రూపాయి.. 70 దాటేసింది! | Rupee falls to fresh all-time low of 70.08 level on Turkish crisis | Sakshi
Sakshi News home page

రూపాయి.. 70 దాటేసింది!

Published Wed, Aug 15 2018 12:43 AM | Last Updated on Wed, Aug 15 2018 12:43 AM

Rupee falls to fresh all-time low of 70.08 level on Turkish crisis - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టర్కీ సంక్షోభం, చమురు రేట్లు.. దేశీయంగా కరెంటు అకౌంటు లోటు భయాలు మొదలైనవన్నీ కలిసి.. రూపాయి విలువను అంతకంతకూ పడదోస్తున్నాయి. తాజాగా మంగళవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 70 స్థాయి దిగువకి  పడిపోయింది. ఇది చరిత్రాత్మక కనిష్టస్థాయి. అయితే, రిజర్వ్‌ బ్యాంక్‌ జోక్యం చేసుకోవడం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఆర్థిక శాఖ ప్రకటించడం.. రూపాయి పతనానికి కాస్త బ్రేక్‌ వేశాయి.

చివరికి స్వల్పంగా 4 పైసల పెరుగుదలతో 69.89 వద్ద రూపాయి క్లోజయ్యింది. ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కాస్త సానుకూలంగా ఉండటం కూడా రూపాయి సెంటిమెంటు కొంత మెరుగుపడటానికి కారణమయ్యాయి. వర్ధమాన దేశాల కరెన్సీలు అస్తవ్యస్తం కావడానికి కారణమైన టర్కీ లీరా మారకం విలువ కూడా కొంత కోలుకుంది. వరుసగా 2 రోజుల పతనం తర్వాత .. డాలర్‌తో పోలిస్తే 6.57 స్థాయికి, యూరోతో పోలిస్తే 7.50 స్థాయికి చేరింది.

టర్కీలో ఆర్థిక సంక్షోభం, ఆ దేశ కరెన్సీ లీరా పతనం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న నేపథ్యంలో మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆల్‌టైం కనిష్ట స్థాయి 70.10కి పడిపోయింది. చమురు ధరలు మళ్లీ ఎగియడం, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటుండటం, కరెంటు అకౌంటు లోటుపై ఆందోళన వంటివన్నీ కలిసి.. దేశీ కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపాయని.. కొత్త కనిష్టానికి పడదోశాయని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. 

వర్ధమాన దేశాల కరెన్సీల క్షీణత, డాలర్‌ బలోపేతం, క్రూడాయిల్‌ ధరల తీరుతెన్నులు మొదలైనవి సమీపకాలంలో రూపాయి విలువను నిర్దేశించనున్నాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దేశీ కరెన్సీ మారకం విలువ ఈ ఏడాది ఇప్పటిదాకా 9.49 శాతం మేర పతనమైంది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం క్షీణించింది. ముఖ్యంగా ఆగస్టులో ఈ తీవ్రత మరింత పెరిగింది.  

ఆదుకున్న ఆర్‌బీఐ జోక్యం..
రూపాయి మరింతగా క్షీణించకుండా ఆర్‌బీఐ భారీ స్థాయిలో జోక్యం చేసుకుని అడ్డుకట్ట వేసి ఉండొచ్చని కరెన్సీ ట్రేడర్లు తెలిపారు. దేశీ స్టాక్‌ మార్కెట్లలో రిలీఫ్‌ ర్యాలీ, అంతర్జాతీయ మార్కెట్లలో రికవరీతో పాటు టర్కీ లీరా కొంత కోలుకోవడం కూడా ఫారెక్స్‌ సెంటిమెంటు కాస్త మెరుగుపడేందుకు దోహదపడింది.

మరోవైపు, రూపాయి భారీ పతనానికి విదేశీ ప్రతికూల అంశాలే కారణమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. క్షీణత మిగతా కరెన్సీల స్థాయిలోనే ఉన్న పక్షంలో దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్‌ చంద్ర గర్గ్‌ వ్యాఖ్యానించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర పుష్కలంగా విదేశీ మారక నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు.   

మరీ అంతగా పడిపోలేదు: బ్యాంకర్లు
డాలర్‌తో పోలిస్తే చాలా మటుకు కరెన్సీల మారకం విలువ గణనీయంగా పతనమైందని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. అయితే, మిగతా కరెన్సీలతో పోలిస్తే రూపాయి మరీ అంతగా బలహీనపడలేదన్నారు. ‘రూపాయి మారకం విలువ 69–70 మధ్యలో స్థిరపడొచ్చని భావిస్తున్నాను. బాండ్లు, స్టాక్‌ మార్కెట్లు.. ఇలా వివిధ సాధనాల్లోకి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు ఇందుకు తోడ్పడవచ్చు.

విదేశీ పెట్టుబడులకు రూపాయి విలువ ఈ స్థాయిలో ఉండటం ఆకర్షణీయంగా కనిపించవచ్చు‘ అని కుమార్‌ తెలిపారు. టర్కీ సంక్షోభం సెగ వర్ధమాన మార్కెట్లన్నింటినీ చుట్టేస్తోందని, రూపాయిపై కూడా ఆ ప్రతికూల ప్రభావాలే పడుతున్నాయని ఐసీఐసీఐ బ్యాంక్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ బి. ప్రసన్న పేర్కొన్నారు. మధ్యకాలికంగా ఇతర వ్యాపార భాగస్వామ్య దేశాల్లో పరిస్థితులకు అనుగుణంగా రూపాయి మారకం విలువ మరికాస్త క్షీణించాల్సిన అవసరం ఉందని చెప్పారు.   


ఫారెక్స్‌పై ఆంక్షలు విధించాలి: ఆర్థికవేత్తలు
రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయాలంటే.. వ్యక్తుల స్థాయిలో డాలర్ల లభ్యతపై ఆంక్షలు విధించాలని, అలాగే అనవసర దిగుమతులను కూడా నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్త అభిరూప్‌ సర్కార్‌ వ్యాఖ్యానించారు. విదేశాల్లో విహార యాత్రల కోసం తీసుకునే విదేశీ మారకంపై కూడా పరిమితులు విధించవచ్చన్నారు. అయితే, ఆంక్షలు విధించేంత స్థాయికి పరిస్థితి ఇంకా చేరలేదని క్రిసిల్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌ ధర్మకీర్తి జోషి అభిప్రాయపడ్డారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరిన విదేశీ మారక నిల్వలు.. ఇప్పటికీ ఇంకా గణనీయంగానే ఉన్నాయని ఇక్రా ప్రిన్సిపల్‌ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ చెప్పారు. ఒకవేళ వర్ధమాన దేశాల కరెన్సీలు పతనమవుతుంటే.. రూపాయి విలువ కూడా బలహీనపడాల్సిందేనని, లేకపోతే ఎగుమతులపరంగా పోటీపడలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆమె పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement