సాక్షి, హైదరాబాద్: త్వరలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. చార్జీలు పెంచుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు సానుకూలత వ్యక్తం చేయటంతో, గత డిసెంబర్‌లోనే ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదన సర్కారుకు సమర్పించింది. సీఎం ఓకే అంటే ఆ మేరకు చార్జీలు పెరిగేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. తాజాగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీని పునరాలోచనలో పడేశాయి. దీంతో గత ప్రతిపాదనను సవరించి కొత్త ప్రతిపాదన సమర్పిస్తోంది. తాజా ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తే చార్జీలు అనూహ్యంగా పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. పాత ప్రతిపాదన ప్రకారం ప్రజలపై సాలీనా రూ.850 కోట్ల భారం పడనుండగా, కొత్త ప్రతిపాదన ప్రకారం అది రూ.1,200 కోట్ల వరకు ఉండనుందని ఆర్టీసీ వర్గాల సమాచారం. కిలోమీటరుకు 40 పైసల నుంచి 50 పైసల వరకు పెంచేలా తాజా ప్రతిపాదన రూపొందిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తున్న దానిపై ప్రయాణికుల జేబుపై పడే భారం ఆధారపడి ఉంది. ఆర్టీసీ అధికారులు మాత్రం పూర్తి గోప్యత పాటిస్తున్నారు.
అసలే నష్టాలు..ఆపై కోలుకోలేని దెబ్బ
ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి ఆ నష్టం విలువ రూ.2 వేల కోట్లకు చేరుకునేలా ఉంది. దీంతో గత డిసెంబర్‌లోనే కి.మీ.కు ఆర్డినరీ బస్సులపై 25 పైసలు, మిగతా కేటగిరీ బస్సులపై 30 పైసలు పెంచాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి సంస్థ నివేదిక సమర్పించింది. ప్రస్తుతం ఆ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంది. కాగా మూలిగే నక్కపై తాడిపండు పడిన చందాన.. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటుండడంతో ఆర్టీసీపై కోలుకోలేని దెబ్బ పడుతోంది. నెలకు 18 కోట్ల నుంచి 20 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్న ఆర్టీసీ చమురు కంపెనీల నుంచి బల్క్‌గా కొంటోంది. ఈ ఒప్పందం మేరకు రిటైల్ కంటే లీటరుపై రూ.4 వరకు తగ్గింపు పొందుతోంది. ఫిబ్రవరి 16 వరకు ఆర్టీసీకి అందే డీజిల్ లీటరు ధర రూ.91 వరకు ఉంది. 17న అది ఒక్కసారిగా పెరిగి రూ.97కు చేరుకుంది. దీంతో సంస్థ బల్క్ కొనుగోలు ఆపి రిటైల్‌గా కొనటం ప్రారంభించింది. ప్రస్తుతం బల్క్ డీజిల్ ధర లీటరుకు దాదాపుగా రూ.104కు చేరుకుంది. యుద్ధం కొనసాగితే వచ్చే వారం రోజుల్లో అది రూ.112ను దాటుతుందని అంటున్నారు. ప్రస్తుతం బంకుల్లో డీజిల్ ధర రూ.94.62గా ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగియగానే ఈ ధర కూడా భగ్గుమనే ప్రమాదం ఉంది. బల్క్ సరఫరా ధరలను మించిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఆర్టీసీ కచ్చితంగా మళ్లీ బల్క్‌గా కొనాల్సిందే. అయితే చమురు కంపెనీలు ఒప్పందానికి కట్టుబడి అప్పటి ధరపై రూ.4 డిస్కౌంట్ ఇస్తాయా. లేదా? అన్నది చెప్పలేని పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీపై ఏటా సుమారు రూ.340 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
బడ్జెట్ సమావేశాల్లోపే ప్రభుత్వానికి..
లీటరు ధర రూ.91 ఉన్న సమయంలో నష్టాలను అధిగమించేందుకు సాలీనా రూ.850 కోట్ల అదనపు రాబడి లక్ష్యంగా చార్జీల పెంపు ప్రతిపాదనలను ఆర్టీసీ ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పుడు అదనంగా రూ.340 కోట్ల వార్షిక భారం పెరిగితే, ఆ భారాన్ని కూడా ఆర్టీసీ ప్రజలపైనే మోపే అవకాశం ఉంది. అంటే తాజా చార్జీల పెంపు ప్రతిపాదనలు వార్షికంగా రూ.1,200 కోట్లకు చేరతాయి. చార్జీలు కి.మీ.కు 40 పైసలను మించి పెరుగుతాయి. ఈ మేరకు అధికారులు రెండు, మూడురకాల కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే ప్రభుత్వానికి అందించి, వీలైనంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment