సాక్షి, హైదరాబాద్: వేసవిలో కొన్ని రకాల కూరగాయల ధరలు పెరగడం సహజమే. ఉత్పత్తికి అనుగుణంగా మామిడి, నిమ్మ ధరల్లోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే బియ్యం, నూనెలు, పప్పుల ధరలకు సీజన్‌తో సంబంధం ఉండదు. కానీ ఇప్పుడు కూరగాయలు, మామిడి, నిమ్మతోపాటు నిత్యావసర వస్తువుల ధరలన్నీ వేసవి వేడిని మించి మండిపోతున్నాయి. కూరగాయలు, పప్పులు, బియ్యం, నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో మొదలైన ధరల పెరుగుదల.. రెండు నెలలు గడిచినా ఆగట్లేదు. యుద్ధం, పెరిగిన డీజిల్ ధరల సాకు చూపుతూ ఉత్పత్తిదారులే నిత్యావసరాలను బ్లాక్ మార్కెటింగ్‌కు తరలిస్తుండగా వ్యాపారులు అదే బాట పట్టారు. వీటికి తోడు వేసవిలో ఉత్పత్తి తగ్గే కూరగాయలు, పండ్లు, పాల రేట్లు కూడా పెరిగాయి. జిల్లాల వారీగా కొన్నిటి ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నా.. దాదాపుగా అన్ని కూరగాయలు, నూనెలు పప్పు దినుసుల ధరలు బాగానే పెరిగాయి. తద్వారా సామాన్యుడిపై వంటింటి నిర్వహణ భారం నెల, రెండు నెలల్లోనే 25 శాతం నుంచి 50 శాతం వరకు అధికమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘పప్పు’.. తినాలంటే తిప్పలే..
రవాణా చార్జీల పెంపు పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పప్పు దినుసుల ధరలు కిలోకు రూ.10 నుంచి రూ.30 వరకు పెరిగిపోయాయి. నెల రోజుల క్రితం కిలో రూ.100 లోపున్న కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, వేరుశనగల ధరలు ప్రస్తుతం రూ.110 నుంచి రూ.130కి చేరుకున్నాయి. ఉత్పత్తిదారుడు నుంచి హోల్‌సేల్ వ్యాపారికి, అక్కడి నుంచి రిటైలర్‌కు వచ్చే సరికి ధరల్లో భారీగా తేడా ఉంటుంది. హైదరాబాద్‌లో కందిపప్పు హోల్‌సేల్ ధర రూ.90గా ఉంటే... రిటైల్ మార్కెట్‌లో రూ.110 నుంచి రూ.130 వరకు ఉంది. అలాగే హైదరాబాద్ బేగంబజార్ హోల్‌సేల్ మార్కెట్‌కు, కరీంనగర్‌లోని రిటైల్ అమ్మకం దారునికి మధ్య కూడా రేట్లలో కిలోకు రూ.20 వరకు వ్యత్యాసం ఉంటోంది. మినప్పప్పు కూడా హోల్‌సేల్‌లో రూ.90 ఉంటే రిటైల్‌లో రూ.130 వరకు ఉంది. ఇక పెసరపప్పు రూ.120కి, ఎర్రపప్పు రూ.130 వరకు రిటైల్‌లో వినియోగదారుడికి అందుతోంది. పల్లీల (వేరుశనగ) ధర రిటైల్ మార్కెట్‌లో రూ.100–110 నుంచి రూ.140కి చేరింది. సూపర్ మార్కెట్‌లలో ప్యాకేజ్డ్ పప్పు దినుసుల ధరలు సామాన్యునికి అందుబాటులో లేనంతగా పెరిగాయి. ఇక చింతపండు కూడా రిటైల్ మార్కెట్‌లో రూ.140 నుంచి రూ.180 వరకు చేరింది. ఎండు మిర్చి కిలో రూ.250 వరకు పలుకుతోంది. దొడ్డు ఉప్పు ధర ఫిబ్రవరిలో కిలోకు రూ.7 ఉంటే అదిప్పుడు రూ.20కి చేరింది. గత 14 ఏళ్లుగా అగ్గిపెట్టె ధర రూపాయి మాత్రమే ఉండగా... ఇటీవలే దానిని రూ.2కు పెంచారు.
