దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. చమురు ధరలు జనవరి కంటే కనిష్ట స్థాయికి పడిపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మార్కెట్‌లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన పదేళ్లలో గరిష్ఠంగా జూన్ 2022లో బ్యారెల్ ధర 115 డాలర్లుగా నమోదైంది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర దాదాపు 70 డాలర్లకు చేరింది.
అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల గతంలో భారీగా పెరిగిన ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల క్రూడాయిల్ ధర 70 డాలర్లకు చేరువలో ఉంది. క్రూడ్ ధరలు గరిష్ఠంగా ఉన్నపుడు చమురుశుద్ధి కంపెనీలకు నష్టాలు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ రేట్లను కొద్దిగా తగ్గించినా దిగివస్తున్న క్రూడ్ ధరలకు అనుగుణంగా మాత్రం రేట్లను తగ్గించలేదు. దాంతో కంపెనీలకు భారీగా లాభాలు చేకూరుతున్నాయి.
త్వరలో జరగబోయే హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు అధికారపక్షం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. లీటర్‌కు నాలుగు నుంచి ఆరు రూపాయలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై ఆరోపణలు.. పీఏసీ విచారణ?
చమురు ధరలు తగ్గుముఖం పట్టడానికి పలు అంశాలు కారణమవుతున్నాయి. లిబియా తన ముడిచమురు సరఫరాలు పెంచింది. అక్టోబర్ నుంచి ఒపెక్ + దేశాలు ఉత్పత్తి కోతలను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఒపెక్ దేశాల కాకుండా ముడిచమురు వెలికితీసే ఇతర దేశాలు వాటి ఉత్పత్తిని పెంచుతున్నాయి. దాంతో సరఫరా పెరిగి ధరలు తగ్గుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment