7 వారాల కనిష్టానికి రూపాయి
- ఇరాక్ యుద్ధ భయాలతో 36 పైసలు క్షీణత
- 60.39కి పడిపోయిన మారకం రేటు
ముంబై: ఇరాక్‌లో యుద్ధ వాతావరణం భారతీయ రూపాయి మారక విలువపై మరింత ప్రభావం చూపింది. యుద్ధ భయాలతో ముడిచమురు ధరలు పెరిగి, అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారం 36 పైసలు తగ్గిపోయింది. తద్వారా ఏడు వారాల కనిష్టస్థాయి 60.39కి చేరింది. దేశీయ మార్కెట్లో మూలధన ప్రవాహంతో పాటు ఈక్విటీల ధరలు క్షీణించడం కూడా రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపాయని డీలర్లు చెప్పారు.
గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగాయి. న్యూయార్క్ మెర్కంటైల్ ఎక్స్ఛేంజీలో జూలై డెలివరీ బెంచ్‌మార్క్ క్రూడ్ రేటు 41 సెంట్లు పెరిగి 106.77 డాలర్లకు చేరుకుంది. ఇరాక్‌లోని అతిపెద్ద రిఫైనరీపై మిలిటెంట్లు బుధవారం ఉదయం దాడి చేశారన్న వార్తలతో డాలర్ల కొనుగోలుకు దిగుమతిదారులు, ముఖ్యంగా చమురు రిఫైనర్లు ఎగబడ్డారు.
స్థానిక ఫోరెక్స్ మార్కెట్లో ఉదయం 60.28 వద్ద ప్రారంభమైన మారకం విలువ 60.06 - 60.54 శ్రేణిలో చలించింది. చివరికి 36 పైసలు (0.06 శాతం) క్షీణించి 60.39 వద్ద ముగిసింది. గత ఏప్రిల్ 29న రూపాయి మారకం విలువ 60.42గా ఉంది. ఆ తర్వాత ఈ స్థాయికి తగ్గడం ఇదే ప్రథమం.