ఎంఆర్‌పీ పేరిట నూనె కంపెనీల మాయాజాలం
రెండు నెలల క్రితం సన్‌ఫ్లవర్ నూనె రూ.150కే వినియోగదారుడికి లభించేది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో ఫార్చూన్ సన్‌ఫ్లవర్ నూనె లీటర్ ఎంఆర్‌పీ రేటు రూ.230 కాగా డిస్కౌంట్ పేరుతో రూ.194కి విక్రయిస్తున్నారు. ఇక పల్లీ నూనె ఎంఆర్‌పీ రూ.250 ఉండగా, రూ.190కి వినియోగదారుడుకి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ విజయ పల్లీ నూనె ఎంఆర్‌పీ రూ.220 కాగా, డిస్కౌంట్ సేల్ పేరుతో రూ.185కి విక్రయిస్తున్నారు. ఇలా అడ్డగోలుగా ఎంఆర్‌పీ ధరను ముద్రించి డిస్కౌంట్ పేరుతో వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. వాస్తవానికి ఫార్చూన్ నూనె రూ.230 ఎంఆర్‌పీగా ముద్రించి ఉందంటే అది హోల్‌సేల్ వ్యాపారికి రూ.190 లోపే వస్తుంది. దానిని రిటైల్‌లో 195 వరకు విక్రయిస్తారు. ఇది వ్యాపారులు, ఇతరులకు తప్ప ఎక్కువ శాతం మంది సామాన్యులకు తెలయని విషయం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు రిటైల్ మార్కెట్‌లో ఎంఆర్‌పీ కన్నా ఎక్కువ ధరకు (రూ.230 వరకు) నూనెలను విక్రయించారు. ఉత్పత్తిదారుడు ఎంఆర్‌పీగా అడ్డగోలు ధరను ముద్రించడంతో అప్పట్లో హోల్‌సేల్ వ్యాపారులు నూనె ప్యాకెట్లను, డబ్బాలను బ్లాక్ చేశారు.
రూ.250కి చేరే అవకాశం
ప్రస్తుతం కూడా ఆయిల్ కంపెనీలు పది రోజులుగా నూనెను బ్లాక్ చేసి, మార్కెట్‌లోకి రిలీజ్ చేయడం లేదు. తాజాగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నూనెలకు సంబంధించిన ధర నిర్ణయమైన తర్వాత కొత్త రేట్లను ముద్రించి మార్కెట్‌లోకి వదిలే అవకాశం ఉందని కరీంనగర్‌కు చెందిన ఓ హోల్‌సేల్ వ్యాపారి ‘సాక్షి’కి తెలిపారు. అప్పుడు నూనె ప్యాకెట్ ధర రూ. 230 నుంచి రూ. 250కి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంఆర్‌పీ ముద్రణపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలనే డిమాండ్ విన్పిస్తోంది. ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో సన్‌ఫ్లవర్‌తో పాటు అన్ని రకాల నూనెల్ని రూ. 210 వరకు విక్రయిస్తుండడం గమనార్హం. కాగా పామాయిల్ ధర నాలుగు రోజుల క్రితం హోల్‌సేల్‌లో రూ.146 ఉండగా, ప్రస్తుతం రూ.156 అయింది. దాన్ని రిటైల్‌గా రూ.170 వరకు విక్రయిస్తున్నారు.
సాగు తగ్గడంతో పెరిగిన కూరగాయల రేట్లు
ప్రస్తుతం కూరగాయల ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లలో టమాటా ధర కిలో రూ.40కి చేరుకోగా, బీరకాయ రూ.50, వంకాయ రూ.40, క్యాబేజీ రూ.40, క్యారెట్ రూ.50, కాలిఫ్లవర్ రూ. 60, పచ్చిమిర్చి రూ.80, బెండకాయ రూ.35, గోరుచిక్కుడు రూ.45, చిక్కుడు రూ.70కి పైగా విక్రయిస్తున్నారు. వీటితో పాటు అల్లం, వెల్లుల్లి, ఆలుగడ్డ ధరలు కూడా నెలరోజుల్లో 50 శాతం వరకు పెరిగిపోయాయి. అయితే రిటైల్ మార్కెట్ ధరలతో పోలిస్తే హోల్‌సేల్, సూపర్ మార్కెట్‌ల ధరల్లో కొంత తేడా ఉంది. అలాగే జిల్లాల వారీగా కూడా రేట్లలో కొంత తేడా ఉంది. హైదరాబాద్‌లో ఉన్న రేట్లకు కరీంనగర్ , వరంగల్ మార్కెట్‌లలో ఉన్న రేట్లకు కొంత తేడా ఉంది. అలాగే రైతుబజార్లలోని ధరలకు బస్తీల్లోని మార్కెట్‌ల ధరలకు కూడా తేడా ఉంది. వేసవి కాలంలో తెలంగాణలో కూరగాయల సాగు తక్కువగా ఉండడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూరగాయలకు రవాణా చార్జీలు పెరగడం కారణంగా ధరలు మండిపోతున్నాయని వ్యాపారులు చెపుతున్నారు. మామిడికాయలు, నూనె, ఆవాలు, ఉప్పు ధరలు పెరగడంతో ఈ వేసవిలో సామాన్యులు మామిడి పచ్చడి పెట్టుకోవడం కూడా కష్టసాధ్యంగా మారింది.
నిమ్మకూ లేని మినహాయింపు!
హైదరాబాద్ చింతలబస్తీలోని రిటైల్ మార్కెట్‌లో ఒక మోస్తరు సైజు నిమ్మకాయ ధర 10 రూపాయలు. రూ.20కి 3. అదే మోండా మార్కెట్‌కు వెళితే రూ.20కి నాలుగు. ఈ స్థాయిలో నిమ్మకాయల ధరలు ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేదు. రాష్ట్రంలో నిమ్మ పంట పెద్దగా లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే దిగుబడి తగ్గిన కారణంగా సగటు వినియోగదారుడు ఒక నిమ్మకాయను పది రూపాయలకు కొనుక్కోవలసి వస్తోంది. వేసవి కాలంలో ఎక్కువగా వినియోగించే నిమ్మకాయల ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
కరీంనగర్ రిటైల్ మార్కెట్లో కూరగాయల ధరలు..(కిలోకు రూ.లలో)
టమాట 35, వంకాయ 40, బెండకాయ 30, పచ్చిమిర్చి 70, బీరకాయ 40, కాకరకాయ 45, సొరకాయ 15, చిక్కుడు 60, గోరుచిక్కుడు 40, దొండకాయ 40, క్యారెట్ 45, క్యాబేజి 30, క్యాలిఫ్లవర్ 50, తోటకూర 30, పాలకూర 50, చుక్కకూర 60, అల్లం 50, ఎల్లిగడ్డ 80, ఉల్లిగడ్డ 20, ఆలుగడ్డ 30.
సర్దుకుంటున్నాం..
మార్కెట్‌లో ఏది
ముట్టుకున్నా మండుతోంది. నిత్యావసరాలు, నూనె ధరలు కూడా బాగా పెరిగాయి. దీంతో ఇతర ఖర్చులు తగ్గించుకొని, తక్కువ మొత్తంలో సరుకులు కొనుక్కొని సర్దుకుంటున్నాం. – సుగుణ, గృహిణి, నాగర్‌కర్నూల్
ఉప్పూపప్పు..నిప్పులే..రూ. 10- 30 పెరిగిన నిత్యావసరాల ధరలు..!
Published Fri, Apr 29 2022 3:14 AM | Last Updated on Fri, Apr 29 2022 12:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment