మహబూబ్‌నగర్ (మదనాపురం) : వంట నూనెల ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్ధంతో ఈ ప్రభావం మరింత ఎక్కువైంది. 20 రోజుల వ్యవధిలోనే కిలో నూనె ప్యాకెట్‌కు రూ.70 పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు నూనె కొనాలంటేనే జంకుతున్నారు.
ఎప్పుడూ లేనంతగా..
నూనె ధరలు ఒక్కసారిగా పెరగడంతో అన్ని వర్గాల ప్రజలను కలవరపెడుతున్నాయి. గతంలో కిలో నూనె ధర రూ.120 నుంచి రూ.140 మధ్య ఉండగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూ.180 నుంచి రూ.200 లకు పెరిగింది.
చిరు వ్యాపారుల అవస్థలు
రోజురోజుకూ పెరుగుతున్న నూనె ధరలతో రోడ్ల పక్కన వ్యాపారాలు నిర్వహించే టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై పెనుభారం పడుతుంది. నూనె రేట్లతో తలకు మించిన భారం అవుతుందని వారు వాపోతున్నారు. పెళ్లిళ్లు, వివిధ శుభకార్యాలకు సైతం నూనె సెగ తగలనుంది.
నూనె రేట్ల పెంపుతో ఇబ్బందులు
గతంలో ఎన్నడూ లేనంతగా వంట నూనెల ధరలు పెరిగాయి. టిఫిన్ సెంటర్ నడపడం ఇబ్బందిగా మారింది. పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు గిట్టడం లేదు. రేట్లు పెంచితే ప్రజలు ఇబ్బందులు పడతారు. ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలను వెంటనే తగ్గించాలి.
– సాయిబాబా, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, గోపాల్‌పేట
ప్రభుత్వం చొరవ చూపాలి
వంట నూనెల ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి. లేదంటే పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడతారు. పెరిగిన గ్యాస్, నూనె ధరలను తలుచుకుంటే వంట గదిలోకి వెళ్లాలంటేనే భయమైతుంది.
– శ్యామల, గృహణి, మదనాపురం
Comments
Please login to add a commentAdd a comment