలు పెంచకపోవటంతో ఇది ఈ స్థాయిలో ఉందని, అదే జరిగితే మరింత పైకెగసే ప్రమాదం లేకపోలేదని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇక తాజాగా తలెత్తిన యూరోప్ భౌగోళిక ఉద్రిక్తతలు మరో నెలపాటు కొనసాగితే... ఈ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 150 నుంచ 200 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment