రూపాయికీ సెగ
ముంబై: ఇరాక్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు రూపాయిపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. సరఫరాపరమైన సమస్యలు తలెత్తవచ్చన్న ఆందోళలనల కారణంగా అంతర్జాతీయంగా చమురు రేట్లు ఎగయడంతో శుక్రవారం దేశీ కరెన్సీ భారీగా పతనం అయ్యింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 52 పైసలు క్షీణించి 59.77 వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరి 24 తర్వాత ఒక్కరోజులో ఇంతగా క్షీణించడం ఇదే ప్రథమం.
ఆ రోజున రూపాయి మారకం విలువ 73 పైసలు పతనమైంది. ఇరాక్‌లో మిలిటెంట్లు చెలరేగిపోతుండటం వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందన్న భయాలు నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తొమ్మిది నెలల గరిష్టానికి ఎగిశాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు రిస్కులను తగ్గించుకునేందుకు డాలర్ల వైపు చూస్తుండటం వల్ల అమెరికా కరెన్సీ బలపడుతోందని, రూపాయి మారకం క్షీణిస్తోందని ట్రేడర్లు తెలిపారు. దేశీ స్టాక్‌మార్కెట్ల పతనం కూడా రూపాయి క్షీణతకు కారణమైందని వివరించారు.