సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు చరిత్రలో ఎన్నడు ఎరగనంతగా పడిపోయాయి. ఏప్రిల్ 22వ తేదీ నాటికి ఓ బారెల్ ధర కనిష్ట స్థాయికి 16 డాలర్లకు పడి పోయింది. నెల రోజుల్లో చమురు ధరలు ఏకంగా 39 శాతం పడి పోయాయి. అయినా దేశీయంగా భారత్ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గక పోవడం ఆశ్చర్యకరం. కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు జనవరి నెల నుంచి తగ్గుముఖం పట్టాయి. అయినా ఇప్పటికీ ముంబైలో లీటరు పెట్రోలు ధర 76.31 రూపాయలు, డీజిల్ ధర 66.21 రూపాయలు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరల్లో భారతీయులకు పెద్దగా ప్రయోజనం ఎందుకు కలగలేదు? అందుకు కారణాలేమిటీ?
కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా మార్చి 14వ తేదీన పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు మూడు రూపాయల చొప్పున పెంచింది. ఈ కారణంగా కేంద్రానికి సమకూరే సొమ్ము 39 వేల కోట్ల రూపాయలు. ఆ తర్వాత వారానికి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్‌పై అదనంగా మరో ఎనిమిది రూపాయల ఎక్సైజ్ పన్నును పెంచేందుకు వీలుగా దేశ ఆర్థిక బిల్లును సవరించింది. చమురు ధరల హెచ్చింపు, తగ్గింపులపై ఇక తమ ప్రభుత్వానికి ఎలాంటి ఆధిపత్యం ఉండదని చమురు ధరలపై నియంత్రణను ఎత్తివేసిన నాడే నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు భారత్‌లో పెట్రోలు ధరలు తగ్గుతూ, పెరిగినప్పుడు పెరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడంలో భాగంగా చమురు ధరలపై ఎక్సైజ్ పన్నులను పెంచుతూ వచ్చింది.
ఇప్పుడు ఇంతగా పన్నులను పెంచడానికి ఆర్థిక అవసరాలే కనిపిస్తున్నాయి. ఆర్థిక ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జీడీపీలో ఆదాయం, వినిమయానికి మధ్య వ్యత్యాసం మూడున్నర శాతానికి చేరుకుంది. ఈ వ్యత్యాసం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏడు శాతానికి చేరుకుంటుందని ముంబైకి చెందిన ‘మోతీలాల్ ఓస్వాల్’ బ్రోకరేజ్ సంస్థ ఏప్రిల్ 13న విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది. మరోపక్క డాలర్‌తో రూపాయి మారక విలువ పడి పోతోంది. కరోనా పరిస్థితుల ప్రభావం ఇలాగే కొనసాగినట్లయితే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ఆస్కారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment